ఏడు పదుల పరిణత భారతం

Sat,August 12, 2017 01:54 AM

భారతికి ఆరతిదేరా, తరుణ భారతికి ఆరతిదేరా ఏండ్ల కిందట రాసిన ఒక సంగీత రూపకంలోని పల్లవి ఇది. మొదట రాడికల్ హ్యూమనిస్ట్, తర్వాత ఏ ఇస్ట్ కాని ప్రముఖ రచయిత, మేధావి, తాత్త్విక చింతనాపరుడు త్రిపురనేని గోపీచంద్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో గ్రామస్థుల కార్యక్రమాల ప్రయోక్తగా (ప్రొడ్యూసర్) ఉన్నప్పుడు ఢిల్లీలో ఒక అంతర్జాతీయ ప్రదర్శన శాలకు పంపించడానికి ఓయూలో చదువుతున్న నన్ను, నా కవి మిత్రుడిని పిలిచి అర్జెంటుగా ఈ సంగీత రూపకం రాయమన్నారు రికార్డింగ్ కోసం.
ప్రజాస్వామ్య ముసుగుతో అమలవుతున్న నిరంకుశ విధానాలు, శుష్క నినాదాలు విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. మూడేండ్లయినా కశ్మీరు మంటలు ఆరడం లేదు. రెండు నెలలైనా డోక్లాం వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదంలో ప్రపంచ దేశాలన్నీ మనల్నే సమర్థిస్తున్నాయని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించిన మరునాడే నేపాల్ విదేశాంగ మంత్రి మేము ఎవరినీ
సమర్థించడం లేదని ప్రకటించడం గమనార్హం.


అక్కడే, ఆకాశవాణి ఆవరణంలో చెట్ల కింద కూర్చొని ఆ రూపకం రాశాం. అప్పుడు, చాలా ఏండ్ల కిందట ఉన్నది తరుణ భారతి. ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడున్నది తరుణ భారతి కాదు, పరిణతి పొందిన భారతి. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏండ్లు నిండాయి. తర్వాత, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డ్బ్భై ఏండ్లయింది. ఏవీ సులభంగా, క్షణాల్లో, కేవలం మాట లు, నినాదాలతో జరుగలేదు. మహాకవి దాశరథి ఒక గజల్ (గాలిబ్‌ది) ను అనువదిస్తూ అన్నారు. ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము.. స్వాతంత్య్ర సాధనకు అనేక పోరాటాలు, ఉద్యమాలు జరుపవలసి వచ్చింది. 1757లో బెంగా ల్ నవాబు సిరాజుద్దౌలా ఈస్టిండియా కంపెనీ సేనాని లార్డ్ క్లయివ్‌తో ప్లాసీ యుద్ధంలో పోరాడి, తన సేనాధిపతి మీర్ జాఫర్ ద్రోహం కారణం గా ఓడిపోయిన సంఘటనను పరిగణిస్తే భారత స్వాతంత్రోద్యమానిది దాదాపు 200 ఏండ్ల చరిత్ర. 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోపె, మంగళ్‌పాండే, ఇక్కడ తుర్రే బాజ్‌ఖాన్ తదితరుల నాయకత్వంలో-మీరట్‌లో మొదలై దక్షిణ భారతం వరకు విస్తరించిన తిరుగుబాటును (మొదటి స్వాతంత్య్ర సంగ్రామం) పరికిస్తే భారత స్వాతంత్య్ర ఉద్యమానిది తొంభై ఏండ్ల చరిత్ర. 1885 డిసెంబర్‌లో కొందరు ఆంగ్లేయ మేధావులు, ఉదారవాదుల చొరవతో, ప్రోత్సాహంతో బొంబాయిలో స్థాపితమైన భారత జాతీయ కాంగ్రెస్ ముప్ఫై ఏండ్ల వరకు కేవలం చర్చలు, సంప్రదింపులు, విజ్ఞప్తి పత్రాల సమర్పణ వరకు, విన్నపాల వరకే పరిమితమైంది.

