ఉన్నత పీఠంపై సమున్నతులు

Sun,July 16, 2017 01:19 AM

రాష్ట్రపతి ఎన్నిక సమీపించడంతో ఆ పద వికి ఉన్న ఔన్నత్యం, స్వాతంత్య్రం వచ్చి న నాటినుంచి ఆ పదవిని అధిష్ఠించిన వారి ఉన్నత వ్యక్తిత్వం మరోసారి చర్చ కువస్తున్నాయి. మిగతా మూడవ ప్రపంచదేశాలకు భిన్నంగా మన దేశంలో ప్రజాస్వామ్య లౌకిక విలువలు బలంగా పాతుకుపోయాయి. అమెరికా, యూరప్ దేశా ల్లో మాదిరిగా రాజ్యాంగ వ్యవస్థలు బలంగా పాతుకు పోయాయి. అందువల్ల రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఈ పదవి ప్రాముఖ్యం గురించి చర్చించుకోవడం ప్రజల కు, ప్రత్యేకించి మేధావులకు గర్వంగా ఉంటుంది.

భారత రాజ్యాంగసభ రూపకల్పన సమయంలో పార్లమెంటరీ వ్యవస్థ, రాష్ట్రపతి పాత్ర గురించి విపులం గా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా పార్లమెంటరీ ప్రభుత్వం వైపు మొగ్గుచూపారు. రాజ్యాంగ సభలో జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ అంబేద్కర్, రాజేంద్రప్రసాద్ వంటి మహానీయులు భారత రాజకీయ వ్యవస్థకు పార్లమెంటరీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండటం, బ్రిటన్‌లో పార్లమెంటరీ వ్యవస్థ చక్కగా పనిచేయడం ఇందుకు కారణం. మొదటి స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత బ్రిటిష్ పార్లమెంటు భారత పాలన నిర్వహణకు అనేక పార్లమెంటరీ ప్రక్రియలను ప్రవేశపెట్టింది. దీనివల్ల మనం పార్లమెంటరీ వ్యవస్థకు ఇప్పటికే అలవాటు పడి ఉన్నం. ప్రఖ్యాత రాజ్యాంగ కోవిదుడు డి.డి.బసు పార్లమెంటరీ ప్రభుత్వం బాధ్యతాయుతమైన పాలనను, అధ్యక్ష తరహా ప్రభుత్వం స్థిరమైన పాలనను అందిస్తుందని, భాతర రాజ్యాంగ నిర్మాతలు బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి మొగ్గు చూపారని విశ్లేషించాడు. అధ్యక్ష తరహా ప్రభుత్వం ఎన్నుకోబడిన నిరంకుశ ప్రభుత్వానికి దారితీస్తుందని భావించి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతికి నామమాత్ర అధికారాలు మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. అమెరికా, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షుని మాదిరిగా మన రాష్ట్రపతి వాస్తవ అధికారాలను కలిగి ఉండనప్పటికీ, బ్రిటన్ రాజు వలె పూర్తి నామమాత్ర అధికారాలను కూడా కలిగిఉండడు. భారత రాష్ట్రపతి ప్రాధాన్యం రాష్ట్రపతి పదవిని అధి ష్ఠించిన వారి రాజకీయ నేపథ్యం, వ్యక్తిత్వంపైన ఆధారపడి ఉంటుంది.

రెండు పర్యాయాలు పదవీ బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రప్రసాద్ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నవారు, రాజ్యాంగసభ అధ్యక్షుడు. ఈ నేపథ్యమే రాజేంద్రప్రసాద్‌ను హుందాతనంతో, స్వతంత్రం గా వ్యవహరించే విధంగా చేసింది. అదేవిధంగా మొదటి ఉపాధ్యక్షుడు, ద్వితీయ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసిద్ధ విద్యావేత్త, తత్త్వవేత్త. వీరు కూడా హూందాగా స్వతంత్రంగా వ్యవహరించగలిగారు.

