విశ్వవిద్యాలయాలకు కొత్తరూపు

Wed,October 11, 2017 01:26 AM

విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నవారు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు కావాలి. తమ చదువుకు సంబంధించిన రంగంలో ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం, ఉపాధి సంపాదించుకోగలుగాలి. కానీ మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆ స్థాయిలో ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే సమాధానం కొంచెం నిరాశాజనకంగానే ఉంటుంది. దేశంలో అందరూ గొప్పగా చెప్పుకునే విశ్వవిద్యాలయాలు కూడా ప్రపంచ పటం మీద 200 లోపు ర్యాంకుల్లో ఎప్పుడూ లేవు. అంతేకాదు 2017-18 ర్యాంకులను చూస్తే ఇంకా బాధ కలుగుతుంది. తెలంగాణలో అన్నిరంగాల్లో అధునాతన కాలానికి సరిపోయేట్టు విధానాలను మలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో కూడా నీటి ప్రాజెక్టులు చేసినట్టు విద్యారంగాన్ని రీ డిజైన్ చేస్తే తెలంగాణ విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో గొప్ప విద్యాలయాలుగా ఎదుగుతాయి.


దేశంలో ఎంతో గొప్పగా చెప్పుకునే విశ్వవిద్యాలయాలు ప్రపంచ పటంలో మంచి ర్యాంకులు పొందకపోవడం దేన్ని సూచిస్తున్నది? జవహర్‌లాల్ నెహ్రూ ఐఐటీలు ప్రారంభించేటప్పుడు విశ్వవిద్యాలయాలను అధునాతన దేవాలయాలుగా వర్ణించారు. దేశం మొత్తం పాఠశాలలు స్థాపించినా అవనంత ఖర్చు పెట్టారు. దేశంలో వెయ్యేళ్ల తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం లభించినప్పుడు, ఏ తెలివైన ప్రధాని అయినా ప్రాథమిక పాఠశాలలు తెరిచి, తప్పనిసరి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి పదేండ్లలో అయినా కొత్త తరం పిల్లలకు విద్య గరిపించాలి. ఆ విధానాన్ని కొనసాగించి దేశంలో అందరినీ విద్యావంతులుగా చేస్తాడా? కానీ ఆయన ఐఐటీలు, మెడికల్ కాలేజీలు పెట్టి, ఐఐఎంలు, ఐఐఎస్‌సీలు పెట్టి బ్రిటిష్ విద్యా విధానంలో చదువుకున్న అగ్రకులాల వారి పిల్లలకు మాత్రమే విద్య అందేట్టు చేస్తా డా? పోనీ దేశం త్వరగా ప్రగతి సాధించడానికి అలా చేశాడేమో అనుకోవడానికీ లేదు. ఎందుకంటే చెమటోడ్చి దేశం కోసంపాటు పడే సామాన్యుల ధనం ప్రభుత్వం తమ మీద ఖర్చు పెడుతున్నదనే సోయి లేకుం డా ఫైనల్ ఇయర్ రాగానే పాశ్చాత్య దేశాలలో ఉద్యోగాలు చూసుకుని వెళ్లిపోతున్నారు. ఈ విశ్వవిద్యాలయాల నుంచి మేధో వలస జరుగడానికి కారణం మొదటి ప్రధాని హ్రస్వదృష్టి అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే ఎరిత్రియా లాంటి అతి వెనుకబడిన చిన్న దేశం కూడా తమ దేశస్తులకు బీఏ లాంటి డిగ్రీ పాసైతే 10-15 ఏండ్లు విదేశాలకు వెళ్లడానికి అనుమతించదు.ఆ సమయంలో వారు తప్పనిసరిగా ప్రభు త్వ ఉద్యోగం చేయవలసిందే. ఇటువంటి నిబంధన పెట్టే ఆలోచన మన పాలకులకు లేకపోవడం దురదృష్టం! 1960ల నుంచీ ఎంత మేధో వల స జరిగిందో అందరికీ తెలుసు. దానివల్ల అగ్రకులాల వారు సామాన్యు ల ధనంతో బాగుపడ్డారు. వారి పిల్లలు మిలియనీర్లు అయ్యారు. పేదవారు, వెనుకబడిన తరగతుల ప్రజలు, ముఖ్యంగా కొన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారు నిస్సహాయంగా మిగిలిపోయారు. వీరు చెమటోడు స్తూ, కష్టపడుతూ దేశంలోనే ఉండిపోయారు. విద్యావంతులు, ధనవంతుల పిల్లలు విదేశాల్లో స్థిరపడి ఆ దేశాల ప్రగతికి దోహదపడుతున్నారు.

