ఆర్థికశక్తిగా తెలంగాణ

Mon,March 12, 2018 11:37 PM

అవినీతికి, జాప్యానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శక విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది.విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు తెలంగాణ వైపు పరుగులు తీశాయి.

సకల వనరులు కలిగిన భారతదేశంలో దరిద్రమెట్లుందో నాయ నా.. అని ఓ కవి ప్రశ్నించాడు. వనరులున్నా దాన్ని సమర్థంగా ఉపయోగించుకొని దరిద్రాన్ని పారదోలే దృఢచిత్తం, దూరదృష్టి పాలకుల్లో ఉంటే సంపద పెరుగుతుంది. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడుతాయి. ఆర్థికవృద్ధితో సమాజం పురోగమిస్తుంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సరిగ్గా అదే జరిగింది. అరువై ఏండ్ల పాటు పేదరికం, నిర్లక్ష్యం నీడన మగ్గిన రాష్ర్టాన్ని ఆర్థికంగా పటిష్టపరిచి ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దింది టీఆర్‌ఎస్ సర్కార్. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి దేశానికే నమూనా గా మారింది. ఇందుకు బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ గణాంకాలే నిదర్శనం. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) ప్రజల తలసరి ఆదాయం జాతీయ సగటును మించి ఆర్థికవేత్తల అంచనాకు అం దనివిధంగా పెరిగింది. ఒకవైపు రాష్ట్ర సంపద పెరిగేలా చర్యలు తీసుకుంటూనే మరోవైపు సొంత పన్నుల రాబడిని పెంచుతూ ప్రభుత్వం ఆర్థికపథంలో వేగంగా దూసుకుపోతున్నది. ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న పైసాపైసాకు పక్కా లెక్కచూస్తూ ఆదాయ, వ్యయాల్లో సమతుల్యత పాటించింది. రాష్ట్రం నలుదిశలా అన్నిరంగాల అభివృద్ధి కార్యక్రమాలు, భారీ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలతో రాష్ట్రం దశ,దిశను మార్చింది.

మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తిరోగమనంలో ఉన్న ఆర్థిక వ్యవ స్థ ముఖచిత్రమే మారిపోయింది. మూడేండ్లలోనే దేశంలోనే ది బెస్ట్ ఎకనామిక్ స్టేట్‌గా అవతరించింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల ఈ నెల 15న శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈసారి కూడా రెవెన్యూ మిగులు రాష్ట్రంగా రికార్డుకెక్కనున్నది. 2017-18లో సుమారు లక్షా 50 వేల కోట్లుగా ఉన్న వార్షిక బడ్జెట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీ సైజులో ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర సొంత రాబడులు మరోసారి భారీగా పెరుగ డం, వృద్ధిరేటు చోటుచే సుకోవడం, జీఎస్‌డీపీతో పాటు తలసరి ఆదా యం పెరుగడం వార్షిక బడ్జెట్‌కు మరింత ఊపునిస్తున్నది. సుస్థిరమైన పరిపాలనా, నిర్దిష్ట ప్రణాళికలు, పారదర్శక విధానాలు, శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పనులు రాష్ర్టాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, ఆర్థిక సంవత్సరం ఆరంభంలో కొత్త గా అమల్లోకి వచ్చిన చట్టంలో గందరగోళం వంటి ఎన్నో ప్రతికూల పరిణామాలను ఎదుర్కొని రాష్ట్రం రాబడులను పెంచుకోవడంలో స్థిరమైన వృద్ధిని సాధించింది. కొత్త రాష్ట్రంగా కేంద్రం నుంచి సహకారం లేకపోయినా, రావాల్సిన సాయం అందకపోయినా సొంతరాబడుల్లో వరుసగా 19 శాతం వృద్ధిరేటును సాధించి తన ఆర్థిక సత్తాను చాటుకున్నది. గత నాలుగేండ్లుగా పన్నుల వాటా, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సీఎస్‌టీ నష్ట పరిహారం ఇతర గ్రాంట్లు మొత్తం కలిపి రూ.81వేల కోట్లు మాత్రమే అందినా సొంత బలంతోనే ఆర్థిక చక్రాలను పరుగులెత్తించడం తో సీఎం కేసీఆర్ సఫలమయ్యారు. బెస్ట్ ఎకనామీ స్టేట్‌గా దేశంలోనే ప్రముఖ స్థానం కల్పించగలిగారు.

బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రాథమిక లెక్కల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈసారి కూడా అత్యంత పటిష్టంగా ఉన్నది. వాస్తవానికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి)ని ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రధాన సూచికగా పరిగణిస్తారు. తలసరి ఆదాయా న్ని ప్రజల జీవన ప్రమాణాలకు ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రెం డింటిలోనూ తెలంగాణ దేశ సగటునుదాటి అనూహ్యమైన వృద్ధిని సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14లో స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) స్థిర ధరల వద్ద 4.2 శాతంగా మాత్రమే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో అది కాస్త ఏకంగా 8.6 శాతానికి పెరుగడం విశేషం. 15-16లో 9.5 శాతానికి పెరిగింది. జీఎస్‌డీ పీ వృద్ధి 2016-17లో స్థిర ధరల వద్ద 10.1శాతానికి పెరుగుతుందని బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంచనా వేసింది. ఇదే సమయంలో జాతీయ జీడిపీ 7.1 శాతం వరకు మాత్రమే ఉంటుందని అం చనా. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన రంగాల్లో ఒక నిర్దిష్టమైన సమయం లో ఉత్పత్తయిన వస్తువులు, సేవల మార్కెట్ విలువను జీఎస్‌డీపీగా పరిగణిస్తారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 2015-16లో 5,75,631 రూపాయలు కాగా 16-17లో అది కాస్త 6,54,294కు పెరిగింది. 17-18లో అది 7.3లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జీఎస్‌డీపీ 10 శాతం వరకు చేరినట్లు సమాచారం. రాష్ట్ర స్థూల ఆర్థిక పరిస్థితి చాలావేగంగా అభివృద్ధి చెందుతున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో 4.2 శాతంగా ఉన్న స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ) తెలంగాణ ఆవిర్భవించిన మూడేండ్లలోనే 9 శాతానికి చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో దేశ జీడీపీ జాతీయ సగటు 6 శాతం కాగా రాష్ట్ర జీడీపి 4.2 శాతంగా మాత్రమే ఉండేది. కానీ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. జాతీయ జీడీపీ సగటును మించి జీఎస్‌డీపీ సగటు వృద్ధి 9.5శాతం దాటింది. ఇం దులో పరిశ్రమల ద్వారా 22 శాతం, సేవారంగాల ద్వారా 63 శాతం, వ్యవసాయం ద్వారా 15 శాతం వాటా ఉంది. ఈ సారి వ్యవసాయరంగం జీఎస్‌డీపీ వాటా మరింత పెంచడానికి ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలను తీసుకుంటున్నది. రైతులకు పంట రుణమాఫీని పూర్తిచేసిన ప్రభుత్వం ఈ సారి నుంచి పంటల పెట్టుబడి సాయం కింద ప్రతీ పంటకు ఎకరానికి రూ.4 వేలను ఆర్థిక సాయాన్ని అం దించాలని నిర్ణయించింది. దేశం లో ఎక్కడా లేనివిధంగా కాళేశ్వరంతో పాటు దాదాపు 40 భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. వీటి ద్వారా కోటి ఎకరాలకు సమృద్ధిగా నీరంది పంటల ఉత్పత్తులు బాగా పెరి గే అవకాశం ఏర్పడింది. తద్వారా వ్యవసాయ జీడీపీ 25 శాతం వరకు పెరుగవచ్చని అంచనా.

ఉమ్మడి రాష్ట్రంలో 2012-13 బడ్జెట్ మొత్తం 1,61,731 కోట్లు కాగా కేవలం తెలంగాణలో బడ్జెట్ లక్షా 50 వేల కోట్లకు చేరింది. రెవెన్యూ రాబడులు లక్షా 16 వేల కోట్లు కాగా తెలంగాణలో లక్షా 13 వేల కోట్లకు చేరిం ది. తలసరి ఆదాయంలో 11.5 వృద్ధి ఉంది. అదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం 9.5 శాతంగా ఉంది. జాతీయ సగటు తలసరి ఆదా యం రూ.1,03,219లు ఉండగా, తెలంగాణ ప్రజల తలసరి వార్షిక ఆదా యం రూ.1,58,360 ఉంది. వాస్తవానికి 2015-16లో జాతీయ తలసరి ఆదాయం రూ.94,130గా అంటే దేశంలో (7.4) శాతంగా ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం 2016-17లో జాతీయ తలసరి ఆదాయం 9.7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఇదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,40,683 నుంచి రూ.1,58,360లుగా ఉన్నది జాతీయస్థాయిలో తలసరి వార్షిక ఆదాయం 1,03,219 కంటే తెలంగా ణ తలసరి ఆదాయం రూ.52,393లుగా ఉంది. జాతీయస్థాయిలో వార్షి క తలసరి ఆదాయ వృద్ధి 2013-14లో 11.6శాతం ఉండగా 2016-17లో అది 10.2 శాతానికి తగ్గింది. కానీ ఇదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం 11.2 శాతం నుంచి 12.6 శాతానికి పెరుగడం విశేషం.

రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూ వల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ (టీఎస్-ఐపాస్) దేశ పారిశ్రామిక రంగంలోనే విప్లవాత్మక మార్పును తెచ్చింది. అవినీతికి, జాప్యానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శక విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు తెలంగాణ వైపు పరుగులు తీశాయి. అన్నివిధాలుగా జరిగిన, జరుగుతున్న అభివృద్ధితో రాష్ట్ర సంపద భారీగా పెరుగుతున్నది.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)
madhusudan

430
Tags

More News

VIRAL NEWS