మహారాష్ట్ర ఘర్షణలు-వక్రీకరణలు

Fri,January 12, 2018 12:23 AM

మహారాష్ట్రలో ఈ మధ్య జరిగిన ఘర్షణల విషయంలో మీడియా, కొంతమంది రాజకీయ నాయకుల వ్యక్తీకరణలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. దళితులు, మరాఠాల మధ్య జరిగిన ఘర్షణలుగా చిత్రీకరించే ప్రయత్నంలో వారు అసలు నిజాలను కావాలనే వక్రీకరణకు పాల్పడ్డారు. ఇక ఆ సమావేశంలో పాల్గొనడానికి వచ్చి ప్రసంగించిన జిగ్నేష్ మేవానీపై రెచ్చగొట్టే విధంగా ప్రసంగించాడనే ఆరోపణలతో కేసులు కూడా బనాయించారు. బీజేపీని కొత్త పీష్వాలుగా చిత్రీకరించి మేవానీ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాడని వారు ఆరోపించారు.

దళితుల సమస్యలపై స్పందించటానికి ఏదో మూల దళిత నాయకత్వం ఉన్నది. అనేక రూపాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ప్రశ్నిస్తున్నారు. ఎదిరిస్తున్నారు.కానీ ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడేవారే కరువయ్యారు. ఎవరు ముస్లింల గురించి గొంతెత్తినా వారి దేశభక్తినిశంకిస్తారు. ముస్లిం లు తమ హక్కులకోసం నినదిస్తే వారు సమాజాన్ని అస్థిరత్వం చేస్తున్నారని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని చెబుతారు. ఇలాంటి దృక్పథం నుంచే దళితులు నిర్వహించుకునే భీమా కోరేగావ్ 200వ ఉత్సవాలపై హిందుత్వశక్తులు దాడులు చేశారు.

జిగ్నేశ్ మేవానీ మాత్రం తన పోరాటాన్ని 2019 దాకా కొనసాగించి వీధి పోరాటంగా మలుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిగ్నేశ్ మేవానీ వాదనకు పూర్తి ప్రాసంగికత ఉన్నది. ఆయన చెబుతున్న విషయాలకు సహేతుకమైన పునాది ఉన్నది. బీజేపీ నేతలు చరిత్రను తవ్వి ముస్లిం రాజుల చరిత్రలను వారి సమాధుల నుంచి తవ్వి తీసి కొత్వ భాష్యాలు చెబుతున్నారు. అది ఔరంగాజేబ్, బాబర్ నుంచి మొదలుపెట్టి టిప్పుసుల్తాన్ దాకా వారి పాలనా కాలం నుంచి విడదీసి అప్పటి ఘటనలకు కొత్త (వక్ర)భాష్యం చెబుతున్నారు. ఇదంతా కర్ణాటకలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ చేస్తున్న దాష్టీకమని మేవానీ ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బీజేపీ నేతలను, మరి కొంతమంది మీడియా వ్యక్తులను కొత్త పీష్వాలని ఎందుకు అంటున్నారో చూడాలి. దీనికోసం మనం కొంత చరిత్రలోకి పోయి చూడాలి. చరిత్రలో పీష్వాలు మహారాజ ఛత్రపతి శివాజీ పాలనలో ప్రధానులుగా పని చేశారు. కాలక్రమంలో ఈ చిత్పవన్ బ్రాహ్మణులే చిన్నచిన్న సామాంత ప్రభువులుగా పాలనాధికారాన్ని చేజిక్కించుకున్నారు. వీరంతా ఇలా స్థానిక ప్రభువులుగా చలామణి అవుతూ చక్రవర్తి కింద తమ పాలనాధికారాలను చలాయించారు. ఇలా ఛత్రపతి రాజ్యంలో మెజార్టీ భూ భాగాన్ని పాలనలో తమ గుప్పిట పెట్టుకున్నారు. ఇలాంటి చరిత్ర నేపథ్యంతోనే సంజయ్‌లీలా బన్సాలీ బాజీరావ్ మస్తానీ సినిమా తీశారు. ఈ కథానుసారం పీష్వా సామ్రాజ్యంలో బాజీరావు ఒక ప్రఖ్యాత మిలిటరీ హీరో. హిందూ పాదుషాగా పేరుగాంచారు. అయినా ఆయన తను రెండో భార్యగా మస్తానీని స్వీకరించి రాజ్యపాలన కొనసాగించాడు. ఇలాంటి చారిత్రక దాఖలాల నుం చే బీజేపీ చేస్తున్న కండబలం రాజకీయాలను చెప్పటానికి వారిని నయా పీష్వాలు అని పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ దీనికి విరుద్ధంగా లవ్ జీహాద్‌ను చేస్తున్నది.

చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే.. శివాజీ తన సైన్యంలో చాలా మందిని మహర్ల(దళితులు)ను సైనికులుగా నియమించారు. అయితే ఆయన పాలనలో అధికారం చలాయించిన పీష్వాలు పరమ క్రూరంగా పాలనాధికారాలు కొనసాగించారని తెలుస్తున్నది. ముఖ్యంగా దళితుల పట్ల చాలా హీనంగా, క్రూరంగా ప్రవర్తించారు. వారు దళితులను జంతువులకన్నా హీనంగా చూసేవారు. దళితులు నడిచిపోతున్న పాద ముద్ర లు కనపడకుండా ఉండేందుకు వారి వెనుకాల చీపిరి కట్టి ఉండాలని కట్టడి చేశారు. ఇలాంటి పీష్వాల పీడన పాలనపై బ్రిటిష్ వారి గెలుపును తమ గెలుపుగా దళితులు భావించారు. ఆ క్రమంలోనే పీష్వాలమీద గెలుపును తమ ఆత్మగౌరవ ప్రతీకగా కూడా భావించారు. ఆ ఘటన జరిగిన 1818ని తమ విజయోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ విజయోత్సవ సభ పుణెకు 30 కిలోమీటర్ల దూరంలోని భీమా కోరేగావ్‌లో జరిగింది. ఈ సభ సందర్భంగానే ఇటీవలి మహారాష్ట్ర ఘర్షణలు.

ఇలాంటి చారిత్రక, వర్తమాన పరిస్థితుల నేపథ్యంలోంచే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ శక్తులను ఆధునిక పీష్వాలని పిలువటం పరిపాటి అయ్యింది. ఇలా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులను జిగ్నేశ్ మేవానీ మాత్రమే మొదటి సారి అనలేదు. ఇంతకుముందు అనేకమంది సామాజిక శాస్త్రవేత్తలు, మేధావులు మతవాదశక్తులను పిలిచారు. ఆ నేపథ్యంలోంచే జిగ్నేశ్ వారి ని ఆధునిక పీష్వాలు అని పిలిచారు. ఇలాంటి సామాజిక పరిస్థితులలోంచే ఆధునిక సామాజిక ఉద్యమకారులు జ్యోతిబాయి ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్ లాంటి వారు మహర్ల హక్కుల కోసం ఉద్యమించారు. ఆధునిక బ్రహ్మనీయ పీష్వాలకు వ్యతిరేకంగా పోరాడారు.

