స్వామియే శరణం

Sat,January 13, 2018 01:11 AM

155 ఏండ్ల కిందట, నిన్నటి రోజు (జనవరి 12)న భారతావని తూర్పు దిశలో, బెంగాల్‌లో ఒక మహా పురుషుడు, కారణజన్ముడు, సనాతన హైందవ మతోద్ధారకుడు, మహా మానవతావాది అవతరించడం దైవిక సంఘటన. ఎనిమిదవ శతాబ్దంలో కలాడిలో (కేరళ) అవతరించిన ఆది శంకరాచార్యుడే తన హైందవ ధర్మ పునరుద్ధరణ, ఆధ్యాత్మికభావ వికాస సంకల్పం, ఉద్యమం.. మిషన్..ఇంకా పూర్తికాలేదన్న అసంతృప్తితో బహుశా తిరిగి కలకత్తాలో అవతరించి ఉంటారు. తాను 40 ఏండ్లకు మించి జీవించబోనని ముందే తన అనుచరులకు, సహచరులకు తెలియజేసిన వివేకానందుడు 40 ఏండ్లు దాటకముందే యజుర్వేద పఠనం చేస్తూ పరమపదించాడు.

ఆది శంకరాచార్యులు కేవలం 32 ఏండ్ల స్వల్ప జీవితకాలం లో హిమాలయాల నుంచి (కాశ్మీరు నుంచి) కన్యాకుమారి వరకు భారతావని అంతట పర్యటించి, నాలుగు దిశలా, నాలుగు పీఠాలను స్థాపించి సనాతన హైందవ ధర్మ పరిరక్షణ పవిత్ర విధి నిర్వహించారు. భారతావని వరకే ఆయన కృషి పరిమితమైంది. ఆదిశంకరుల మహాసంకల్పం అసమగ్రంగా మిగిలింది. 18వ శతాబ్దం చివరన 1772లో జన్మించిన రాజా రామ్ మోహన్‌రాయ్ ప్రాచీన భారతంలో ఆధునిక యుగారంభం కోసం కలలుగన్నారు. సామాజిక, వైజ్ఞానిక రంగాల్లో అభ్యున్నతికే రాజా రామ్ మోహన్‌రా య్ కృషి పరిమితమైంది. ఆది శంకరాచార్యుల తర్వాత 1200 ఏండ్లకు, రాజా రామ్ మోహన్ రాయ్ పిదప దాదాపు వందేండ్లకు, 1863, జనవరి 12న కలకత్తాలో, మకర సంక్రాంతి దివ్యరోచిస్సులు ప్రసరిస్తున్న వేళ, ఒక బెంగాలీ సంప్రదాయ కుటుంబంలో, న్యాయవాది విశ్వనాథ్ దత్త, భువనేశ్వరీదేవి దంపతులకు నరేంద్రనాథ్‌దత్త జన్మించాడు. తల్లి భువనేశ్వరీదేవి వారణాసి విశ్వేశ్వరుడికి జరిపిన పూజల ఫలమే నరేంద్రదత్త జననమని ఆ కుటుంబంలో అందరూ భావించారు. తల్లి ధార్మిక స్వభావం, భక్తి తత్పరత, తండ్రి హేతువాద దృక్పథం, అభ్యుదయ, ఆధునికభావాలు బాలుడు నరేంద్రుడిపై అమిత ప్రభావం కలిగించా యి. తల్లిదండ్రులు ఉగ్గుపాలతో నూరిపోసిన నైతిక, ధార్మిక పాఠాలను, విలువలను నరేంద్ర తన జీవితంలో ఎన్నడూ మరిచిపోలేదు. పసితనంలోనే అసాధారణ ప్రతిభాకుసుమం వికసించిన నరేంద్రుడు బాల్యం నుంచే యోగాభ్యాసంతో ధ్యానంలో నిమగ్నుడై సమాధిస్థితిలో తాదా త్మ్యం పొందేవాడు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంతం, యోగశాస్త్రం, మత ధర్మ శాస్ర్తాలు, చరిత్ర, మానవ వికాస పరిణామవిషయాలు, సామాజిక శాస్ర్తాలు, కళలు, సాహిత్యం, సంగీతం తదితర విషయాలు, భగవద్గీత, రామాయణం, భారతం తదితర కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాలు, సంస్కృతం, బెంగాలీ ప్రాచీన వాఙ్మయాలలో బాల్యంలోనే నరేంద్రుడికి అఖండ వైదుష్యం సంతరించడం విశేషం. వ్యాయామం, క్రీడల్లో సైతం ఆయన ముందు నిలిచాడు. హిందూ సమాజంలోని కులతత్త్వం, రుగ్మత, దురాచారాలు, దుష్ట సంప్రదాయాలు నరేంద్రుడికి బాల్యం నుంచే బాధ కలిగించాయి. శారీరకంగా కలకత్తాలో జన్మించినప్పటికీ నరేంద్రుడికి బాల్యంలోనే ఆధ్యాత్మి క జన్మ ఇచ్చింది రాయపూర్. 1877 నుంచి రెండేండ్లు తండ్రి విశ్వనాథ్ దత్త కుటుంబం రాయపూర్‌లో గడపవలసి వచ్చింది. 14 ఏండ్ల బాలుడు నరేంద్రకు ఆధ్యాత్మిక జిజ్ఞాస అంకురించింది రాయపూర్‌లోనే. తండ్రితో ఆధ్యాత్మిక విషయాలపై కూలంకష చర్చలు ఆధ్యాత్మిక జిజ్ఞాసకు సమిధలుగా దోహదపడ్డాయి. కలడు కలండనెడివాడు కలడో లేడో అన్న విచికిత్స ఆ రోజుల్లోనే ఆ బాలుడి మస్తిష్కాన్ని మధించడం మొదలైంది.

