వర్సిటీల ప్రతిష్ఠను పెంచే విధానాలు

Tue,February 13, 2018 12:58 AM

ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకు సంపాదించాలంటే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాటిని సాధించాలి. ఈ అంశాలు మన రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఎంత వరకు తృప్తికరంగా ఉన్నాయో, వాటిలో చేపట్టాల్సిన సంస్కరణలు ఏమిటో విశ్లేషించుకోవాలి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఒక్కటి కూడా ప్రపంచంలో 100 ర్యాంకుల్లో లేదు.

సమాజంలో పెరుగుతున్న అసహనం, నేర ప్రవృత్తి, లింగవివక్ష, లైంగికదాడులు, కుటుంబ కలహాలు వంటివి నివారించడానికి కూడా విశ్వవిద్యాలయాలు వారి విద్యార్థులను తయారుచేయాలి. దీనివల్ల వారి వారి ప్రాంతాలలో జరిగే అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకోగలుగుతారు. ఈ సోయితో ఎక్కడికి వెళ్లినా వారి చుట్టుపక్కల వారిని ఆదుకోగలుగుతారు. ఈ రకంగా ఎంత చిన్న విశ్వవిద్యాలయమైనా తన స్థాయిలోనే ఆర్థిక ప్రగతికి,సామాజిక సంతులతకు ప్రయత్నించాలి. అప్పుడు ఆ విశ్వవిద్యాలయానికి మంచి ర్యాంకు వస్తుంది.

ర్యాంకుల గణనలో రెండు అంశాలుంటాయి. అవి ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు. ఆర్థిక అంశాల్లో ముఖ్యమైనవి ఇన్నోవేషన్ (ఆర్థికాభివృద్ధికి కొత్త దారు లు), రీసెర్చ్ (ఆర్థిక పరిపుష్టికి, పెరుగుదలకు కావాల్సిన పరిశోధన), పబ్లికేషన్స్ (చేసిన పరిశోధనలు, కొత్తగా కనుక్కొన్న విషయాలు ప్రపంచప్రఖ్యాత పేపర్లలో, జర్నల్స్‌లో ప్రచురించడం).

దీన్ని బట్టి అర్థమైన ముఖ్యమైన విషయం ఏమిటంటే-ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాలు ఆర్థిక పురోభివృద్ధికి నిరంతరం పనిచేయాలి. ఒక దేశం, ప్రాంతంలో మనుషులను అన్నిరకాలుగా సంపన్నులను చేసే విషయాల మీద పరిశోధన, ప్రచురణ చేస్తూ అవి సామాన్య జనాలకు కూడా ఉపయోగపడి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. అంటే ఒక సమాజం ఆర్థికప్రగతికి ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనే ఆధారం. అంటే విశ్వవిద్యాలయంలో ఉన్న సమ యంలో, తర్వాత ఎక్కడైనా ఉద్యోగాల్లో చేరినా, ఆ విద్యార్థులు నిరంతర పరిశోధకులుగా కొనసాగి వారి దేశ ఆర్థికస్థాయిని పెంచాలి.

రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎంతవరకు ఈ అంశాలకు ప్రాధా న్యం ఉన్నదో విశ్లేషించాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నత విద్య చంద్రబాబు సీఎం అయిననాటి నుంచి తిరోగమనంలో పడింది.ఆయన విశ్వవిద్యాలయాలకు ఇచ్చే గ్రాంటు తగ్గించారు. కంప్యూటర్ విద్య మాత్రమే విద్యగా ప్రచారం చేశారు. అప్పుడే రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన శాస్త్ర, సాంకేతిక సంస్కరణలు కూడా ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాచుర్యం పొందాయి. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే మానవ సమాజానికి అభివృద్ధిపథం అని పొరపాటు పడిన చంద్రబాబు వర్సిటీల్లోని ఉన్నత విద్యను, పరిశోధనలను నిర్లక్ష్యం చేశారు. ఇబ్బడిముబ్బడిగా ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి, మిగతా రంగాలన్నీ కుంటుపడటానికి కారణమయ్యారు. నిజానికి విశ్వవిద్యాలయాల్లో, శాస్త్రీయ రంగా ల్లో కోర్ సైన్సెస్‌లో జరిగిన పరిశోధనలే ఏ ఇంజినీరింగ్, టెక్నాలజీ అభివృద్ధికైనా ఉపయోగపడేవి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ లాంటి రంగాల్లో విశ్వవిద్యాలయల్లో చాలా పరిశోధనలు జరిగితేనే శాస్త్ర, సాంకేతిక సంస్థ ల్లో పరిశోధన అడ్వాన్స్‌డ్ విషయాల్లో సాగుతుంది. ఈ మూల శాస్ర్తాలు ప్రగతి సాధించకపోతే కష్టం. మరి ఈ రంగాల్లో విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనలు ఏమిటి? వాటి ఫలితాలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఉపయోగపడుతున్నాయి? అలాగే సామాజికశాస్ర్తాలైన ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్, పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ వంటి శాస్ర్తాల ద్వారా సమాజాన్ని అర్థంచేసుకోవాలి. లేకపోతే సామాజిక విలువలు దెబ్బతింటాయి. అది అన్నిరంగాలకూ విస్తరిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ వహించి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని, వ్యవసాయరంగాన్ని ఒక దగ్గరికి చేర్చి వ్యవసాయరంగంలో సాధిస్తున్న ప్రగతి చూస్తే విశ్వవిద్యాలయాలకు, సమాజ ఆర్థికరంగానికి ఉన్న అవినాభావ సంబంధం అర్థమౌతుంది. అలాగే ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగాలు ప్రజల మారుతున్న అభిరుచులకు అద్దంపడుతూ, వారిని, జీవితాన్ని ఒక విలువలు కలిగిన మార్గంలోకి మళ్లించగలవు. ఈ రంగాల్లో అతి ముఖ్యమైనది సంస్కృతిలో భాగమైన భాషారంగం. ఈ శాస్ర్తాలన్నీ అభ్యసించడానికి కావాల్సింది భాష. ప్రసిద్ధ అమెరికన్ భాషా శాస్త్రజ్ఞుడు ఇలా అంటాడు. ఒక వ్యక్తి భాషానైపుణ్యాలు అతని ఇతర నైపుణ్యాలను నిర్ణయిస్తాయి అని. విశ్వవిద్యాలయ విద్య పూర్తి చేసి పరిశోధన చేయాలన్నా, ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, స్వయం ఉపాధి మార్గాలు చూసుకోవాలన్నా భాషా నైపుణ్యాలు చాలా ముఖ్యం. మరి ఎన్ని విశ్వవిద్యాలయాలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నాయి? అసలు విద్యార్థులకు చదువుకుంటున్న సంవత్సరాల్లో జీవితం కోల్పోకూడదంటే పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల అవసరాల్నీ తీర్చేట్టు, వారిని సంపూర్ణ మానవులుగా ఎదిగేటట్టు చేసే ప్రక్రియలు అన్నీ ఉండాలి.

