ఫూలే బాటలో గురుకులాలు

Sun,June 18, 2017 01:54 AM

నూతన సమాజం పొద్దు పొడువటానికి ఒక సూర్యోదయంలాంటివి ఈ గురుకుల పాఠశాలలు. ఈ బడులే సమాజంలోని అంతరాలను సరిచేయగలవు. ఈ బడులే బహుజనులకు అన్నిరకాల అవసరాలను అందించగలవు. ఈ బడు లే బీసీలకు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చగలవు. ప్రతి ఒక్క బీసీ ఆత్మగౌరవంతో నిలబడేందుకు, తెలంగాణ సమాజాన్ని శిరస్సెత్తుకుని నిలిచేవిధంగా చేయగలిగిన శక్తి ఈ గురుకులాలకు ఉన్నది.
students
నేను ప్రజలకర్థమవుతున్నా నా అని నిరంతరం పరీక్షించుకునే వాడే నాయకుడు. నాపై రాళ్లు విసిరేవాళ్లు నన్ను అర్థం చేసుకోకున్నా నష్టం లేదు, ప్రజలు నన్ను అర్థం చేసుకుంటే చాలునన్న ఆలోచనలో ముందుకుసాగే వారు విజయులుగా నిలుస్తారు. దార్శనికుడైన నాయకుడే ధైర్యంగా నిలబడగలుగుతాడు. నిత్యం ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ పోవటంతో పాటుగా భవిష్యత్ సమాజాన్ని శక్తివంతం చేయాలంటే ఆ నాయకులు స్టేట్స్‌మెన్‌లు కాగలుగాలి. రాబోయే ఎన్నికల్లో ఎట్లయినా గెలిచి పవర్ సంపాదించుకోవటం ఏ రొడ్డగొట్టుడు నాయకుడైనా చేస్తాడు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా నూతన సమాజ నిర్మాణం చేయగలమన్న తలంపు గల నేతలు మాత్రమే చరిత్రలో నిలువగలుగుతారు.

తెలంగాణ ఉద్యమాన్ని ఒక్క చేత్తో రాజకీయ ప్రక్రియ ద్వారా నడిపించగలిగిన కేసీఆర్‌కు సాధించుకున్న తెలంగాణను ఎట్లా నిర్మించుకోవాలో కూడా తెలుసు. కేసీఆర్ పునర్నిర్మాణ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. రాష్ట్రం ఏర్పడినప్పుడే దాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దుకోవటానికి అందరి చేతులుండాలని ఆ చేతులన్నింటిని పిడికిళ్లుగా మార్చే పని కేసీఆర్ చేస్తున్నారు. ఈ యజ్ఞంలో ప్రతి తెలంగాణ పౌరుడు పాలుపంచుకోవాలి. ఇది మరో సాంస్కృతిక ఉద్యమం. ఈ పునర్నిర్మాణాన్ని ఉద్యమంగా మలుచుకొని తెలంగా ణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ సమయంలో కలాలు, గళాలు, మేధావులు, విజ్ఞులు అందరూ ముక్తకంఠంతో కదిలి రావాల్సి ఉన్నది. తెలంగాణలో ఆ కోణంలో కదిలివస్తున్నారు. కొందరు విమర్శిస్తున్నారు. అది వేరే విషయం.

ఇప్పటికే చెరువు అలుగు దుమికి ప్రవహిస్తున్న నీళ్లను తెలంగాణ సమాజం రెండు కళ్లతో చూస్తున్నది. ఇంటింటికి నల్లా నీళ్ల కోసం పనులు జరుగుతున్నాయి. అణగారిన వర్గాల, కులాల పిల్లలు అన్ని వసతులున్న గురుకులాల్లోకి అడుగులు వేస్తున్నారు. యాదాద్రి, భద్రాద్రి, రాజాద్రిలు భక్తి రాజధానులుగా మారుతున్నాయి. దేశ నిర్మాణం కోసం నాటి నెహ్రూ ఏ విధమైన కలలుగన్నాడో అలాంటి పని ఇపుడు తెలంగాణ సమాజంలో జరుగుతుంది. తలా ఒక చేయి వేసి కలిసిరాండని కేసీఆర్ కోరుతున్నారు. కొం దరు రాకపోతే కూడా సహిస్తున్నారు కానీ అడ్డుతగిలే పనిచేస్తే మాత్రం కేసీఆర్ అస్సలూరుకోరు. అవతలివ్యక్తి ఎంత పెద్ద వాడైనా అమిత్‌షా అయినా ఆయన సహించడు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే పని ఎవరుచేసినా కేసీఆర్ ఉగ్రుడవుతారు.

