చర్చస్థాయి పెంచని కమ్యూనిస్టులు

Wed,December 6, 2017 11:28 PM

కమ్యూనిస్టు ప్రభుత్వాలకు, ఉద్యమాలకు నాయకత్వాల వైఫల్యం వల్ల ఎటువంటి దుస్థితి ఎదురైంది? ఆ సిద్ధాంతం వర్తమాన దశలో ఎదుర్కొంటున్న ప్రశ్నలు ఏమిటి అనే విస్తృతమైన ప్రశ్నలను అట్లుంచితే, మార్క్సిజం ఒక గొప్ప విశ్లేషణా శాస్త్రమని దాని ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. తెలంగాణ విషయానికి వస్తే, ఆయా అంశాలపై ఉభయ కమ్యూనిస్టుల నుంచి బూర్జువా పార్టీల కన్నా పేలవమైన పడికట్టు విమర్శలు మినహా, విశ్లేషణలతో చర్చస్థాయిని పెంచటమన్నది ఒక్క విషయంలోనూ కన్పించదు.

కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఏకీభవిస్తారా, లేదా? కమ్యూనిస్టులకు ఎంత బలం ఉంది? అనే ప్రశ్నలతో నిమిత్తం లేకుండా గతంలో వారిని అందరూ గౌరవించేవారు. చట్టసభలలో బయట కూడా వారి నాయకులు చేసే ప్రసంగా లు, రచనలు, వాటిలోని విషయ చర్చలు, విశ్లేషణలు అందరినీ కట్టిపడేసేవి. వాటిని విన్నవారికి ఆయా విషయాల పట్ల తమ అవగాహనాస్థాయి పెరిగినట్లు తోచేది. అది నిజం కూడా. ఆ చర్చల నుంచి ఎంతో నేర్చుకునే వారు. ఆ కమ్యూనిస్టు నేతల పట్ల ఎంతో అభిమానం ఉండే ది. ఇపుడు పరిస్థితి ఏమిటి? బయటివారి మాట అటుంచి ఆ రెండు పార్టీల కార్యకర్తలకు సైతం ఆ నాయకులు తమ ప్రసంగాలు, విశ్లేషణల తో అవగాహనను పెంచలేకపోతున్నారు. తాము బూర్జువాలు అని పిలిచే పార్టీ నాయకులు చేస్తున్న ప్రసంగాలు సైతం అనేక సందర్భాలలో, పలు విధాలుగా అంతకన్నా మెరుగుగా ఉంటున్నాయి. వాటిలో గణాంకాలు ఉంటాయి. వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం ఉంటుంది. తమ పాలనానుభవాలు కనిపిస్తాయి. భవిష్యత్తు గురించిన ఆలోచనలు, సూచనలు ఉంటాయి. అవన్నీ సరైనవి కాకపోవచ్చుగాక, కనీసం అటువంటి దృష్టి, ప్రయత్నం ఉండటమన్నది గమనించవలసిన విషయం. తెలంగాణకు చెందిన ఉభయ కమ్యూనిస్టులలో అటువంటిదేమీ కన్పించదు. పైన అన్నట్లు పేలవమైన, పడికట్టు విమర్శలు తప్ప.ఇది, అది అనిగాక అన్ని విషయాల్లోనూ అదే పరిస్థితి కావటాన్ని బట్టి వారిలో మార్క్సి స్టు విశ్లేషణాశక్తి శూన్యస్థితికి చేరిందా అనే అభిప్రాయం కలుగుతున్నది.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో కొన్ని నిజమైన కమ్యూనిస్టు పార్టీలు (ఎంతో కొంత ఉన్నవని అర్థం), కొన్ని కాగితపు వామపక్షాలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఒకటి ప్రకటించాయి. అది ముందుకు కదిలితే ఎట్లా ఉండేదో గాని, ఇంతకాలం తర్వాత వారు మాత్రం ఎక్కడి వారక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆ కూటమి అయినా ఉన్నదీ లేనిదీ తెలియకుండా ఉంది. చూస్తుండగానే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉభయ కమ్యూనిస్టులకు బూర్జువా పార్టీలకు వలెనే ఓట్లు, సీట్లు, పొత్తుల ఆరాటం మొదలైంది. వారి విషయంలో ఇది మనం కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్న పరిస్థితే.

