చైనా విస్తరణవాదం

Tue,July 18, 2017 01:03 AM

కొంతకాలంగా చైనా ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. తన శక్తియుక్తులన్నింటినీ వినియోగించి గ్లోబల్ మార్కెట్‌ను హస్తగతం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నది. దీనికోసం చైనా కనీవిని ఎరుగనన్ని నిధులను కేటాయిస్తున్నది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు 29 దేశాధినేతలు, వంద మంది ప్రతినిధులతో చైనా బీజింగ్‌లో బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ (బీఆర్‌ఎఫ్)పేరుతో సదస్సును నిర్వహించి అధ్యక్షోపన్యాసం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కీలక వార్తగా మీడియాలో చోటుచేసుకున్నది. చైనా కొత్త సిల్క్‌రోడ్డుతో దేశాల మధ్య సమాన, సౌహార్థ సంబంధాలకు తావులేకుండా పోతున్నది. దేశాల అంతర్గత విషయాలు, రాజకీయాలు కూడా ఆధిపత్య శక్తికి అనుకూలంగా రూపొందే ప్రమాదం పొంచి ఉన్నది.ఈ క్రమంలోనే సిల్క్‌రూట్ పేర చైనా అనుసరిస్తున్న ఆధిపత్య విధానాలను భారత్ నిరసిస్తున్నది.

ఈ సదస్సుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ఐఎంఎఫ్ చీఫ్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు హాజరవటం తో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఈ ఫోరం నిర్వహణ, హాజరైన దేశాల ప్రాతినిధ్యం పట్ల అమెరి కా కూడా ఆసక్తిగా గమనిస్తూ, చైనా కూడా ప్రపంచీకరణలో భాగస్వామ్య మై గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశించటం పట్ల హర్షం వ్యక్తం చేసింది.
గమనించాల్సిన విషయమేమంటే.. బెల్ట్ ఆండ్ రోడ్ ఫోరమ్ ఈ గ్లోబ ల్ మార్కెట్ కోసం కొత్త సిల్క్ రూట్‌ను ప్రతిపాదించింది. ఇది ఆసి యా తూర్పు దేశాల నుంచి పశ్చిమ యూరప్ దేశాలను అనుసంధానం చేస్తుంది. ఇది జల, భూ మార్గాలు, ఆధునిక శాటిలైట్ సమాచార వ్యవ స్థ కలిగి ఉంటుంది. ఈ వ్యాపార మార్గాన్నే చైనా కొత్త సిల్క్ రూట్ అం టున్నది. ఇది పురాతన సిల్క్ రూట్‌ను గుర్తుకు తెచ్చేలా ప్రపంచ దేశాలన్నింటినీ వ్యాపారాత్మకంగా అనుసంధానం చేస్తుంది. చరిత్రలో సిల్క్ రూట్‌తో చైనా వ్యాపారంలో నెరిపిన ఆధిపత్యాన్ని జ్ఞప్తికి తెస్తున్నది. ఒకసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే.. క్రీస్తు పూర్వం 202 నుంచి క్రీస్తు శకం 220 దాకా చైనా హాన్ సామ్రాజ్య కాలంలో ప్రపంచ వ్యాణిజ్యంలో సిల్క్‌రోడ్ కీలక భూమిక పోషించింది. నాడు ఇది చైనా వ్యాపార వాణి జ్య ఆధిపత్యానికి తార్కాణంగా నిలిచింది. నిజానికి చైనా సిల్క్ రోడ్ అనేది ఒకే రోడ్డు మార్గం కాదు. ఇది అనేక రోడ్డు, సముద్ర మార్గాల సమాహారం. అది ప్రస్తుత కొరియన్ భూభాగం నుంచి జపాన్ నుంచి మధ్యదరా సముద్రం వరకు నాలుగు భారత భూమార్గాల గుండా విస్తరించి ఉండేది. ఈ మార్గం ద్వారా అనేక వస్తువులు రవాణా అయ్యేవి. దీనికి సిల్క్ రూట్ అని పేరెందుకు వచ్చిందంటే.. ఈ సిల్క్ మార్గం పొడవునా చైనా ఉత్పత్తిచేసిన సిల్క్ ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఈ విధంగా తూర్పు, పశ్చిమ దేశాలను అనుసంధానం చేస్తూ సాగిన ఈ వ్యాపార మార్గం హాన్స్ రాజవంశ పాలనాకాలం క్రీస్తు పూర్వం-130లో గణనీయమైన ప్రశస్తి కలిగి ఉండింది.