పీవీ నర్సింహారావు విద్యాశాఖమంత్రిగా ఉన్నప్పుడు నాటి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుచేశారు. ఆ మూడు రెసెడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకువచ్చారు. వివిధ రంగాలకు పాలనాధ్యక్షులను ఈ స్కూళ్లే అందించాయి. వీటి ఫలితాల ఆధారంగానే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు ప్రారంభించటం జరిగింది. కేంద్ర మానవవనరుల శాఖా మం త్రిగా పీవీ బాధ్యతలు తీసుకున్నాక సర్వేల్ స్కూళ్లలాంటివే దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయ టం జరిగింది. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాసంస్థలను ఏర్పాటుచేశారు. పీవీ ఆలోచనతో విద్యాశాఖను మానవవనరుల శాఖగా మార్చారు.

ఆ తర్వాత ఆ సర్వేల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులు కాపీ కొట్టారు. ప్రభుత్వ రెసిడెన్షియ ల్ స్కూళ్ల వ్యవస్థను గత పాలకులే ఒకరకంగా చంపేశారు. గత పాలకుల హయాంలో బడుగు బలహీన వర్గాలు, దళిత మైనార్టీ వర్గాలకు చదువు దూరమైం ది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో చదువు ఖరీదైన సరుకైం ది. తల్లిదండ్రులు తమ భూములు, ఆస్తులు అమ్ముకొని పిల్లలను చదివించుకోవాల్సిన స్థితి వచ్చేసింది. పీవీ రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థను కాపీ కొట్టి వెలసిన ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యారంగాన్నే శాసించే దశకు వచ్చాయి. ప్రాథమిక, మాధ్యమిక ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్య, ఇంజినీరింగ్ చదువు దాదాపుగా కార్పొరేట్ రంగం గుప్పిట్లోకి పోయింది. తెలంగాణను కార్పొరేట్ విద్యారంగం శాసించే దశ నుంచి బయటపడాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఉండటమొక్కటే మార్గమని తలంచిన ఆలోచన లూ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక కీలకాంశాలు.

ఉద్యమ సమయంలోనే కేజీ టు పీజీ చదువును ఉచితంగా అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఒక్కొక్క రంగానికి సంబంధించి ప్రక్షాళనా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. తాగు, సాగు నీరు విషయంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు సమగ్ర రూపమిచ్చారు. చాలావరకు ఆ ఫలితాలు అందుతున్నాయి. నిధుల విషయంలో, కొలువుల విషయంలో భారీ కసరత్తు జరుగుతున్నది. అందుకే కార్యాచరణ మొదలై వేగం అందుకోబోతున్నది. కేజీ టు పీజీ చదువును ఒక్కసారిగా ట్రాక్ ఎక్కించాలంటే అందుకు విస్తృతమైన కార్యరంగం ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. అందుకోసం ఒక్కొక్క మెట్టుగా అడుగులు వేస్తూ ముందు కుసాగటం జరుగుతున్నది.

కేజీ టు పీజీ విద్యకు ఇంకా సమగ్ర రూపం రాలేదని విమర్శ చేయటం సులభమైనదే కానీ ప్రాథమిక దశ నుంచి చదువుకు బలమైన పునాదులు పడాలి. ఆ పని అంత సులభమైనది కాదు. పిల్లలు డ్రాపౌ ట్ అవుతున్న దశ ఇంకా ఉన్నది. ప్రధానంగా ప్రభు త్వ బడులు, కాలేజీలంటే నమ్మకం పోయిన స్థితిని కూడా ఇంతకుముందు పాలకులు కల్పించారు. దీనినుంచి బయటపడటం అంత సుల భం కాదు.

