వాస్తవ చరిత్ర వెలుగులోకి రావాలె

Wed,November 15, 2017 12:49 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ తెలంగాణ నిజమైన చరిత్రను రాయిస్తాం అని ప్రకటించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రాంతాలు, అస్తిత్వం, చైతన్యం, గుర్తింపు, ఆత్మగౌరవం ప్రాతిపదికలపై పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ కాలంలో పౌరసమాజంలోని వివిధ వర్గాలు, మేధావులు మన చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక ప్రత్యేకతను చాటిచెప్పారు.

సమైక్య పాలనలో మసగబారి, చీకటిలోనికి నెట్టబడి, నిరాదరణకు గురైన తెలంగాణ చరిత్రను తిరుగరాయడం నేటి తక్షణ కర్తవ్యం. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం చరిత్రకారులతో ఓ చరిత్ర కమిటీని నియమించాలి. ప్రామాణికమైన, అసలు తెలంగాణ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలి. సమగ్ర తెలంగాణ చరిత్ర పరిశోధనా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించాలి. ఆయన పర్యవేక్షణలో స్టేట్ ఆర్కేవ్స్, ఆర్కియాలజీ లైబ్రరీలలో అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించాలి. అయిదు సంపుటాలను తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ప్రచురించాలి. గతంలో లాగ విద్యాశాఖ ఆధ్వర్యంలో చరిత్ర ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాలి. స్టేట్ ఆర్కేవ్స్, తార్నాక ప్రాంగణంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలి.
telangana
తెలంగాణ చరిత్రకు సంబంధించిన అనేకాంశాలను స్వీయకోణంలో పునఃపరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి తెలుగుజాతి వారస త్వం, భాషా సమూహం పేరు మీద తెలంగాణ చారిత్రక విశిష్టత, ప్రత్యేకత విస్మరణకు, వక్రీకరణకు గురైంది. ఆర్థిక రంగాభివృద్ధితో పాటు తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వాల పునర్వికాసానికి సంబంధించిన అంశాలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొనబడినాయి. అదేవిధంగా తెలంగాణ చరిత్రను ప్రోత్సహించడానికి యూనివర్సిటీలలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసి తెలంగాణ ఉద్య మ చరిత్రను రికార్డు చేయాలని కూడా మ్యానిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించే క్రమంలో ఆర్థికాంశాలతో పాటు, చారిత్రక, సాంస్కృతిక పునిర్వికాసానికి పాటుపడవల్సిన ఆవశక్యతను ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యక్తమైన చారిత్రక చైతన్యానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం సరైన ప్రణాళికలను సిద్ధం చేయాలనే కోరిక ప్రబలంగా ముందుకు వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చరిత్రకారులలో ఒక కమిటీని నియమించి ప్రామాణికమైన తెలంగాణ చరిత్ర రచన జరుగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ జాతి పురోగతికైనా, పునర్నిర్మాణానికైనా గతం, చారిత్రక వారసత్వం దిక్సూచిగా, మార్గదర్శకంగా పనిచేస్తుంది. కాబట్టి సమగ్ర తెలంగాణ చరిత్ర, సంస్కృతి గ్రంథాలను రచిం చి, ప్రచురించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

