పచ్చదనంతోనే ప్రాణవాయువు

Sat,July 15, 2017 01:44 AM

ప్రకృతి ఇచ్చిన అపారమైన వనరులను మనం వినియోగించుకుంటున్నాం. మన అవసరాలన్నింటిని తీర్చుకుంటున్నాం. అదే సమయంలో ప్రకృతి ఖాతాలో మనమెంత తీసుకున్నామో అంత భర్తీ చేయాల్సి ఉం టుంది. సహజ వనరులు మన అవసరాలు తీర్చడాని కే గాని మన అత్యాశను తీర్చడానికి కాదు. తమ అహింసా సిద్ధాంతం జీవవైవిధ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని మహాత్మాగాంధీ అన్నారు.ప్రతి మనిషి కనీసం ఒక చెట్టునైనా నాటాలని అగ్ని పురాణంలో పేర్కొన్నారు. అలాగే మూడు చెట్లు నాటితే స్వర్గప్రాప్తి అని రుగ్వేదంలో చెప్పబడింది. చెట్లను నరుకడం పాపమని తెలిపింది.

ప్రాచీన కాలంలో మన దేశమంతా అరణ్యాలు విస్తృతంగా ఉన్నట్లుగా వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భాగవతం లాం టి పురాణాల్లో అనేకసార్లు ప్రస్తావించారు. రామాయణంలో రాముని వనవాసం, మహాభారతంలో పాండవ వనవాసం, అభయారణ్యాల్లో ఆశ్రమాలున్నట్లు విన్నాం. కానీ రానురాను పరిస్థితి మారుతున్నది. మని షి తనకు ప్రాణవాయువును అందించే అడవితల్లిని తన గొడ్డలి వేటుకు బలిచేస్తున్నాడు. 1952 జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం మొత్తం భూభాగంలో 33.3 శాతం, అడవులు కొండ ప్రాంతాల్లో 66 శాతం చెట్లు వ్యాపించి ఉండాలి. ఒకప్పుడు తెలంగాణ భూ భాగంలో 55 నుంచి 60 శాతం అడవులున్న జిల్లాల్లోనే అటవీ సంపద కొవ్వొత్తిలా కరిగిపోతున్నది. అటవీశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 25.11 శాతం అడవులున్నాయి.దేశ సాంఘిక, ఆర్థిక ప్రగతి సహజ వనరులైన అరణ్య సంపదతో ముడిపడి ఉన్నది. ఈ నేపథ్యంలోనే అడవుల అభివృద్ధికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని 1952లోనే గుర్తించారు. ఆ మేరకు చెట్లను విరివిరిగా పెం చి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభు త్వం 1952లో వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి వారంలో దేశమంతటా వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలన్నది ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఎంతో దూర దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినా.. ఉమ్మడి రాష్ట్ర పాలకు లు ఈ కార్యక్రమ అమలు విషయలో నిర్లక్ష్యం చూపారు. వాళ్ల పుణ్యమా ని అడవి తల్లి విలవిల్లాడింది. వివిధ కారణాలతో తగ్గుతున్న అటవీ సంప దను కాపాడేందుకు 1980లో భారత ప్రభుత్వం అడవుల సంరక్షణ చట్టా న్ని రూపొందించింది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలోనూ ఉమ్మడి పాలకులు విఫలమయ్యారు.అటవీ విస్తీర్ణం తగ్గడానికి చెట్ల నరికి వేత, కలప స్మగ్లింగ్ ప్రధాన కారణాలు. వీటిని నిలువ రించ డంలో ఉమ్మ డి పాలకులు పూర్తిగా విఫలమయ్యారు.