దాదాభాయి నౌరోజీ, ఫిరోజ్‌షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, సురేంద్రనాథ్ బెన ర్జీ తదితర మహా మేధావులు, అకళంక దేశభక్తులు రంగం మీదికి వచ్చి నా, లోక్‌మాన్య తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని గర్జించినా అతివాదుల, మితవాదుల ఘర్షణలతో చివికిన భారత జాతీయ కాంగ్రెస్ సామాన్య జనకోటి దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇరువై ఏండ్ల పాటు దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ సమర ప్రయోగాలు కొనసాగించిన మహా త్మా గాంధీ తర్వాత తిలక్, గోఖలే అభ్యర్థనతో స్వదేశానికి శాశ్వతంగా 1915లో తిరిగి వచ్చిన తర్వాతనే, ఆయన నాయకత్వంలో, ఆయన నిర్వహించిన అపూర్వ శాంతియుత పోరాట కార్యక్రమాలతో భారత జాతీయ కాంగ్రెస్ ప్రజల మధ్యకు మొదటిసారి వెళ్లగలిగింది. 1915 జనవరి, 9న బొంబాయిలో అడుగుపెట్టిన తర్వాత గాంధీజీ వెం టనే పోరాటాలకు ఆరాటపడలేదు. తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖ లే సలహా పాటించి గాంధీజీ ఖరీదైన దుస్తులను త్యజించి, మోకాళ్ల మీది కి ధోవతితో, చొక్కాలేకుండా కాలి నడకన, మూడో తరగతి రైలు పెట్టెలో దేశమంతటా విస్తృతంగా పర్యటించారు. వందేండ్ల కిందటనే గాంధీజీ ఈ దేశంలోని కోట్లాది ప్రజల పేదరికాన్ని స్వయంగా చూసి సామాన్యుల దారిద్య్రం, అజ్ఞానం, అమాయకత్వం, అనారోగ్యం, అపరిశుభ్రత గురిం చి మాట్లాడి, ఈ దుస్థితిని నివారించే మార్గాలను సూచించారు. గాంధీజీని డియర్ మహాత్మాజీ అని సంబోధించిన రవీంద్రనాథ్ టాగోర్ మాటలివి.. వేలాది దరిద్రుల, నిరుపేద ల గుడిసెల వాకిళ్ల లో గాంధీజీ వారిలో ఒకడిగా నిలిచాడు. వారి భాషలో మాట్లాడాడు. సజీవ సత్యం గా ఆయన కనిపించాడు. భారతీయులందరు తనవాడని భావించిన వాడు ఆయన ఒక్కడే.

గాంధీజీ 1917లో చంపారన్, బార్డోలి, పోరాటాలతో మొదలుపెట్టి 1919లో రౌలట్ చట్టం పట్ల నిరసన తెలిపే కార్యక్రమాలతో 1930లో దండి ఉప్పు సత్యాగ్రహం దాకా సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన శాంతియుత కార్యక్రమాలతో, సకల భారతావనికి ఏకైక నాయకుడిగా ప్రశస్తి పొందారు. దాదాపు ముప్ఫై ఏండ్ల శాంతియుత సత్యాగ్రహ సమ రం, ఎడతెగని చర్చలు, సంప్రదింపుల అనంతరం గాంధీజీ అంతిమ అస్త్రంగా క్విట్ ఇండియా పిలుపునిచ్చి బ్రిటిష్ పాలకులను హెచ్చరించడానికి నిర్ణయించారు. అభిప్రాయ భేదాలున్న కొందరు దేశ ప్రజల అభిప్రాయాన్ని గమనించి గాంధీజీ నిర్ణయాన్ని శిరసావహించక తప్పలే దు. వార్ధా ఆశ్రమం నుంచి 1942 ఆగస్టు, 8 నాటికి గాంధీజీ బొంబా యి చేరారు. గాంధీజీ గట్టిగా బలపరచిన క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, వర్కింగ్ కమిటీ 1942 ఆగస్టు 8న ఆమోదించాయి. ఆగస్టు 9న గాంధీజీని అరెస్టు చేసి పూణెలోని ఆగాఖా న్ భవన్‌లో నిర్బంధించారు. జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయి పటే ల్, మౌలానా ఆజాద్, రాజేంద్రప్రసాద్ తదితర అగ్రనాయకులను, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేలాది కార్యకర్తలను, ఉద్యమకారులను, సామాన్య ప్రజలను బ్రిటిష్ పాలకులు దేశమంతటా జైళ్లలో నిర్బంధించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్య మం ఒక మహోజ్వల ఘట్టం.

జైలు నుంచి విడుదలైన తర్వాత సర్దార్ పటేల్, వైశ్రాయి మౌంట్ బాటన్‌తో మాట్లాడుతూ.. ఇక మీరు ఈ దేశా న్ని పాలించలేరన్నారు. ఒక వంక లక్షలాది ప్రజలు, ఉద్యమకారులు సకల త్యాగాలకు సిద్ధమై ముందు నడుస్తున్నప్పుడు కొందరు మీర్ జాఫ ర్ వంటి ద్రోహులు బ్రిటిష్ పాలకుల ముందు మోకరిల్లి, తలవంచి, క్షమార్పణ పత్రాలు రాసిచ్చి చెంపలేసుకున్నారు. ఆ ద్రోహుల వారసుల కారణంగా ఇప్పటికీ ఈ దేశం సమైక్యతకు విఘాతం కలిగే ప్రమాదం కనిపిస్తున్నది. కుల, మత విద్వేషాల, మతోన్మాద చర్యల, అసహన శక్తు ల విజృంభణ ఉండని శాంతియుత భారతం కోసం గాంధీజీ కలలు గన్నారు. ఈ కలలు ఇష్టంకాని మతోన్మాదుల తుపాకి గుండ్లకు ఆయన బలైనారు. పేదరికం నిర్మూలన, హింసాత్మక ధోరణుల నియంత్రణ గాం ధీజీ పరమాశయాలు. గాంధీజీ ఆశయాలను ఆచరించడానికి చిత్తశుద్ధితో గత మూడేండ్ల నుంచి అవిరళ, అకుంఠిత, అనల్ప కృషి జరుగుతున్నది ఒక్క తెలంగాణలోనే.. ఏ కంటిలోను కన్నీరు ఉండరాదన్న గాంధీజీ ప్రబోధానికి అంకితమై సత్ఫలితాలను సత్వరంగా చూపిస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే. ఆంధ్ర పాలకుల దోపిడి, అణచివేత నుంచి అసామాన్య ఉద్యమాలు, అశేష త్యాగాల ఫలితంగా విము క్తి పొంది అద్భుత పునర్నిర్మాణంలో నిమగ్నమైన తెలంగాణ రాష్ట్రం ప్రగతికి భంగం కలిగించే అసహనం స్పష్టంగా కనిపిస్తున్నది. పునర్నిర్మాణానికి, ప్రగతి యాత్రకు అర్హమైన ప్రత్యేక సహకారం అందించడానికి బదు లు ప్రగతి నిరోధక చర్యలను చేపట్టే కుటిల యత్నాలు జరుగుతున్నాయి.

