తెలుగుకు పుట్టినిండ్లు ఎన్ని?

Tue,July 18, 2017 01:01 AM

అంతర్జాతీయ భాషల్లో కాని, పోటీల్లో కానీ మనం పాల్గొనవల్సిందే. కానీ, ఆది సాకుగా చూపి ప్రధాన భాషగా, మాధ్యమ భాషగా తెలుగును వదిలిపెట్టి ముందుకుపోవడం ప్రమాదకరం. తెలుగులో తగ్గిపోయిన పూర్వ పద సంపదను, భాషా వైదుష్యాన్ని తిరిగి పొందగడానికి తగిన కృషిచేయడానికి అకాడమీలు, సాంస్కృతిక సంస్థలు మేధావులు బాధ్యత వహించాలి. అప్పుడే తెలుగుకు ఏదైనా మేలు జరుగును.

మన చరిత్రకారులు, పండితులు, విశ్లేషకులు, ముఖ్యంగా సంస్కృత భాషావాదులు తెలుగు పుట్టుక రీతిని మార్చి, దానికి వ్యతిరేకంగా ఆంగ్లం, అంధకం, సంస్కృత భాషాజన్యమని, ఆర్వాచీన భాష అని రకరకాల కథనాలు చెప్పి దానికి అపఖ్యాతిని కలిగించారు. కానీ ఇవన్ని అసంబద్ధమని పరిశీలిస్తే తెలుస్తుంది. కారణం పురాణకాలం ముందునుంచి తెలుగు ఉనికిలో కలదని సాక్ష్యం కనబడుతున్నది. ముఖ్యంగా ఒకజాతి పేరుకు దాని భాషకు విరుద్ధంగా రెండో పేరు కలుగునని లోకరీతిలో కనిపింపదు. పూరాణాలు తమకన్నా ముందు జీవించిన మౌర్య, శాతవాహన, చరిత్రలు వాటి పరిపాలనాకాలాలు తెలిపాయి.

అంతేగానీ ఆ వంశాల కుల గోత్రాలు, స్థానిక స్థితి తెలుపలేదు. కానీ అవి స్థానిక ఆధారాలను బట్టి వాటి స్థానికత తక్కిన విషయాలు తెలుస్తున్నవి. ఇటువంటి సందర్భంలో ఆయా వంశాలకు మూడు, నాలుగు శతాబ్దాల తర్వాత వచ్చిన పురాణాలు తమ కథనాల్లో శాతవాహనులు ఆంధ్ర రాజులని చెప్పడం కుదరని విషయం. పురాణాల్లో, అయితరేయ బ్రాహ్మణముల్లో, విశ్వామిత్రుని శాప అంశంలో, మెగస్థనీసు సైతం అట్లనే చెప్పారని ఒకరి తర్వాత ఒకరు రాసినట్లు చెప్పవచ్చు. ఇప్పుడు కొత్తగా అఫ్ఘానిస్తాన్‌లోని అంధకం అను జాతి తెలుగుకు పూర్వవంశం అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇవన్ని ఎక్కువ భాగం మహిమలతో కూడిన విషయాలు. వీటికి ఎట్టి చారిత్రక, భౌగోళిక ఆధారాలు తెలుగు దేశంలో కనిపించవు.

తెలుగు 24 ద్రావిడ భాషల్లో ముఖ్యమైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పైగా సింధు నాగరికత నుంచి ఒత్తిడి వల్ల దక్షిణాదివైపు తరలివచ్చాయి. అందులో ప్రధానమైన తెలుగు, తనకు ప్రత్యేక చిహ్నమైన భాషను ఏర్పరుచుకున్నది. తెలుగు క్రీ.పూ 800 శతాబ్దాల పూర్వమే కలదని చరిత్రకారులు చెపుతున్నపుడు ఆ తర్వాత పురాణకాలంలో తెలుగు కు వ్యతిరేకమైన రెండో పేరు ఆంగ్లం కానీ, అంధకం కానీ కలువదు. తెలుగులో మరొక అంశం ఉన్నది.తెలుగు జాతిలోని కొందరు పూర్వం తైలాంగులను పేరుతో బర్మా, పెగు, ప్రోము అను ప్రదేశాలకు వలసవెళ్లి అక్కడ రాజ్యాలను స్థాపించుకున్నట్లు కొన్ని శాసనాల్లో తెలుస్తున్నది. ప్రస్తుతం భారతదేశం అంతటా తైలాంగు కుటుంబాలు చెల్లాచెదురై విడివిడిగా కనిపిస్తున్నవి. తెలుగుకు త్రిలింగ దేశమని ఇంతకుముందే పేరు కనిపిస్తున్నది. పదహారు జనపదాల్లో అస్మక వంటి తెలుగు ప్రాంతాలు ఉన్నాయి.

