ఇవీ.. అదనపు ప్రయోజనాలు

Thu,October 12, 2017 11:29 PM

ఇది రీ ఇంజినీరింగ్ ద్వారా ఒనగూరే అదనపు ప్రయోజనాలపై స్థూలమైన వివరణ. ప్రభుత్వం ఈపీసీ విధానాన్ని రద్దుచేసింది. సర్వేలు, డిజైన్లు ప్రభుత్వ ఇంజినీర్లే చేస్తారు. కాంట్రాక్టర్లకు చేసిన పనికి మాత్రమే చెల్లింపులు చేస్తారు. కాబట్టి ఇందులో కాంట్రాక్టర్ల ప్రయోజనాలున్నాయని చెప్పడం అసమంజసం. తెలంగాణ అవసరాల మేరకే ప్రాజెక్టుల రీ డిజైన్ జరిగిందని గమనించాలి. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత కోటి ఎకరాల సాగునీటి కల నిజం కాబోతున్నది.

జూన్ 1న సంగారెడ్డి సభలో రాహుల్‌గాంధీ చేత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమేనని మాట్లాడింపజేశారు. పీపుల్స్ చార్జ్‌షీట్ పేరుమీద విడుదల చేసిన డాక్యుమెంట్‌లో కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్ అని విమర్శించారు. ప్రజలను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత సిద్దిపేటలో జరిగిన ఓ సభలో ప్రొఫెసర్ కోదండరాం కూడా అదే స్వరంతో మాట్లాడారు. రీ ఇంజినీరింగ్ ఎందుకు అవసరమైందో, రీ ఇంజినీరింగ్ వల్ల ఒనగూరే అదనపు ప్రయోజనాలను చూద్దాం.


ఒకటి.. శ్రీరాంసాగర్ జలాశయంపై ఆధారపడిన ఆయకట్ల కు నికరమైన సాగునీటిని సరఫరా చేయడం. రెండవది.. గోదావరి నదిని పునరుజ్జీవనం కావించడం. మూడవది.. ప్రాజెక్టుల నీటి కేటాయింపులను అవసరాలకు అనుగుణంగా పెంచడం. శ్రీరాంసాగర్ జలాశయం కింద ఆయకట్టును స్థిరీకరించడం: గత కొన్నేండ్లుగా శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు జలాశయాలకు తగినంత నీరు రావడంలేదు. కారణాన్ని గూగుల్ ఎర్త్ సహాయంతో ముఖ్యమంత్రి స్వయంగా శోధించినప్పుడు తేలిన విషయమేమంటే ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు గోదావరిపై, మంజీరా తదితర ఉపనదులపై 450 పైగా ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెక్‌డ్యాంలు నిర్మించినట్లు బయటపడింది. అదే సమయంలో దిగువన ప్రాణహిత, ఇంద్రావతి సంగమం తర్వాత గోదావరిలో పుష్కలంగా నీరు ప్రవహిస్తున్నదని సీడబ్ల్యూసీ లెక్కలు చెపుతున్నాయి. సగటున ఏటా దాదాపు 1650 టీఎంసీల నీరు దిగువ గోదావరిలో లభ్యమవుతదని తేలింది. ఇంతటి కరువు కాలంలో కూడా వర్షాకాలం మొదలైన కాడినుంచి దిగువ గోదావరిలో సముద్రంలోకి ప్రవహించిన నీరు 500 టీఎంసీలకు పైనే. ఈ నీరు మనం వినియోగించుకోలేకపోతే వృథాగా సముద్రంలో కలిసిపోతుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసేటప్పుడు వృథాగా సముద్రంలోకి పోయే నీటిని వాడుకుని ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాలను స్థిరీకరించుకోవడం ప్రధానాంశంగా ముందుకు వచ్చింది.

