దివిజకవి సినారె

Sat,June 17, 2017 12:22 AM

పొద్దున్నే ఫోన్ వస్తే భయమవుతున్నది. నెలరోజుల కిందట తెల్లారకముందే, సూర్యోదయం కాకముందే ఒక ఫోన్..ఒక ఆత్మీయురాలు, ఒక పెద్దమనిషి చివరిశ్వాస విడిచినారన్న వార్త. భళ్లున తెల్లవారు నింక భయం లేదు అని ఒక కవి మిత్రుడు భరోసా ఇచ్చాడు. కాని, భయమవుతున్నది. సాధారణంగా రుగ్మతలు చీకట్లలో, రాత్రి వేళల్లో ప్రకోపించి వాటి ప్రతాపం చూపిస్తాయని కొందరు విజ్ఞులు అంటారు.విశ్వగీతి విన్పించిన సినారె విశ్వంభర వేదం వల్లించి విశ్వ మానవుడిగా వినుతి పొందారు. విశ్వంభర కావ్యాన్ని ముగిస్తూ మహాకవి, మహామనీషి సినారె సాగిపోయే ప్రవాహం, చావులేని జీవితం అన్నారు. ఈ వాక్యాల్లో ఆయన మానవాళికి అందించిన మహత్తర సందేశం ఇమిడి ఉన్నది.

మే నెల విషాద వార్త తర్వాత ఇంకా నెల కాలేదు. 2017 జూన్ 12న పొద్దున్నే ఫోన్. ఎత్తాలంటే భయం. అయినా ఎత్తక తప్పదు. ఒక టీవీ ఛానె ల్ నుంచి ఆ ఫోన్. వినగూడనిది విన్నాను, జరుగూడనిది జరిగింది. అత్యంత ఆత్మీయులు, గౌరవనీయులు, అనేక సంవత్సరాలు అక్షరాలతో, పద సముదాయాలతో అలవోకగా ఆడుకొని ఒలింపిక్ శిఖరాలు అధిరోహించిన వాడు, భాషను శాసించినవాడు, ఏ గ్రేట్ లవబుల్ పర్సనాలిటీ సి.నారాయణరెడ్డి ఇక లేడని, ఆయన శ్వాస ఆగిందని, కలం నిలిచిందని, గళం ఇక విచ్చుకోదని ఆ ఫోన్ కాల్‌లో తెలిసినపుడు నిజమా అని మాత్రం అడిగాను. ఉదయం నా హృదయం అని కవితా జలపాతం ప్రవహింపజేసిన మహాకవి సినారె హృదయం ఉదయమే నిలిచిపోవడం దిగ్భ్రాంతి కలిగించింది. అంతకుఅయిదు రోజుల ముందు ఆయన తన ప్రియవేదిక తెలంగాణ సారస్వత పరిషత్తుకు వచ్చి ఒక సన్మానసభకు అధ్యక్షత వహించారు. నెలరోజులు కాలేదు నేను ఆయనతో మాట్లాడి.. ఎప్పటివ లెనె ఆయన మాటల్లో ఆత్మీయత తొణికిసలాడింది. 2016 ఆగస్టు 24న సారస్వత పరిషత్తులో ఆయన స్వయంగా దేవులపల్లి రామానుజరావు శత జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆ కార్యక్రమంలో మాట్లాడడానికి నేను వెనుకాడాను. పక్కనే కూర్చున్న ఆయన నా భుజం తట్టి మాట్లాడు అన్నారు. ఆ మాట ఆ మహనీయుని ఆదేశం వలె నా చెవిలో ధ్వనించింది. వెంటనే లేచి మాట్లాడాను. ఆయన ఆదే శంలోని మహాత్మ్యం ఏమిటో గాని తర్వాత వరుసగా చాలా సభల్లో మాట్లాడాను. గడిచిన ఆరేడు దశాబ్దాల్లో సినారె ఒక హితుడిగా, స్నేహితుడిగా, సహాధ్యాయిగా, సహచరుడిగా, అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా, కవీశ్వరుడిగా, సద్విమర్శకుడుగా, పలు సాహిత్య, సాంస్కృతిక సంస్థల అధీశ్వరుడుగా కొన్ని వేలమంది భుజం తట్టి ప్రోత్సహించి ఉంటారు. ఆ విరాట్ వృక్షం అండన పెరిగిన దండి వృక్షాలు ఎన్నో! దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ ఆయన నిష్ర్కమించి నాలుగైదు రోజులవుతున్నా మన మధ్య ఉన్నట్లే అనిపిస్తున్నది. సాయంకాలంలో ఏదో ఒక సారస్వ త, సాంస్కృతిక వేదికపై ఆయన గంభీర, మంజుల గళం వినిపిస్తుందనిపిస్తుంది. కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయ న అక్షర అస్త్ర సన్యాసం చేయలేదు. అంపశయ్యను అధిరోహించిన భీష్మాచార్యుని వలె ఆయన అసంఖ్యాకులకు స్ఫూర్తి కలిగించారు.

