కళ్యాణి చాళుక్యులది తెలంగాణే

Wed,December 6, 2017 11:27 PM

మన చరిత్రను నిర్మించుకుందాం- 2

వరంగల్లు జిల్లా ఖాజీపేటలో సత్యాశ్రయ భీమరసు (క్రీ.శ. 872) శాసనం దొరుకుతున్నది. ఇతడే చాళుక్య వంశాన్ని తెలిపే రూగి శాసనంలో అనుమకొండేయ భీముడుగా పేర్కొనబడినాడు. ఇతడు అనుమకొండకు చెందినవాడని, రాష్ట్ర కూట చక్రవర్తియైన మొదటి అమోఘవర్షుని సామంతుడిగా ఉండి, వరంగల్లు ప్రాంతాన్ని పాలించే వాడని దీనివల్ల ధృవపడుతున్నది. ఈ అనుమకొండేయ భీముడే కళ్యాణి చాళుక్యులకు మూలపురుషుడు. ఇతని పుత్రుడు అయ్యన. అయ్యన కుమారుడు 4వ విక్రమాదిత్యుడు. ఇతడే రెండవ తైలపుని తండ్రి. క్రీ.శ 1015 నాటి గూరి (బీజాపూర్ జిల్లా) శాసనం, ఖాజీపేట శాసనం ఆధారంగా కళ్యాణి చాళుక్యుల పూర్వులు తెలంగాణవారే అని తెలుస్తున్నది.
TELUGU-MAHASABALU
బాదామి చాళుక్యులు (క్రీ.శ.535-755): బాదామి చాళుక్యులు కృష్ణానది ఉత్తరదక్షిణ తీరాలలో గల అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా, కర్నూలు జిల్లాల్లో వ్యాపించి ఉన్న చాళుక్య వంశానికి చెందినవారు. చాళుక్య వంశ ప్రసక్తి రెండవ పులకేశి సార్వభౌముడు వేయించిన తుంబేయలూరు శాసనంలో ఉన్నది. ఈ శాసనం కార్తీక పూర్ణిమ నాడు వచ్చిన చంద్రగ్రహణ సందర్భంగా, కృష్ణా, తుంగభద్రల సంగమ స్థానంలో గల సంగమేశ్వర స్వామి సన్నిధిలో తుంబేయలూరు గ్రామంలో వేదవేదాంగేతిహాస విదుడైన మావుగణస్వామికి 25 నివర్తనాల భూమిని దానంగా ఇచ్చిన సందర్భంగా వేయించబడినది. చాళుక్య విషయాంతర్గతాలైన కొల్లాపూరు, గద్వాల, కర్నూలు, అలంపూరులలో రెండవ పులకేశి, మొద టి విక్రమాదిత్యు డు, వినయాదిత్యుడు, విజయాదిత్యుడు, వారి రాణులు అనేక ధార్మిక కార్యాలు నిర్వహించి, దేవాలయాలు నిర్మించి అనేక శాసనాలు వేయించినారు. కర్నూలులో జిల్లాలోని నంది మండలంలో అనేక దేవాలయాలు, అలంపూరులో చాళుక్య శిల్పమండితాలైన నవబ్రహ్మలయాలు కూడా ఆ రాజ్యన్యులచే నిర్మింపబడినవే. దీనివల్ల చాళుక్య వంశం వారి జన్మస్థానమైన కారణంగా వారికి గల విశేషాభిమానం వ్యక్తమవుతున్నది.

చాళుక్యులు మొదట తమ మాతృభూమియైన చాళుక్య విషయంలో ఉండి, తర్వాత విష్ణుకుండినుల వద్ద చేరి తమ ధైర్యసాహసాలను ప్రదర్శించి, సైన్యాధికారులై, ఆపై సామంతులుగా స్థిరపడ్డారు. విష్ణుకుండినులు బలహీనపడటంతో సత్యాశ్రయ పులకేశి క్రీ.శ 535లో స్వాతంత్య్రం ప్రకటించుకొని కర్ణాటకలోని ఐహోల్ నుంచి పరిపాలన సాగిస్తూ, అక్కడికి పది మైళ్ల దూరంలో గల వాతాపికొండపై కోటను కట్టించి క్రీ.శ 543లో తన రాజధానిని అక్కడికి మార్చాడు. బాదామి నగరానికే పూర్వం వాతాపియని పేరుండేది. బాదామి రాజధాని నుంచి పాలన సాగించడం వల్ల ఆ వంశీయులకు బాదామి చాళుక్యులని ప్రసిద్ధి. వారు తమ రాజభాషయైన సంస్కృతంలోనే గాక తెలుగులో కూడా శాసనాలు ప్రకటించారు. రెండవ పులకేశి దక్షిణాపథ సామ్రాజ్యం 99 వేల గ్రామాలతో ఒప్పి ఉన్నట్లు ఐహోల్ శాసనం తెలుపుతున్నది. సకలోత్తరాపథేశ్వరుడైన శ్రీహర్షవర్ధనుని నర్మదా తీరంలో ఓడించి, అతని గజ బలాన్ని లాగుకొని, అత ని పరమేశ్వర బిరుదాన్ని స్వాయత్తం చేసుకొన్న పరాక్రమశాలి రెండవ పులకేశి. ఇతని ఈ విజయం దక్షిణాపథ చరిత్రలో గొప్ప మలుపు.