వరద కాలువ-శ్రీరాంసాగర్ ఎత్తిపోతల పథకం: తొలుత రీ ఇంజినీరింగ్ ప్రతిపాదనలను రూపకల్పన చేస్తున్న దశలో సింగూరు, నిజాంసాగర్‌లోకి నీటిని మల్లన్నసాగర్ నుంచి ఒక లింక్ కాలువ ద్వారా హల్ది వాగులో జారవిడిచి మంజీరా నది నుంచి నిజాంసాగర్‌ను నింపడం, అవసరమైన పక్షంలో నిజాంసాగర్ నుంచి ఎస్సారెస్పీలోకి కూడా నదీ మార్గం ద్వారా తరలించాలన్న ఆలోచన చేశారు. ఎల్లంపల్లి నుంచి నదీ మార్గం ద్వారా తక్కువ లిఫ్ట్‌తో ఎస్సారెస్పీకి పంపు చెయ్యవచ్చుననే వాదన పట్ల ప్రభుత్వానికి భిన్నాభిప్రాయం లేదు. అయితే ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీదాకా దాదాపు 12 వరుస బ్యారేజీలు, 12 పంపుహౌ జ్‌లను నిర్మించవలసి ఉంటుంది. దాదాపు 20-25 వేల కోట్లను వీటి నిర్మాణం కోసం వెచ్చించాలి. రాష్ట్ర ఆర్థికపరిస్థితులు అనుకూలించినప్పు డు వాటి నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చు. లేదంటే ఇన్‌ల్యాండ్ నేవిగేషన్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరిస్తే ఆ బ్యారేజీల నిర్మాణం వెంటనే చేపట్టవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్లన్నసాగర్‌దాకా నీటిని తీసుకురావడం అనివార్యం గనుక ప్రస్తుతానికి హల్దివాగు, మంజీరా నదుల ద్వారా ఎటువంటి కట్టడాల అవసరం లేకుండానే నీటిని ఎస్సారెస్పీలోకి తరలించే ఆలోచన ప్రభుత్వం చేసింది. ఇది సాంకేతికంగా హేతుబద్ధమైన నిర్ణయమే. ప్రభుత్వం తక్కువ ఖర్చుతో, తక్కువ ఎత్తుతో, తక్కువ విద్యుత్ వినియోగంతో ఎస్సారెస్పీలోకి నీటిని తరలించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించమని సీఎం ఇంజినీర్ల ను ఆదేశించారు. ఆ అన్వేషణలో వచ్చిందే వరదకాలువ-ఎస్సారెస్పీకి ఎత్తిపోతల పథకం. అదే శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకంగా నిర్మాణం అవుతున్నది.

ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌లో అత్యంత కీలకమైనదిగా శ్రీరాంసాగర్ జలాశయానికి కరువుకాలంలో రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి శ్రీరాంసాగర్ వరదకాలువ ద్వారా ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగింది. తక్కువ ఖర్చుతో భూసేకరణ అగత్యం లేకుండా 22 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం కలిగిన వరద కాలువనే జలాశయంగా మలిచి నీటిని శ్రీరాంసాగర్ జలాశయానికి తరలించే అద్భుత పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. కేవలం1067 కోట్ల ఖర్చుతో 60 రోజుల్లో 60 టీఎంసీ నీటిని శ్రీరాంసాగర్ జలాశయానికి తరలించే వీలు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా కలుగుతుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 112టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 75 శాతం విశ్వసనీయతతో 196 టీఎంసీల నీటి వినియోగం కోసం నిర్మించడం జరిగింది. అయితే ఎగువన మహారాష్ట్ర అనేక బ్యారేజీలను నిర్మించడంతో శ్రీరాం సాగర్ వద్ద నీటి లభ్యత 54 టీఎంసీలకు పడిపోయినట్లుగా 25 ఏండ్ల గోదావరి ప్రవాహ లెక్కలు చెబుతున్నాయి. పూడిక వల్ల జలాశయం నిల్వ సామర్థ్యం కూడా 80 టీఎంసీలకు పడిపోయింది. దాంతో శ్రీరాంసాగర్‌పై ఆధారపడిన ఆయకట్టుకు నీరందించడం దుర్లభంగా మారింది. శ్రీరాంసాగర్ జలాశయం మీద ఆధారపడిన ప్రాజెక్టులకు అవసరమ య్యే నీరు 95 టీఎంసీలు, ఆయకట్టు 9.73 లక్షల ఎకరాలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి జలాశయం నుంచి మిడ్ మానేరుకు తరలించే రోజుకు 2 టీఎంసీల నీటిని మార్గమధ్యలో వరద కాలువ కి.మీ.102 వద్ద వదులుతారు. అక్కడ క్రాస్ రెగ్యులేటర్‌ను నిర్మించి ఒక టీఎంసీని వరదకాలువ ద్వారా శ్రీరాంసాగర్‌కు ఎత్తిపోయ డం, మరో టీఎంసీని వరదకాలువ ద్వారా దిగువన మిడ్ మానేరు జలాశయానికి పంపుతారు. 60 రోజుల అనంతరం శ్రీరాంసాగర్‌కు 60 టీఎంసీలను ఎత్తిపోసిన తర్వాత పంపులను ఆపేస్తారు. ఆ తర్వాత 2 టీఎంసీలు మిడ్‌మానేరుకు తరులుతాయి. 33 మీ ఎత్తుకు పంపు చేసే ఈ పథకంలో 156 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది.

రీ ఇంజినీరింగ్‌తో గోదావరినది సజీవం: ప్రభుత్వం చేపట్టిన రీ ఇంజినీరింగ్ ప్రతిపాదనల వల్ల గోదావరి నదిపై కొత్త బ్యారేజీల నిర్మాణం జరుగుతున్నది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం ఆనకట్ట జలాశయాలను కలుపుకుంటే నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి కొత్తగూ డెం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం ఆనకట్ట దాకా మొత్తం 500 కిలోమీటర్ల పొడవున్న గోదావరి నది 274 కిలోమీటర్ల పొడవునా 365 రోజు లు సజీవంగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం దాకా గోదావరి నది పొడవు 500కి.మీ. అందులో ఈ బ్యారేజీల కారణంగా 274 కి.మీ పొడవున 365 రోజులు నీరు నిలువ ఉంటుంది. గోదావరినదిపై 154.10 టీఎంసీ నిల్వ సాధ్యపడుతున్నది. గోదావరి నది సజీవం అవుతున్నందున ఉత్తర తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, టూరిజం, జలరవాణా వంటి రంగాల్లో అనూహ్యమైన ఆర్థిక ప్రగతి జరుగనున్నది. గోదావరి పరీవాహక ప్రాంతంలో జీవ వైవిధ్యం పెంపొందనున్నది. రీ ఇంజినీరింగ్‌లో ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల పెంపు: ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌లో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.
deshpandey
గత ప్రభుత్వాలు వివక్షాపూరితంగా చేసిన నీటి కేటాయింపులను సవరించింది. 5,43,750 ఎకరాలకు సాగునీరందించే దేవాదుల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం కేటాయించిన నీరు 38 టీఎంసీలు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టుకు 60 టీఎంసీల నీటిని కేటాయించింది. 4 లక్షల ఎకరాలకు సాగునీరందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి గత ప్రభుత్వం 25 టీఎంసీలు కేటాయిస్తే, ఇప్పుడు 40 టీఎంసీలను కేటాయించింది. 16 లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 160 టీఎంసీలు కేటాయిస్తే, ఇప్పుడు ఎల్లంపల్లి వద్ద లభ్యమయ్యే నీరు కలుపుకొంటే 180 టీఎంసీలు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 180 టీఎంసీ లకు పెంచింది. ఎల్లంపల్లి వద్ద లభ్యమయ్యే నీరు కలుపుకొంటే 200 టీఎంసీలు. ఆయకట్టు 16 లక్షల నుంచి 18 లక్షల ఎకరాలకు పెంచింది. ప్రాణహితకు వేరేగా 2 లక్షల ఎకరాలకు 20 టీఎంసీలు ఆదిలాబాద్ తూర్పు జిల్లా కోసం కేటాయించడం జరిగింది.
ఇది రీ ఇంజినీరింగ్ ద్వారా ఒనగూరే అదనపు ప్రయోజనాలపై స్థూలమైన వివరణ. ప్రభుత్వం ఈపీసీ విధానాన్ని రద్దుచేసింది. సర్వేలు, డిజైన్లు ప్రభుత్వ ఇంజినీర్లే చేస్తారు. కాంట్రాక్టర్లకు చేసిన పనికి మాత్రమే చెల్లింపులు చేస్తారు. కాబట్టి ఇందులో కాంట్రాక్టర్ల ప్రయోజనాలున్నాయని చెప్పడం అసమంజసం. తెలంగాణ అవసరాల మేరకే ప్రాజెక్టుల రీ డిజైన్ జరిగిందని గమనించాలి. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత కోటి ఎకరాల సాగునీటి కల నిజం కాబోతున్నది.
(వ్యాసకర్త: సాగునీటి ఓఎస్డీ)

470
Tags

More News

VIRAL NEWS