తెలంగాణ భారతికి హారతి

Sat,July 15, 2017 01:49 AM

తెలంగాణ భారతికి దివ్యహారతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సంకల్పాన్నిప్రకటించారు. మహత్తర సంకల్పం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ తెలంగాణ ప్రపంచ ప్రథమ తెలుగు మహాసభలకు సారథ్యం వహించడం ముదావహం. తెలంగాణలోనే కాదు ప్రపంచమంతటా, వివిధదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు హర్షం కలిగిస్తున్న మహత్తర, చరిత్రాత్మక పరిణామం ఈ సంకల్పం.
డెబ్భై ఏండ్లు నిండుతున్న స్వతంత్ర భారతంలో మూడే ళ్ల కిందటనే అరువై ఏండ్ల శాంతియుత, ప్రజాస్వామ్య పోరాటాలు, మహోజ్వల ఉద్యమాల ఫలితంగా అవతరించిన కొత్త రాష్ట్రం తెలంగాణ. బాలారిష్టాలను, అంతర్గత ప్రగతి నిరోధకుల, బాహ్య శత్రువుల అసూయా ద్వేషాలను, అవరోధాలను ఆత్మైస్థెర్యంతో జయప్రదంగా ఎదుర్కొంటూ ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయిక, వైజ్ఞానిక, సంక్షేమ రంగాల అభి వృద్ధిలో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న, తన అస్తిత్వ సౌధాన్ని పటిష్ఠంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్రం వెయ్యేండ్లకు మించిన తన సారస్వత, సాం స్కృతిక వైభవాన్ని, ఉజ్వల చరిత్రను తొలి ప్రపంచ తెలంగాణ తెలుగు మహాసభ వేదికపై సకల ప్రపంచానికి ఉద్ఘాటించబోతున్నది. తెలంగాణ అస్తిత్వ నిరూపణ మహోద్యమంలో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ పతాకస్థాయి, పరాకాష్ట. అనాది నుంచి, విశేషించి వెయ్యేండ్ల కిందట లిఖిత చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి భాష, సారస్వతం, సంస్కృతి, సభ్యత విషయాల్లో తెలంగాణ వ్యక్తిత్వం ప్రత్యేకమై నది, విశిష్టమైనది. తెలంగాణం మరో ప్రాంతానికి, పొరుగు ప్రాంతాని కి ఎన్నడూ ఉపగ్రహం కాదు. తెలంగాణం తేనె తీయని తెలుగు మాగా ణం. అచ్చమైన తెలుగు భాషా సంపదల కోశాగారం తెలంగాణం. జాను తెలుగు ఝరులు ప్రవహించిన నేల మనది. అచ్చ తెలుగు కవితల, కావ్యాల పచ్చలహారం, పరిమళభరిత హరితహారం తెలంగాణం.

ఎనిమిది వందల ఏండ్ల కిందట, పన్నెండవ శతాబ్ది ఉత్తరార్థంలో పాల్కురికి సోమనాథుడు ఉరుతర పద్య గద్యోక్తుల కంటె, సరసమై పరగిన జాను తెనుంగు, చర్చింపగా సర్వ సామాన్యమగుట, కూర్చెదద్విపదలు కోర్కి దైవార అని ఛందోనియమాల శృంఖలాలను తెంచ యత్నించాడు. సర్వ సామాన్యమైన జనుల భాషకే సోమన జైజై అన్నాడు. దాదాపు మూడు వందల ఏండ్ల అనంతరం భక్తి కవి బమ్మెర పోతన మరో బావు టా ఎగరేశాడు.. పదిహేనవ శతాబ్దం ఉత్తరార్థంలో. ..కొందరికి తెనుగు గుణమగు.. అని అన్నాడు పోతన్న. ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీయుర్విన్ బురాణావళుల్, తెనుగున్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో తెనుగున్ జేయరు మున్ను భాగవతమున్, దీనిని దెనింగించి, నా జననంబున్ సఫలంబు జేసెద బునర్జన్మంబు లేకుండగన్ అని గూడ అన్నాడు మన పోతన్న. పోతన, సోమన ఇద్దరు తెలు గు శబ్దాన్నే ఉపయోగించారు. ఆంధ్ర శబ్దాన్ని ఉపయోగించలేదు. అయినప్పటికీ ఏమూల నుంచో ఆంధ్ర శబ్దం వచ్చి తెలంగాణ ప్రాం తాన్ని వాటేసుకున్నది. పోతన భాగవతాన్ని శ్రీమదాంధ్ర భాగవతం అని అంటున్నారు. పోతన తెలంగాణ కవి కాడంటూ ఇప్పటికీ ఆంధ్ర పాలకులు ఏటా ఒంటిమిట్టలో ఉత్సవాలు జరుపుతున్నారు. కందుకూరి వీరేశలింగం (ఆంధ్రకవుల చరిత్ర రెండవ ప్రచురణలో), కొమర్రాజు లక్ష్మణరావు, శేషాద్రి రమణ కవులు తదితర పరిశోధకులు దాదాపు వందేండ్ల కిందట పోతన తెలంగాణ కవి అని తేల్చిచెప్పినా సోయి లేకుం డా వ్యవహరించడం శోచనీయం. భాగవత పురాణం, రామాయణ కావ్యం (తెలుగులో), బసవపురాణం, అచ్చతెలుగు కావ్యం (యయాతి చరితం) వంటి ఉద్గ్రంథాలు వెలువడిన పవిత్రస్థలం తెలంగాణం.తన ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మాతృభాష తెలుగు కోసం తెగిం చి పోరాడిన రణక్షేత్రం తెలంగాణం.