ఇవన్నీ గతకాలపు వాదనలని ఎవరైనా వాదించవచ్చు. కానీ వర్తమా న కాలంలో జరుగుతున్న హింసను గురించి ఆలోచించాల్సి ఉన్నది. హింసకు కారకులను గుర్తించాల్సి ఉన్నది. గత కొన్నేండ్లుగా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న హింసాకాండ, దాడులను గురించి చర్చించాలి. గత మూడేండ్లుగానైతే ముస్లింలు లక్ష్యంగా అనేక సందర్భాల్లో దాడులు జరిగాయి, జరుగుతున్నాయి. దాడులు ముస్లింల వరకే పరిమి తం కావటం లేదు. సమాజంలోని మేధా శక్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోంచే నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కల్బుర్గీ లాంటి హేతువాద మేధావులను అం తమొందించారు. దేశవ్యాప్తంగా విమర్శనాత్మక మేధాశక్తులపై కనిపించని నిషేధం, దాడిని అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హిందుత్వ శక్తులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడులతో హిందువులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే కుల ప్రాతిపదికపై ఒకరిపై ఒకరికి వ్యతిరేకత పెం చుతూ ప్రజలను కూడగడుతూ హిందుత్వం వెనుక నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈ సందర్భంగా మనకొక సామెత గుర్తుకు వస్తున్నది. షోలే సినిమా నడుస్తున్న కాలంలో తల్లులు తమ పిల్లలను నిద్ర పుచ్చేందుకు గబ్బర్‌సింగ్ వస్తున్నాడని చెప్పి భయపెట్టి నిద్రపుచ్చేవారు. ఇప్పుడు కూడా అదే మరో రూపంలో జరుగుతున్నది. ఇప్పుడు గబ్బర్ సింగ్‌లు సామాజిక సమూహాలనే భయకంపితులను చేస్తున్నారు. కాకుంటే నేటి గబ్బర్‌సింగ్‌లు గడ్డంతో, తలపై టోపీతో ఉంటున్నారు.
saba
ఈ సందర్భంగానే మనం గమనించాల్సిన విషయమేమంటే.. కోరేగావ్ ఘటన తర్వాత జరిగిన ఘర్షణలు, ఆ నేపథ్యంలో అక్కడి ప్రజల కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జిగ్నేశ్ మేవానీ, జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ వచ్చారు. వారిపై టీవీ యాంకర్లు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. దేశ విభజనకారులు వచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారని మీడియా ప్రజలను రెచ్చగొట్టింది. తప్పుడు సమాచారంతో వక్రమార్గం పట్టించింది. ప్రకాశ్ అంబేద్కర్ నిర్వహించిన సం ఘీభావ సభలో పాల్గొని ప్రసంగించారు. దాన్నికూడా మీడియా వక్రీకరించటం చూస్తే ఆధునిక పీష్వాల తీరు ఎలా ఉన్నదో అర్థమవుతున్నది.

ప్రస్తుత పరిస్థితుల్లో దళితుల సమస్యలపై స్పందించటానికి ఏదో మూల దళిత నాయకత్వం ఉన్నది. అనేక రూపాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ప్రశ్నిస్తున్నారు. ఎదిరిస్తున్నారు.కానీ ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడేవారే కరువయ్యారు. ఎవరు ముస్లింల గురించి గొంతెత్తినా వారి దేశభక్తిని శంకిస్తారు. ముస్లిం లు తమ హక్కులకోసం నినదిస్తే వారు సమాజాన్ని అస్థిరత్వం చేస్తున్నారని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని చెబుతారు. ఇలాంటి దృక్పథం నుంచే దళితులు నిర్వహించుకునే భీమా కోరేగావ్ 200వ ఉత్సవాలపై హిందుత్వశక్తులు దాడులుచేశారు. ఇప్పటికైనా హిందుత్వ వాదులు తమ వాదనలోని అసలు నిజాలను తెలుసుకోవాలి. దళిత, వెనుకబడినవర్గాలు చేస్తున్న హక్కుల పోరాటాలను గుర్తించాలి. గౌరవించాలి. ఇలా చేసినప్పుడే నిజమైన సామాజిక శాంతి నెలకొంటుంది. దళిత ఉద్యమాలను నిందాపూర్వకంగా తిరస్కరించినంత కాలం ఇలాం టి ఉద్యమాలు ఉబికి వస్తూనే ఉంటాయి.
(వ్యాసకర్త: రచయిత, ప్రముఖ జర్నలిస్టు) ndtv.comనుంచి..

414
Tags

More News

VIRAL NEWS