తెలంగాణ నిర్మాణ కవిత్వం

Sat,November 18, 2017 11:12 PM

కలల సాగు ఆవిష్కరణ
వఝల శివకుమార్ కవిత్వం కలల సాగు ఆవిష్కరణ సభ నేడు సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్ రవీంద్రభారతి మినీహాల్‌లో జరుగుతుంది. దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరుగు సభలో కె.శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. నందిని సిధారెడ్డి, జింబో, మామిడి హరికృష్ణ, అయాచితం శ్రీధర్, వారాల ఆనంద్ ప్రసంగిస్తారు. పెన్నా శివరామకృష్ణ పుస్తక పరిచయం చేస్తారు. అందరికీ ఆహ్వానం.
- తెలంగాణ వికాస సమితి
shiva
కవిత్వం హృదయార్ద్రవం. లోలోన రగుల్తది. రాజుకుంటది. దాని అం తిమ ప్రయోజనం జనం పాలుపట్టిన పైరు విరి ముత్యాలుగా మారే సంతృప్తి. ఆ లోతులు తెలిసి ప్రవర్తించే అవిశ్రాం త కలంసహవాసి వఝల శివకుమార్. మొదటి సంపుటి గోగుపువ్వునుంచి, పాలకంకుల కల దాఖలా. మూడింటి తర్వాత వలసపోయిన పత్రహరితాలు, ధ్వంసమైన స్వప్నాలను కన్న కలల సాగు నాలుగోది. ఆనందంగా బతుకడ మే జీవితమైతే ఆ సంతోషపు ఘడియలు లేకుం డా దశాబ్దాలు వసంతాన్ని తరుముకున్న గతకాలపు పీడన, నిరాశావాదానికి స్వస్తిపలికి కొత్త బతుకు చిత్రాలను, విలువలను ఆవిష్కరించింది.

నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రసాధన కోసం కలమెత్తిన కవులు, రచయితలు ఇవ్వాల ఏం రాస్తున్నారు? రచనలు పలుచబడినాయా? వస్తు న్న మార్పులేంటి? వస్తు శిల్పాల తీరుతెన్నులెట్లున్నయి? వంటి ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ రావలసిన సరైన సమయంలో వచ్చి న చిక్కటి కవిత్వం కలల సాగు. తెలంగాణలో ఏ వివక్షలను లక్ష్యం చేసుకున్నా ఏ సమస్యలకు స్పందించినా, మా బతుకులు ఇట్ల మారాలని, ఇట్లుండాలని సిద్ధాంతీకరించుకున్న మూలాలే వ్యక్తమవుతున్నాయి. వస్తువు విభిన్న తీరుల దర్శనమవుతున్నది. జీవితాన్ని గౌరవించకుండా భావావేశాన్ని, గాఢతను పరిగణనలోకి తీసుకుం టే పొరపాటే అవుతది. ఇప్పుడు తెలంగాణలో వస్తున్నది నిర్మాణాత్మక కవిత్వం (సాహిత్యం) అని మనం స్పష్టంగా చాటవలసిన అవసరం ఉన్నది. వస్తు శిల్పాలను పదునుచేసిన వఝల శివకుమార్ కలల సాగు నిర్మాణాత్మక సాహి త్యం (కవిత్వం)లో భాగం. తనను తానుగా అక్షరాల్లో రంగరించుకున్నాడు. శిల్పీకరించుకున్నా డు. ఆ అంతర్ముఖీనత్వంలోంచి బహిర్గతమైన అభివ్యక్తులను సాగుచేశాడు.

ఈ సంపుటిలో 63 నారుమళ్లున్నయి. అన్నింటిలోనూ రేపటి ఆశలు కొట్టుమిట్టాడుతయి. కలలన్నీ బతుకుపాటల/పల్లవులై ప్రతిధ్వనించ నీ... అనే రెండు మెతుకులు చాలు పరిపక్వతా వాసనలు వెదజల్లడానికి. సామాన్యుని జీవితానికి నిండుదనం చేకూర్చడమంటేనే అసలైన సాఫ ల్యం అవుతది. కానీ ఇటు స్పర్శకురాని జీవితా లు ప్రచారంలో సాఫల్యత అనిపించుకున్నా కలకాలం నిలిచేదికాదు. రెండింటి మధ్య వఝల కవిత్వం స్పష్టమైన రేఖను గీస్తుంది.