తెలంగాణ విశిష్ట వ్యక్తిత్వం: తెలంగాణ ప్రాంతం కేంద్రంగా దాదాపు ఐదు దశాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీలు దక్కన్ సంస్కృతిలోని విశిష్టమైన మన సంస్కృతిని వారసత్వంగా స్వీకరించి, కొనసాగించారు. తెలంగాణ అస్తిత్వం, వ్యక్తిత్వం భారతీయ సంస్కృతిలో ప్రత్యేకతను సంతరించుకున్నది. మధ్యయుగా ల నాటి ప్రముఖ చరిత్రకారులు అమీర్ ఖుస్రో, ఫెరిస్టా, అబుల్ ఫజల్ లు తెలంగాణ ప్రత్యేక నైసర్గిక స్వరూపాన్ని, భౌగోళిక లక్షణాలను, జనజీవన వైవిధ్యాన్ని, వైవిధ్యభరితమైన సామాజిక, ఆర్థిక, వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు విభిన్న మతాల మధ్య నెలకొన్న సోదరభావం, సంస్కృతీ సాన్నిహిత్యాన్ని కొనియాడారు. సమకాలీన పరిస్థితుల్లో దక్కన్ వారసత్వం, సంస్కృతిలో విశిష్ట లక్షణాలు అంతర్భాగంగా రూపుదిద్దుకున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తెలంగాణ చరిత్రను పునఃఅంచనా వేసి, సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకతను ముందుకుతెచ్చింది. దానికితోడు భారతీయ సాంస్కృతిక పరిణామక్రమంలో మన ప్రాంత పాత్ర ఎలాంటిదనే అంశాలను కూడా విశ్లేషించాల్సిన అవసరముందనే భావన రూపుదిద్దుకుంటున్నది. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో చెలరేగిన భాషా ప్రయుక్త రాష్ట్ర ఉద్యమాలకు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాని కి మధ్య పోలికలు, తేడాలు, వైవిధ్యాలను తులనాత్మకంగా అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం. అందుకు ప్రాంతీయ చరిత్రను సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనకు నిర్దిష్టమైన భావన, అస్తిత్వాలకు బలమైన చారిత్రక పునాదులున్నాయి. నూత న రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్ మాత్రమే కాదనే విషయాన్ని చారిత్రక ఆధారాలతో నిరూపించడం తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణంలో కీలక అంశం.