భారత స్వాతంత్రోద్యమం, విశేషించి అందులో ఒక ఉజ్వల ఘట్టమైన క్విట్ ఇండియా సమరం ఈ దేశం భిన్నత్వంలోని ఏకత్వానికి, వసుధైక కుటుంబ భావనకు ప్రతీకలు. బ్రిటిష్ పాలనకు దాసోహమన్న ద్రోహులు తప్ప దేశంలోని అన్ని మతాల, వర్గాల వారు భారత స్వాతంత్రోద్యమంలో స్వచ్ఛందంగా సమిధలైనారు. భారత జాతీయవాదం, దేశభక్తి అసహనానికి, సంకుచిత ధోరణులకు, విద్వేషానికి అతీతమైనవని గాంధీజీ, రవీంద్రనాథ్ టాగోర్ ఉద్బోధించారు. 1913లో గీతాంజలి గీతా సంకలనానికి నోబెల్ బహుమతి పొందిన రవీంద్రుడు 1921 మే నెలలో, స్టాక్‌హోంలో ఆ బహుమతిని స్వీకరిస్తూ కావించిన ప్రసంగంలో భారతీయ ఆత్మను, స్ఫూర్తిని సృష్టీకరిస్తూ అన్న ఈ మాటలు ఈ రోజు దేశభక్తి, జాతీయవాదం పేరిట అసహనాన్ని, హింసాత్మక ధోరణులను రెచ్చగొడుతున్నవారు గమనించవలసినవి. I do not think that it is the spirit of India to reject anything, reject any race, reject any culture. The spirit of India has always proclaimed the ideal of unity. This ideal of unity never rejects anything, any race or any culture. India is there to unite all human races.. రవీంద్రుడు విశ్వకవీశ్వరుడే కాదు, విఖ్యాత ఆధ్యాత్మిక భావ సంపన్నుడు. ఏడు పదుల భారతం ఇప్పుడు ఏ మార్గంలో పయనిస్తున్నదన్నది కీలక ప్రశ్న.

దేశంలో గడిచిన మూడేండ్ల నుంచి సామాజిక, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్య, పరిపాలనా రంగాల్లో జరుగుతున్న విఫల, విష ప్రయోగాలు, వితండ వాదనలు, వక్రభాష్యాలు ప్రజాతం త్ర వాదులకు కలవరం కలిగించడం సహజం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రమాదకరంగా విస్తరణవాదం విజృంభిస్తున్నది. భారత రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ వ్యవస్థకు, ఫెడరల్ ప్రజాస్వామ్యాని కి ఏకచ్ఛత్రాధిపత్యంతో తిలోదకాలిచ్చే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. 1980లో జనతా పార్టీ పక్షాన గెలిచిన భజన్‌లాల్ మొత్తం పార్టీని మూటగట్టి పార్టీ ఫిరాయించినప్పుడు కూడా ఇటువంటి ప్రమా దం కనిపించలేదు. హఠాత్తుగా నోట్ల రద్దు, సర్జికల్ ైస్ట్రెక్స్, జీఎస్టీ తదిత ర చర్యలు ఆశించిన ఫలితం కంటే ఊహించని నష్టాలు ఎక్కువ కలిగిస్తున్నాయని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ప్రజాస్వామ్య ముసుగు తో అమలవుతున్న నిరంకుశ విధానాలు, శుష్క నినాదాలు విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. మూడేండ్లయినా కశ్మీరు మంటలు ఆర డం లేదు. రెండు నెలలైనా డోక్లాం వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదంలో ప్రపంచ దేశాలన్నీ మనల్నే సమర్థిస్తున్నాయని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించిన మరునాడే నేపాల్ విదేశాంగ మంత్రి మేము ఎవరినీ సమర్థించడం లేదని ప్రకటించడం గమనార్హం.
prabakar

443
Tags

More News

VIRAL NEWS