ప్రభుత్వ స్కూళ్లపై మంచి అభిప్రాయాన్ని, గౌరవాన్ని తీసుకువచ్చేందుకు కృషిచేయాల్సి ఉన్నది. ఇందుకు కేసీఆర్ మొదటగా ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యావ్యవస్థను పటిష్ఠం చేసేపని చేపట్టారు. ఇప్పుడవి మంచి ఫలితాలిస్తున్నాయి. అందుకు ప్రవీణ్ కుమార్ చేసిన కృషి మరువలేనిది. బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన చదువునందించేందుకు పెద్దఎత్తున గురుకులాలను ఏర్పాటుచేశారు. కేసీఆర్ ఆలోచనల మేరకు ఇందుకు పూర్వరంగంగా గత కొ న్ని నెలలుగా చాలా కృషి జరిగింది. మహాత్మా జ్యోతి బా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షే మ గురుకుల విద్యాలయాలను రాష్ట్రవ్యాప్తంగా 2017 జూన్ 6వ తేదీన ప్రారంభించారు.

కేసీఆర్ దార్శనికునిగా ఎన్నో కోణాలనుంచి ఆలోచించి ఈ గురుకుల విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశా రు. ఈ విద్యావ్యవస్థ ద్వారా బహుజనవర్గాల పిల్ల ల్లో ఎంతో మార్పురావటం ఖాయం. ఒక పదేళ్ల తర్వాత ఈ ఫలితాలను స్పష్టంగా చూడవచ్చు. బీసీ లు అన్నిరంగాల్లో దూసుకుపోవటానికి బలమైన సాధనం ఈ గురుకుల విద్యా వ్యవస్థే. ఈ గురుకుల విధానాన్ని విజయవంతం చేసుకునే దిశగా మొత్తం విద్యారంగ పాలనా యంత్రాంగం అడుగులు వేయాలి. కేసీఆర్ దీర్ఘకాలిక ఆలోచనలకు ప్రతిరూపంగా ఈ గురుకుల విద్యా వ్యవస్థను కాపాడుకోవ టం అందరి బాధ్యత. ఈ గురుకుల విద్యా వ్యవస్థ ఒక్క తెలంగాణకే కాదు, దేశానికి, ప్రపంచానికి శక్తివంతమైన మానవ సంపదను అందిస్తుంది. చిన్న దేశమైన క్యూబా ప్రపంచదేశాలకు డాక్టర్లను పంపించినట్లు ఫిన్లాండ్‌లాంటి చిన్న దేశం ప్రపంచ విద్యారంగానికి పాఠ్యాంశంగా మారినట్లు, తెలంగాణ నుం చి నైపుణ్యం గల మానవ వనరులు ప్రపంచానికి అందుతాయి. చదువే బడుగుల బతుకులు మార్చుతుందన్న మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయాలకు ప్రతిరూపంగా తెలంగాణలో బీసీల కోసం కేసీఆర్ ఆలోచనలతో గురుకుల విద్యాలయాలు ప్రారంభించబడ్డాయి.

ఈ బడులు మనవే, వాటిని రక్షించుకొని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా బహుజ న వర్గాలదే. ఆధిపత్యవర్గాల అన్నిరకాల ఆధిపత్య గోడలను కూల్చగల శక్తి కూడా ఈ గురుకుల స్కూళ్ల నుంచి ఉద్భవిస్తుంది. నూతన సమాజం పొద్దు పొడువటానికి ఒక సూర్యోదయం లాంటివి ఈ గురుకుల పాఠశాలలు. ఇవే సమాజంలోని అంతరాలను సరిచేయగలవు. ఈ బడులే బహుజనులకు అన్నిరకాల అవసరాలను అందించగలవు. ఈ బడు లే బీసీలకు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చగలవు. ప్రతి ఒక్క బీసీ ఆత్మగౌరవంతో నిలబడేందుకు, తెలంగా ణ సమాజాన్ని శిరస్సెత్తుకుని నిలిచేవిధంగా చేయగలిగిన శక్తి ఈ గురుకులాలకు ఉన్నది. అదే ఆలోచన లో కేసీఆర్ ఈ విద్యావ్యవస్థకు రూపకల్పన చేశారు. ఫూలే ఆలోచనలు విరుగ కాసేందుకు జ్యోతిబాఫూలే ఆశయాలు ఫలాలుగా అందరికీ అందేందు కు కేసీఆర్ చేసే ఈ పని దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.
విద్య
జేజీ శంకర్

617
Tags

More News

VIRAL NEWS