పులిచింతలో కొంత మేలు

Sun,July 16, 2017 01:10 AM

పులిచింతల ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశమైంది. పులిచింతల పవర్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధమైంది. తాము అధికారంలో ఉండగానే పులిచింతల ప్రారంభించాం కాబట్టి, అది మా ఘన తే అని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. తెలంగాణ భూముల్ని ముంచి, ఆంధ్ర ప్రయోజనం కోసం కట్టిన పులిచింతల ప్రాజెక్టును మీ ఘనతగా చెప్పుకోవడం ఆత్మవంచన అని టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చా రు. నిజానికి పులిచింతల ప్రాజెక్టు ఎవరి ఘనత? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? నాడు వ్యతిరేకించిన తెలంగాణ నేడు ఆ ప్రాజెక్టు ద్వారా ఎట్లా లబ్ధి పొందబోతున్నది అనే ప్రశ్నలు అందరిలో ఉదయిస్తున్నాయి. నిజానికి ఇది తెలంగాణ భూములను, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నల్గొండ జిల్లా భూములను, గ్రామాలను ముంచి, వేలాది మందిని నిర్వాసితులను చేసి కట్టిన ప్రాజెక్టు. ఎకరం కూడా తెలంగాణలో ఆయకట్టులేని ప్రాజెక్టు. తెలంగాణను ముంచి ఆంధ్రకు ప్రయోజనం చేసే ప్రాజెక్టు. కానీ అంతా కీడే కనిపించే ఈ ప్రాజెక్టులో కూడా కొంత మేలు సాధించగలిగింది తెలంగాణ ప్రభుత్వం. నీళ్లన్నీ ఆంధ్రకు తరలిపోతున్నప్పటికీ, ఆ నీటి ప్రవాహంతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంటును నిర్మించి, 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నాలుగు యూనిట్లు నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.

నాగార్జునసాగర్ దాటిన తర్వాత ప్రకాశం బ్యారేజీకి ముందు పులిచింతల ప్రాజెక్టుకు అప్పటి సీమాంధ్ర పాలకులు డిజైన్ చేశారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని వదిలినప్పుడే కాకుండా, హైదరాబాద్ నుంచి వచ్చే మూసీ నది, ఇతర కాలువల నీళ్లు కూడా పులిచింతలకు చేరుతయి. అక్కడ 45 టీఎంసీల నీటిని నిల్వచేసి గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అప్పటి నల్గొండ, ఇప్పటి సూర్యాపేట జిల్లా పరిధిలోని 32 గ్రామాలు, 14వేల ఎకరాలు మునిగాయి. 12 వేల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. కానీ తెలంగాణలో ఒక్క ఎకరం కూడా నీటి పారకం లేదు. దాదాపు 20 మీటర్ల ఎత్తు నుంచి 57,700 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీరు కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడ జల విద్యుత్ కూడా అవకాశం ఉందని తేల్చారు. డ్యాంతో పాటు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించాలని 2006 లోనే నిర్ణయించారు. కానీ డ్యాం పనులు శరవేగంగా పూర్తయినా జల విద్యుత్ కేంద్రం పనులు మాత్రం నత్తనడకన నడిచాయి.

2006 లోనే పులిచింతల హైడల్ పవర్ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి వచ్చింది. కానీ తెలంగాణ వచ్చే నాటికి, అంటే 8 ఏండ్లు పని పూర్తి చేయలేదు. ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి జరుగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే పులిచింతలలో కదలిక వచ్చింది. పనులు చేయకుండా వెళ్లిపోయిన కాంట్రాక్టరును మళ్లీ పిలిపించి, అంచనాలు మళ్లీ తయారుచేయించి, 2015లో పనులు ప్రారంభించి, పూర్తి చేశారు. ఏడాదికింద మొదటి యూనిట్ ప్రారంభమైంది. ఇప్పుడు అన్ని యూనిట్లు తుదిదశకు చేరుకున్నయి.