దాదాపు వందేండ్ల కిందట 1921 నవంబర్‌లో హైదరాబాద్ నగరం జామ్‌బాగ్‌లో జరిగిన ఒక సభలో ఒక తెలంగాణ వక్త తన తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఎదురైన అడ్డంకి, అవహేళన తెలంగాణ అంతటా నిరసన పెల్లుబుకడానికి కారణమైంది. ఆ నిరసన అంతటితో ఆగలేదు. ప్రతిఘటన జ్వాల రగుల్కొనడానికి ఆ నిరసన ఆజ్యమైంది. 1923 మార్చిలో హనుమకొండలో జరిగిన ఒక సమావేశంలో నిజాం రాష్ట్ర (హైదరాబాద్ సంస్థానం) ఆం ధ్ర జనసంఘం స్థాపితమైంది. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర శబ్దం ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలను తురుష్క ఆంధ్రు లు అని, తౌరక్యాంధ్రులు అని ఈసడించారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు బతికి లేదన్న దురహంకారపూరిత ప్రచారం మొదలైంది. ఈ ఈసడింపును, దుష్ర్పచారాన్ని తుత్తునియలు చేసి తెలంగాణ ప్రాంతం తెలుగుభాష సజీవ స్రవంతి అని చాటిచెప్పడానికి, తెలంగాణ అస్తిత్వం నిలుపడానికి సురవరం ప్రతాపరెడ్డి నాడు ఏడు దశాబ్దాల కిందట తెలంగాణ ఊరూర ఉన్న కవుల కవితలను సేకరించి గోలకొండ కవుల సంచిక సంకలనాన్ని ప్రచురించారు. ఆంధ్ర సాంస్కృతిక దురహంకారంపై దెబ్బకొట్టిన మొదటి అస్త్రం ఈ సంకలనం. నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం నిజానికి నిజాం రాష్ట్ర తెలంగాణ జనసంఘం అని చెప్పాలె. ఈ సంఘం మొట్టమొదటి తెలంగాణ స్థాయి మహాసభ 1930లో అప్పటి మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. 1930 నుంచి 1947 వరకు పదిహేడు ఏండ్లలో పదమూడు మహాసభలు జరిగాయి. ఈ సభల సం దర్భాన మహిళా సమావేశాలు జరుగడం, భాషా సమస్యతో పాటు రైతు ల సమస్యలు, వివిధ గ్రామీణ వృత్తుల వారి సమస్యలను విస్తారంగా చర్చించడం విశేషం. నాలుగవ మహాసభ 1935లో సిరిసిల్లలో జరిగిం ది. మహాసభల కార్యక్రమాలు, తీర్మానాలు, ప్రసంగాలు, ఉత్తరప్రత్యుత్తరాల వివరాలన్నీ తెలుగులోనే రాయాలని సిరిసిల్ల మహాసభలో తీర్మానించడం ఒక చరిత్రాత్మక సంఘటన. సిరిసిల్ల మహాసభకు మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహించారు.

