నిత్య విద్యార్థిగా నా అనుభవాలు

Sat,May 20, 2017 01:45 AM

కేయూ నేలలో, గాలిలో పరివ్యాపితమై ఉన్న ప్రజాస్వామిక సంస్కృతి ప్రభావంతో విశాలమైన పంచాన్నివెలిగించే దివిటీలు చిన్నవో, పెద్దవో వెలిగించే ఉంటారు. వాళ్లందరూ మన అందరిలో ఉన్నారు. అపూర్వమైన ఈ తెలుగు విభాగపు పూర్వవిదార్థి సమ్మేళనం సారవంతంగా, అర్థవంతంగా జరుగాలని ఆశిస్తున్నాను.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 1967లో వరంగల్‌లో ఏర్పడిన పీజీ సెంటర్ తొలి అధ్యయన శాఖల్లో తెలుగు విభాగం ఒకటి. కాకతీ య విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆ బీజం నుంచి మొలకెత్తి పెరిగి మహావృక్షమైంది. యాభై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విభాగ చరిత్రను స్మరించుకోవడానికి, ఆ స్ఫూర్తితో మరో యాభై ఏళ్ల నడకకు జవసత్వాలు సమకూర్చుకోవడానికి ప్రేరణగా నేడు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తుండటం సంతోషకరం. నేను ఈ తెలుగు విభాగపు విద్యార్థిని అన్నది నాకెప్పుడూ గర్వకారణమే. 1975లో పీజీ ఫస్టియర్ పూర్తిచేసే నాటికి తెలుగు అధ్యయన శాఖ ఓయూ పరిధిలోనే ఉండేది. సెకండియర్లోకి వచ్చాక 1976 ఆగస్టు 19న కేయూ ఏర్పడింది. తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధి ఆకాంక్ష కాకతీయ విశ్వవిద్యాలయంగా ఫలవంతమైన చరిత్రకు ప్రత్యక్ష సాక్షిని కావడం నాకు అద్భుతంగా అనిపిస్తుంది.

కాకతీయ విశ్వవిద్యాలయపు మొదటి సెనేట్‌కు మానవీయ సామాజిక శాస్త్ర విభాగాల నుంచి నేను, గణితశాస్త్ర విభాగం నుంచి సాంబయ్య విద్యార్థి ప్రతినిధులుగా ఎంపికవడం ఊహించని ఒక గొప్ప అవకాశం. సెనేట్ సమావేశంలో కొత్త యూనివర్సిటీ విద్యార్థులకు ఉండే ఉద్యోగ అవకాశాలను గురించి మాట్లాడిన సంగతి నాకు గుర్తుంది. దాని ఫలితమే అనుకుంటా అన్ని విభాగాల్లోనూ మా మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎంఏ పూర్తి కాగానే మెరిట్ ప్రకారం ఖాళీగా ఉన్న అధ్యాపక స్థానాలకు తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారు. తర్వాత కాస్త ముందూవెనుకా అందరి ఉద్యోగాలు స్థిరీకరించబడ్డాయి.

నేను చదువుకు ఇక్కడ చేరింది 1975లో అయినా, మా నాన్న కేతవరపు రామకోటిశాస్త్రి గారి వల్ల 1969 నుంచే నాకు ఈ తెలుగు విభాగంతో పరిచయం ఉన్నది. పీజీ సెంటర్ తెలుగు విభాగాన్ని స్వతంత్రంగా అభి వృద్ధి చేయటానికి బిరుదురాజు రామరాజుతో పాటు మా నాన్న ఓయూ నుంచి పదోన్నతిపై బదిలీ అయి వరంగల్ వచ్చారు. దువ్వూరి వెంకట రమణశాస్త్రిని పిలిపించుకొని పీజీ పిల్లలకు వ్యాకరణం రుచి చూపేందుకు ఉపన్యాసం ఇప్పించడమేకాక నాన్న తాను ప్రత్యేకంగా ఇంట్లో ఆయనచేత పాఠాలు చెప్పించుకొని వినడం నాకు బాగా గుర్తు. విశ్వనాథ సత్యనారాయణను తెలుగు విభాగానికి తీసుకొచ్చి విశ్వనాథ పీఠాన్ని ప్రారంభించటం కూడా గుర్తున్నది. బిరుదురాజు రుక్మిణి, పాకనాటి జ్యోతి, వీరపద్మజ, బి.కామేశ్వరి పీజీ విద్యార్థులుగా అప్పుడప్పుడు మా ఇంటికి రావటమూ గుర్తే.

