వాహనదారుల్లో మార్పు రాదా?

Tue,September 12, 2017 11:46 PM

మోదీ, కేసీఆర్, కేటీఆర్, ధోనీ, కోహ్లీ లాంటి ప్రముఖులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలె. దాని కోసం ప్రచార, ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. రోడ్డు ప్రమాదాల ద్వారా ఎంత నష్టం చేకూరుతుందో అర్థం చేయించాలి. ఇదొక ఉద్యమంలా నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లింఘించే వాహనదారులపై కఠినతరమైన కేసులు పెట్టాలి. అప్పుడే వాహనదారుల్లో మార్పు వచ్చే ఆస్కారం ఉంటుంది.

మోటారు వాహనాల చట్టానికి ఎన్ని కఠినతరమైన నిబంధనలు విధించినా, పోలీసు అధికారులు ఆ నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించటం లేదు. చట్టాన్ని అత్రికమిస్తూనే ఉన్నారు. వీరిలో పోలీసులూ ఉన్నారు. ప్రభుత్వం ఈ చట్టానికి ఎంతో ప్రాధాన్యం కల్పిస్తున్నప్పటికీ రోజురోజుకూ ఉల్లంఘనల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారందరూ అక్షరాస్యులే. ఈ అక్షరాస్యులకు నిజంగానే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదా? ఒక సగటు పౌరుడిగా వాహనాలను ఏ విధంగా నడుపాలో మనకు అవగాహన లేదా? హెల్మెట్ ధరించాలి, సీటు బెల్టు పెట్టుకోవాలి, రాంగ్‌రూట్లో వెళ్లకూడదు, మద్యం తాగి వాహనాన్ని నడుపరాదు, ఎర్రలైట్ పడ్డప్పుడు వాహనాన్ని ఆపాలనే విషయాలు ప్రభుత్వం నిర్వహించే అవగాహన కార్యక్రమాల ద్వారానే తెలుసాయా? ఈ దుస్థితిలో మన అక్షరాస్యులున్నారా? హైదరాబాద్ నగరం లో వాహనదారుల పరిస్థితి చూస్తే ఇంకో యాభై ఏండ్లయినా మార్పు వస్తుందా అనిపిస్తున్నది. ఇష్టానుసారం వాహనాన్ని నడుపడం తమ హక్కుగా భావించి ఎదుటి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పార్కిం గ్ స్థలాల్లో వాహనాలను పార్క్ చేయకుండా రోడ్డును ఆక్రమిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నవారే. ఆ విషయం మరిచిపోయి ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లు వదిలి తప్పులు చేస్తున్నారు. సమస్యలు సృష్టిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఒక పోలీసు అధికారి పత్రికాముఖంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవట్లేదని, ట్రాఫిక్ పోలీసుల, కోర్టుల జరిమానాలను, జైలు శిక్షలను ఏమాత్రం లెక్కచేయ డం లేదని వాపోయారు. ఒక అక్షరాస్యుడు జరిమానా లేదా, జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా నిసిగ్గుగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలను అత్రికమిస్తే ఏమనుకోవాలె. ఇటువంటి వారికి ప్రజాస్వామ్య దేశం లో చోటుండకూడదు. ఎంత సేపూ ప్రభుత్వాన్ని, పాలకులను, అధికారులను విమర్శించడమేనా? తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నా మా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నాడా లేదా తెలుసుకోవాలంటే హైదరాబాద్ లాం టి నగరంలో అధికారులకు సాధ్యమవుతుందా? ఎన్నివేల సీసీ కెమెరాలు అమర్చాలి? ఎన్నివేల మంది పోలీసు సిబ్బందిని నియమించాలి?
మన నగరాలు, పట్టణాలను బాగుచేసుకోవాలంటే ప్రభుత్వమే ముం దుకురావాలా? పౌరులుగా మనం మనస్థాయిలో ప్రభుత్వానికి సహకరించలేమా? నాగరికులమని చెప్పుకునే మనం అనాగరిక చర్యలకు స్వస్తి చెప్పలేమా? ఈ మధ్య పోలీసులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన దారుల విషయంలో తల్లిదండ్రులను, లేదా భార్యను, ఇతర కుటుంబ సభ్యు లను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాహనదారుడు తప్పుచేసినందుకు కుటుంబసభ్యులు ఇబ్బందులకు ఎదుర్కోవడం సబబేనా? ఈ ఉల్లంఘనదారుల ఫొటోలు పోలీసు అధికారుల రికార్డుల్లో నిక్షిప్తమై ఉం టే వారి పరిస్థితి ఘరానా దొంగలు, నేరగాళ్ల మాదిరే కదా.

