ఆలయాలకు జీఎస్టీ పోటు

Sun,June 18, 2017 01:52 AM

20 లక్షల వరకు, ఆపైబడిన వార్షిక ఆదాయం గల దేవాలయాలన్నీ జీఎస్టీ కోరల్లోకి రాబోతున్నాయి. దేవాదాయ చట్టం ప్రకారం ఇప్పటికే FAF, AWF వగైరాల కింద 21.5 శాతం ఆదాయాన్ని కోల్పోతున్న దేవాలయాలు, 18 శాతం జీఎస్టీకి కోల్పోక తప్పదు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించాలని కోట్లాది భక్తుల ప్రతినిధిగా వేడుకుంటున్నాం.
GST
దేశవ్యాప్తంగా పన్ను వ్యవస్థను, దాని నిర్వహణను మరిం త సులభతరం చేయడానికి, క్రమబద్ధం చేయడానికి, పలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల స్థానంలో వచ్చే జులై 1 నుంచి జీఎస్టీ (వసు సేవా పన్ను) విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి ఇది మంచి నిర్ణయం.అయితే దీని పరిధి పెరిగే కొద్దీ అవగాహనా లోపం, విచక్షణా రాహిత్యంతో కొన్నిచోట్ల చిక్కులు ఎదురుకాబోతున్నాయి. వస్తుసేవా పన్ను చట్టంలో 2017లో మతపరమైన వ్యవహారాల గురించి ప్రస్తావనే లేదు. ప్రతి వస్తు వు, సేవా కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగే వ్యవహారంగా చట్టంలో పరిగణించబడటం ఆశ్చర్యకరం. మన దేశం ఆధ్యాత్మికతకు, దైవ చింతనకు ప్రాముఖ్యం ఇచ్చే దేశం. ఎన్నో ప్రపంచదేశాలు మత సంస్థలకు జీఎస్టీ పరిధిలోనుం చి మినహాయింపునిచ్చాయి. భారతదేశం కూడా అటువం టి చొరవ తీసుకోవాలని ఆశిస్తున్నాం. ఇది మొదటి దశలోనే జరుగాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.

హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినంత వరకు భక్తులను ఈ పన్ను తీవ్రంగా బాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రసాదాలు, విశ్రాంతి మందిరాల (సత్రాలు/కాటేజీలు) విషయంలో ఇది ఎక్కువగా కన్పిస్తున్నది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల వినతులతో ప్రసాదాలకు మాత్రం కేంద్రం నుంచి మోక్షం (మినహాయింపు) లభించింది. కాటేజీలకు మాత్రం ఇంకా విముక్తి లభించలేదు.
హిందూ దేవాలయాల్లో భక్తులకు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముకు లభించే ప్రసాదాలు, దర్శనా లు, భోజనాలు వివేకం లోపించిన పాలకులకు/అధికారులకు ప్రతిసారి రేసులు, క్లబ్బుల లాగా లాభసాటి వ్యాపారంలాగా కనిపించడం బాధాకరం. భక్తుల నిరసనలు, న్యాయస్థానాల మొట్టికాయలతో గుట్టుచప్పుడు కాకుండా తప్పులు దిద్దుకోవడం మొదటి నుంచి క్రమం తప్పకుం డా ఆచారంగా వస్తున్నది.

గతంలో ఒకసారి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా- అమ్మకానికి పెట్టారు కనుక పన్నుకట్టాల్సిందేనని హూంకరించారు. ఆ తర్వాత ట్రిబ్యునల్ మొట్టికాయ వేస్తూ అది లాభార్థన ధ్యేయంతో చేసిన వస్తూత్పత్తి కాదని హితబోధ చేయడంతో కళ్లు తెరుచుకున్నాయి. అలా ప్రసాదం మినహాయింపు పొందింది.ఇక కాటేజీల విషయానికొస్తే ఇలాంటి గమ్మత్తులే లోగడ కూడా జరిగాయి, తిరుపతిలో ఉండే సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ వారు టీటీడీకి నోటీసులు జారీచేశారు. వాటికి జవాబిచ్చే లోపలే 2011 మే 25న మరో ఉత్తర్వు ఇస్తూ వసతిసేవ క్యాటగిరీ కింద అర్జంట్‌గా సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనీ, 2011 మే 1నుంచి కాటేజీలన్నింటికీ పన్ను కట్టాలన్నారు.