సిల్క్ రోడ్ అని మొదట పిలిచినవాడు జర్మనీకి చెందిన యాత్రికుడు, వ్యాపారస్తుడు ఫెర్డినాండ్ వాన్ రిచ్తోఫెన్. ఆ కాలంలో టర్కీ ఒట్టోమెన్ సామ్రాజ్యాధినేత పశ్చిమ దేశాలతో వ్యాపారానికి తిరస్కరించాడు. ఈ క్రమంలోనే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సిల్క్‌రోడ్‌ను మూసివేశారు. ఎందుకంటే జర్మనీతో కలిసి మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమెన్ సామ్రాజ్యం పాల్గొన్నది. ఈ నేపథ్యం లోంచే సిల్క్‌రూట్ ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి సిల్క్‌రోడ్ కేవలం వ్యాపార కార్యకలాపాలకు, వాణిజ్య విస్తరణకే కాకుండా దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల్లో కూడా అది కీలక భూమిక పోషించింది. దేశాల మధ్య సంస్కృతి సంబంధాలు, మత, ద్వైపాక్షిక సంబంధాలకు అది భూమికగా పనిచేసింది. భారత దేశంలో కూడా 12 నగరాలను ఈ సిల్క్‌రోడ్డు అనుసంధానింప జేసిందని యునెస్కో కూడా గుర్తించింది. ఈ సిల్క్ రోడ్డు ఏడు రాష్ర్టాలు బీహార్, జమ్ము కశ్మీర్, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లను కలుపుతూ ఉండేది. ఈ క్రమంలోనే వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపు పొందదగిన స్థలాలు, నగరాలున్నాయ ని గుర్తించింది.

వాస్తవానికి అంతర్జాతీయ వ్యాపారం కోసం సిల్క్‌రోడ్ పునరుద్ధరణకు చైనా అధ్యక్షుడు 2013లో పూనుకున్నాడు. దీనిలోభాగంగా కొత్త సిల్క్‌రోడ్ నిర్మాణం కోసం సమాయత్తమైంది. అనేక నిర్మాణాలు, రవా ణా సదుపాయాలు, అధునాతన సమాచార వ్యవస్థలను నిర్మాణం చేస్తున్నది. దీనిద్వారా ఆసియా, యూరప్, ఆఫ్రికాతో చైనా అనుసంధానం గావింపబడుతుంది. పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంబంధాల అనుసంధాన కూడలిగా మారుతుంది.