జూన్ 12 పొద్దున విన్న విషాదకర వార్త మనసును కెలుకుతుండగా నే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఫోన్‌లో మాట్లాడమన్నారు రికార్డ్ చేయడానికి. నేను చాలా సెన్సిటివ్ గనుక చలిస్తున్న కంఠంతో ఫోన్‌లో చెప్పిన నాలుగు మాటలివి.. మహాకవి, మహావక్త, తెలుగు భాషా సరస్వతి ముద్దుబిడ్డ, మధుర సంభాషణా చతురుడు డాక్టర్ సినా రె అస్తమయం వార్త ప్రపంచమంతట తెలుగు సాహిత్య ప్రియులందరికి, తెలుగు కవితా రసాస్వాదన పిపాసువులందరికి నిశ్చయంగా అశనిపాతం. ఇజం గొడవలతో, వాదవివాదాలతో సంబంధం లేని నిజమై న కవీశ్వరుడు సినారె. మానవతావాదమే ఆ మహాకవి, ఆ మహామనీషి ఇజం, పవిత్ర ప్రబోధం. తెలంగాణ సిరిసిల్ల నేలపై జన్మించిన సినారె జానపద, ప్రాచీన, ఆధునిక సాహిత్య సంపదలను ఆపోశనం పట్టి, నిత్యం సమకాలీన సమాజం పరిణామాల పట్ల స్పందిస్తూ అత్యున్నత స్థాయి అవార్డులు, గౌరవాలతో జాతీయ, అంతర్జాతీయ సత్కారాలు, గుర్తింపుపొందిన మధురకవి. ఆయన ఊపిరులలో కవితలు, కవితాత్మక కావ్యాలు పల్లవించాయి.

