సృజనాత్మకత లేని ప్రతిపక్షాలు

Thu,October 12, 2017 01:17 AM

నిర్మాణాత్మకత, సృజనాత్మకత, తగు వివేకం, రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత అనే నాలుగు లక్షణాలు గల మంచి ప్రతిపక్షం
రూపుదిద్దుకోగల సూచనలు మూడేండ్లు గడిచినా కన్పించకపోవటం విచారాన్ని కలిగిస్తుంది. అధికార పక్షం విఫలమైనట్లు ఒకవేళ ఒకరోజున ప్రజలు భావించితే, ఆ స్థానంలో ఎన్నుకునేందుకు అంతకన్న మెరుగైన పార్టీ కోసం చూస్తారుగదా. కాని అటువంటి లక్షణాలు ప్రతిపక్షాలకున్నట్టు ఇంతవరకు కన్పించలేదు. పైగా వాటిపట్ల నిరాశలే ఇంకా పెరుగుతున్నాయి.


అధికార కాంక్షతో విచక్షణను కోల్పోయి, ఈ నాలుగు లక్షణాలను విస్మరించి, వ్యవహరణ కూడా వికృతంగా ఉన్నప్పుడు వారిని చూసి ప్రజలు భయపడుతారు, ఈసడించుకుంటారు. గత మూడున్నరేండ్లను సమీక్షిస్తే ప్రతిపక్షాల పరిస్థితి ఆ విధంగా కన్పిస్తున్నది. మునుముందు కూడా మారగల సూచనలు లేకపోవటం వారికి నష్టం కావటం సరేసరి. ఒకస్థాయిలో, దీర్ఘకాలంలో, తెలంగాణ రాజకీయానికి కూడా నష్టదాయకమే.


రాష్ట్రం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక్కొక్క ఏడాది పూర్తయినప్పుడల్లా ప్రభుత్వ పరిపాలన తీరుపై సమీక్షలు వెలువడుతున్నాయి. తనవైపు నుంచి తను కూడా ప్రభుత్వం నివేదికలు ఇస్తున్నది. వాటితో పాటు ఇతరులు ఏకీభవిస్తారా లేదా అనేది వేరే విషయం. కాని సమీక్షల పద్ధతిని అనుసరించటం ప్రధానం. స్వతంత్రంగా బయట జరిగే సమీక్షలు ఉండనే ఉన్నాయి. అదే పద్ధతిలో, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రతిపక్షాల పనితీరుపై కూడా సమీక్షలు జరిగే పద్ధతి మనకులేదు. చెదురుముదురు గా ఒకరిద్దరు రాసేవి తప్ప. ఇక ప్రభుత్వం వలె ప్రతిపక్షాలు తమవైపు నుంచి స్వీయ సమీక్షలు అంతర్గతంగా చేసుకోవటం గాని, బయటకు ప్రకటించటం గాని ఎప్పుడూ లేదు. దానినట్లుంచి ప్రస్తుతానికి వస్తే, తెలంగాణలోని వివిధ ప్రతిపక్షాలు గత మూడున్నర సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్నాం. 2019 ఎన్నికలకు ఇక మిగిలింది ఏడాదిన్నర. అందులో చివరి ఏడాది ఎన్నికల తయారీకి, అభ్యర్థుల ఎంపికలు, ప్రచారాలకు పోతుంది. ఆ విధంగా ఈ ఆరు నుంచి పది మాసాల కాలంలోనే ప్రజలకు అధికార పక్షం గురించి, ప్రతిపక్షాల గురించి తుది అభిప్రాయాలు అనదగ్గవి ఏర్పడుతాయి. అటువంటిస్థితిలో, ఈ రెండు శిబిరాల గురించి గత మూడున్నరేండ్లలో కలిగిన అభిప్రాయాలు ఏమిటి? మిగిలిన 6-10 మాసాలలో ఎటువంటివి ఏర్పడవచ్చు? ఇంతవరకు కలిగినవే యథాతథంగా కొనసాగవచ్చునా? లేక మారవచ్చునా? అన్నవి ప్రశ్నలు.