కలకత్తాకు తిరిగివచ్చి 1879లో ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నత విద్యార్జన ప్రారంభించిన తర్వాత 1884లో బీఏ డిగ్రీతో పట్టభద్రుడైన నరేంద్రుడు అవేరోజుల్లో పాశ్చాత్య ప్రసిద్ధ తత్త్వవేత్తల ఉద్గ్రంథాలను, సంస్కృ త మత గ్రంథాలను, ధర్మశాస్ర్తాలను సూక్ష్మ పరిశీలన, విశ్లేషణలతో అధ్యయనం చేసి విద్యార్థి దశలోనే ఆధ్యాత్మిక అపార విజ్ఞానాన్ని ఆపోశనం పట్టాడు. నరేంద్రుడు విద్యార్థి దశలో ఉత్తమ రచయిత, కవి, అనువాదకుడు. అనర్గళ వక్తృత్వం చిన్నప్పుడే ఆయనను వరించింది. తన విద్యార్థి నరేంద్రుడు జీనియస్ అని, వివిధ దేశాల విశ్వవిద్యాలయాల్లో తనకెక్క డ అంతటి జీనియస్ కన్పించలేదని కలకత్తా స్కాటిష్ కాలేజ్ ప్రిన్సిపాల్ విలియమ్ హెస్టీ వేనోళ్ల పొగిడాడు. నరేంద్రుని జ్ఞాపకశక్తి, ధారణశక్తి అద్భుతమైనవని ఆయన ప్రొఫెసర్లు ప్రశంసించారు. విద్యార్థిగా నరేంద్రుడు ఒక వంక భగవదన్వేషణ ప్రారంభించి మరోవంక కేశవచంద్ర సేన్ నాయకత్వంలోని బ్రహ్మసమాజ్‌లో సభ్యుడైనాడు. మీరు దేవుణ్ణి చూశారా అంటూ నరేంద్రుడు కలకత్తా ప్రముఖులెందరినో ప్రశ్నించా డు. నరేంద్రుడి ఈ ప్రశ్నకు కలకత్తాలోని హైందవ ప్రముఖులెవ్వరూ సమాధానం ఇవ్వలేదు. దక్షిణేశ్వర్‌లోని రామకృష్ణ పరమహంసకు వద్ద కు వెళ్లి చూడు అని ప్రిన్సిపాల్ రెవరెండ్ విలియమ్ హెస్టీ తన విద్యార్థి నరేంద్రకు భగవదన్వేషణ మార్గం చూపించాడు. 1881 నవంబర్‌లో దక్షిణేశ్వర్‌లో రామకృష్ణ పరమహంస దర్శనంతో నరేంద్రుడి వ్యక్తిగత జీవితంలో, భారత ఆధ్యాత్మికరంగంలో ఒక వినూత్న, అపూర్వ, మహోజ్వల అధ్యాయం ప్రారంభమైంది. నరేంద్రుని సందేహాలను, సంశయాలను, భావాలను, అభిప్రాయాలను, వాదనలను అంతులేని ఓపికతో విన్నాడు రామకృష్ణుడు. పరమహంస రామకృష్ణ వద్ద ఐదేండ్ల సేవతో, శుశ్రూషతో, సత్యాన్వేషణ తపస్సుతో నరేంద్రుడిలో అనూహ్య పరివర్త న సంభవించింది. అంతవరకు పీడించిన అశాంతి, అయోమయత్వం, ఆవేదన తొలిగి నరేంద్రుడికి ఆధ్యాత్మిక అపార పరిణతి లభించింది. నరేంద్రుడు ఒక విజ్ఞతామూర్తిగా, ఆధ్యాత్మిక సమున్నత శిఖరంగా, యోగ సంపన్నుడిగా, స్వామిగా, మహర్షిగా సకల ప్రపంచానికి వెలుగు ల దారిచూపే విశిష్ట వ్యక్తిత్వం ఏర్పడింది. 1896 ఆగస్టు16 ఉదయం కాసిపూర్‌లో రామకృష్ణ పరమహంస అసువులు విడిచి మహాసమాధి పొందుతున్నప్పుడు తన తపస్సునంతా నరేంద్రుడికి ఆవహింపజేసి నరేంద్రుడే తన ఆధ్యాత్మిక వారసుడని ప్రకటించారు. నరేంద్రా, నాకు ఉన్నదంతా నీకు అర్పించాను.