బ్రిటన్ యురోపియన్ యూనియన్ నుంచి వైదొలి గి కొత్త సిల్క్‌రోడ్డుపై ఆసక్తి చూపించింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ స్కాట్లాండ్, ఐర్లాండ్‌ను కలుపుతూ ఉత్తరభాగంలో నిర్మిస్తున్న సిల్క్‌రోడ్డుకు అనుమతి ఇచ్చింది. ఇది సిల్క్‌రోడ్డులో అత్యంత కీలకమైనదిగా పరిగణింపబడుతున్నది. ఈ పరిస్థితుల్లోనే చైనా అనుసరిస్తున్న విస్తరణవాద విధానాలను భారత్ గమనించింది. చైనా ఏకపక్షంగా సిల్క్ రోడ్డు నిర్మాణానికి అనుసరిస్తున్న విధానాలను భారత్ వ్యతిరేకిస్తూ చైనాకు తన నిరసనను తెలిపింది. ఈ క్రమంలోనే భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న సముద్ర జలాల్లో చైనా తిష్టవేయటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నది. అలాగే భారత్‌కు ఇరుగుపొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో రోడ్డు నిర్మాణాలు, ఓడరేవుల నిర్మాణాలు, రైల్వే లైన్లు, రోడ్డుమార్గాల నిర్మాణాలకు గాను ఆర్థికసాయం పేర తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న విధానాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం నుంచి సిల్క్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం అక్రమమని అంటున్నది. ఈ పరిస్థితిని చూస్తే.. చైనా నిర్మిస్తున్న న్యూ ఎకనామిక్ కారిడార్ (కొత్త సిల్క్ రోడ్డు) ఆయా దేశాల వ్యాపార నిర్వహణకు ఉపయోగపడటమే కాకుండా, కొన్ని దేశాల నుంచి ఆర్థిక సహాయ నిరాకరణకు కూడా ఇది మార్గం వేయనున్నట్లు కనిపిస్తున్నది.ఈ నేపథ్యంలోనే లాటిన్ అమెరికా దేశాలను కూడా అనుసంధానం చేసేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. ఆ దేశాల్లో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, తదితర భారీ ప్రాజెక్టులు కూడా చైనా చేపడుతున్నది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కొన్నిదేశాలు చైనా చేపడుతున్న కొత్త సిల్క్‌రోడ్డు నిర్మాణం పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. అంతర్జాతీయ సూత్రాలను అధిగమిస్తూ, ఆయా దేశాల అంతర్గత భద్రత, వ్యూహాత్మక రక్షణ విషయాలను, స్థానిక భద్రత విషయాలను పట్టించుకోకుండా చైనా ముందుకుపోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం, అమెరికా అరక్షణాత్మక చర్యలను చేపట్టడం లాంటి విషయాలను చెప్పుకోవచ్చు.

ఎవరేం చెప్పినా సిల్క్‌రూట్ ద్వారా చైనా తన వ్యాపార విస్తరణ పాదాలను దక్షిణాసియా దేశాల్లో వేయబోతున్నది. ఫిలిప్పీన్స్, వియ త్నాం, అరుణాచల్‌ప్రదేశ్ లాంటి ప్రాంతాలన్నీ చైనా ఆధిపత్య పర్యవేక్షణలోకి వెళ్లబోతున్నాయి. హిందూమహాసముద్రంలోకి చైనా చొచ్చుకురావటాన్ని స్నేహపూర్వక చర్యగా ఎవరూ అంగీకరించే పరిస్థితి లేదు. అలాగే చైనా ఆర్థికశక్తి, పెత్తనంతో అనేక దేశాలను అప్పుల ఊబిలోకి దింపి తన చెప్పు చేతల్లో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తున్నది. తెలివైన అప్పులిచ్చేవాడు రుణగ్రస్తులకు ఎలాంటి స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారం ఇస్తారో చరిత్రలో అనేక సాక్ష్యాలున్నాయి. ఆర్థిక బలహీనులను వ్యక్తిత్వం లేని వారిగా మార్చి ఎంతటి ఆధిపత్య విధానాలకు పాల్పడుతారో అనుభవమే. ఆర్థికంగా ఆధారపడే తత్వం ఎవరినీ వెన్నెముక కలిగిన వారిగా మసలుకోనీయదు. ఆర్థిక ఆధిపత్యదారికి అడుగులకు మడుగులొత్తే స్థితే రుణగ్రస్తులకు దక్కుతుంది. మొత్తంగా చూస్తే, చైనా కొత్త సిల్క్‌రోడ్డుతో దేశాల మధ్య సమాన, సౌహార్థ సంబంధాలకు తావులేకుండా పోతున్నది. దేశాల అంతర్గత విషయాలు, రాజకీయాలు కూడా ఆధిపత్య శక్తికి అనుకూలంగా రూపొందే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలోనే సిల్క్‌రూట్ పేర చైనా అనుసరిస్తున్న ఆధిపత్య విధానాలను భారత్ నిరసిస్తున్నది. గ్లోబల్ మార్కెట్ పేరుతో చైనా నిర్మిస్తున్న కారిడార్‌ను వ్యతిరేకిస్తున్నది.
(వ్యాసకర్త: ఐసీఎస్‌ఎస్‌ఆర్ మాజీ డైరెక్టర్, న్యూ ఢిల్లీ)
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

అంతర్జాతీయం: డాక్టర్ ఎస్.సరస్వతి

636
Tags

More News

VIRAL NEWS