కేంద్రంలో ఆధికారంలో ఉన్న రాజకీయపక్షం మద్దతు, ప్రధాని మద్దతు లేకుండా రాష్ట్రపతిగా ఎన్నిక కావడం కష్టం. ఈ నేపథ్యంలో కొందరు రాష్ట్ర పతులు రబ్బరుస్టాంపులుగా పేరొందారు. ఇందిరాగాంధీ వంటి బలమైన నాయకురాలు ప్రధానిగా ఉన్న నేపథ్యంలో ఆమె అభీష్టం మేరకు రాష్ట్రపతి పదవిని పొందిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, వి.వి.గిరి మరీ నామమాత్రపు పాత్ర పోషించారు. వీరి పాత్రను నాటి రాజకీయ నేపథ్యంలో అర్థం చేసుకో వాలె. కొందరు రాష్ట్రపతులు సాధారణ పరిస్థితుల్లో నామమాత్రమైన పాత్ర ను పోషిస్తూ, సంక్షోభ సమయాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. ఈ విధంగా తమ నిర్ణయాల ద్వారా రాష్ట్రపతి పదవికి వన్నెతెచ్చారు. ఈ కోవకు చెందిన వారు ఆర్.వెంకట్రామన్. కేంద్రంలో సంకీర్ణ రాజకీయాలు ఉన్నపుడు వెంకట్రామన్ రాష్ట్రపతిగా వ్వవహరించారు. ఆర్.వెంకట్రామన్ గారు తనకు తాను ఎమర్జెన్సీ ల్యాంప్‌తో పోల్చుకున్నారు. అందుకే ఈయనను ఎమర్జెన్సీ ల్యాంప్ ప్రెసిడెంట్ అన్నారు.
భారత రాజ్యాంగం ప్రగతిశీల, ఆచరణాత్మక రాజ్యాంగం అనేది గుర్తుం చుకోవలసిన విషయం. న్యాయకోవిదులు ఈ దృష్టితోనే రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ విషయాన్ని గుర్తించడం వల్లనే ఆయా కాలాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రపతుల వ్యవహారసరళి ఉన్నది. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగ పరిమితులకు లోబడి రాజ్యాంగబద్ధమైన రాష్ట్రపతిగా శంకర్ దయాల్ శర్మ పేరు తెచ్చుకున్నారు.

రాష్ట్రపతి అలంకారప్రాయమైన విధులకు మాత్రమే పరిమితం కాకుండా సమకాలీన దేశీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా నిర్దిష్టమైన భావాలను కలిగి ఉంటూ, వాటిని వ్యక్తం చేయవచ్చన్న ఒరవడిని కేఆర్ నారాయణ్ ప్రవేశపెట్టారు. కేఆర్ నారాయణ్‌కు సామాజిక న్యాయం, విదేశి విధానాల పై నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి.అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింట న్ భారత పర్యటనకు వచ్చినప్పుడు అధికారిక విరామ సమావేశంలోనే నారాయణన్ అమెరికా విదేశ విధానం పైన విశిష్ఠమైన విమర్శ చేశారు. ఈ విధంగా క్రియాశీలక రాష్ట్రపతిగా నారాయణన్ పేరు తెచ్చుకున్నారు.
రాష్ట్రపతుల విషయం చర్చకు వచ్చినప్పుడు ప్రత్యేకిం చి చెప్పుకోవలసిన వారు అబ్దుల్ కలాం. భారతీయతకు నిలువెత్తు ప్రతీక అయిన అబ్దుల్ కలాం డాంబికాలు, ఆర్భాటాలకు పోలేదు. అందరితో మమేకమవుతూ, యువతను, విద్యార్థిలోకాన్ని ఉత్తేజపరిచారు. తన ఆదర్శవంతమైన జీవితంతో ప్రజల రాష్ట్రపతిగా పేరు తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిభా పాటిల్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈమె రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన మొదటి మహిళ. ప్రతిభా పాటిల్ అత్యధికంగా మరణశిక్షలకు క్షమాభిక్షను ప్రసాదించి రాష్ట్రపతికి ఉన్న న్యాయపరమైన విచక్షణాధికారాలను ప్రజలకు అవిష్కరించారు. పదవీవిరమణ చేయబోతున్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిణతి చెందిన రాజకీయవేత్త. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలను రచించడంలో, పార్టీ అంతర్గత తగాదాలను పరిష్కరించడంలో దిట్ట. కేంద్రమంత్రి వర్గంలో అనేక పదవులను చేపట్టి, అన్ని పదవులకు సార్థకత కల్పించిన రాజనీతిజ్ఞుడు. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినపుడు తనకున్న అభ్యంతరాలను నిర్మొహమాటంగా చెప్పిన ప్రజాస్వామ్యవాది. పార్లమెంటు సభ్యు లు విలువైన సభాకాలాన్ని వృథా చేస్తుండటంపై మనోవేదనను స్పష్టంగా వ్యక్తంచేశారు. అధికారంలో కాంగ్రె స్ ఉన్నా, కాంగ్రేతరపక్షాలు ఉన్నా, తన విధులను రాజ్యాంగస్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా నిర్వహించి రాష్ట్రపతి పదవి విశిష్ఠతను చాటిచెప్పిన గొప్ప నాయకుడు. రాజకీయ వ్యవస్థలో కొన్ని పదవులను రాజకీయాలకు అతీతంగా నిర్వహించవచ్చని ఆచరణలో నిరూపించ గలిగిన దార్శనికుడు ప్రణబ్ ముఖర్జీ.