ఇప్పుడు నేనొక ఫకీరును. పైసగూడ లేని భిక్షువును. నీకు నేనిచ్చిన దివ్య శక్తులతో నువు ప్రపంచంలో ఘనకార్యా లు సాధిస్తావు. నీవు సాధించవలసింది ఎంతో ఉంది నరేన్ అని రామ కృష్ణ పరమహంస అన్నారు. రామకృష్ణ పరమహంస మహాసమాధి అనంతరం కాసిపూర్ సమీపంలో, గంగానదీ తీరంలో నరేంద్ర తదితర శిష్యులు రామకృష్ణమఠ్ స్థాపించారు. 1887 తొలిభాగంలో నరేంద్ర, మరో 8 మంది శిష్యులు సన్యాసం స్వీకరించారు. సన్యాసంలో నరేంద్రుని పేరు బిబిదిశానంద. తర్వాత ఖేత్రి మహారాజు బిబిదిశానందకు వివేకానందుడు అని నామకరణోత్సవం జరిపారు. 1899లో బారానగర్ నుంచి హవురా జిల్లాలోని బేలూరుకు తరలిన రామకృష్ణమఠ్ వివేకానందస్వామి నేతృత్వంలో ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైంది. రామకృష్ణ పరమహంస తన ఆధ్యాత్మిక వారసుడని నరేంద్రుడిని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఆయన (నరేంద్రుడు) 23 ఏండ్ల యువ సన్యాసి, పరివ్రాజకుడు. వివేకానందుడు ఒక పరివ్రాజకుడుగా 1889 లో కలకత్తా నుంచి భారతదేశ పర్యటన ప్రారంభించాడు. కాశ్మీరం నుం చి కన్యాకుమారి వరకు మూడేండ్ల పాటు కొనసాగిన ఒక అద్భుత పాదయాత్ర అది. పాదరక్షలు ఏవీలేకుండా కొన్ని వేల మైళ్లు ఆయన దేశమంతటా పర్యటించారు. ఆ మహాప్రస్థాన పాదయాత్రలో ఆయన తన వెం ట తీసుకువెళ్లినవి ఒక కర్ర, ఒక ముతక గొంగళి, ఒక భిక్షపాత్ర, రెండు గ్రంథాలు. ఒకటి భగవద్గీత, రెండవ గ్రంథం ది ఇనీషియేషన్ ఆఫ్ క్రిస్ట్. భారత పర్యటనలో కొందరు రాజులు, మహారాజులు ఆయనకు ఆతి థ్యం ఇచ్చి సత్కరించడానికి ముందుకువచ్చినా ఆయన ఆ సత్కారాల ను తిరస్కరించి నిరుపేదలతో గడిపాడు. కడుపులో ఆకలి మంటలు రగుల్కొంటున్నప్పుడు ఆధ్యాత్మికతకు విలువలేదని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ పాలనలో భారత ప్రజలు ఆధ్యాత్మిక స్తబ్దతకు, దారిద్య్రానికి గురై అథోగతి పాలయ్యారని వివేకానందుడు బాధ పడ్డాడు. పేదరికాన్ని నిర్మూలించి ఆకలి మంటలను చల్లార్చడానికి సోషలిస్టునవుతానన్నారు. భారత పర్యటనలో ఆయన 1893 ఫిబ్రవరి 12న సికింద్రాబాద్‌లో ఒక బహిరంగసభలో ప్రసంగించారు.
prabhakr