ప్రామాణిక చరిత్ర: బ్రిటిష్ వలసపాలకుల నుంచి విముక్తి పొందిన తర్వాత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సూచన మేరకు భారత ప్రభు త్వం సమగ్ర భారతదేశ చరిత్ర-సంస్కృతి, స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర రచనకు ఒక నిపుణుల కమిటీని నియమించింది. ప్రసిద్ధ చరిత్రకారులైన తారాచంద్, మజుందార్ లాంటివారు జాతీయవాద దృక్పథంతో సమ గ్ర భారతదేశ చరిత్రను రచించే బాధ్యతను స్వీకరించారు. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంలో 1940 దశకంలో గులాంయాజ్‌దానీ, హరుణ్‌ఖాన్ షేర్వాణీ, యన్.యం.జోషీలు దక్కన్ చరిత్ర, సంస్కృతి విశిష్ట లక్షణాలను వివరిస్తూ పలు గ్రంథాలను రచించారు. నాటి నిజాం ప్రభు త్వం ప్రామాణిక దక్కన్ చరిత్ర ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించిం ది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రాంతీయ చరిత్ర రచనకు చరిత్రకారుల కమిటీని ఏర్పాటుచేశా రు. ఈ క్రమంలోనే హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్య్రోద్యమ చరిత్ర రచనా బాధ్యతను కాశీనాథ్‌రావు వైద్య, గోపాల్‌రావు ఎక్టోటేల నేతృత్వంలోని కమిటీకి అప్పగించడం జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో ప్రముఖ మేధావులు, పరిపాలనాదక్షులైన సర్ అక్బర్ హైదరీ, నవాబ్ అలీయావర్‌జంగ్ బహదూర్‌లు నిజాం ప్రభుత్వం తరఫున దక్కన్ చరిత్ర ప్రాజెక్టుకు సంపూర్ణ మద్దతును అందించారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఔదార్యంతో దక్కన్ చరిత్ర రచన జరుగడం మనందరికీ గర్వకారణం. ఒక ప్రముఖ చరిత్రకారుడు అన్నట్లు కొత్త లక్ష్యాలు రూపొందించినప్పుడల్లా గత కాలపు సంఘటనల ప్రాముఖ్యం, గతానికి చరిత్రకారుల వ్యాఖ్యానాలు మారుతూ ఉంటాయి. ఈ సూత్రీకరణ తెలంగాణ చరిత్రను స్వీయ దృక్పథంతో విశ్లేషించి, పునర్‌లిఖించడానికి వర్తిస్తుందని చెప్పవచ్చును. ప్రస్తుత సామాజిక, రాజకీయ, అస్తిత్వ, ఆత్మగౌరవ ఉద్యమాల స్వరూప స్వభావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రాంతీ య చరిత్రను పునర్నిర్మించడం అవసరం. అందుకు చరిత్ర పూర్వయు గం నుంచి ఆధునిక యుగం వరకు తెలంగాణ నాగరికత విశిష్ట లక్షణాలను, ప్రాముఖ్యాన్ని సోదాహరణంగా వివరించాలి.
sathyanarayana
ప్రత్యేక రాష్ట్ర భావనకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ అస్తిత్వం, వ్యక్తి త్వం పరిణామక్రమాన్ని, చారిత్రక ప్రక్రియను హేతుబద్ధంగా, శాస్త్రీయం గా విశ్లేషించాల్సిన ఆవశ్యకత నేటితరం మేధావులకు సవాల్‌గా మారిం ది. ఈ మధ్యకాలంలో తెలంగాణ చరిత్ర పరిశోధనలలో నూతన అం శాలు కనుగొనబడినాయి. వీటన్నింటిని క్రోడీకరించి సమగ్ర తెలంగాణ చరిత్ర-సంస్కృతిని ఐదు భాగాలుగా విభజించి రచించాలి.
మొదట సంపుటం: చరిత్ర పూర్వయుగం, పాతరాతి, కొత్తరాతి, శిలాయుగాలు, మెగాలిథిక అవశేషాల ఆధారంగా తెలంగాణ ప్రాంతంలో వెలసిల్లిన నాగరికత మౌలిక లక్షణాలు.
రెండవ సంపుటి: ప్రాచీన తెలంగాణ-శాతవాహనుల కాలం నుంచి తెలుగు చాళుక్య యుగం వరకు.
మూడవ సంపుటం: కాకతీయ రాజ్యం నుంచి కుతుబ్‌షాహీల పాలన వరకు.
నాలుగవ సంపుటం: ఆధునిక యుగంలో అసఫ్‌జాహీల పాలన.
ఐద వ సంపుటం: 1952 నుంచి 2014వ సంవత్సరం వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాల చరిత్ర, తెలంగాణ సోయిని నింపుకొని ప్రామాణిక చరిత్రను రచించడానికి యాజ్‌దాని, షేర్వాణీలు రచించిన గ్రంథాలు మార్గదర్శకంగా ఉంటాయి. పూర్వపు తెలంగాణ రాష్ట్రం అనుసరించిన విధానం నేటి ప్రభుత్వానికి ఆదర్శంగా ఉండాలి. సమైక్య పాలనలో మసగబారి, చీకటిలోనికి నెట్టబడి, నిరాదరణకు గురైన తెలంగాణ చరిత్రను తిరుగరాయడం నేటి తక్షణ కర్తవ్యం. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం చరిత్రకారులతో ఓ చరిత్ర కమిటీని నియమించాలి. ప్రామాణికమైన, అసలు తెలంగాణ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలి. సమ గ్ర తెలంగాణ చరిత్ర పరిశోధనా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించాలి. ఆయన పర్యవేక్షణలో స్టేట్ ఆర్కేవ్స్, ఆర్కియాలజీ లైబ్రరీలలో అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించాలి. అయిదు సంపుటాలను తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ప్రచురించాలి. గతం లో లాగ విద్యాశాఖ ఆధ్వర్యంలో చరిత్ర ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాలి. స్టేట్ ఆర్కేవ్స్, తార్నాక ప్రాంగణంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలి. నూతన రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ చరిత్ర-ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదరించి ప్రోత్సహిస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: విశ్రాంత ఆచార్యులు, ఉస్మానియా యూనివర్సిటీ)

809
Tags

More News

VIRAL NEWS