ప్రతిధ్వనించాయి. ఊపిరి ఉన్నంతవరకు ఆయన కవితావాణి ఆగలేదు.. కలం, గళం రెండూ ఆయన అమోఘ అస్ర్తాలు.. హనుమాజీపేట నుంచి హైదరాబాద్‌కు, ఇంకా ఆవలి తీరాలకు, నిమ్నోన్నతాల్లో నిశ్చలంగా, నిశ్చయంగా, నిర్భయంగా పయనించిన సారస్వత మహారథి నారాయణరెడ్డి. ఒదుగకుండానే ఎదుగడం, సర్వోన్నత శిఖరాలను అధిరోహించడం ఆయన ప్రత్యేకత, విశిష్ఠత. ఆయన పుట్టినగడ్డ, నేల, మట్టి ప్రశస్త పరిమళాలు ఆయన వ్యక్తిత్వంలో, మనోజ్ఞ కవిత్వంలో సౌరభాలను వెదజల్లాయి. హైదరాబాద్ నగరంలో ని చాదర్‌ఘాట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే వరకు సినారె ఉర్దూ పదాలు మిళితమైన, అచ్చమైన తెలంగాణ తెలుగు మాట్లాడేవాడని ఆయన క్లాస్‌మెట్స్, రూమ్‌మెట్స్ అన్నారు. ప్రముఖ ఉర్దూ కవుల గజళ్లలోని మూల మకరందాలను తెలుగు పాఠకులకు అందించి, ఆస్వాదిం పజేయడంలో సినారె ఉర్దూ పాండిత్యం ఎంతో ఉపకరించింది. ఆధునికాంధ్ర కవిత్వం.. సంప్రదాయములు ప్రయోగములు అన్నది అత్యం త జటిల విషయం. ఈ అంశంపై అపార పరిశోధన, పరిశీలన, విశ్లేషణ జరిపి సినారె రచించిన అద్భుతమైన థీసిస్‌కు డాక్టరేట్ లభించి యాభై ఐదు ఏండ్లయింది. గత అరువై ఏండ్ల కాలం సినారె సారస్వత స్వర్ణయుగం. సారస్వత లోకంలో, అన్ని, అన్ని ప్రక్రియల్లో తానై ఆయన విరాట్ స్వరూపంతో విస్తరించారు. తనదైన ఒక తెలుగు సారస్వత లోకా న్ని ఆయన సృష్టించారు. కవిబ్రహ్మ అన్న మాటకు పర్యాయపదం సినా రె. కొందరిని శ్రీశ్రీ రాయని భాస్కరులు అని ఎగతాళి చేసేవాడు. సినా రె విరామం లేకుండా రాశులుగా రాసి, తెలుగు సరస్వతికి అమూల్య ఆభరణాలను అర్పించి ప్రకాశించిన భాస్కరుడు.

జంటకవులు కాకున్నా జంటకవుల వలె, కవి సోదరుల వలె కన్పించి, వ్యవహరించి, ప్రవర్తించి, కాళోజీతో కలిసి తెలంగాణ రచయితల సం ఘం స్థాపించి అపూర్వ సారస్వత చైతన్యాన్ని రేకెత్తించిన, కవితా వాతావరణాన్ని సృష్టించిన అత్యాధునిక మహాకవులు నారాయణరెడ్డి, దాశర థి. తిమిరంతో సమరం అన్నారు దాశరథి. నా రణం మరణంపైనే అన్నారు సినారె. సినారె అరువై ఏండ్ల అహర్నిశల కృషితో, అక్షర తపస్సుతో సాధించిన సారస్వత మహోన్నత వ్యక్తిత్వం ఈ తరం, భావితరాల కవులు, రచయితలు, మేధావులందరికీ గర్వకారణమైంది, మార్గదర్శకమైంది. తాపీ ధర్మారావు పండితులెందరో తప్పులెత్తి చూపిన మహా పండితుడు. సాహిత్య పరిశోధనలో ఆయనది ఆధునిక, శాస్త్రీయ దృక్పథం. చేమకూర వెంకటకవి విజయవిలాసం కావ్యంపై హృదయోల్లాస వ్యాఖ్య రచిస్తున్నప్పుడు రెండేండ్లు తాపీ వారి ముందు సహాయకుడిగా కూర్చునే అవకాశం, అదృష్టం నాకు లభించినయ్. నన్నయాది కవుల వ్యర్థపద ప్రయోగంపై విమర్శలు కుప్పిస్తున్న తాపీవారు సినారెను మహాకవి అని ప్రశంసిస్తున్నప్పుడు (ఆ రోజుల్లో శ్రీశ్రీ, ఆరుద్ర, గోరాశాస్త్రి తదితరులు తాపీవద్దకు తరచూ వస్తుండేవారు) నేను ఆనందంతో పొంగిపోయేవాణ్ణి. ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి బయటికి రాకముందే (అప్పుడు నేను కామర్స్, ఎకనామిక్స్ విద్యార్థిని) నేను రాసిన మహాక వి గురజాడకు అఖిల భారతస్థాయిలో యునెస్కో అవార్డు లభించినప్పుడు సినారె గారి అభినందలను మరిచిపోలేను.

ఒక వార పత్రికలో వారంవారం ప్రచురితమైన నా చెప్పుకోదగ్గ మనుషలు ఒక గ్రంథంగా ప్రచురితమైనప్పుడు సినారె నిలువుటద్దం శీర్షికతో పీఠిక రాశారు. అం దులోని కొన్ని వాక్యాలు.. వ్యక్తులు చరిత్రలను సృష్టిస్తారు. చరిత్రలు వ్యక్తులను తీర్చిదిద్దుతాయి. అయితే, పురుషుల్లో పుణ్య పురుషల్లాగ వ్యక్తుల్లో ఏ పిడికెడు మంది వ్యక్తులో చరిత్ర పుటల్ని తొడుక్కుని కీర్తిమూర్తులై నిలుస్తారు.. మిత్రుడు దేవులపల్లి ప్రభాకరరా వు ఎన్నుకున్న వ్యక్తులు విభిన్న రంగాలకు చెందినవాళ్లు.. ప్రభాకరరావు సూక్ష్మ పరిశీలకుడు, సునిశిత పరిశోధకుడు.. అస్తమానం కథలు, నవలలు, కవితలతో తలమునకలవుతున్న తెలుగు భారతికి ప్రభాకరరావు చేసిన వివిధ విఖ్యాత వ్యక్తుల రేఖాచిత్రణం చల్లని ఊరట, తీయని ఊపిరి. ఈ వాక్యాలు రాసి నన్ను అభినందించినప్పుడు ఆయన అధికార భాషా సం ఘం అధ్యక్షుడు. ఆయన అభినందనలు నాకు ఆశీస్సులు. విశ్వగీతి విన్పించిన సినారె విశ్వంభర వేదం వల్లించి విశ్వ మానవుడిగా వినుతి పొందారు. విశ్వంభర కావ్యాన్ని ముగిస్తూ మహాకవి, మహామనీషి సినా రె సాగిపోయే ప్రవాహం, చావులేని జీవితం అన్నారు. ఈ వాక్యాల్లో ఆయన మానవాళికి అందించిన మహత్తర సందేశం ఇమిడి ఉన్నది. సినారె గళం, కలం నుంచి పొంగి వచ్చిన మాటలన్నీ రసాత్మక కావ్యాలే. సినారె పాటలు సైతం పదలాలిత్యం, భావ ఔన్నత్యం, సాహిత్య ప్రమాణాలతో శాశ్వతత్వాన్ని సంతరించుకోవడం విశేషం.

తెలంగాణ ప్రజాభీష్టానికి అనుగుణంగా అవతరించిన తెలంగాణ రాష్ర్టానికి ప్రజాస్వామ్యవాది సినారె హార్ధిక స్వాగతం పలికారు. మూడేం డ్ల పాటు ఆయన తెలంగాణ ప్రభుత్వ తీరు తెన్నులను, రాష్ట్ర సర్వతో ముఖాభ్యుదయానికి జరుగుతున్న అపూర్వకృషిని, సాధిస్తున్న అద్భుత విజయాలను తిలకించారు. తెలుగు భాష, సారస్వతం, సంస్కృతి వికాసానికి సీఎం నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం కంకణధారణ చేసిన సత్యా న్ని ఆయన గమనించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యాన తొలి తెలుగు ప్రపంచ మహాసభల నిర్వహణకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన మహా సంకల్పం ఆయనకు హర్షం కలిగించింది. ఇంతవరకు ఇక్కడి కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు ఎన్నడూ ఊహించని గౌరవం, గుర్తింపు తెలంగాణలో వారికి లభిస్తున్నాయి. ఎదురయినచో తన మద కరీంద్రము డిగ్గి కేలూత యొసగి ఎక్కించుకొనియె అని అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థానంలోని పెద్దన కవికి ఇచ్చిన గౌరవం గురించి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సాటిలేని సంస్కారంతో, నిండు హృదయంతో సినారె గారి అంతిమయాత్రలో ఇచ్చిన గౌరవం ఇంతవరకు ఈ దేశ చరిత్రలో, బహుశా ప్రపంచ చరిత్రలో ఇంకే కవికి, రచయితకు లభించలేదు.
prabhakarrau

900
Tags

More News

VIRAL NEWS