నాణ్యమైన విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లో చదివిన వారు దేశానికి సహాయపడాలన్న నిబంధనలు లేక ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయాలకు కూడా ఈ పరిస్థితి వచ్చింది. 70 ఏండ్ల స్వాతంత్య్రానంతరం అందరికీ విద్య, ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, సంక్షే మ పథకాలు అని మాట్లాడటం ఏ దేశానికైనా సిగ్గుచేటే! మలేషియా, సింగపూర్ రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన దేశాలు. జర్మనీ, జపాన్ కండ్ల ముందు ప్రగతి సాధించినా భారత దేశాన్ని పాలించిన ప్రభుత్వం అవేవీ గమనించలేదు. విద్యావంతులైన ప్రజలకు సరైన ఉపా ధి అవకాశాలు కల్పించలేదు. చదివే విద్య ఒక రంగంలో, చేసే ఉద్యోగం ఇంకొక రంగంలో అన్నట్లు తయారైంది.మన రాష్ట్రంలో-ప్రపంచానికి నిపుణులను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోని గొప్ప విద్యాలయాలలో తన ర్యాంకు నిలుపుకుంటూనే ఉన్నది. మిగతా విశ్వవిద్యాలయాలు ఇంకా ప్రగతి సాధించాల్సి ఉన్నది. అయితే దానికోసం ఏం చేయాలో విశ్లేషించాలి, ఆలోచించాలి.

విశ్వవిద్యాలయంలో ఏ కోర్సు చేసిన విద్యార్థికైనా ఆ రంగం గురించి పూర్తి అవగాహన, సమాచారం,జ్ఞానం, తన భవిషత్తును తీర్చిదిద్దుకోగలిగిన నైపుణ్యాలు ఉండాలి. ప్రతి కోర్సు ఈ లక్ష్యాలన్నింటినీ సాధించేటట్టుగా తీర్చిదిద్దబడాలి. అలాగే ప్రతి కోర్సునూ ఏదైనా ఉద్యోగ సాధనకు లేక స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఉపయోగపడేట్టుగా తీర్చిదిద్దాలి. కోర్సుల రూపకల్పనలో ఆయా రంగాల నిపుణుల సలహాలు తీసుకోవాలి. ప్రతి కోర్సును రెండేండ్లకోసారి మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. అలాగే ఇప్పుడున్న ప్రతి కోర్సునూ ప్రక్షాళన చేస్తూ అవసరం ఉన్న కొత్త కోర్సుల రూపకల్పనకు ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు పూనుకోవాలి. అంతేకాదు ఇప్పుడు కాలేజీ లెక్చరర్ల ఎంపిక కోసం నిర్వహించబడే పరీక్షా విధానంలో కూడా మార్పులు తేవాలి.

పోస్ట్ గ్రాడ్యూయేట్ కోర్సులు మంచిస్థాయిలో ఉంటే విద్యార్థులకు క్లాసు బయట కూడా గైడెన్స్ అవసరమవుతుంది. ఉదాహరణకు రిఫరెన్స్ ఎలా చేయాలనే విషయంలోనూ, పరీక్షలకు ఎలా తయారవాలనే విషయంలోనూ, భాషా నైపుణ్యాల విషయంలోనూ (ముఖ్యంగా ఇంగ్లీషుకు సంబంధించి), వ్యక్తిత్వ వికాసానికి, వారి వారి వ్యక్తిగత సమస్య లు పరిష్కరించుకోవడటంలోనూ విద్యార్థులకు ఇతరుల సహాయం అవసరమౌతుంది. అందుకే ప్రతి యూనివర్సిటీలోనూ ఒక హెల్ప్ సెంటర్ ఉండాలి. ఈ సమస్యల పరిష్కారానికి ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని నియమించి ఒక ఎకడమిక్ సెంటర్ రూపొందించాలి.