1) పాఠశాలల్లో చదువుతోపాటే ఆటలు, లలిత కళలు నేర్పాలి. ఆరవ తరగతి నుంచి తప్పనిసరిగా ఒక ఆట, ఒక కళ చదువుతోపాటు నేర్పాలి. కళలు మనిషిలోని నేర ప్రవృత్తిని నివారిస్తాయి. సున్నిత భావాలను పెంపొందిస్తాయి. 2) కళాశాలల్లో ఆటల క్లబ్బులను, లలిత కళలు నేర్పే సెంటర్లను తప్పనిసరిగా నెలకొల్పాలి. చదువు మేధను పెంచితే, ఆటలు ఆరోగ్యాన్ని, దారుఢ్యాన్ని, కళలు మానసిక సంతులతను పెంచి కాపాడుతాయి. 3) విశ్వవిద్యాలయాల్లో వారు చదివే కోర్సులు జీవితానికి, ఎలా దోహదపడుతాయో చెప్పే అంశంతో పాటు ఇంకొక ముఖ్యమైన సెంటర్ ఉండాలి. అందులో నాలుగు ముఖ్యమైన భాగాలుండాలి. ఒకటి అకడమిక్ హెల్ప్ భాగం. ఇందులో విశ్వవిద్యాలయ విద్యార్థులకు, పరిశోధన చేసే వారికి యూనివర్సిటీలోని వివిధ విభాగాల ఆచార్యులు చదువులోని సందేహాలు తీర్చి మార్గదర్శకం చేయాలి. ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు ముఖ్యంగా బోధించాలి. వర్సిటీలోని అధ్యాపకులే వారానికి రెండు గంటలు తమ సమయాన్ని ఇక్కడ వెచ్చించాలి. రెండవ విభాగం కౌన్సిలింగ్ సెంటర్. విద్యార్థులకు ఉన్న కుటుంబ, వ్యక్తిగత సమస్యల గురించి సలహాలు ఇవ్వాలి. వారు చదువుమీద, భవిష్యత్తు మీద కేంద్రీకరించేటట్టు చేయాలి. మూడవది లలిత కళల విభాగం. ఉత్సాహం ఉన్న విద్యార్థులు తీరిక వేళల్లో నేర్చుకోవడానికి నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, చేతి నిపుణత క్రియలు వగైరా ఉండాలి. నాల్గవది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెంటర్. ఇది విద్యార్థులకు మంచి రిక్రియేషన్ ఇస్తుంది. మన రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పై విభాగాలు ఎన్నింటిలో ఉన్నాయి? అలాగే పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ దేశాల ఏ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్లు చూసినా విభాగాలు, ఫ్యాకల్టీ, విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ తెలుస్తాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ సైట్ అన్నికంటే బాగుంది. మరి అన్నీ ఆ స్థాయిలో ఎందుకు లేవు? విశ్వవిద్యాలయ అధ్యాపకులకు పీహెచ్‌డీ తప్పనిసరిగా ఉండాలి.