బహుళపక్ష రాజకీయ వ్యవస్థ గల భారత్ వంటి విశాల దేశంలో రాష్ట్రపతి ఎన్నిక కోసం ఏకాభిప్రాయం సాధించడం కష్టతరం. అయినప్పటికీ ఈ దిశ గా ప్రయత్నించడంలో తప్పులేదు. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో నీలం సంజీవరెడ్డి మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సైద్ధాంతిక వైరు ధ్యం గల రాజకీయపక్షాలు పోటీకి తప్పకుండా మొగ్గుచూపుతాయి. ఎన్నికల రాజకీయ అవసరాల దృష్ట్యా ఇది అనివార్యమవుతుంది. ఈసారి రాష్ట్ర పతి పదవికి పోటీ తప్పలేదు. దేశవ్యాప్తంగా బలాబలాలు పరిశీలించినట్టయి తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ కనబడు తున్నది.

ramarao
రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించడానికి ముందు బీజేపీ నాయకత్వం వ్యూ హాత్మకంగా వ్యవహరించింది. ముందస్తుగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతును ఖరారు చేసుకున్నది. ఆ తర్వాత దశలో టీఆర్‌ఎస్, జేడీయూ, వైఎస్సార్ కాంగ్రెస్, అన్నాడీఎంకే చీలికవర్గాల వంటి తటస్థ పక్షాల మద్దతు ను సమీకరించింది. ఈ పునాది నిర్మాణం సాగిన తర్వాత రావ్‌ునాథ్ కోవిం ద్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రావ్‌ునాథ్ కోవింద్‌ను నిలబె ట్టడం ద్వారా బీజేపీ కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాతినిథ్యం వహించే రాజకీయ పార్టీ అనే అభిప్రాయాన్ని తొలిగించుకునే ప్రయత్నం చేసింది.

రావ్‌ునాథ్ కోవింద్ ప్రజా జీవితంలో క్రియాశీలంగా పాల్గొన్న రాజకీయ వేత్త. సామాన్యమైన జీవనశైలి, మచ్చలేని రాజకీయ జీవితం ఆయనది. అనూహ్యరీతిలో బీజేపీ రావ్‌ునాథ్ కోవింద్‌ను ముందు నిలుపడం వల్ల ప్రతిపక్షాలు ఒత్తిడికి గురయ్యాయి. అయినప్పటికీ దీటైన అభ్యర్థిగా మీరా కుమార్‌ను నిలుపగలిగాయి. గత రాష్ట్రపతుల మాదిరిగానే కాబోయే రాష్ట్రప తి కూడా ప్రజా ప్రయోజనాలను, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ విశిష్ఠతను మరింత బలోపేతం చేస్తారని అశిద్దాం.

కోవింద్ ప్రజా జీవితంలో క్రియాశీలంగా పాల్గొన్న రాజకీయవేత్త. సామాన్యమైన జీవనశైలి, మచ్చలేని రాజకీయ జీవితం ఆయనది. అనూహ్యరీతిలో బీజేపీ రావ్‌ునాథ్ కోవింద్‌ను ముందు నిలుపడం వల్ల ప్రతిపక్షాలు ఒత్తిడికి గురయ్యాయి. అయినప్పటికీ దీటైన అభ్యర్థిగా మీరా కుమార్‌ను నిలుపగలిగాయి. గత రాష్ట్రపతుల మాదిరిగానే కాబోయే రాష్ట్రపతికూడా ప్రజా ప్రయోజనాలను, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ విశిష్ఠతను మరింత బలోపేతం చేస్తారని అశిద్దాం.

625
Tags

More News

VIRAL NEWS