పలు పరిశోధనల ప్రకారం.. ఒక చెట్టు తన జీవితకాలంలో సగటున ఒక టన్ను కార్బన్‌డయాక్సైడ్‌ను తీసుకొని పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడుతుంది. రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు, పరిశ్రమల చుట్టూ వ్యాపించి ఉన్న చెట్లు శబ్ద కాలుష్య తీవ్రతను తగ్గిస్తాయి. పర్యావరణం కలుషితం కాకుండా కాపాడటమే గాక, కలుషితమైన పర్యావరణాన్ని శుద్ధిచేసి, పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. అటవీ ప్రాంతాల్లో నేల పైపొరలోని హ్యూమస్ స్పాంజి వలె వర్షపు నీటిని పీల్చుకుంటుంది. పీల్చుకున్న వర్షపు నీరు జారిపోకుండా గట్టి గడ్డి మొక్కలు అడ్డుకొని వాటి గుండా నెమ్మదిగా భూమిలోకి వాన నీరు ఇంకుతుంది. ఈ విధానం వల్ల భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. అరణ్యాల్లోని భూముల్లో గంటకు 38 మిల్లీమీటర్ల వర్షపు నీరు ఇంకుతుంది. అటవీ ప్రాంతంలో భూమి పై పొర తడిగా ఉంటుంది. తుఫాను గాలులు వీచినప్పటికీ సారవంతమైన నేల కొట్టుకుపోకుండా చెట్లు, గడ్డి మొక్కలు కాపాడుతాయి. చెట్టు ఒక కిలో కలపను తయారుచేసుకోవడానికి దాదాపు 1.5 కిలోల కార్బన్‌డ యాక్సైడ్‌ను వినియోగించుకొని ఒక కిలో ఆక్సిజన్‌ను గాల్లోకి వదిలిపెడుతుంది.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్ష చదరపు కిలోమీటర్ల అరణ్యాలు నాశనమవుతున్నట్లుగా గణాంకాలు చెపుతున్నాయి. ఒకనాడు ప్రపంచమంతటా 50 శాతానికి మించి అడవులుండేవి. కానీ నేడు 30 శాతానికి మాత్రమే పరిమితమయ్యాయి. మన దేశంలో అడవులు 19 శాతానికే పరిమితమయ్యాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి హెక్టార్లకుపైగా అడవులు నాశనం చేస్తున్నట్లుగా గణంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. కాగా ఇందులో 28,854 చదరపు కిలోమీటర్లలో అటవీ విస్తీర్ణం నమోదైంది. ఇందులో 9,813.65 చదరపు కిలోమీటర్లలో అటవీ ప్రాంతం క్షీణించినట్లుగా గణాంకాలు చెపుతున్నాయి. ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి, ఆ సమస్య పరిష్కారం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం కేసీఆర్ దిట్ట. ఈ విషయంలో నూ అదే పంథా అనుసరించా రు. పాలన పగ్గాలు చేపట్టడమే ఆలస్యం.. తెలంగాణలో అట వీ సంపదను పెంచడానికి ఓ బృహత్తర హరిత హారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ పచ్చని మాగాణిగా మారాలంటే అటవీ శాతం పెంచడం అత్యంత అవసరమని గుర్తించారు. ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు పెంచాలనే లక్ష్యంగా అడుగులు వేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం విశేషం.

ఇందులో భాగంగా 2015 జూలై 3న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులో కేసీఆర్ చేతులు మీదుగా హరితహారం కార్యక్రమానికి అంకురార్పరణ జరిగింది. వానలు మళ్లీ వాపసు రావాలి, కోతులు వెనక్కి వెళ్లాలన్న నినాదం కూడా ఈ సంకల్పానికి తోడైంది. ప్రస్తుతం ఇది ప్రజా ఉద్యమంగా మారింది. ఇటీవల ప్రారం భమైన మూడో దశ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగ స్వామ్యంతో 40 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యం వైపు ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా మొక్కలు నాటడమే మొదటి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో తెలంగాణ అద్భుత అటవీ సంపద రాష్ట్రంగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణ జాతి భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ హారితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ప్రతి పౌరుడూ మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి. అప్పుడే ఈ లక్ష్యం నెరవేరి హరిత తెలంగాణ అవ తరిస్తుంది.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి, కరీంనగర్)
Prakashrao

439
Tags

More News

VIRAL NEWS