2014 ఎన్నికల ఫలితాలు తెలిసినవే. టీఆర్‌ఎస్ ఓట్లు, సీట్లతో అగ్రస్థానంలో ఉండి సొంతంగా అధికారానికి వచ్చింది. అప్పటినుంచి తన పద్ధతితో తాను పాలిస్తున్నది. ప్రతిపక్షాలు కొద్దికాలం స్తబ్దంగా ఉండి ఆ తర్వాత నుంచి ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించాయి. అనేక అంశా లను లేవనెత్తాయి. వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించా యి. ఇదంతా అటు ప్రభుత్వం వైపునుంచి, ఇటు ప్రతిపక్షాల వైపు నుం చి జరిగే సహజమైన కార్యకలాపం. అయితే, వారిద్దరు తమతమ పను లు ఈ మూడున్నరేండ్లలో ఏ విధంగా చేసినట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారనేది సమీక్షించవలసిన విషయం. ఇటువంటి సమీక్షలను ప్రజలు నివేదికల రూపంలో ప్రకటించరుగాని, ఆ పని ఏడాదికొకసారి అన్న పద్ధతిలో కాకుండా తమస్థాయిలో నిరంతరం చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు వచ్చే ఎన్నికలు, ఉప ఎన్నికల వంటి సందర్భాలలో వ్యక్తం చేశారు. తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పూర్తిస్థాయిలో ప్రకటిస్తారు. ఆ విధంగా గత మూడున్నర సంవత్సరాలలో ప్రతిపక్షాలను గమనించినపుడు, వారు వివిధ అంశాలను ప్రతిరోజు లేవనెత్తి విమర్శలు చేయటం కనిపిస్తున్నదే.

అంతవరకు అది ఆహ్వానించదగిన పనే తప్ప ఆక్షేపించవలసింది ఏమీ లేదు. కాని వారు అట్లా లేవనెత్తుతున్న అం శాలు, లేవనెత్తుతున్న తీరు, వాటితో పాటుగా అందుకు సంబంధించి ఇతర విధాలుగా వ్యవహరిస్తున్న పద్ధతులు అనే మూడూ ఎట్లా ఉన్నా యి? వాటి గురించి ప్రజలకు కలుగుతున్న అభిప్రాయం ఏమిటి? వారు నిర్మాణాత్మకత, సృజనాత్మకత, తగు వివేకం, రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత అనే నాలుగు లక్షణాలను ప్రదర్శిస్తున్నారా? అన్నవి గమనించదగిన విషయాలు. అట్లా ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంటే వారు ఈ మూడున్నర సంవత్సరాలలో సఫలమైనట్లే. ప్రజల విశ్వాసాన్ని సంపాదించగలుగుతున్నట్లే. అంతమాత్రాన వారికి 2019 లో అధికారాన్ని అప్పగించితీరుతారని కాదు. కాని తెలంగాణకు అవసరమైన ఒక మంచి పక్షం రూపుతీసుకుంటున్నదనే భావనను కలిగించగలిగితే అదే ఒక విజయమవుతుంది. అటువంటి నమ్మకం ప్రజలకు తమ భవిష్యత్తు గురించి భరోసాను ఇస్తుంది. ప్రజలు తమను విశ్వసిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు గెలిపిస్తారనే భరోసా ప్రతిపక్షాలకు కలిగే ఆస్కారం కూడా ఉంటుంది. రాజకీయాల్లో అది కీలకమైన విషయమని గుర్తించాలి. అది లేనప్పుడు ప్రతిపక్షాలు తమ ధోరణిలో తాము ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంటాయి గాని, ప్రజల దృష్టిలో అందుకు విలువ ఉండదు.
ashok
మూడున్నరేండ్ల తెలంగాణ ప్రతిపక్షాల వ్యవహరణను సమీక్షించినపుడు కన్పించేది ఇదే. కనీసం ఇంతవరకు వీరు నిర్మాణాత్మకత, సృజనాత్మకత, తగు వివేకం, రాష్ర్టాభివృద్ధి పట్ల నిబద్ధత అనే నాలుగు లక్షణాల్లో ఏ ఒక్కటి కూడా చూపలేదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులలో ఎవరూ చూపలేదు. వారి పట్ల ప్రజలకు విశ్వాసం కలుగకపోవటానికి ఇది ఒక కారణం కాగా, వారు వ్యవహరిస్తున్న తీరు మరొక కారణం అవుతున్నది. మూడున్నర సంవత్సరాలు గడిచిన వెనుక ఈ విధంగా ఉన్న పరిస్థితి రానున్న ఆరు నెలలు, ఏడాదిలో మారగల అవకాశం ఉంటుందా? దాన్ని బట్టి ప్రజలకు వారి పట్ల అభిప్రాయం మారవచ్చునా? సూత్రరీత్యా అసాధ్యం కాదు. కాని ఈ పార్టీలను, వాటి నాయకుల తీరును గమనించినపుడు సందేహాలు కలుగుతున్నాయి. అటువంటప్పుడు ప్రజల ఆదరణ లభించేది ఎట్లా?
వీరంతా చదువుకున్నవారు, తగు అనుభవం గలవారే. దాన్ని బట్టి వారికి తగు విజ్ఞత ఉండాలి. కాని అధికారం పట్ల ఆత్రుత విచక్షణను కోల్పోయేట్లు చేస్తుంది. ప్రత్యర్థిపై ఉండే ఆగ్రహం అందుకు తోడైతే ఇక చెప్పనక్కరలేదు. దృశ్యం మరింత వికటంగా మారుతుంది. గత మూడున్నరేండ్లలో ప్రతిపక్షాల చర్యలలో అత్యధికం అధికార కాంక్ష వల్ల విచక్షణను కోల్పోయినటువంటివే. కొన్నయితే మరొక అడుగు ముందుకువెళ్లి పైన అన్నట్లు వికటంగా మారాయి.