ఆయన గొప్ప సౌమ్యవాది, సమన్వయవాది. కొండా వెంకట రంగారెడ్డి స్వీయచరిత్రకు రాసిన పరిచయ వాక్యాల్లో మాడపాటి హనుమంతరావు నేను తెలంగాణ బిడ్డను అని చెప్పి గర్వపడ్డారు. సిరిసిల్ల మహాసభలో వ్యక్తమైన తెలుగు భాష స్ఫూర్తి మరింత బలాన్ని, వేగాన్ని పుంజుకొని 1937లో నిజామాబాద్‌లో నిర్వహించిన ఆరవ మహాసభ నాటికి ఉధృత స్వరూపం ధరించింది. మహాసభల్లో అందరూ తెలుగులోనే ప్రసంగించాలని, మాట్లాడాలని సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు గట్టిగా వాదించారు. నిజామాబాద్ మహాసభకు అధ్యక్షత వహించిన మందుముల నరసింగరావు ఆ రోజుల్లో రయ్యత్ ఉర్దూ దినపత్రిక సంపాదకుడు. ఆయన ఉర్దూ, అరబ్బీ, పార్సీ, ఇంగ్లీష్ భాషల్లో పండితుడు. నిజామాబాద్ సభా వేదికపై ఆయన కూడా తెలుగులో మాట్లాడక తప్పలేదు. 1930 నుంచి 1947 వరకు జరిగిన మహాసభలు పదమూడు భాషపరంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అపార, అపూర్వ చైతన్యాన్ని తెలంగాణ అంతటా రేకెత్తించగలిగాయి. 1944లో, వరంగల్లులో సారస్వత పరిషత్తు వార్షికోత్సవం సందర్భాన వరంగల్లు కోటలో తెలుగు కవి సమ్మేళనం ఏర్పాటైంది.

కవి సమ్మేళనం వేదికకు మతోన్మాద దుండగులు నిప్పు అంటించి బూడిద చేశారు. సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, యువకవి దాశరథి పట్టదలతో ఆ బూడిద కుప్ప మీదనే కవి సమ్మేళనం నిర్వహించారు.నిజాం ప్రభుత్వం గస్తీ నిషాన్ 53తో ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ తెలంగాణ మహాసభలు ఏటేటా జరిగాయి, ఆంధ్ర సారస్వత పరిషత్తు (ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు) తెలంగాణ అంతటా అక్షరజ్యో తి వెలిగించింది. గత శతాబ్ది కాలంలో తెలంగాణలో అన్ని సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలకు తెలు గు భాషాభిమానమే స్ఫూర్తినిచ్చింది, ప్రేరణ కలిగించింది. దుమారాలు ఎన్ని చెలరేగినా, ఆసఫ్‌జాహీ పాలనలో, ఆంధ్ర పాలకుల పెత్తనంలో, అణచివేతలో అలక్ష్యానికి, అవహేళనకు గురైనా తెలంగాణ తెలుగు భాషా దీపం ఎన్నడూ ఆరిపోలేదు. తెలుగు భాష, సంస్కృతి వికాసాని కి తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని అరువై ఏండ్ల కిందట ఆంధ్ర నాయకులు, పాలకులు బుజ్జగించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాం తాల విలీనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే ఆంధ్ర పాలకులు తెలు గు భాషను, సంస్కృతిని, చరిత్రను మరిచిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పదేండ్లకు తెలుగును అధికార భాషగా ప్రవేశపెట్టే చట్టం వచ్చింది. పద్దెనిమిది ఏండ్లకు మొదటి అధికార భాషా సంఘం నియమితమైంది.

ఇరువై ఏండ్లకు 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ విపరీత జాప్యంతో పోల్చినప్పుడు మూడేండ్లయి నా నిండక ముందే రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష, సారస్వతం, చరిత్ర వికాసం కోసం తీసుకుంటున్న సత్వర చర్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మూడేండ్లలోనే అభివృద్ధి రంగంలో అపూర్వరీతిలో ముందడుగు వేస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కు సిద్ధమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో నిరాదరణకు గురైన తెలంగాణ వైతాళికులకు, ప్రముఖులకు తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ, గుర్తింపు లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మహాకవి దాశరథికి అవమానం జరిగిం ది. ఆయనను ఆస్థానకవి పదవి నుంచి తొలిగించారు. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడగానే దాశరథి, కాళోజీ పేరిట అవార్డులు ఇస్తూ వారిని గౌరవిస్తున్నది. 1957 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవం జరిపిన పిదప తెలంగాణ ప్రముఖ సాహిత్యవేత్తకు కీలకమైన కార్యదర్శి పదవి లభించకుండా కుట్రలు జరిగాయి. ఆ కుట్రలు ఫలించలేదు. 1954 మార్చి 12న ఢిల్లీ లో జాతీయ సాహిత్య అకాడమీ స్థాపితమైంది. రచయితగా, గ్రంథకర్త గా ప్రపంచ ప్రసిద్ధి పొందిన జవహర్‌లాల్ నెహ్రూను అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అకాడమీ అధ్యక్షుడి నెహ్రూ (అప్పటి ప్రధాని) అన్న మాటలివి.. As President of the Academy I may tell you frankly I would not like the Prime Minister to interfere in my work సాహిత్య మూర్తి, సాహిత్య బంధువు రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వం తెలంగాణ సాహిత్య అకాడమీకి లభించడం శుభసూచకం.. తెలంగాణ సారస్వత వికాసానికి సంకేతం.
Prabakarrao

573
Tags

More News

VIRAL NEWS