తెలంగాణ ఏర్పడిన 2014కు ముందటిస్థితిని, తర్వాతి స్థితిని ఒకసారి సమీక్షించి చూడండి. 2014కు ముందు సీపీఐ వైఖరి ప్రత్యేక రాష్ట్రం విషయంలో మారింది గనుక ఆ పార్టీని అట్లుంచితే, తన వ్యతిరేక వైఖరి గురించి సీపీఎం 2014కు ముందుగానీ, తర్వాత గానీ తెలంగాణ ప్రజలతో ఓపెన్‌గా చర్చించలేదు. వ్యతిరేకతను ఇప్పటికీ మార్చుకొనకపోగా, ఆ విషయమై ప్రజలను మభ్యపెట్టేందుకు రకరకాల ఉపాయాలకు పాల్పడుతున్నది. అందులో ప్రజల పట్ల చూపే మార్క్సిస్టు నిజాయితీ ఏమిటో మనకు బోధపడక, వారి పట్ల ఇప్పటికీ గౌరవం కలుగటం లేదు. మూడున్నరేండ్ల క్రితం రాష్ట్రం ఏర్పడే నాటికి వీరిద్దరి అకౌంట్ ఈ విధంగా మొదలైంది. ఆ తర్వాత నుంచి జరిగిందేమిటి అనేది అంతకన్నా ముఖ్యం అనుకుంటే, ఇరువురూ అదేవిధంగా గౌర వం కోల్పోతున్నారు. అందుకు యథాతథ కారణం వారు ప్రభుత్వాన్ని విమర్శించటం కాదు. పైన అనుకున్నట్లు, ఆ విమర్శలలో పేలవమైన పడికట్టుతనం మినహా, విన్నవారికి తగు అవగాహన కల్పించగల సమాచారాలు, విశ్లేషణలు ఉండవు. చర్చస్థాయిని పెంచటం ఉండదు. అయి నా, చర్చ అన్నదే లేనప్పుడు దాని స్థాయిని పెంచటమన్నది ఎక్కడ! సాధారణంగా, కేవలం అధికార రాజకీయాన్ని నడుపటం, అందుకోసం అడ్డదిడ్డపు విమర్శలు చేయటం బూర్జువా పార్టీల ధోరణి అనే భావన సమాజంలో ఉంది. అందుకు కమ్యూనిస్టులు భిన్నమని, వారికి అధికారం అవసరమైనా అంతకన్నా ఎక్కువగా సమాజాన్ని చైతన్యపరుచ టం ముఖ్యమనుకుంటారన్నది అభిప్రాయం. కాని గత మూడున్నర సంవత్సరాలుగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల తీరును గమనించిన మీద ట, వారికి, బూర్జువా పార్టీలకు తేడా ఏమైనా ఉందా అనే సందేహం కలుగుతున్నది.

నిజానికి ఎంత శ్రమపడినా కమ్యూనిస్టులకు కొద్ది స్థానాలకు మించి అధికారానికి రాగల అవకాశం ఎంతమాత్రం లే దు. అటువంటపుడు అయినా వారు వ్రతం చెడకుండా సిద్ధాంత నిష్టతో వ్యవహరించాలి. విషయాలపై సమాజానికి అవగాహన పెంచాలి. విమర్శలు, చర్చలస్థాయిని తమ సిద్ధాంత శక్తితో పైకి తీసుకుపోవాలి. కానీ వారు అం దుకు విరుద్ధంగా వ్రతం చెడినా సరే ఒకటి రెండు సీట్లు వస్తే చాలు, ఆ క్రమంలో తమ విమర్శలు, విశ్లేషణలు ఎంత నేలబారు స్థాయికి పతనమైనా ఫరవాలేదు, అందువల్ల తమ పట్ల సమాజానికి గౌరవం తగ్గినా చింతించనక్కరలేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇదంతా ఊహాగానం కాదు, కావాలని అనటం కాదు. గత మూడున్నరేండ్లుగా వివిధ విషయాలపై ఈ రెండు పార్టీల వారి ప్రకటనలు, ప్రసంగాలు, రచనలు, విమర్శలను గుర్తుచేసుకోండి. వాటిపై స్వయంగా వారు కూడా ఒకసారి తమ సిద్ధాంతమైన మార్క్సిస్టు స్ఫూర్తితో ఆత్మవిమర్శ చేసుకోవటం మంచిది. అన్నీ ఒకే విధమైన నిస్సారమైన మాటలు. అవే పునశ్చరణలు. ఏ రోజు, ఏ సభలో, ఎక్కడ ఏమన్నది చూసినా మన అవగాహనలు పెంచేది ఏమీ కన్పించదు. ఎన్నోసార్లు వాటి నుంచి పేర్లను తప్పించి చూస్తే బూర్జువా పార్టీల వారు, ఒకానొక మతతత్వ పార్టీ వారు, రకరకాల మేధావులు అనేదానికి వీరి మాటలకు ఆవగింజంత తేడా అయినా ఉండదు. గత మూడున్నరేండ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నవి ఉన్నాయి, జరుగనివి ఉన్నాయి. మంచీ చెడూ ఉంది. అదంతా సహజం.