వాస్తవానికి వారు మరీ ఈ విధంగా వ్యవహరించవలసిన అవసరం లేదు. విచక్షణ కోల్పోయి తెచ్చుకున్న చెడ్డ పేరును వారు ఆశ్చర్యకరమైన వ్యవహరణతో మరింత చెడగొట్టుకుంటున్నారు. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ నీటిపారుదల ప్రాజెక్టుల విషయమై వ్యవహరిస్తున్న తీరు. ఇందువల్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడగలదని ఎవరూ చెప్పనక్కరలేదు. కనీసపు ఇంగితం ఉన్నా సరే అర్థమవుతుంది. కాని రెండేండ్లకు పైగా వారు ప్రాజెక్టులను విమర్శిస్తూ అడ్డంకులు సృష్టిస్తూనే పోయారు. తమ తీరు ప్రజలకు నచ్చలేదని ఒక దశలో గ్రహించటంతో, తాము వాటికి వ్యతిరేకులం కాదని వివరించబూనుకున్నారు. కాని విచిత్రమేమంటే అప్పటికీ ఆటంకాలను సృష్టించటం మానుకోలేదు. కాళేశ్వరంపై గ్రీన్ ట్రిబ్యునల్ తాత్కాలిక స్టే అందుకు తాజా ఉదాహరణ. పైన అనుకున్నట్లు, అధికార కాంక్షలు మితిమీరినపుడు విచక్షణను కోల్పోతారు. ప్రాజెక్టులను కట్టనిస్తే ఒక సమస్య, కట్టనివ్వకపోతే మరొక సమస్య అన్నట్లు తయారైంది వారి పరిస్థితి. అదొక అస్తిత్వపు డైలమా.
కాని ఇది వారి స్వయంకృత సమస్య. ఇటువంటి పరిస్థితి డైలమాను సృష్టించవలసిన అవసరమే లేదు. నిర్మాణాత్మకత, సృజనాత్మకత అనే దృక్పథం ఉండి, తగు వివేకం కలిగి, రాష్ర్టాభివృద్ధి పట్ల నిబద్ధతను చూపి ఆలోచించినట్లయితే ఇది అసలు డైలమా కాకూడదు. ఎందుకంటే, ప్రజ లు ఈ నాలుగు లక్షణాలను కోరుకుంటారు. అధికారపక్షంలో, ప్రతిపక్షాలలో కూడా. అవి ఉన్నవారి పట్ల ప్రజలకు సానుకూల దృష్టి ఏర్పడుతుంది. గెలువటం, అధికారానికి రావటమన్నది ప్రజాస్వామ్యంలో పరిస్థితులను బట్టి అటూఇటూ మారుతూనే ఉంటాయి. కానీ ఈ నాలుగు లక్షణాలు లేనివారికి అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సందేహిస్తారు. అధికార కాంక్షతో విచక్షణను కోల్పోయి, ఈ నాలుగు లక్షణాలను విస్మరించి, వ్యవహరణ కూడా వికృతంగా ఉన్నప్పుడు వారిని చూసి ప్రజలు భయపడుతారు, ఈసడించుకుంటారు. గత మూడున్నరేండ్లను సమీక్షిస్తే ప్రతిపక్షాల పరిస్థితి ఆ విధంగా కన్పిస్తున్నది. మునుముందు కూడా మారగల సూచనలు లేకపోవటం వారికి నష్టం కావటం సరేసరి. ఒకస్థాయిలో, దీర్ఘకాలంలో, తెలంగాణ రాజకీయానికి కూడా నష్టదాయకమే.

609
Tags

More News

VIRAL NEWS