ప్రాకృత భాషా సాహిత్యంలో తెలుగు శబ్దాలు, దాని జాతి ఆచారాలకు సంబంధించిన కథనాలు మనకు కనిపిస్తున్నవి. తెలుగు ప్రాచీన ఉనికిని గుర్తించేందుకు మనకు శాతవాహన కాలమే ముఖ్యం. ఇటువంటి శాతవాహనులకు కూడా ఆంధ్ర జాతి వారని దుర్మార్గంగా పేరు పెట్టారు. ఒకవైపు శాతవాహనులు కానీ, ప్రాకృత కవులు కానీ, సంస్కృత భాషావేత్త లు కానీ దేశ భాషలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయని వాటిని పొగిడారు. కానీ కొందరు చరిత్రకారులు దాని ఊసే ఎత్తలేదు.తెలుగు దేశంలోకి జైన, బౌద్ధ మతాలు వ్యాపించాయి. వాటి శిల్పాలు కొంత కలిగి ఉన్నాయి . కాని వాటికి ఈ ప్రాంతంలో గుర్తింపే కానీ ప్రజ లు సమూలంగా దాన్ని అనుసరించలేదు. బౌద్ధ సాహిత్యంలో తెలంగాణ గురించి ఏదేదో కలదని చెప్పడానికి బదులు వాటిని ప్రత్యక్షంగా చూపడం మంచిది. మనం గ్రహింపగలిగినంత వరకు జైన, బౌద్ధ మతాలు తమ మత ప్రచారాలకు తెలుగునే వాడుకున్నట్లు కనిపిస్తున్నది. బుద్ధుడు ఎం దుకు తన రాజత్వంను వదిలి తపస్సుకు బయల్దేరాడో అందరికీ తెలుసు.

ఈ మతాల పరిస్థితి ఎట్లున్నప్పటికీ తెలుగు వారు తమ ఆది దేవుణ్ణి, ఆది మతాన్ని కొలువక మానలేదు. ఆయా మతాల ప్రభావం తర్వాత దేశ దురాక్రమణ కాలాల్లో పెచ్చుమీరి మహమ్మదీయ, ఆంగ్లేయ మతాల వలసలు వచ్చిపడ్డాయి కానీ అవేవీ తెలుగు భాషను గాని, తెలుగు సంస్కృతిని కానీ ప్రభావం చేయలేదు. ఏదైన సంక్షోభంలో కొందరు అటు ఇటు పరిగెత్తడం సాధారణమే. సామాన్యంగా రాజాదరణ కలిగిన చోట మతాచార్యులు గాని, పండితులు గాని, మూగుకొని తమ ప్రభావంతో ఎదుటివానికి దుస్థితి కలిగించటం చరిత్రలో మనకు కనిపిస్తున్నది.
సంస్కృత భాషను కానీ పురాణాలను కానీ, తదితర వాటిని తెలుగు వారు అధికంగా గౌరవించారు. వారికి వాటిపై భేద భావాలు లేవు. కానీ సంస్కృతమంటే భాషలు చేపట్టిన వారికే అట్టి ప్రకృతి వంట పట్టలేదు. పైగా తెలుగును చెడగొట్టే ప్రయత్నం చేశారు. దీనికి ఉదాహరణలు కోకొల్లలు. తెలుగును కాపాడటంలో, భాషా వికాసం కావించుటలో తెలుగువారు కాకపోయినా చాళుక్య, చోళ రాజులే కారణమని మనకు కనిపిస్తున్నది. ఇటు వంటి సందర్భంలో మనకు నన్నచోడ కవి కనిపిస్తాడు. అతడు రాజు కనుక రాజసం ఉన్నది. పైగా శివ కవి. జాను తెలుగు కవి త్వం అని చెప్పినప్పటికీ ముదురుముదురుగానే కుమార సంభవ రచన కావించెను. ఈ సంధర్భంలోనే తెలుగుకు అపకారం కావించిన మార్గ కవులను అతడు దుర్మార్గ పదవర్తను అని తెగనాడెను. నాటి తెలుగు అభివృద్ధికి చోళ, చాళుక్యుల రాజుల కృషి వల్లనే తెలుగు నిలబడిందనటంలో సందేహం లేదు.