మైనర్ పిల్లలు వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలాంటి పిల్లలను తల్లిదండ్రులు మందలించాల్సిందిపోయి తమ పిల్లాడు ఏదో ఘనకార్యం చేసుకువచ్చినట్టుగా మురిసిపోతున్నారు, ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. గంటసేపు ప్రయాణించాల్సిన దూరాన్ని అరగంటలో ముగించే యువతను చూసి తల్లిదండ్రులు ఓహో అని మెచ్చుకుంటున్నారు. మద్యం సేవించి రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవ్‌చేసే వ్యక్తిని శభా ష్ అని మత్తులో ఉండే స్నేహితులు పొగుడుతున్నారు. హెల్మెట్ లేకుంటే పోలీసులు పట్టుకుంటారని చెప్పడమే తప్ప, అది తలకు సురక్షితమని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడానికి, ఎర్రలైటు పడితే వాహనాన్ని ఆపడానికి, మద్యం తాగకుండా వాహనాన్ని నడుపడానికి నాగరిక సమాజంలో పోలీసువారి లేదా సీసీ కెమెరాల పర్యవేక్షణ అవసరమా అని వాహనదారులు ప్రశ్నించుకోవాలి. ఈ దుందుడుకు చర్యలకు పాల్పడే ఉద్యోగస్తులు, యువత, మైనర్లు, వారి తల్లిదండ్రులు, కోర్టుకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం దాకా పిలుపు కోసం ఎదురుచూస్తే తల్లిదండ్రులకు తలకొట్టేసినంత పనవుతుంది. అంతేగాక రోజంతా వృథా. భవిష్యత్తులో ఉద్యోగానికి, పాస్‌పోర్టుకు, డ్రైవింగ్ లైసెన్స్‌కు అనర్హులవుతారు. మొదటిసారి రాష్ట్రంలో ప్రతి మోటార్‌వాహన ఉల్లంఘనకు జరిమానాతో పాటు పాయింట్ల విధానం ప్రవేశపెట్టారు. అమల్లోకి వచ్చిన మొదటిరోజే కొన్నివే ల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. అయినా వాహనదారుల్లో మార్పురాకపోవడం శోచనీయం.

ప్రజల్లో మార్పు రావాలంటే గొప్పవ్యక్తులు వారిని ప్రభావితం చేయా లి. క్రికెటర్ ధోనీ జుట్టు, విరాట్ కోహ్లీ గడ్డం, క్రిస్‌గేల్ గంగ్‌నమ్ ైస్టెల్ డ్యాన్స్, లసిత్ మలింగ హెయర్‌ైస్టెల్‌ను ఎంతో మంది యువత అనుకరించారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ సందేశానికి ఎంతో మంది ప్రభావితులై వంటగ్యాస్ సబ్సిడీని వదులుకోవడం, నోట్లరద్దు విష యంలో ఎన్ని ఇబ్బందులున్నా యాభై రోజులకు పైగా కష్టాలు భరించటం మనం చూశాం. ఇలాంటి ప్రభావ శీల వ్యక్తుల తోడ్పాటుతో ట్రాఫిక్ ఉల్లం ఘనల విషయంలోనూ ప్రచారం చేస్తే బాగుంటుంది.

దేశంలో కుటుంబ నియంత్రణ ప్రచారం సుమారు మూడు దశాబ్దాల కు పైగా ఒక ఉద్యమంలా జరిగింది. అది మొదలైనప్పుడు ప్రజల్లో అవగాహన శూన్యం. అదీగాక అక్షరాస్యత శాతం కూడా తక్కువే. ప్రస్తుతం దేశంలో అక్షరాస్యతా శాతం బాగా పెరిగింది. కానీ నిర్లక్ష్య ధోరణి మాత్రం అంతం కాలేదు. దాని ఫలితమే ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ప్రజల్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్నది. ఆయన చేనేత వస్ర్తాల వాడకంపై ట్వీట్‌చేస్తే అధికారగణం, టాలీవుడ్, బాలీవుడ్‌కు సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు ప్రభావితమయ్యారు. వారు పాటించడమే కాకుండా ప్రజల నూ ప్రభావితం చేస్తున్నారు. దీంతో చేనేత వస్ర్తాలకు ప్రాధాన్యం సంతరించుకున్నది.
murali

మోదీ, కేసీఆర్, కేటీఆర్, ధోనీ, కోహ్లీ లాంటి ప్రముఖులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలె. దాని కోసం ప్రచార, ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. రోడ్డు ప్రమాదాల ద్వారా ఎంత నష్టం చేకూరుతుందో అర్థం చేయించాలి. ఇదొక ఉద్యమంలా నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠినతరమైన కేసులు పెట్టాలి. అప్పుడే వాహనదారుల్లో మార్పు వచ్చే ఆస్కారం ఉంటుంది.
(వ్యాసకర్త: విశ్రాంత జిల్లా, సెషన్స్ జడ్జి)

848
Tags

More News

VIRAL NEWS