మన చరిత్రను నిర్మించుకుందాం

Wed,December 6, 2017 12:10 AM

ప్రభువు ఆజ్ఞకు శాసనమని పేరు. ఇటువంటి ఆజ్ఞలు, ప్రకటనలు శాశ్వతంగా నిలిచి ఉండేందుకు, ప్రజలందరికి సులభంగా తెలిసేందుకు, గండ శిలలపైన, శిలాఫలకాలపైన,తామ్ర పత్రాలపైన ఈ ప్రకటనలు చెక్కింపబడేవి. ఈ శాసనాలను రాజన్యులు, మండలాధీశులు, దాతలు, ఉపాసకులు, ధనికులు, సామాన్య ప్రజలు శిల్పమండితమైన దేవాలయాలను, చైత్యాలయాలను,విహారాలను నిర్మించి, వాటి వివరాలను శాసనాలపై చెక్కించేవారు. అనేక ధార్మిక, సామాజిక కార్యాలను నిర్వహించి, ఆ సందర్భంగా వేద శాస్త్ర కోవిదులకు, శిల్పులకు, కళాకారులకు, శ్రేణులకు, ఆలయాలకు గో, భూ హిరణ్యాది దానాలు కావించి, శిలా, తామ్ర శాసనాలను వేయించేవారు. వాపీ, కూపతటాకాదులు, ఉప వనాలు నిర్మించినప్పుడు కూడా ఇటువంటి శాసనాలు, ప్రకటనలు వెలువడేవి.

ప్రాచీనకాలంలో మనదేశంలో ఇతిహాసాలు, పురాణాలు, తరంగిణి వంటి గ్రంథాలు వచ్చినా, ఆధునిక పద్ధతిలో భారత వర్షేతిహాసం రాసే ఒరవడి లేకుండినది. ఆ లోటును తీర్చేందుకు ఆధునిక చారిత్రికులు భారతదేశ చరిత్రను పుననిర్మించుకునేందుకు పూనుకున్నారు. అయితే అశోక చక్రవర్తి ధర్మలిపి శాసనాలు మొదలుకొని తర్వాతి శాసనాలన్నీ బ్రాహ్మీ లిపిలోనే ఉండి, ఎవరికి అర్థం గాని స్థితి ఏర్పడ్డది. పండితపరిశోధకులెందరో శ్రమించి, బ్రాహ్మీ లిపిని విశ్లేషించి అర్థం చేసుకోవడంతో ప్రాచీన శాసనాలన్నింటినీ అవగతం చేసుకోవడానికి మార్గం సుగమమైంది. మన తెలుగు లిపితో సహా దేశంలోని లిపులన్నీ బ్రాహ్మీ లిపి నుంచి పరిణమించినవే. ఆంగ్లేయ ప్రభుత్వ కాలంలోనే ఎఫిగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ స్థాపించబడి, దాని పక్షాన దేశపు నలుమూలల గల వేల కొలది శాసనాలు సంపాదించి, అనేక బృహత్సంపుటాలలో భద్రపరుచబడినవి. ఆయా కాలాలలో పరిణతి పొందుతూ వచ్చిన లిపులకు ఆయా రాజుల పేర శాతవాహన లిపి, ఇక్షాకు లిపి, పల్లవలిపి, వేంగీలిపి, చాళుక్య లిపి, కాకతీయ లిపి అని సౌలభ్యం కోసం శాసన పరిశోధకులు పేర్లు పెట్టుకొన్నారు. వీటికి కారణం ఆయా కాలాల్లో లిపులలో వచ్చిన మార్పులు. ఈ లిపులు గల శాసనాలన్నీ సంస్కృతం, ప్రాకృతం, కన్నడ, తెలుగు, తమిళం మొదలైన భాషలలో ఉన్నవి. వీటిని చదివి చారిత్రక రాజకీయ, ఆర్థిక, సామాజికాది అంశాలను సమన్వయం చేసి ప్రామాణికమైన భారతదేశ చరిత్రను నిర్మించారు చరిత్ర శోధకులు. దక్షిణ భారత చరిత్ర కూడా ఈ బృహత్ప్రయత్నం ద్వారానే వెలువడ్డది.
తెలంగాణలో శాతవాహనులు మొదలు ఇక్షాకులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కల్యాణి చాళుక్యులు, కాకతీయులు మొదలైన రాజవంశీయుల కాలంలో వేయించిన వందల కొలది శాసనాలు లభిస్తున్నవి.