ఉపాధ్యాయుల ఉద్యోగాలకు గానీ, రీసెర్చ్ స్కాలర్లకు ఇచ్చే పరీక్షలు గానీ వారి అవగాహన, భావనాపటిమ, తులనాత్మకశక్తి, విమర్శనాశక్తి, విశ్లేషణాశక్తిని పరిక్షించేవిగా ఉండాలి. అప్పుడే వారు విద్యార్థులకు పాఠాలుచెప్పగల శక్తిగానీ, పీహెచ్‌డీ పరిశోధనా గ్రంథం రాయగలిగిన పటిమగానీ కలిగి ఉంటారు. కేవలం జ్ఞాపకశక్తికి పరీక్ష పెడితే అటు భాషా నైపుణ్యాలు గానీ, ఇటు భావనాశక్తి గానీ లేనివారు ఉత్తీర్ణులవుతారు. వారు ఉద్యోగాల్లో, పరిశోధనల్లో ఎలా రాణించగలరు? అప్పుడు సహజంగా విద్యారంగ స్థాయి దిగజారుతుంది. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఉన్నత విద్యా రంగంలో ఉద్యోగాలకు, పరిశోధనకు వాడే పరీ క్షా విధానం మారితే తప్ప విద్యారంగం స్థాయి పెరుగదు. ఆబ్జెక్టివ్ ప్రశ్న లు కాక, సొంతంగా ఒక వ్యాసం రాయగలిగే సామర్థ్యం పరీక్షించాలి. ఏ కోర్సుకైనా, ఉద్యోగానికైనా, అవగాహన, ఆలోచన ముఖ్యం. అసలు ఉన్న విద్యాస్థాయిలో విద్యార్థులందరికీ భాషా నైపుణ్యాల మీద పట్టు ఉండాలంటే ఆ ప్రక్రియ పాఠశాల స్థాయి నుంచే జరుగాలి.
రెండవ అంశమైన సామాజిక అంశాలులో నాలుగు రకాలుగా విద్యా విధానాన్ని పరిశీలిస్తారు. 1.వసతులు (15శాతం) మొదటి అంశం. ఒక విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు, చదువుకునే వాతావరణాన్ని బట్టి విద్యార్థులు ఎలా తయారు అవుతారన్నది ఆధారపడి ఉంటుంది. 2) బోధన (30 శాతం)ఒక విద్యాలయంలో ( ఏస్థాయిలో అయినా) అతి ముఖ్యమైనది బోధకుల క్వాలిటీ, తరగతిలో వారు తమ విద్యార్థులకు చేసే మార్గదర్శనం చాలా ముఖ్యమైనవి. పశ్చిమ దేశాల్లో సీనియర్‌ప్రొఫెసర్ అయినా సరే ఒక సెమిస్టర్‌లో కొత్త పరిశోధన చేయకపోయినా, ఒక్క సెమిస్టర్ పేపర్ ఇవ్వకపోయినా వారికి తర్వాత టీచింగ్‌కు అవకాశం ఇవ్వరు. మన విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలక్షన్ అప్పుడు చూపించిన పబ్లికేషన్లనే ప్రొఫెసర్ ప్రమోషన్‌కు చూపించడం పరిపాటి. ఈ పద్ధతి మారాలి. ఉన్నత విద్యారంగంలోని అధ్యాపకులు నిరంతరంగా పరిశోధన చేయాలి. తాను ఎదుగుతూ విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలువాలి. 3)ఎంప్లాయిబిలిటీ (40శాతం)అంశం అన్నిటికంటే ముఖ్యమైనది.
kankadurga
ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు త్వరితగతిన మారుతున్న అవసరాలకు అనుగుణంగా తమ విజ్ఞానాన్ని ఉపయోగించగలుగాలి. పరిశ్రమల్లో, సంస్థల్లో పనిచేయగలిగిన నైపుణ్యాలు సంతరించుకున్న విద్యార్థులు మాత్రమే ఉద్యోగాలు పొందగలరు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఎందరు విద్యార్థులకు ప్లేస్‌మెంట్ దొరుకుతుందో, దాన్నిబట్టి విశ్వవిద్యాలయల ప్రతిష్ఠ పెరుగుతుంది. 4. సామాజిక బాధ్యత (15 శాతం). దీనిలో ఒక విశ్వవిద్యాలయం స్థానికంగా ఉన్న పరిశ్రమలు, ఇతర సంస్థలే గాక, స్థానిక సమాజంలోని మనుషులతో ఎంతవరకు బాధ్యతగా ఉంటుంది అన్న అంశం ముఖ్యం. స్థానికులలో వెనుకబడిన వారు, బీద వారికి ఏ రకంగా సహా యం చేస్తుంది,అనుకోని ప్రకృతి వైపరీత్యాలలో ఎంత అండగా నిలబడుతుందీ అన్న అంశాలు చాలా ముఖ్యం. ప్రాంతీయంగా ఉన్న అసమానతలు తొలిగించడంలో విశ్వవిద్యాలయం ప్రముఖపాత్ర వహించా లి. ముఖ్యంగా సమాజంలో పెరుగుతున్న అసహనం, నేర ప్రవృత్తి, లింగవివక్ష, లైంగికదాడులు, కుటుంబ కలహాలు వంటివి నివారించడానికి కూడా విశ్వవిద్యాలయాలు వారి విద్యార్థులను తయారుచేయాలి. దీనివల్ల వారి వారి ప్రాంతాలలో జరిగే అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకోగలుగుతారు. ఈసోయితో ఎక్కడికి వెళ్లినా వారి చుట్టుపక్కల వారిని ఆదుకోగలుగుతారు. ఈ రకంగా ఎంత చిన్న విశ్వవిద్యాలయమైనా తన స్థాయిలోనే ఆర్థిక ప్రగతికి, సామాజిక సంతులతకు ప్రయత్నించాలి. అప్పుడు ఆ విశ్వవిద్యాలయానికి మంచి ర్యాంకు వస్తుంది. ఈ దిశగా మన విశ్వవిద్యాలయాలు ఆలోచించాలి. అడుగులు వేయాలి.
(వ్యాసకర్త: రిటైర్డ్ ప్రొఫెసర్, ఓయూ)

403
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles