అధ్యయన, అధ్యాపనశీలి

Sun,August 13, 2017 01:31 AM

ఈ అసాధారణ అధ్యయన, అధ్యాపనశీలి మరింత ఉత్సాహభరితంగా రచనావ్యాసంగం కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. జీవిక కోసమే తంటాలు పడే దశ నుంచి విద్యారంగంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించి, అత్యుత్తమ గౌరవాలను పొంది తెలుగు జాతికి, తెలంగాణ వైభవానికి నిరుపమాన సేవలందించిన ఆచార్య రవ్వా శ్రీహరిగారి సాహితీ కృషి నిత్యస్ఫూర్తిదాయకం, నిరంతర చైతన్యవాహకం.

తెలుగు సాహిత్య ప్రపంచంలో తమకంటూ విశిష్ట స్థానాన్ని సముపార్జించుకున్న పండి త పరిశోధక వతంసులు ఆచార్య రవ్వా శ్రీహరిగారు. తెలుగు, సంస్కృత సాహిత్య అధ్యయన, అధ్యాపనలతో పాటు శ్రీహరి నిఘంటు నిర్మాణం, పాణినీయ అష్టాధ్యాయికి విపుల వ్యాఖ్యానం సమకూర్చ డం ద్వారా ఇరుభాషల సాహిత్యాధ్యయనానికి ఉదాత్త బాటలు వేసిన ఉత్తమ అధ్యాపకులు.

ప్రారంభించిన అధ్యయనం సంస్కృతమే అయినా, తెలుగు సాహిత్యంలో భాస్కర రామాయణం-సవిమర్శక పరిశీలనం అనే అంశంపై ఆచార్య బిరుదురాజు రామరాజుగారి పర్యవేక్షణలో సిద్ధాంత వ్యాసాన్ని రూపొందించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన మాతృభాషాభిమాని. ఆచార్య రవ్వా శ్రీహరి సాహితీ జీవనం త్రివే ణి సంగమంలా కొనసాగింది. సంస్కృత సాహిత్యాధ్యయనం, తెలుగు సాహి త్య పరిశోధన, బోధనానుభవం ఆచార్య రవ్వా శ్రీహరి జీవితంలో అవిభాజ్య అంశాలు.

1943 మే 5న యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం వెల్వర్తి గ్రామం లో వేంకటనరసమ్మ, రవ్వా నరసయ్య దంపతులకు శ్రీహరి జన్మించారు. చిన్న వయసులోనే తల్లి మరణించడం జీవితానికి ఆశనిపాతం. శ్రీహరి ఆమె కోసమే ప్రత్యేకంగా సంస్కృతంలో మాతృగీతం అనే శతక రచన చేసి ఆ మాతృమూర్తిని చిరస్మరణీయం చేశారు.

శ్రీహరి ప్రాథమిక విద్య పూర్తయ్యేకాలం (1952) నాటికి పూర్వ నల్లగొం డ జిల్లా మొత్తంలో మూడే ఉన్నత పాఠశాలలుండేవట. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరిలలో. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల, తల్లి చిన్ననాడే పరమపదించడం వల్ల చదువుకు అంతరాయం ఏర్పడుతుందని భయ పడ్డారు. ఇంతలో ఫీజులు లేకుండా భోజనా సౌకర్యంతో చదువు చెబుతామని శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహస్వామి సంస్కృత విద్యాపీఠం వారి ప్రకట న తెలియవచ్చింది. శ్రీహరి తమ సహచరులతో కలిసి యాదగిరిగుట్టలో సం స్కృత విద్యాపీఠంలో ప్రవేశించి సంస్కృతంలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన సంస్కృతాధ్యయనం సికింద్రాబాద్‌లో ని మున్నాలాల్ సంస్కృత కళాశాలలో ఒక రూపాన్ని సంతరించుకున్నది. సీతారాం బాగ్లోని వేదాంత వర్ధినీ సంస్కృత కళాశాలలో కోయిల్‌కందాడై శఠగోప రామానుజాచార్యుల వద్ద 1958-62 వరకు జరిపిన అధ్యయనం తమ జీవితానికే వెలుగును ప్రసాదించిందని పలుమార్లు గుర్తుచేసుకున్నారు. తదనంతరం ఎం.ఏ. సంస్కృతం రాసి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై బంగారు పతకాన్ని సాధించారు.

హైదరాబాద్‌లోని వివేకవర్ధినీ కళాశాలలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన శ్రీహరి సారస్వత పరిషత్తు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా వ్యవహరించి, కుప్పంలో ని ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా తమ విశేష సేవలు అందించారు. విశ్వవిద్యాలయ బోధన కొనసాగుతున్న సమయంలోనే నిరంతర పరిశోధనతో అనేక గ్రంథాలను రచించారు. లఘు సిద్ధాంత కౌముదికి వ్యాఖ్య, వ్యాకరణ పదకోశం, సంకేత పదకోశం, అలబ్ధ కావ్యపద్య ముక్తావళి, ముకుం ద విలాసం, సంస్మృతసూక్తి ముక్తావళి, తెలుగు కవుల సంస్కృతానుకరణ లు, వాడుక తెలుగులో అపప్రయోగాల లాంటి రచనలతో తమ పరిశోధనాసక్తి నిరుపమానమని నిరూపించారు.

తెలుగు సాహిత్య పరిశోధకుల్లో వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, మానవల్లి రామకృష్ణ కవిగారు, నిడుదవోలు వేంకటరావుగారు ప్రాత:స్మరణీయులు అని భావిస్తారు రవ్వా శ్రీహరి. తొలిదశలో వీరి రచనలను అధికంగా అధ్యయనం చేయడం వల్ల ఆ రచనల స్ఫూర్తితో సాహిత్య చరిత్రకు ఉపకరించే రీతిలో అలబ్ధ కావ్య ముక్తావళి అనే గ్రంథాన్ని సంకలనం చేశారు. తెలుగు సాహిత్యంలో నేటికీ లభ్యం కాని ఎర్రన రామాయణం, అధర్వణ భారతం మొదలైన గ్రంథాలకు చెందిన పద్యాలను వివిధ ఆకరాల ఆధారంగా సేకరిం చి ఈ గ్రంథంలో కూర్చారు. సుమారు వంద గ్రంథాల నుంచి పద్యాలు సేకరించి రూపొందించిన ఈ గ్రంథాన్ని తమ గురువైన ఆచార్య బిరుదురాజు రామరాజుకు అంకితంచేసి అభిమానాన్ని చాటుకున్నారు.

16 ఏండ్ల చిరుప్రాయంలోనే ధూర్జటి కాళహస్తీశ్వర శతకాన్ని సంస్కృతంలోకి అనువదించాలని సంకల్పించి కొన్ని పద్యాలను అనువదించారు. ఆ తర్వాత సృజన సాహిత్యాన్ని అనువదించడానికి ఈ ప్రాథమిక కృషి పునాది వేసింది. రవ్వా శ్రీహరి మహాకవి గుర్రం జాషువాగారి ఫిరదౌసి కావ్యాన్ని ఫిరదౌసి పేరుతోనూ, గబ్బిలం కావ్యా న్ని తైలపాయికా అనే పేరుతోనూ, సినారెగారి ప్రపంచపదులను ప్రపంచపదీ పేరుతో, వేమన, నృసింహ శతకాలనూ సంస్కృతంలోకి అనువదించారు. ప్రపంచపదీ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహూమానాన్ని పొందారు.
రవ్వా శ్రీహరి 1973లోనే రూపొందించిన సంకేతపదకోశం వివిధ శాస్ర్తాల సాంకేతిక పదాలను వివరించే విలక్షణ నిఘంటువు. శ్రీహరి రూపొందించిన గ్రంథాల్లో వ్యాకరణ పదకోశం ఒకటి. ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంతో కలిసి ఈ పదకోశాన్ని తెలుగు అకాడమీ కోసం తయారుచేశారు. తెలుగు, సంస్కృత వ్యాకరణాల్లోని అనే క పదాలకు వివరణలు సమకూరుస్తూ ఆయన ఈ గ్రంథాన్ని అందించారు.
సంస్కృతాధ్యయనశీలురు అయినా రవ్వా శ్రీహరి మాండలిక పదాల పట్ల, జన వ్యవహారంలోని అభివ్యక్తుల పట్ల ప్రత్యేక మమకారం కలిగినవా రు. అందులోనూ తెలంగాణ మాండలికాలంటే శ్రీహరి గారికి అమితాసక్తి. వివిధ వృత్తులకు సంబంధించిన మాండలికాలను సాహిత్య అకాడమీ తయా రుచేయించినా ఏ వృత్తులకు సంబంధంలేని మాండలికాలను ఉపేక్షించడం సరైనది కాదని భావించారు. మొత్తం సాహిత్యంలో ఒకే ఒక్కచోట, ఒక్కసారి మాత్రమే ప్రయోగించిన పదాన్ని కూడా నిఘంటువుల్లో చేర్చిన నిఘంటుకారులు లక్షలాది ప్రజల నాలుకల్లో నిత్యమూ వ్యవహారంలో ఉన్న మాండలిక పదాలను ఉపేక్షించడం యుక్తం కాదని భావించి నల్లగొండ జిల్లా మాండలిక పదకోశాన్ని రూపొందించారు. కోశకర్తకు ఉండవలసిన శాస్త్రీయ దృష్టితో కూర్చిన మాండలిక పదకోశమిది.

శ్రీహరి గారి నిరంతర శ్రమకు శ్రీహరి నిఘంటువు నిలువెత్తు సాక్ష్యం. ఈ నిఘంటు నిర్మాణం సమకాలీన సాహితీ ప్రపంచంలో అరుదైన ఘటనగా పేర్కొనాలి. ఏనాడో సాహిత్య అకాడమీ సూర్యరాయాంధ్ర నిఘంటువును నిర్మించి వదిలిన స్థితి నుంచి నిఘంటువులోకి ఎక్కని కొన్నివేల పదాలను తమ శ్రీహరి నిఘంటువులోకి ఎక్కించడం, అన్నమయ్య సాహిత్యంలోని కొన్నివేల పదాలను ఈ నిఘంటువులోకి తీసుకురావడం శ్రీహరిగారి నిరుపమాన పరిశోధనా పాటవానికి నిదర్శనం.

పదవీవిరమణ చేసిన తర్వాత శ్రీహరిగారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల ప్రధాన సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించి మహాభారతానికి, మహాభాగవతానికి పలువురు పండితుల చేత వ్యాఖ్యానం సంతరింపజేసి సమన్వయం చేశారు. తాళ్ళపాక అన్నమాచార్య, పెదతిరుమలాచార్య తిరువేంగళనాథాది కవుల సంకీర్తనలకు సమగ్రమైన నిఘంటువును రూపొందించారు. ఈ క్రమంలోనే మారుమూల తెలుగు పదాల మూలాలను వెతకడానికి అవకాశం కలుగడం వల్ల తెలుగు పలుకుబళ్ళ సోయగం, తాళ్ళపాక కవు ల కవితా వైదగ్ధ్యమూ, ఆ ప్రాంత ప్రజల వాడుక భాషలోని విలక్షణతా విశద పరుచడానికి తాళ్ళపాక కవుల పదకోశాన్ని రూపొందించారు.

ఇవన్నీ సాగుతుండగానే సంస్కృతంలో పాణిని రచించిన అష్టాధ్యాయికి సుమారు 2 వేల పేజీల్లో వ్యాఖ్యాన్యం సంతరించి సంస్కృత భాషాధ్యయనానికి మార్గం సుగమం చేయడం వారి శిఖరాయమాన పాండిత్యానికి నిదర్శనం. ఇంతటి పరిశోధనా ప్రజ్ఞను ప్రదర్శించినందువల్లే తిరుపతిలోని కేంద్రీ య సంస్కృత విద్యాపీఠం వారు 2011లో మహామహెూపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరించారు. నేటికాలంలో ఇంతటి విద్వత్తును సంపాదించడం ఒక ఎత్తయితే నిరంతర రచనా వ్యాసంగంతో తమ అధ్యయనశీలతకు సార్థకతను సమకూర్చడం మరొక ఎత్తు.
వయసు పైబడుతున్నా, ఆరోగ్యం సహకరించకపోయినా తరగని ఉత్సాహంతో నిరంతర సాహితీ వ్యాసంగంతో స్ఫూర్తిదాయక తేజోమయ జీవితా న్ని గడుపుతున్న ఈ అసాధారణ అధ్యయన, అధ్యాపనశీలి మరింత ఉత్సాహభరితంగా రచనావ్యాసంగం కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. జీవిక కోసమే తంటాలు పడే దశ నుంచి విద్యారంగంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించి, అత్యుత్తమ గౌరవాలను పొంది తెలుగు జాతికి, తెలంగాణ వైభవానికి నిరుపమాన సేవలందించిన ఆచార్య రవ్వా శ్రీహరిగారి సాహితీ కృషి నిత్యస్ఫూర్తిదాయకం, నిరంతర చైతన్యవాహకం.
(ఆచార్య రవ్వా శ్రీహరి పంచసప్తతి మహోత్సవ సందర్భంగా..)
acharya

658
Tags

More News

VIRAL NEWS