కళ్యాణి చాళుక్యులు (క్రీ.శ.976-1189): రాష్ట్ర కూట మూడవకృష్ణుడు రెండవ తైలపుని తద్దవాడికి పాలకునిగా నియమించినాడు. రాష్ట్రకూటులు బలహీనంగా ఉన్నది కనిపెట్టి మాన్యఖేటంపై దండెత్తి విజయాన్ని సాధిం చి, తైలపుడు దానిని రాజధానిగా చేసుకొని పరిపాలన ప్రారంభించాడు. తర్వాత దక్షిణాపథంపై దండయాత్ర సాగిస్తూ, పరాధీనమైన కొలనుపాకను స్వాధీనం చేసుకొని దానిని తాత్కాలిక రాజధానిగా చేసుకొన్నాడు.
జగదేకమల్ల జయసింహుని కుమారుడు త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు రాజధానిని మాన్యఖేటం నుంచి క్రీ.శ. 1042 ప్రాంతంలో కళ్యాణి నగరానికి మార్చాడు. కళ్యాణి రాజధానిగా ఉండటం వల్ల ఈ వంశీయులకు కల్యాణి చాళుక్యులని పేరు వచ్చింది. వరంగల్లు జిల్లా ఖాజీపేటలో సత్యాశ్రయ భీమరసు (క్రీ.శ. 872) శాస నం దొరుకుతున్నది. ఇతడే చాళుక్య వంశాన్ని తెలిపే రూగి శాసనంలో అనుమకొండేయ భీముడుగా పేర్కొనబడినాడు. ఇతడు అనుమకొండకు చెందినవాడని, రాష్ట్ర కూట చక్రవర్తియైన మొదటి అమోఘవర్షుని సామంతుడిగా ఉండి, వరంగల్లు ప్రాంతాన్ని పాలించే వాడని దీనివల్ల ధ్రువపడుతున్నది. ఈ అనుమకొండేయ భీముడే కళ్యాణి చాళుక్యులకు మూలపురుషుడు. ఇతని పుత్రుడు అయ్యన. అయ్యన కుమారుడు 4వ విక్రమాదిత్యుడు. ఇతడే రెండవ తైలపుని తండ్రి. క్రీ.శ 1015 నాటి రూగి (బీజాపూర్ జిల్లా) శాసనం, ఖాజీపేట శాసనం ఆధారంగా కళ్యాణి చాళుక్యుల పూర్వులు తెలంగాణవారే అని తెలుస్తున్నది. అనుమకొండేయ భీముని సంతతివారైన అయ్యన ప్రభృతులు కూడా రాష్ట్రకూటులచే ఉన్నత పదవులలో నియుక్తులై కర్ణాటక ప్రాంతానికి పరిపాలన బాధ్యతలపై వెళ్లవలసి వచ్చింది. ఆపై బలహీనపడ్డ రాష్ట్రకూటులను తొలిగించి రెండవ తైలపుడు (ఆహావమల్లుడు) కళ్యా ణి చాళుక్య సామ్రాజ్యానికి శ్రీ కారం చుట్టినాడు.
gangapuram
స్వతంత్రించిన కుమారతైలపుడు: కల్వకుర్తి సమీపంలోని రాచూరులో గల క్రీ.శ. 1136 నాటి శాస నం వల్ల కందూరునాడుకు చాళుక్య రాజప్రతినిధిగా ఉన్న కుమార తైలపుడు, తండ్రియైన త్రిభువన మల్ల చక్రవర్తి మరణానంతరం అన్నయైన భూలోకమల్ల సోమేశ్వరుడు చాళుక్య సింహాసనం అధిష్ఠించగా, అతనిని ధిక్కరించి గంగాపురంలో శ్రీమతైలపదేవుడుగా పట్టాభిషిక్తుడైనట్లు తెలుస్తుంది. ఆ శాసనంలో కుమార తైలపుడుగా గాక చాళుక్య చక్రవర్తులకు గల ప్రశస్తియుతుడై సమస్త భువనాశ్రయ శ్రీపృథ్వీ వల్లభ, మహారాజాధి రాజ పరమేశ్వర, పరమ భట్టారక, సత్యాశ్రయకుతిలక, చాళుక్యాభరణ శ్రీరామత్తైలపదేవుడుగా ప్రశంసింపబడినాడు. ఇందు గంగాపురం రాజధానిగా పేర్కొనబడినది. ఈ శాసనపు సమకాల శాసనాలలో భూలోకమల్ల వర్షాలు పేర్కొనబడుతుండగా, తైలపుడు దీనిని అంగీకరించక, తండ్రియైన త్రిభునమల్ల విక్రమాదిత్యుడు ప్రవర్తింపజేసిన చాళుక విక్రమ శకాన్నే పేర్కొనడం గమనింపదగినది. గోన గన్నారెడ్డి: కల్వకుర్తి ప్రాంతపు సిరుసన గండ్ల క్షేత్రానికి దగ్గరలో గల గ్రామంలో లభించిన ఒక శాసనంలో గోన గన్నారెడ్డికి పుణ్యం కలుగునట్లు అచటి చెలిమెల కాపులు అనేక ధానధర్మాలు చేసినట్లు చెప్పబడింది. దీనివల్ల చలిమెల కాపులు గన్నారెడ్డికి దగ్గరి బంధువులని, గన్నారెడ్డి ఆ ప్రాంతం వాడైనందుకే అతని కోసమే ధర్మకార్యాలు చేశారని తెలుస్తున్నది. కల్వకుర్తి, దాని పరిసర గ్రామాలలో గొనరెడ్ల కుటుంబాలు అనేకం ఇప్పటికీ నివసిస్తున్నాయి. గనుక గన్నారెడ్డి ఇక్కడి నుంచే ఓరుగల్లు చేరుకొని, తన ధైర్య సాహసాలతో క్రమంగా రాణిరుద్రమదేవి కడసేవ కునిగా నియుక్తుడైనాడని చెప్పవచ్చు.
(ఇంకా ఉంది..)

923
Tags

More News

VIRAL NEWS