వీటన్నింటిపై కమ్యూనిస్టులకు వీలైనంత అధికంగా సమాచార సేకరణ, అవసరమైన అంశాలపై క్షేత్రస్థాయి అధ్యయనం, వీటన్నింటిపై వాస్తవమైన విశ్లేషణ, ఆ తర్వాత తమ సైద్ధాంతిక దృక్పథం నుంచి మదింపు చేసి సారాంశాన్ని తేల్చటం అనేవి జరుగుతున్నాయా అనేది ప్రశ్న. కమ్యూనిస్టులు అయినవారు ఇదంతా చేస్తేనే అది మార్క్సిజం అనే గొప్ప విశ్లేషణాశాస్ర్తానికి అనుగుణంగా పనిచేసినట్లవుతుంది. ఆ విశ్లేషణ ప్రతిఫలించే ప్రకటనలు, ప్రసంగాలు, రచనలు, విమర్శలు చర్చ స్థాయిని పెంచుతాయి. వాటి నుంచి తమ అవగాహనను పెంచుకునేందుకు ఇతరులకు ఎంతైనా ఉం టుంది. ఇతరులు వారికి ఓట్లు, సీట్లు, అధికారం ఇవ్వటం సరే. అంతకన్న ముందు, వారు బూర్జువాలకన్నా భిన్నంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయం కలుగాలి. వారిపై గౌరవం ఏర్పడాలి. ఈ రోజున అది సుతారమూ లేకుండా పోతున్నది. ఒకవేళ ఇదంతా నిజం కాదని, గత మూడున్నరేండ్లలో తాము ముఖ్యమైన విషయాలపై పైన అన్నట్లు సమాచార సేకరణలు, క్షేత్రస్థాయి అధ్యయనాలు, మార్క్సిస్టు విశ్లేషణలు చేశామని వారు చెప్పదలచుకుంటే, అవి సమాజానికి సంబంధించినవే తప్ప రహస్యం కానక్కరలేదు గనుక, వాటిని వెల్లడి చేయాలి. ఈ సందర్భం లో మరొక ఆలోచన కూడా కలుగుతున్నది. ప్రభుత్వాలను వారు తరచుగా శ్వేత పత్రాలు కోరుతుంటారు. మంచిదే. అదే పద్ధతితో, ఇక్కడ ఇంతవరకు చర్చించిన విషయంపై వారు తమపై తాము ఒక శ్వేతపత్రం తయారుచేసి ప్రజల ముందుంచితే, తమ పట్ల గౌరవ విశ్వాసాలు పెరుగవచ్చు.
ashok
తెలంగాణ ఏర్పడిన కొత్తలో కొన్ని నిజమైన కమ్యూనిస్టు పార్టీలు (ఎంతో కొంత ఉన్నవని అర్థం), కొన్ని కాగితపు వామపక్షాలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఒకటి ప్రకటించాయి. అది ముందుకు కదిలితే ఎట్లా ఉండేదో గాని, ఇంతకాలం తర్వాత వారు మాత్రం ఎక్కడి వారక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆ కూటమి అయినా ఉన్నదీ లేనిదీ తెలియకుండా ఉంది. చూస్తుండగానే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉభయ కమ్యూనిస్టులకు బూర్జువా పార్టీలకు వలెనే ఓట్లు, సీట్లు, పొత్తుల ఆరా టం మొదలైంది. వారి విషయంలో ఇది మనం కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్న పరిస్థితే. 2019 కోసం చరిత్ర పునరావృతమవుతున్నది. చివరికి ఎవరెవరితో కలిసి ఎన్ని ఓట్లు, సీట్లు పెంచుకుంటారో లేక పోగొట్టుకుంటారో తెలియదు గానీ, తాము 65 సంవత్సరాల క్రితం చారిత్రక పాత్ర వహించిన ప్రాంతం ఒక స్వయంపాలిత రాష్ట్రంగా అవతరించిన స్థితిలో అక్కడ తమ విలువతో, తమ వ్యవహరణ ద్వారా తామే చెలగాటమాడుతున్నారు!

468
Tags

More News

VIRAL NEWS