వఝల శివకుమార్ కలల సాళ్లకు రాత్రి ఒక ఉదయం అయింది. పొద్దంతా మననం చేసిన జీవితం నెలవంకను రాత్రిళ్లు ప్రశాంతంగా సానబెట్టాడు. పల్లె సౌరభమంత అందమైన పాదాలు గా చెక్కాడు. కొత్త పదాలకు ప్రాణం పోసి ఆటాడుకున్నడు. అలంకారాలతో మెరుగులు దిద్దా డు. వ్యంగాన్ని, అధిక్షేపాన్ని దేన్నీ వదలలేదు. ఆయన కలం జాలులో ఒక్కొక్క పదం పాదమవుతున్నప్పుడు అవి తలవిరుపుగా గర్వంగా పద్యమంతా అయి సాగుతయి. సమయం ఓ పాదరస ప్రవాహం అన్నడు. సమయం విలువ ప్రాణం పోతున్నప్పుడు కాదు తెలువాల్సింది, జ్ఞానం పడ్డప్పుడే అది సద్వినియోగపర్చవలసిన ధాతువు. ప్రయోజనకరంగా మలుచుకోవలసిన రుతువు. కాలం కన్నా వెనుకబడటం సోమరి, చేతగాని పని. కాలం వెంట కొట్టుకపోవడం బలహీనం. కాలం కన్నా రెండడుగులు ముందు నిలబడి కాలానికి చెమటలు పట్టించడం ఔరా! అనిపించుకునే మనిషి మాత్రమే చేసే నిండుతనం. అలాంటి వాళ్లు చరిత్రలో నిలుస్తారు. ఆ చైతన్యం విలువలతో కూడుకొని ఉంటది. అప్పుడు ఆట రక్తికడుతది. ఆట మనదైనంత మాత్రాన అనుభవాల కట్టు కట్టకపోతే ఓటమి మనదే కాక తప్ప దు. వఝల శివకుమార్‌కు ఆ తాత్తిక విలక్షణం ఉన్నది. కనుకనే క్షణాన్ని చేతిలోకి తీసుకోమన్నా డు. కలల సాగు మజిలీలో కవి భావోద్వేగం లెక్కలోకి తీసుకోదగింది. చెట్టుకూలిన పక్షిలా విలవిలలాడుతడు.
sampath
వలసపోయిన పత్రహరితం కోసం కన్నీరు కారుస్తడు. దూరం కొట్టబడిన సామాన్యుడై ఆలోచనల్లో పడుతడు. తనవారిని కలుపుకునే ఆరాటంలో చిగురిస్తడు. నమ్మి చేతు లు కలుపుతడు. ఆత్మీయంగా పలుకరిస్తడు. ఆదరిస్తడు. మానవీయ పరిమళాలలో తన పరివా రం అంతా ఒక ఊరై అలుముకోవాలని, అల్లుకోవాలని పరివేదనలో పరివ్యాప్తమవుతడు. ఆయన హృదయాంతరాళపు అసలు విషయం మార్పు. జీవితాన్ని పరిగణించిన తీరులో తన ను తాను సమీక్ష చేసుకుంటూ తోటి వారిని సమ్మిళితం చేసుకుంటూ, ఆధిపత్యాలను విధ్వంసపు వలలనూ ఛేదించుకుంటూ ముందుకుపోవుడే లక్ష్యంగా కలల సాగు కవితా సంపుటి రుజువు చేస్తది. ఆగమై పోయిన చూపులా మనిషి తనాన్ని వెతుక్కుంటున్న ఈ రోజుల్లో వఝల శివకుమార్ ఆత్మగల్ల సాక్షాత్తు మానవుడు. మనిషిని, ప్రభావాలను అవి వేసిన ముద్రలను పట్టించుకున్నడు. స్పృహ తప్పిన నిజాల మీద/పచ్చ టి అబద్ధాల కవాతును పసిగట్టినవాడు. నాగలి ని నిలబెట్టాల్సిన చోట పడగొడుతున్న ద్రోహాల చిత్రాలు తీశాడు. తల్లి ఒడిలాంటి ఇల్లు తడిని రూపుకట్టిన నిబద్ధత కలగా కన్నులను విశాలం చేశాడు. వస్తు శిల్పాల మధ్య సమతూకం, సమన్వయం లేనిది భావప్రస్ఫుటత్వం సాధ్యం కా దు. తన కవిత్వంలో కేంద్ర బిందువైన మనిషి అనే అనుభవాలను పిండి అక్షరీకరించిండు.

వఝల.. కవిత్వమై కరచాలనం చెయ్యడం కోసం పరితపించినవాడు. ఆప్తవాక్యంగా అంద రి మనసులో ఉండాలని ఆశ. తల్లిలా తల్లడిల్లే అక్షరాల కొమ్మై జీవితాన్ని సార్థకం చేసుకోవడమే ఆయనకిష్టం. ఎన్ని మజిలీలు దాటినా ఇంకా తనివితీరలేదు. ఆ అక్షరబంధమై సాహితీ మిత్రులతో అనుబంధంగా ప్రవర్ధిల్లుతుంది.

988
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles