శ్రీలంక సుస్థిరతే భారత్‌కు భద్రత

Fri,May 19, 2017 01:00 AM

ఇరవై ఎనిమిది ఏండ్ల తరువాత భారత ప్రధా ని శ్రీలంక సందర్శించడం పట్ల దక్షిణాసియా ప్రాంత దేశాలలోనే కాకుండా, అంతర్జాతీయంగా ఆసక్తి వ్యక్తమవుతున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో ప్రధా ని మోదీ శ్రీలంక పర్యటన రెండు దేశాలకు ఉపయోగకరమే కాకుండా, ఈ ప్రాంత సుస్థిరతకు ఎంతో తోడ్పడుతుంది.

కేంద్ర ప్రభుత్వం శ్రీలంకలోని తమిళుల హక్కుల కోసం, విదేశాలలోని భారతీయ సంతతి ప్రజల సంక్షేమం కోసం
నిజాయితీతో కృషిచేస్తున్నది. అంతర్జాతీయ సంబంధాలు ఉద్వేగాలపై ఆధారపడి ఉండవని తమిళనాడులోని రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలె. అంతర్జాతీయ సంబంధాలు కేంద్ర పరిధిలోని అంశం. రాష్ట్ర పరిధిలోనిది కాదు.

ఐక్యరాజ్యసమితి వైశాఖ దినోత్సవం (బుద్ధ పూర్ణిమ) సందర్భంగా ప్రధాని శ్రీలంక సందర్శించారు. భారత శ్రీలంక సంబంధాలు ఎంతో సంక్లిష్టంగా మారాయి. రెండు దేశాల మధ్య అనేక సమస్యలున్నాయి. శ్రీలం క సమస్య ప్రభావం తమిళనాడుపై కూడా పడుతున్నది. ఈ నేపథ్యంలో మోదీ తలపెట్టిన రాజకీయేతర పర్యటనకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఏర్పడ్డది.

ఈ సందర్భంగా శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే కొంత కాలం కిందట చేసిన వ్యాఖ్య గుర్తు తెచ్చుకోదగినది. అన్ని దేశాలు శ్రీలంకకు మిత్రదేశాలే. అయితే భారత్ మాత్రం శ్రీలంకకు బంధు దేశం అన్నారాయన. నిజంగా కూడా శ్రీలంకలోని అనేకమంది ప్రజలు భారత సంతతికి చెందినవారే. వీరిలో 15 శాతం మంది తమిళులు. తమిళనాడు ప్రజలు మరిచిపోలేని ముఖ్యమంత్రి ఎంజీఆర్ శ్రీలంకలో నే జన్మించారని ప్రధాని మోదీ ఈ పర్యటన సందర్భంగా గుర్తుచేశారు. శ్రీలంకతో సంబంధాల విషయం చర్చకు వచ్చినప్పుడల్లా తమిళనాడు రాజకీయ నాయకులు దీనిని తమిళుల పరిస్థితి, వారి భవిష్యత్తుతో ముడిపెట్టి మాట్లాడుతుంటారు. శ్రీలంక తమిళులలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం జాఫ్నా రాజ్యంలోని తమిళుల సంతతి. మరోవర్గం బ్రిటిష్ కాలంలో 19,20 శతాబ్దాలలో తేయాకు తోటలలో పనిచేయడానికి వెళ్లిన వారి సంతతి. తేయాకు తోటలలో పనిచేయడానికి వెళ్ళిన వారిలో చాలామంది స్వాతంత్య్రం వచ్చిన తరువాత తిరిగి వచ్చారు. అక్కడే ఉన్నవారిని శ్రీలంక తమిళులు అంటారు. వీరికి అక్కడ శ్రీలంక పౌరసత్వం ఉన్నది.

వీరు శ్రీలంక జనాభాలో 11.21 శాతం. ఉత్తరాది రాష్ర్టాలలో వీరిదే మెజారిటీ. తూర్పు రాష్ర్టాలలో కూడా ప్రబలంగా ఉం టారు. ప్రధాని మోదీ తమిళ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. భారతీయ సంతతికి చెందిన వీరు భారత, శ్రీలంక దేశాల మధ్య వారధిగా మోదీ పేర్కొన్నారు.తమిళుల జనాభా కోణంలోనే రెండు దేశాల మైత్రి మొదలుకాదు, ముగియదు. అయితే మన తమిళనాడు రాష్ట్రంలో శ్రీలంక పట్ల వైఖరిని నిర్ణయించడానికి ఈ జాతి, భాష, మత, సాంస్కృతిక అంశాలు ప్రాధా న్యం వహిస్తున్నాయి. చైనాతో సంబంధాల విషయం వచ్చేసరికి బ్రహ్మపుత్ర జలాల సమస్య ముందుకువస్తుంది. పాకిస్థాన్‌తో ఇండస్ జలాల సమస్య ఉన్నది. శ్రీలంకతో పాక్ జలసంధిలో చేపలు పట్టడం సమస్య ఉంటుంది.

తమిళ సమస్య కూడా ఉన్నది. పొరుగు దేశాలతో సంబంధాలు బలపరచుకోవాలని భావించినప్పుడు, సరిహద్దుల్లో ఉన్న మన రాష్ర్టాల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోకతప్పదు. కానీ రాష్ర్టా ల సమస్యలు మాత్రమే అంతర్జాతీయ సంబంధాలను నిర్ణయించే అం శాలు కాకూడదు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రజల అవసరాలు, మనోభావాలు పట్టించుకుంటూనే, శ్రీలంకలోని తమిళుల ప్రయోజనాలకు పాటుపడుతూనే, శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలను వాస్తవికతా పునాదిపై వృద్ధి చేసుకోవలసి ఉంటుంది. ఇదెంతో సంక్లిష్టమైన వ్యవహా రం. కానీ మన దేశంలోని రాష్ర్టాల నాయకులు జాతీయ దృక్పథంతో అంతర్జాతీయ సమస్యలను అర్థం చేసుకోవడం లేదు. ఇది చాలా విచారకరమైన అంశం.

భారతదేశ వ్యూహాత్మక భౌగోళిక రాజకీయాలలో శ్రీలంకకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. దక్షిణ భారత ద్వీపకల్పన రక్షణకు అగ్రగామి దేశం గా శ్రీలంకను చెప్పుకోవచ్చు. హిందు మహా సముద్రంపై భారత్ ఆధిపత్యం సంపాదించడానికి, సముద్ర మార్గాన్ని నియంత్రించడానికి, వ్యూహాత్మక విధానాలకు శ్రీలంకతో సత్సంబంధాలు తప్పనిసరి. వాణి జ్య అవసరాలకు సముద్ర మార్గాలు కీలకమైనవని తెలిసిందే. చైనా దక్షిణాసియాలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. శ్రీలంక భారత్ భయాందోళనలను అర్థం చేసుకొని వ్యవహరించాలె. కానీ కానీ తమిళుల అంశం మూలంగా శ్రీలంకను పూర్తిగా మనవైపు తిప్పుకోలేని పరిస్థితి ఉన్నది. అనేక దేశాలలో సరిహద్దుకు ఇరువైపులా ఒకే జాతి వారుండటం అసాధారణమేమీ కాదు. తమిళులు కూడా ఇరు దేశాలకు విస్తరించి ఉన్నారు. దేశాలను సరిహద్దులు విడదీసినా ఇరువైపులా ప్రజల మధ్య అనుబంధం తెగిపోదు.

యూరోపియన్ దేశాలలో వలసల సమస్య పెద్దగా మారింది. అమెరికాలో అనేక జాతులు, మతాల వారున్నారు. భిన్నభాషలు మాట్లాడేవారున్నారు. బహుళ సమాజాలలో అనేక సమస్యలుంటాయి. భారత్‌లో సరిహద్దు వద్ద నివసించే పంజాబీలు, అస్సామీలు, కశ్మీరీలు, బెంగాలీలకు అవతలివైపు ప్రజలతో సన్నిహిత సంబంధాలుంటాయి.
హిందు మహా సముద్రంలో కీలక ప్రాంతంలో ఉన్న శ్రీలంకపై చైనా ఎంతోకాలంగా కన్నేసి ఉన్నది. చైనా లక్ష్యం వాణిజ్య అభివృద్ధి మాత్రమే కాదు. శ్రీలంక వాయువ్య ప్రాంతంలోని మన్నార్ జలసంధిలో చమురు సహజవాయువు నిక్షేపాల అన్వేషణకు భారత్‌తో పాటు చైనా కూడా హక్కులు సంపాదించింది. దీనివల్ల శ్రీలంకలో తిష్టవేయడానికి చైనాకు సాకు దొరికింది. శ్రీలంక ఆగ్నేయ తీరంలో రేవును వృద్ధిచేయడానికి, చమురు నిలువ వసతులు నిర్మించడానికి చైనా ఇంజినీర్లు కృషిచేశారు.

భారత్ చుట్టూరా ఉన్న దేశాలతో స్నేహం పెంచుకోవాలనేది చైనా దౌత్య విధానం. శ్రీలంకలో తమిళుల మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతున్నదని తమిళనాడులో రాజకీయ పక్షాలు ఎంతోకాలంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా శ్రీలంకకు ఐరాసలో అండగా నిలిచింది. చైనాకు సార్క్‌లో పరిశీలక హోదా లభించేవిధంగా శ్రీలంక సహకరించింది. ఇదే రీతిలో శ్రీలంకకు ఆగ్నేయాసియా దేశాల కూటమిలో పరిశీలక హోదా ఇవ్వడానికి చైనా తోడ్పడ్డది. చైనా శ్రీలంకను మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, దీనికి ప్రతిగా భారత్ స్పందించక తప్పదు.

చైనా ఇటీవల వన్ బెల్ట్ వన్ రోడ్ అనే భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలను కలిపే భారీ ప్రాజెక్టు ఇది. ఇం దులో భాగంగా చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌ను కూడా చేపట్టింది. ఈ భారీ ప్రాజెక్టులో అన్నిదేశాలు చేరవచ్చునని ప్రకటించింది. ఇందుకోసం చర్చించడానికి బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ ఏర్పాటుచేసింది. చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను, ఆర్థిక వ్యవహారాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ కారిడార్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ గుండా పోవడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇతర దేశాలకు చైనా ప్రపంచీకరణను, స్వేచ్ఛా వాణిజ్యాన్ని, పెట్టుబడులను, శాంతియుత సంబంధాలను ప్రోత్సహించే దేశంగా ప్రచారం చేసుకుంటున్నది. యాభై ఏండ్ల కింద భారత్ చైనా ప్రవచించి న పంచశీలను ఈ మధ్య గుర్తుచేసింది.

ఈ విధంగా భారత్‌కు ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో మన దేశానికి దక్షిణాన శ్రీలంక ఎంతో కీలకంగా మారింది. హిందు మహా సముద్రంలో నౌకాదళ కార్యకలాపాలకు శ్రీలంక అనుకూలమైన స్థావరం. ఈ ఒక్కకారణం చాలు, భారత్ శ్రీలంకతో మైత్రి పెంపొందించుకోవడం ఎంత అవసర మో అర్థం చేసుకోవడానికి. శ్రీలంకతో కచ్చతీవు దీవి వంటి ఎన్నో సమస్యలున్నాయి. ఈ దీవిని మన దేశం స్వాధీనంలోకి తెచ్చుకోవాలని, ఎట్లయినా తమకు భద్రత కల్పించాలని శ్రీలంక తమిళ మత్స్యకారులు కోరుతున్నారు. అయితే ఇవేవీ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇవేవీ అడ్డంకి కాకూడదు.

ఇరు దేశాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సమస్యలకు పరిష్కారాలు అన్వేషించాలె. మత్స్యకారుల సమస్య భారత అంతర్జాతీయ సంబంధాల్లో భాగం కాదు. సముద్ర జలాల చట్టాలు, చేపలు పట్టే హక్కులకు సంబంధించిన సంక్లిష్టమైన ఆర్థిక అంశమది. దీనిని మత్స్యకారులు జీవనోపాధి సమస్యగా చూడా లె. మానవతా దృక్పథంతో దీనిని అర్థం చేసుకొని పరిష్కరించాలె. కానీ ఉద్వేగాలు పెంచి జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగేలా చేయకూడదు. అంతర్జాతీయ సంబంధాలకు అనేక కోణాలుంటాయి. దేశంలోని కేంద్ర రాష్ట్ర సంబంధాలు, జాతుల ఉద్వేగపూరిత అంశాలు ఎన్నికల లబ్ధి కోసం పనికివస్తాయి.

శ్రీలంకతో సంబంధాలకు అడ్డంకి కాకూడదు.శ్రీలంక సమైక్యత, సమగ్రత, సార్వభౌమతాన్ని పరిరక్షించడం ఆ దేశానికి ఎంత అవసరమో, మన దేశానికీ అంతే అవసరం. శ్రీలంక సుస్థిరతతో ఉండటం, శాంతియుతంగా ఉండటం మన దేశ ప్రయోజనాల రీత్యా అత్యావశ్యకం. భారత్‌కు వేల ఏండ్లుగా దక్షిణాసియా దేశాలతో సాంస్కృతిక, భాషాపరమైన సంబంధాలున్నాయి. ఈ సంబంధాలను చెడగొట్టుకోకుండా, వీటి పునాదిపై ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేర్చుకోవాలె. అయితే కేంద్ర ప్రభుత్వం శ్రీలంకలోని తమిళుల హక్కుల కోసం, విదేశాలలోని భారతీయ సంతతి ప్రజల సంక్షేమం కోసం నిజాయితీతో కృషిచేస్తున్నది. అంతర్జాతీయ సంబంధాలు ఉద్వేగాలపై ఆధారపడి ఉండవని తమిళనాడులోని రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలె. అంతర్జాతీయ సంబంధాలు కేంద్ర పరిధిలోని అం శం. రాష్ట్ర పరిధిలోనిది కాదు.
-(వ్యాసకర్త: ఐసీఎస్‌ఎస్‌ఆర్ మాజీ డైరెక్టర్)
-(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)


-డాక్టర్ ఎస్.సరస్వతి

437
Tags

More News

VIRAL NEWS