పూర్వపు శాసనాలను, కొత్తగా వెలువడ్డ శాసనాలను మళ్లీ సూక్ష్మంగా పరిశీలిస్తే తెలంగాణ అమూల్య చారిత్రక సంపద లభిస్తుంది. మన కొత్త రాష్ట్రంలో తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో కలిసి 2500 శాసనాలకు పైగా దొరుకుతున్నవి. వీటన్నింటిని సూక్ష్మంగా శోధిస్తే అబ్బురం గొలిపే ఎన్నో చారిత్రక సత్యాలు బహిర్గతమవుతాయి. కొత్త విషయాలను కొందరు పరిశోధకులు వ్యాసాల రూపంలో ప్రకటించినా, వాటిలో సమన్వయం లేక పాఠకులకు అందుబాటులో లేవు.

స్వాతంత్య్రం రాకపూర్వమే శతావధాని దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణ అంతటా సంచరించి, వందలకొలది శాసనాలను సేకరించి మన చరిత్రకు ఎనలేని సేవ చేశారు. తెలంగాణ శాసనాలు అన్న పేరుతో రెండు శాసన సంపుటాలు వెలవడ్డవి. రెండవ సంపుటానికి శాసన పరిశోధకులు శ్రీ గడియారం రామకృష్ణశర్మగారు సంపాదకత్వం నిర్వహించగా లక్ష్మణరాయ పరిశోధక మండలి ప్రచురించింది. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ పురావస్తు శాఖలో డాక్టర్ నేలటూరి వేంకటరమణయ్యగారు, డాక్టర్ వాసుదేవపరబ్రహ్మ శాస్త్రి గారు శాసన పరిశోధకులుగా చేరి, మారుమూల గ్రామాల్లో దాగియున్న శాసనాలెన్నింటినో వెలికి తెచ్చినారు. వరంగల్లు, కరీంనగర్, నల్లగొండ జిల్లాల ప్రామాణిక శాసన సంపుటాలను ప్రకటించారు. వీటివల్ల చరిత్ర శోధకులకు ఎంతో మేలు చేకూరుతున్నది. అట్లే మహాబూబ్‌నగర్ జిల్లాలో లభించిన 300 శాసనాలతో రెండు శాసన సంపుటాలు 2003లో ప్రకటింపబడినవి. వీటికి ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు సంపాదకత్వం వహించినా, తప్పులతో నిండి ఉన్నది. కృషి అంతా వ్యర్థమైంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సంపుటాలను శుద్ధరూపంలో పునర్ముద్రణ కావిస్తే చరిత్ర పరిశోధకులకు మేలు కలుగుతుంది.

రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు దక్షిణాపథాన్నంతా పాలించినా కర్ణాటకలోని తమ రాజధానుల నుంచి పరిపాలన సాగిస్తూ, తమ శాసనాలను చాలావరకు తెలుగు, కన్నడ లిపిలో హళగన్నడ భాషలో ప్రకటించారు. ఈ హళగన్నడ శాసనాలే వందలకొద్ది తెలంగాణ అంతటా వ్యాపించి ఉన్నవి. ఈ మూల శాసనాలను సామాన్యులు చదివి అర్థం చేసుకోవడం కష్టం. మొదలు వెలువడ్డ రెండు తెలంగాణ శాసన సంపుటాలు, పురాతత్త శాఖ ప్రకటించిన శాసన సంపుటాలు తెలుగు లిపిలో రావడం వల్ల కొంత సౌకర్యం కలిగింది. కాకతీయుల కాలంలో కన్నడ లిపి నుంచి విడివడి స్వతంత్రంగా తెలుగు లిపి ఆవిర్భవించింది. కాకతీయ శాసనాలన్ని నేటి తెలుగు లిపిలో, తెలుగు, సంస్కృత భాషలలో ఉండటం వల్ల పరిశోధకులకు మేలు జరిగింది. ఇదివరకు చరిత్ర గ్రంథాలెన్నో వెలువడ్డా అవి మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. ఈ గ్రంథాల తర్వాత తెలంగాణలో ఎన్నో కొత్త శాసన సంపుటాలు వచ్చాయి.
పూర్వపు శాసనాలను, కొత్తగా వెలువడ్డ శాసనాలను మళ్లీ సూక్ష్మంగా పరిశీలిస్తే తెలంగాణ అమూల్య చారిత్రక సంపద లభిస్తుంది. మన కొత్త రాష్ట్రంలో తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో కలిసి 2500 శాసనాలకు పైగా దొరుకుతున్నవి. వీటన్నింటిని సూక్ష్మంగా శోధిస్తే అబ్బురం గొలిపే ఎన్నో చారిత్రక సత్యాలు బహిర్గతమవుతాయి. కొత్త విషయాలను కొందరు పరిశోధకులు వ్యాసాల రూపంలో ప్రకటించినా, వాటిలో సమన్వయం లేక పాఠకులకు అందుబాటులో లేవు. ఈ శాసనాల ఆధారంగా, కనుగొన్న విషయాలను విశ్లేషించి, పూర్వం వెలువడ్డ చరిత్రలోని ఒడిదొడుకులను సవరిస్తూ, రెండింటిని సమన్వయిస్తూ తెలంగాణ ప్రామాణిక చరిత్రను రాయాలి. కొత్తగా కనుగొన్న చారిత్రక సన్నివేశాలు మచ్చుకు కొన్ని- కదంబ రాజవంశం: (క్రీ.శ. 3వ శతాబ్ది)