విశ్వవిద్యాలయ స్థాయి పరీక్షించడానికి అతి ముఖ్యమైన అంశం పరిశోధనలే. పరిశోధన అనేది విద్యార్థులు చదివే చదువుకు, బయట ప్రపంచంలో దాని విలువకు ఒక సారథిగా ఉంటుంది. ఏ రంగమైనా పరిశోధన లేకపోతే ప్రగతి సాధించటం అసాధ్యం. పరిశోధనల వల్లనే ఒక రంగ పూర్వాపరాలు తెలుస్తాయి. మారుతున్న కాలానికి సరిపోయినట్టు జీవితాన్ని మలుచుకోవడం సాధ్యమౌతుంది. అందుకే విశ్వవిద్యాలయంలో చేరే ప్రతి ఉపాధ్యాయుడికి పరిశోధనా అనుభవం ఉండాలి. పీహెచ్‌డీ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇక్కడ కూడా విద్యారంగం దేశంలో వెనుకబడి ఉంది. డిగ్రీ కాలేజీ, విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులందరికీ పీహెచ్‌డీ ఉండాలనే నిబంధనైతే ఉంది. కానీ ఆ కోర్సు కోసం వసతులు మాత్రం తగిన స్థాయిలో లేవు. గుర్తింపు పొందిన పర్యవేక్షకుల (రీసెర్చి సూపర్ వైజర్స్) సంఖ్య ఎంతో లెక్కతెలీదు. ఒక్కో విశ్వవిద్యాలయంలో వారి దగ్గర పరిశోధన చేసే విద్యార్థుల సంఖ్య పరిమితి వల్ల కూడా సమస్య జఠిలమౌతున్నది. అంతేగాక కొందరు విద్యార్థులు పదేండ్ల దాకా పూర్తి చేయకపోవడంతో వారి పర్యవేక్షకుల దగ్గర ఖాళీలు ఏర్పడటం లేదు. ఈ విషయంలో యూజీసీ నిబంధన చాలా స్పష్టంగా ఉన్నది. డిగ్రీ లెవల్ నుంచి ఉపాధ్యాయులకు తప్పనిసరిగా పీహెచ్‌డీ ఉండాలి. ఈ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలున్నాయి. కానీ విశ్వవిద్యాయాలు వాటి మీద దృష్టి పెట్టడం లేదు. ప్రతి విశ్వవిద్యాల యం తమ పరిధిలో గుర్తింపు పొందిన పర్యవేక్షకుల పట్టిక, వారి నిపుణ రంగాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచవచ్చు. ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధన రంగాలకు తగినట్టు లైబ్రరీలు, ఇంటర్నెట్ అవకాశాలు కల్పించే విధంగా సెంటర్స్ తెరువాలి. ప్రతి లైబ్రరీలో పరిశోధన చేసే ఏ విద్యార్థికైనా ప్రవేశం కల్పించాలి.
kankadurga
ప్రస్తుతం సాగుతున్న పరిశోధనా నాణ్యత మీద కూడా చాలా సందేహాలున్నాయి. రీసెర్చ్ అవగానే విద్యార్థి యూనివర్సిటీకి తన పరిశోధనా గ్రంథాన్ని సమర్పిస్తాడు. దీనిని వేరే యూనివర్సిటీల్లోని 3 పరీక్షలకు (వారు కూడా వారి విద్యాలయంలో పర్యవేక్షకులై ఉండాలి) పంపుతారు. వారు ముగ్గురు ఆ గ్రంథానికి డాక్టరేట్ డిగ్రీ ఇవ్వచ్చా అన్న విషయం పరీక్షించి రిపోర్టు పంపుతారు. తరువాత ఒక మౌఖిక (వైవా) పరీక్ష నిర్వహించి డిగ్రీని డిక్లేర్ చేస్తారు. అయితే ఇందులో ఉన్న పెద్ద లోపం ఏమంటే, విద్యార్థి పర్యవేక్షకుడే ఈ పరీక్షల పేరు నిర్ణయించి విశ్వవిద్యాలయానికి ఇవ్వడం. తన విద్యార్థి మీద ఉన్న అభిమానం కోసమో, తన సొంత ప్రతిష్ఠ కోసమో చాలామంది పర్యవేక్షకులు తమ స్నేహితులు, తెలిసినవారికి పేర్లు నిర్ణయించి, వైవా పరీక్ష కూడా మమ అనిపించి పీహెచ్‌డీ డిగ్రీలు ఇప్పించేస్తున్నారు. ఇది అరికట్టగలిగితే పరిశోధనా నాణ్యత పెరుగుతుంది. ఏ విశ్వవిద్యాలయం తన పరిశోధన రంగాన్ని బలోపేతం చేస్తుందో, ఆ సంస్థ ర్యాంకు బాగుపడుతుంది.విద్యార్థులకు ఇతర వసతులు కూడా విశ్వవిద్యాలయాలు కల్పించాలి. స్పోర్ట్స్, గేమ్స్, లిటరరీ క్లబ్స్, డాన్స్, మ్యూజిక్ నేర్చుకునే ఆర్ట్ సెంటర్స్ వంటివి హాబీలుగా విద్యార్థులు మలుచుకుంటే వారికి వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది.

విశ్వవిద్యాలయాల స్థాయి నిర్ణయించటంలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి అంతర్జాతీయ, రెండు ఫ్లెక్సిబిలిటీ. మొదటి అంశానికి యూనివర్సిటీ వాతావరణం, కోర్సులు, వాటి నాణ్యత ప్రధానమైనవి. ఈ కోర్సులు అధునాతన కాలానికి, మనుష్యులకు, సంఘాలకు, మొత్తంగా విశ్వానికే ఉపయోగంగా ఉండాలి. ఇక ఫ్లెక్సిబిలిటీ సాధించటానికి ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు ఉండాలి. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకొక ఫ్యాకల్టీకి కొన్ని కోర్సులు చేసైనా మారే విధానం ఉంది. ఈ విధానం అన్ని అమెరికన్ యూనివర్సిటీలలో ఉంది. ఆ రకంగా ఒక విద్యార్థి ఇష్టం ఉంటే, ఫీల్డ్ మార్చుకునే వసతి భారతీయ విశ్వవిద్యాలయాలు కల్పించాలి.తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో అధునాతన కాలానికి సరిపోయేట్టు విధానాలను మలుస్తున్నది. నీటి ప్రాజెక్టులను చేసినట్టు విద్యారంగాన్ని కూడా రీ డిజైన్ చేస్తే తెలంగాణ విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో గొప్పవిగా ఎదుగుతాయి.

369
Tags

More News

VIRAL NEWS