తెలుగు పుట్టుక తెలంగాణంలోనే అనుట సంకుచితంగా ఉంది. ఉత్తర సరిహద్దు నుంచి దక్షిణ సముద్రం వరకు వ్యాపించిన తెలుగును తెలుసుకొనేందుకు ప్రాచీన భాషలు, శాసనాలు, తెలుగు లిపి మనకు వాస్తవం కనిపింపచేయును. ఇందులో కొంత భాగం ఆంధ్ర దేశమని తమ భాగానికి పేరు కొందరు పెట్టుకోవడం వారి అభిమతం. కానీ జాతి వేరుగా చెప్పుకొని భాష మాత్రం మాది తెలుగే అనడం ఆశ్చర్యకరం.తెలుగును నిలబెట్టేట్లు చేయడంలో శివ కవుల కృషి ప్రశంసనీయం. జనం మెచ్చిన సరళభాషలో తెలుగు చందంలో అనేక కావ్యాలు వారు రచించి కీర్తి వంతులు అయ్యా రు. శివ కవులని వారికి పేరు పెట్టినప్పటికీ వారందరూ విష్ణు భక్తులే. అద్వై త భావన కలిగిన వారే. భూత, భవిష్యకాలంలో పుట్ట జాలడని పేరు గాం చిన భాగవత రచనా కారుడైన పోతనను ఎవరు మరిచిపోగలరు. మధుర భక్తి కవిత్వంలో అతడికి అతడే సాటి. తెలుగులో రామాయణ భారత కవులు అటువంటివారే.

అసలు నన్నయ్య, నారాయణభట్టు వంటివారు తెలుగువారు కాదని గట్టి చరిత్ర ఉన్నది. కానీ వారు తెలుగుకు వేసిన బీజం ఎటువంటిదో అం దరికి తెలుసు. పోతన ఖ్యాతి గురించి మార్గ కవులకు కన్ను కుట్ట్టినది. అందుకే ఆయనపై దుర్మార్గంగా స్థానిక వాదాన్ని లేవనెత్తారు. తెలుగులో చాప కూటి సిద్ధాంతాన్ని, శివుని ముందు అందరు సమానులే అని చెప్పగలిగిన మతాచార్వులు మన భాషకు చెందినవారే. ఈ సందర్భంలో గుర్తించాల్సింది ఏమంటే అసాధ్యమనుకున్న తెలంగాణ నిర్మాణం తెలుగు పేరుతోనే జరుగడం దానికి గల శక్తిని రుజువు చేస్తున్నది. తెలుగు పేరు గాక ఈ దేశానికి ఆంధ్రమని, అంధక దేశమని తెలంగాణ ఏర్పాటు గావింపగలమని ఎవరైనా భావిస్తారా?. అటువంటి దానికి ప్రజలు ఏ మాత్రం అంగీకరించరు.

తెలుగు పేరుకు గల మహిమ ప్రజల్లో అంతగా నాటుకుపోయింది. ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకునే సందర్భంలో తెలుగుపై, దాని పేరుపై ఇటువంటి అసంగత వ్యాఖ్యలు చేయడం దుస్సాహసమే. ఈ అం శాలు పదేపదే వారి దృష్టికి తేవడం జరిగింది. అచరిత్రాకమైన అంశాల జోలికి పోవద్దని చెప్పడం జరిగింది. కానీ కొందరు చరిత్రకారుల్లో ఎటువంటి పరివర్తన కనిపించడం లేదు.
ప్రస్తుతం తెలుగు జాతి భాషల పేరుతో ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం మనది. కాబట్టి, రాష్ట్ర నాయకులకు తెలుగును అభివృద్ధి చేయడం కర్తవ్యంగా మారింది. అంతేగాక ఉద్యమ సమయంలో తెలుగుకు జరిగిన అన్యాయాలను, అవమానాలను సరిదిద్దుకొనేందుకు పూనుకున్న వా రు కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ, ఏర్పడిన తెలుగు అకాడమీ కానీ, పండితులు కానీ, మేధావులు కానీ, నాయకులు కానీ తెలుగును యథాతథస్థితికి తెచ్చి దాని పూర్వవైభవాన్ని కాపాడాలి. అంతర్జాతీయ భాషల్లో కాని, పోటీల్లో కానీ మనం పాల్గొనవల్సిందే. కానీ, ఆది సాకుగా చూపి ప్రధాన భాషగా, మాధ్యమ భాషగా తెలుగును వదిలిపెట్టి ముందుకుపోవడం ప్రమాదకరం. తెలుగులో తగ్గిపోయిన పూర్వ పద సంపదను, భాషా వైదుష్యాన్ని తిరిగి పొందగడానికి తగిన కృషిచేయడానికి అకాడమీలు, సాంస్కృతిక సంస్థలు మేధావులు బాధ్యత వహించాలి. అప్పుడే తెలుగుకు ఏదైనా మేలు జరుగును.
(05-06-2017 నమస్తే తెలంగాణ పత్రికలోని వ్యాసానికి ప్రతిస్పందనగా)
ప్రతిస్పందన
తేరాల సత్యనారాయణ శర్మ

553
Tags

More News

VIRAL NEWS