ఎంఏలో మా బ్యాచ్‌లో చేరినవాళ్లలో చాలామంది మొదటి సెమిస్టర్ పూర్తికాకూండానే చదువు వదిలేసి వెళ్లిపోయారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు మిగిలిన వాళ్లం ఏడుగురం. నేను, రమ, రంగమణి, సుగుణ, రాం గోపాల్, నరహరి, కృష్ణమూర్తి. జ్ఞానగంధం తీయటానికి అధ్యయనమే సాన అని ఆచరణలో చూపిన గురువులు ఒక మహత్తర ప్రభావం. మా నాన్నతో పాటు కోవెల సుప్రసన్న, మాదిరాజు రంగారావు, జీవీ సుబ్రహ్మణ్యం, కాశీనాథుని నాగేశ్వరరావు పాఠాలు చెప్పిన గురువులు.
ఎంఏ తర్వాత పీహెచ్‌డీ కోసం సుప్రసన్న గారి దగ్గర మరో ఐదేళ్లు చదువుకొనే అవకాశం దొరికింది. ఈ లోగా నేనూ తెలుగు విభాగం అధ్యాపక వర్గంలో చేరాను. అప్పటికీ నాకు పాఠాలు చెప్పిన అధ్యాపక త్రయం (కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్న, మాదిరాజు రంగారావు)తోపాటు పేర్వారం జగన్నాథం, హరి శివకుమార్, కోవెల సంపత్ కుమారాచార్య, బిరుదురాజు రుక్మిణి అధ్యాపకులుగా ఉన్నారు. వారందరితో కలిసి పనిచేయడంలో వాళ్ల పాఠబోధనా పద్ధతులు, పరిశోధనా దృక్కోణాలు, విద్యావిషయక నిబద్ధత, పాలనాదక్షత, వ్యవహారశైలి లాంటివి సన్నిహితంగా చూస్తూ, తెలుసుకొంటూ నేర్చుకొనే అదృష్టం కలిగింది.

ఇప్పుడు తెలుగు శాఖాధిపతి అయిన ప్రొఫెసర్ బన్న అయిలయ్య నాకు తొలి బ్యాచ్ ఎంఏ విద్యార్థి. అతని కవిత్వ శక్తి గురించి, అధ్యయన దృక్పథం గురించి, సాహిత్య విమర్శ వ్యాసంగం గురించి నేను ప్రత్యేకం గా చెప్పనక్కరలేదు. ఇతడితోపాటు ఇక్కడ ఉండవలసిన ఇతడి బ్యాచ్ విద్యార్థి మంచి కవి, అధ్యయనశీలి, సాహిత్య విమర్శకుడు అయిన డాక్టర్ సీతారాం. డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు కూడా ఆ బ్యాచ్ విద్యార్థే. నా గురువుల నుంచి ఎంత నేర్చుకున్నానో అంతగానూ వీళ్లందరి నుంచి నేర్చుకున్నాను. నేర్చుకోవడం ఒక రోజుతోనో, రెండేళ్ల ఎంఏతోనో, ఒకటీరెండు డిగ్రీలతోనో అయిపోదని, చుట్టూ ఉన్న చలనశీల సమాజ సాహిత్య మానవ సం బంధాల నుంచి తెలుసుకొనేది ఎప్పుడూ ఏదో ఒక కొత్తది ఉం టుందని అనుభవం చెప్పింది. ఆ రకంగా నేనీ తెలుగు విభాగపు నిత్య విద్యార్థిని.

లాల్ బనో గులామీ ఛోడో కవిగా, గొప్ప విప్లవ గేయ గాయకుడిగా నాకు తెలిసిన ఎన్‌కే రామారావును డిపార్ట్‌మెంట్లో చూడటం, మాట్లా డటం ఎంతో బాగుండేది. అతడి బ్యాచ్‌మేట్, మంచి స్నేహితుడు గంగాధర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడయ్యాడు. వాళ్లిద్దరికీ స్నేహితుడు అంబాలవాసి లింగమూర్తి, రాడికల్ విద్యార్థి ఉద్యమం నుంచి నల్లమల విప్లవోద్యమంలోకి నడిచివెళ్లాడు. తెలుగు విభాగంలో విదార్థి దశ అంటే వీళ్లందరూ గుర్తుకువస్తారు.
Vidma
ఈ యాభై ఏళ్లలో ఇక్కడ చదివినవాళ్లు ఎంతోమంది ఎన్నెన్నో ఉద్యోగాలను చేస్తూ, ఉన్నత పదవులు అధిష్టిస్తూ వ్యక్తిగతంగా ఎదిగి ఉంటారు. కేయూ నేలలో, గాలిలో పరివ్యాపితమై ఉన్న ప్రజాస్వామిక సంస్కృతి ప్రభావంతో విశాలమైన ప్రపంచాన్ని వెలిగించే దివిటీలు చిన్నవో, పెద్దవో వెలిగించే ఉంటారు. వాళ్లందరూ మన అందరిలో ఉన్నారు. అపూర్వమైన ఈ తెలుగు విభాగపు పూర్వవిదార్థి సమ్మేళనం సారవంతంగా, అర్థవంతంగా జరుగాలని ఆశిస్తున్నాను. తెలుగు విభాగం అధ్యాపకవర్గానికి, అధ్యాపకేతర సిబ్బందికి, పరిశోధక విద్యార్థులకు, ఎంఏ విద్యార్థులకు ఈ సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు.
(వ్యాసకర్త: ఎమిరేటిస్ ప్రొఫెసర్, తెలుగు విభాగం, కేయూ)(నేడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పూర్వవిద్యార్థుల సమ్మేళనం)

548
Tags

More News

VIRAL NEWS