ఇప్పటి వనపర్తి జిల్లాకు చెందిన కందూరు పూర్వం కందూరు నాడుకు రాజధానిగా ఉండేది. ఏరువ భీమ చోళుడు, కళ్యాణి చాళుక్య చక్రవర్తియైన త్రిభువనమల్ల విక్రమాదిత్యునికి యుద్ధాలలో తోడ్పడి, అతనివల్ల కందూరునాడుకు ఏలికగా నియుక్తుడైనాడు. అప్పటినుంచి ఏరవ చోళులు కందూరు చోళులుగా పిలువబడ్డారు. అంతకు ముందే కందూరు అనెమరసు మొదలైన వారి కుటుంబాలు అక్కడ ఉన్నట్టు శాసనాలవల్ల తెలుస్తున్నది. దీనివల్ల కందూరుకు గల రాజకీయ ప్రాధాన్యం ఎట్టిదో తెలుసుకునేందుకు వీలు కలుగుతున్నది. కదంబ రాజవంశానికి మూల పురుషుడైన మయూరశర్మ వేదశాస్త్ర విదులైన విప్రుల ఇంట జన్మించాడు. కందూరు ఇప్పటికీ కదంబ వృక్షాలకు నిలయం. వారి ఇంటిలో అందమైన పూలు పూసే కదంబ వృక్షం ఉండటం వల్ల ఆ వంశీయులకు కదంబులని పేరు వచ్చింది. మయూరశర్మ తండ్రివద్ద వేద విద్యను అభ్యసించి, చతుర్వేదాల్లో పారంగతుడగుటకు మిత్రునితో కలిసి పల్లవుల రాజధాని, సకల విద్యలకు నిలయమైన కాంచీనగరంలో ఒక ఘటిక అనే విద్యా పీఠంలో ప్రేశించాడు. ఒకనాడు ఆ నగరంలో తిరుగుతుండగా, ఒక అశ్వికునితో ఘర్షణకు దిగవలసి వచ్చింది. అశ్వికునితో తలపడి, అతనిని ఓడించి బ్రహ్మా తేజో విరాజితుడైన బ్రాహ్మణుడు క్షత్రియ శక్తికి లొంగి ఉండటమేమిటని తలచి, శౌర్యము మీర చేత ఖడ్గం ధరించి, శ్రీ శైలారణ్యెలకు చేరుకొని, సైన్యాన్ని సమీకరించి, పల్లవులతో విజృంభించి పోరాడి పశ్చిమ సముద్రతీరంలో వనవాసి ప్రాంతాన్ని ఆక్రమించి, వైజయంతిపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. శ్రీశైలం వరకు అతని సామ్రాజ్యం విస్తరించి యున్నట్టు శాసనాలు తెలుపుతున్నవి. కందూరికి సమీపంలో కోడూరు అనే ప్రసిద్ధ గ్రామం ఇప్పటికీ ఉన్నది. కోడూరునే రాజధానిగా చేసుకొని త్రిభుమనమల్ల చక్రవర్తి కొడుకు కుమార తైలపుడు కందూరునాడుకు రాజ ప్రతినిధిగా వచ్చి పాలన సాగించాడు.
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తమ కడిమిచెట్టు చారిత్రక నవలలో ఏదో ఒక తీవ్రమైన సంఘటన కోడూరు స్థానాలో జరిగినట్లు చెప్పినా ఆంధ్రాప్రాంతానిదనే భావన కలుగజేశాడు. మయూర శర్మతో సంబంధం కలిగి, మొదటి నుంచి రాజకీయ ప్రాధాన్యం గల ఈ కోడూరే అది అని మనం నిర్ణయించవచ్చు.
ganga
పూర్వం కందూరు, దాని పరిసర గ్రామాల్లోని మయూర శర్మ చరిత్రలో కోవిదులైన వృద్ధులు ఈ విషయాలను కథలుగా చెప్పుకునేవారు. కదంబుల చరిత్రను ఇంకా తీవ్రంగా పరిశోధించవలసి ఉన్నది. విష్ణుకుండిన వంశం (క్రీ.శ.358-624) విష్ణుకుండినులు తెలుగు దేశాన్ని సమగ్రంగా పాలించడమే కాక క్రమంగా ఉత్తర, దక్షిణ దేశాలలో చాలా భాగాలు జయించి రాజ్య విస్తరణ కావించారు. వీరు త్రికూట మలయాధిపతులుగా శ్రీ పర్వతస్వామి పాదానుధ్యాతలుగా శాసనాల్లో పేర్కొనబడ్డారు. విష్ణుకుండిన శాసనాలు మొదలు బెజవాడ మొదలైన చోట్లలో దొరుకడం వల్ల చారిత్రకులు వారిని ఆంధ్ర ప్రాంతం వారిగనే మొదట నిర్ణయించారు. కాని గోవిందవర్మ (క్రీ.శ. 398-435) ప్రాకృత శిలాశాసనం హైదరాబాద్‌లోని చైతన్య పురిలోగల నృసింహాలయం వద్ద దొరుకడం వల్లను, నల్లగొండ జిల్లాలో గల తుమ్మలగూడెం ఇంద్రపాల నగరంలో దొరికిన విక్రమేంద్ర భట్టారక వర్మ, ఇంకా పూర్వడైన గోవిందవర్మ వేయించిన శాసనాల వల్ల నల్లగొండ జిల్లా నుంచే ఆంధ్ర ప్రాంతానికి వారు విస్తరించినట్లు తెలుస్తున్నది. ఎక్కడ తమ రాజధానులను స్థాపించినా విష్ణుకుండినులు దేవతల రాజధానియైన అమరావతి అని గాని, దాని నామాంతరాలైన ఇంద్రపాలనగరం, ఇంద్రపురి, శక్రపురి అనిగాని పేరు పెట్టడం కనిపిస్తుంది. నాగర్‌కర్నూలు జిల్లాలోని అమరావతిని (నేటి అమరాబాదును) మొదట రాజధానిగా చేసుకొని మహారాజేంద్రవర్మ (క్రీ.శ.358-370) పరిపాలన సాగిస్తూ, నల్లగొండ జిల్లాకు రాజ్యాన్ని విస్తరించినట్లు నిశ్చయించవచ్చు.
(ఇంకా ఉంది..)

500
Tags

More News

VIRAL NEWS