తెలంగాణ వచ్చే నాటికి జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఇన్ టేక్ గేట్స్, పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తికాలేదు. ఒకసారి డ్యాం మొత్తం నిర్మాణం పూర్తయితే, అది నింపిన తర్వాత ఇన్ టేక్ గేట్స్ నిర్మించడం సాధ్యం కాదు. ఇది గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం వచ్చీ రాగానే పులిచింతలపై దృష్టి కేంద్రీకరించి, శరవేగంగా ఇన్ టేక్ గేట్స్ నిర్మించింది. పవర్ ప్లాంట్ నిర్మాణం, యూనిట్ల స్థాపన జరుగుతున్నది. పులిచింతల ప్రాజెక్టులోని 24 గేట్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఉన్నప్పటికీ, ప్రాజెక్టుకు ఎడమవైపున్న కొండ ప్రాంతపు భూ భాగం మాత్రం ప్రస్తుత సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం వజినేపల్లి గ్రామ పరిధికి చెందుతుంది. ఈ మాత్రం ఉన్న కొంత అనుకూలతను తెలంగాణ నూటికి నూరుపాళ్లు వినియోగించుకొని 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించింది. ఈ సీజన్ నుంచే పూర్తిస్థాయి ఉత్పత్తి కూడా జరుగనుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్మాణం పూర్తి కావాల్సినప్పటికీ, జాప్యం జరుగడం వల్ల అంచనా వ్యయం 380 కోట్ల రూపాయల నుంచి 580 కోట్ల రూపాయల వరకు చేరింది. అయినా సరే, వ్యయానికి వెనుకాడకుండా జల విద్యుత్ ప్లాంటును నిర్మించింది. జల విద్యుత్ ప్లాంటే కాకుండా, అక్కడున్న కొండల ప్రాంతాన్ని చదును చేసి సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసలు అక్కడ సోలార్ ప్లాంట్ పెట్టవచ్చనే ఆలోచన కూడా చేయలేదు. పూర్తిగా ఆంధ్ర ప్రయోజనాల కోసమే నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు ద్వారా కూడా కొద్దో గొప్పో ప్రయోజనం పొందే వ్యూహం రూపొందించి, అమలుచేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
vijay
2006లో డిజైన్ చేసిన పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టును కనీసం 2014 నాటికన్నా పూర్తి చేయగలిగి ఉంటే, ఈ మూడేళ్లలోనే కనీసం 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. మూడేండ్లకు కలిపి 600 మిలియన్ యూనిట్లు. దీని విలువ 180 కోట్ల రూపాయలు. ఇదొక్కటే కాదు, లోయర్ జూరాల విషయంలో కూడా ఇలాంటిదే జరిగిం ది. లోయర్ జూరాల కూడా పదేండ్ల కిందటే పూర్తికావాలె. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తికాలేదు. నాసిరకం పనుల వల్ల ప్లాంటు కొట్టుకుపోయింది. తెలంగాణ ప్రభు త్వం పునర్నిర్మాణం చేపట్టింది. 2014కు ముందే ప్రాజెక్టు నిర్మించి ఉంటే, అక్కడ 240 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చేది. తెలంగాణ రాకముందే కట్టి ఉంటే, ఇప్పటికే 1000 మిలియన్ యూనిట్ల కరెంటు ఉతత్తి అయ్యి ఉండేది. దీని విలువ దాదాపు 300 కోట్లు. పోలవరం పరిధిలోని సీలేరు ప్లాంటు ఆంధ్రకు పోవడం వల్ల కూడా తెలంగాణకు భారీ నష్టం జరిగింది. ఇక్కడ 460 మెగావాట్ల ప్లాంటు ఉంది. ఏటా దీనివల్ల మనకు 300 కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నది. ఇలా సీమాంధ్ర పాలకులు చేసిన తప్పిదాలు, చూపిన వివక్ష వల్ల జల విద్యుత్ రంగంలో మనకు తెలంగాణ వచ్చే నాటి కి తీవ్ర విద్యుత్ సంక్షోభం తప్పలేదు. ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తున్నది. చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి.

2006లో డిజైన్ చేసిన పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టును కనీసం 2014 నాటికన్నాపూర్తి చేయగలిగి ఉంటే, ఈ మూడేళ్లలోనే కనీసం 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. మూడేండ్లకు కలిపి 600 మిలియన్ యూనిట్లు. దీనివిలువ 180 కోట్ల రూపాయలు. ఇదొక్కటే కాదు, లోయర్ జూరాల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. లోయర్ జూరాల కూడా పదేండ్ల కిందటే పూర్తికావాలె. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తికాలేదు.

604
Tags

More News

VIRAL NEWS