సరే. ప్రతిసారీ జరిగినట్టే ఈసారి కూడా టీటీడీ కోర్టుకెక్కింది. తమది లాభాపేక్ష లేకుండా సేవలు వివిధ రూపా ల్లో అందించే సంస్థ అని టీటీడీ వాదించింది. మీకు మినహాయింపు ఇచ్చినట్లు మీ వద్ద ఏవైనా ఆధారాలున్నాయా? అని కోర్డు అడిగింది. అయితే 2011 మే 25 ఉత్తర్వు ల్లో 50 శాతం మినహాయింపు ఇచ్చిన ట్లు ఉంది కనుక అదే చూపింది. అయి తే పూర్తి మినహాయింపును మాత్రం టీటీడీ పొందలేకపోయింది.చట్టంలోని ఒక నిబంధన 65 (105) ప్రకారం మూడు నెలల వరకు వసతి కల్పించే సంస్థ అయినా, సదరు సేవకు వారు ఏ పేరు పెట్టుకున్నా పన్ను పరిధిలోకి వస్తారు. ఈ నిర్వచనం పరిధిలోకి పరిధిలోకి కాటేజీలు కూడా వస్తాయి కాబట్టి పన్ను కట్టాలన్న ఆదేశాల్లో తప్పేముందని కోర్టు కూడా అభిప్రాయపడింది.

అయితే 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి ఆ పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండా మినహాయింపుని స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పడు మళ్లీ ఆ మినహాయింపు జీఎస్టీ రూపంలో పామునోట్లో పడి ఆట మొదటికి చేరింది. అంటే జులై 1 నుంచి విధించే జీఎస్టీలో కాటేజీ సేవలకు, ఇతర దేవాదాయ ధర్మాదాయ సేవల్లో కొన్నింటిపై పన్ను వేటు పడుతుంది. ప్రవేశ రుసుముతో దర్శనం టిక్కెట్టుకు ఇక్కట్లు తప్పవు. కళ్యాణ మండపాలు, అర్చన టిక్కెట్లు వీటికి కష్టాలే..
ఇప్పటికే రూ.35 లడ్డూను సబ్సిడీపై రూ.25కే అమ్ముతున్నా కొందరికి ఉచితంగా మరికొందరికి తక్కువ మొత్తానికి ఎక్కువ సంఖ్యలో ఇస్తున్నా, వేలాది మందికి ఉచిత భోజనం పెట్టడానికి ఖజానా ఖాళీ అవుతున్నా భక్తులకు సేవలు ఇకముందు ఇలాగే కొనసాగించాలంటే టీటీడీ లాంటి ధార్మిక సంస్థల ముందు రెండే అవకాశాలుంటా యి. అప్పులు భరిస్తూ అయినా పన్నులు కట్టడం లేదా ఆ భారాన్ని భక్తుల భుజాల మీదికి సర్దడం.

జీఎస్టీ 2017లో నిర్వచనాల నిబంధన 17 ప్రకారం వ్యాపారం అని దేన్ని నిర్వచించవచ్చు అని ఉటంకిస్తూ, ప్రవేశ రుసుముతో ప్రాంగణ ప్రవేశాన్ని కూడా వ్యాపారం గా నిర్వచించారు. ఈ నిర్వచనం వల్ల దర్శనం టిక్కెట్లకు పన్ను పోటు తప్పదు. కళ్యాణ మండపాలకు, కళ్యాణోత్సవాలకు పన్ను తప్పదు.
20 లక్షల వరకు, ఆపైబడ్డ వార్షిక ఆదాయం గల దేవాలయాలన్నీ జీఎస్టీ కోరల్లోకి రాబోతున్నాయి. దేవాదాయ చట్టం ప్రకారం ఇప్పటికే FAF, AWF వగైరాల కింద 21.5 శాతం ఆదాయాన్ని కోల్పోతున్న దేవాలయాలు, 18 శాతం జీఎస్టీకి కోల్పోక తప్పదు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించాలని కోట్లాది భక్తుల ప్రతినిధి గా వేడుకుంటున్నాం.
హిందువులు అత్యధికంగా నివసించే దేశంలో లక్షలాది భక్తులకు పలు రూపాల్లో నిత్యం సేవాధర్మంతో తరించే టీటీడీ వంటి ఎన్నో దేవాలయాలకు, హిందూ ధార్మిక సం స్థలకు ప్రతిరోజూ, ప్రతిక్షణం ఇటువంటి అగ్ని పరీక్షలు ఎదురుకావడం శోచనీయం.

దేవాలయాలు, దర్శన వ్యవహారాలు, ప్రసాదాలు, సత్రాల వంటివి పాలకులకు వాణిజ్య సంస్థల్లాగా, జూద గృహాల్లాగా, డీలర్ల లాగా, టోకు వ్యాపార దుకాణాల్లాగా, సరుకు డిమాండ్.. సరఫరా.. పంపిణీ పరిభాషల్లాగా కనిపిస్తున్నప్పడు ప్రతిభక్తుడూ ఆలోచించి తగువిధంగా స్పం దించాల్సిన సందర్భం మంచుకొస్తున్నది.
విశ్లేషణ సి.ఎస్.రంగరాజన్

479
Tags

More News

VIRAL NEWS