తొలిసారి (భారత పర్యటన ముగిసిన తర్వాత) వివేకానందుని విదేశీ పర్యటన దేశంలోని అతి సామాన్యులు ఇచ్చిన విరాళాలతో సాధ్యమైం ది. 1893 మే 31న వివేకానందుడు బొంబాయి నుంచి అమెరికా బయ ల్దేరారు. షికాగో నగరం చేరడానికిముందు (1893 జూలైలో షికాగో చేరారు) మార్గమధ్యలో వివేకానందుడు జపాన్, చైనా, కెనడా దేశాల్లో పర్యటించారు. షికాగో మహానగరంలోని ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో 1893 సెప్టెంబర్ 11న పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్‌లో భారత ప్రతినిధిగా, చదువుల తల్లి సరస్వతికి మొదట నమస్కరించి వివేకానందుడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అఫ్ అమెరికా అని సంబోధిస్తూ అనర్గళంగా కావించిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ ప్రసంగం ప్రారంభం కాగానే 7 వేల మంది సభికులు లేచి హర్షధ్వానాలు చేశారు. సెప్టెంబర్ 27 వరకు పార్లమెంట్ సమావేశాల్లో ఆయన కావించిన ప్రసంగాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో అపూర్వ సంచలనం సృష్టించాయి. ఆయనది దైవిక వక్తృత్వమని న్యూయార్క్ క్రిటిక్ పత్రిక ప్రశంసించింది. అమెరికా హృదయం అఖండంగా ప్రతిస్పందించింది. సమావేశాల చివరి ప్రసంగంలో ఆయన If anybody dreams of the exclusive survival of his own religion and the destruction of the others I pity him from the bottom of my heart.. Assimilation and not destruction. Harmony and peace and not dissertion.. 125 ఏండ్ల కిందట వివేకానందుడు ఒక ప్రపంచ వేదికపై చేసిన ఈ ప్రబోధం ఇప్పుడు హిందూత్వంపై తమదే గుత్తాధిపత్యం అంటున్న వారికి, అసహనం వాతావరణం సృష్టిస్తున్న వారికి జ్ఞానోదయం కల్గించాలె.. స్వామియే శరణం. వివేకానందుడు అమెరికాలో ఉండగానే రెం డు పర్యాయాలు ఇంగ్లండ్ వెళ్లి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మ్యాక్స్‌ముల్లర్ తదితర మహా పండితులతో చర్చలు జరిపారు. మాక్స్‌ముల్లర్ పండితుడు తర్వాత వివేకానందుని జీవితచరిత్ర రచించారు. ఫ్రెంచ్ తత్త్వవేత్త, మేధావి రోమరోలా గూడా వివేకానందుని జీవిత చరిత్ర రచించారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ తదితర జాతీయ నాయకులు స్వయంగా కలకత్తా వెళ్లి రామకృష్ణమఠ్‌లో వివేకానందుని దర్శనం చేసుకున్నారు. వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువు అని అరవింద మహర్షి శ్రద్ధాంజలి ఘటించారు. వివేకానందుని బోధనల ప్రభావంతో తన దేశభక్తి వేయి రెట్లు హెచ్చిందని గాంధీ మహాత్ముడు అన్నారు. తాను 40 ఏండ్లకు మించి జీవించబోనని ముందే తన అనుచరులకు, సహచరులకు తెలియజేసిన వివేకానందుడు 40 ఏండ్లు దాటకముందే యజుర్వేద పఠనం చేస్తూ పరమపదించాడు.

515
Tags

More News

VIRAL NEWS