నీళ్ల సారుకు కళాంజలి

Fri,May 19, 2017 12:57 AM

విద్యాసాగర్‌రావు తెలంగాణ థియేటర్ రిసెర్చ్ సెంటర్ బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి తన నాటక ప్రయాణ మలుపులను వివరించారు.ఇంతకాలం జలసాగరుడిగానే మనందరికి తెలిసిన విద్యాసాగర్‌రావు
కళాసాగరుడన్న మాట మాకు ఒకింత ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించింది.

vijay
తెలంగాణ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున లేచిన సందర్భం తెలంగాణ సమాజాన్ని మలుపు తిప్పింది. ఈ ప్రజా ఉద్యమంతో పాటు సాహిత్యకారులు, కళాకారులు, పరిశోధకులు తమ తమ రంగాల్లోకి ఒక్కసారి తెలంగాణ చూపును ప్రసరింపజేశారు. ఎందరో పరిశోధకులు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రలను, సినిమా ఇతర కళలను పరిశోధించి తెలంగాణ ఉనికిని వెలుగులోకి తెచ్చారు. ఈ క్రమంలో కొంతమంది పరిశోధకులు తెలంగా ణ నాటకరంగ అస్తిత్వాన్ని వెతుక్కునే ప్రయత్నాలు చేశారు. తెలుగు నాటక రంగంలో తెలంగాణ నాటకం ఎక్కడుందని ప్రశ్నించే గొంతుకులకు సమాధానంగా తెలంగాణ నాటకానికి శతాబ్దాల చరిత్ర ఉందన్న విషయా న్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తెలంగాణ లో విస్మృతమైన, అక్షరరూపందాల్చని ఎందరో నాటక మహనీయులున్నారని తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. ఆ ప్రయత్నం లో భాగంగా తెలంగాణ ఆధునిక నాటకానికి ఆద్యుడిగా పేర్కొనదగిన మంత్రి శ్రీనివాసరావు తెలుగు నాటకరంగంలో ప్రతిభావంతమైన పాత్ర పోషించారని తొలిసారిగా వెలుగులోకి తెచ్చింది. ఆయన హైదరాబాదీ అని ఎవరికీ తెలియదు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి మంత్రి శ్రీనివాసరావు జయంతి సభను 2017 జనవరి 1న రవీంద్రభారతి వేదికపై నిర్వహించి తెలంగాణ సమాజానికి టీటీఆర్‌సీ పరిచయం చేసింది. ఈ సభలో అతిథిగా పాల్గొన్న నీటి పారుదలరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు తాను కూడా నటుడిగా, నాటక రచయితగా, ప్రయోక్తగా నాటకరంగంలో తన ప్రయాణాన్ని వివరించారు. ఆ సభ ద్వారా ఆయనలో కొత్త కోణం ఆవిష్కృతమైంది.

సాగునీటిపై సాధికారికంగా మాట్లాడటమే కాదు, నదీజలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటాపై విద్యాసాగర్‌రావు చేసిన కృషి తెలంగాణ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆయన ఉద్యమ కాలం లో నీటి నిజాలను నిగ్గుతేల్చి తెలంగాణ మట్టి రుణాన్ని తీర్చుకున్న ముద్దుబిడ్డ. ఉద్యమంలో కేసీఆర్ అడుగులో అడుగై నడిచిన విద్యాసాగర్‌రావు బీడు భూములకు నీటినెలా తరలించాలో మేధోయజ్ఞం చేశారు. అందుకే ఆయన సాగునీటి నిపుణుడిగా యావత్తు తెలంగాణ ప్రజలకు దీపపు స్థంభమై కనిపిస్తారు. కానీ, నటుడిగా, నాటక రచయితగా, ప్రయోక్తగా ఈ తరానికి దాదాపు తెలియదు. విద్యాసాగర్‌రావు జీవితంలో జలవిజ్ఞానం, నాటక విజ్ఞానం జమిలిగా కనిపిస్తాయి.

ఆయనచేసిన వృత్తి జలశాస్త్రవేత్తగా నిలబెడితే, ప్రవృత్తి నటుడిగా, రచయితగా నాటకరంగం సుస్థిరం చేసింది. ఇంజినీరింగ్ చదువుకుంటున్న సమయంలోనే నాట్య విద్యాలయంలో మూడేళ్ల సాయంకాల నటశిక్షణా కోర్సును పూర్తిచేశారు. అబ్బూరి రామకృష్ణారావు, మంత్రి శ్రీనివాసరావు, ఎ.ఆర్. కృష్ణ లు అధ్యాపకులుగా ఉండేవారు. మంత్రి శ్రీనివాసరావును నాటకరంగం లో తనకు మొదటి గురువుగా విద్యాసాగర్‌రావు పేర్కొంటారు. నాట్య విద్యాలయంలో సినీనటులు త్యాగరాజు, ప్రఖ్యాత రంగస్థల నటులు భానుప్రకాష్, లక్ష్మీ కనకాల, రవీందర్‌రెడ్డి వంటివారు ఆయనకు సహ విద్యార్థులు. అక్కడ మృచ్ఛకటికం, కన్యాశుల్కం వంటి నాటకాలు ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడ్డాయి. నాట్య విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన అనేక నాటకాల్లో నటుడిగా పాల్గొన్నాడు.
1960లో రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇంజినీరుగా ఉద్యోగంలో చేరిన విద్యాసాగర్‌రావు 1990 వరకు రాష్ట్ర సరిహద్దులు దాటి అనేక పదవుల ను నిర్వహించారు. హైదరాబాద్‌లో కొంతకాలం, ఢిల్లీ, అహ్మదాబాద్, రూర్కేలాలలో సుదీర్ఘకాలం పనిచేశారు.

అయితే ఆయన ఉద్యోగ ప్రయాణంలో నాటకం వెన్నంటే నడిచింది. ఆయన చేసే వృత్తి తన ప్రవృత్తికి ఏనాడు ఆటంకం కలిగించలేదు. ఉద్యోగం చేసే ప్రతిచోట నాటక మిత్రులను ప్రోదిచేసింది. తొలిరోజుల్లో గిరీశం పేరుతో కవిత్వం రాసిన ఆయ న సృజన నాటకంవైపు పరుగులు తీసింది. ఎక్కువగా ఉత్తర భారతదేశం లో పనిచేయడం వల్ల తెలుగు నాటకాలతో పాటు హిందీ నాటకాలను ప్రదర్శించారు. ఢిల్లీలో పనిచేసిన కాలంలో ఢిల్లీ తెలుగు అసోసియేషన్‌లో సభ్యుడిగా అనేక నాటకాలను ప్రదర్శించారు. ఆల్ ఇండియా రేడియోలో ఢిల్లీ కేంద్రంగా ప్రసారమయ్యే నాటకాల్లో పాల్గొనేవారు. ఏకధాటిన వెయ్యి రేడియో నాటకాల్లో ఆయన పాల్గొన్నారు. మట్టి బంగారం, పంజరంలోని పక్షులు, ఇదేమిటి, ఈ ఇల్లు అమ్మబడును, వాన వెలిసింది వంటి ఎన్నో నాటకాలను ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకున్నారు.

విద్యాసాగర్‌రావు నటుడిగానే కాకుండా నాటక రచయితగా, దర్శకుడి గా నాటక రంగంలో ఆయన పాదముద్రలు కనిపిస్తాయి. 1960 నుంచి 75 వరకు ఆయన నాటక రచనా ప్రస్థానంలో 2 నాటకాలు, 11 నాటిక లు రచించారు.అలాగే క్షంతవ్యులు, గుడ్‌బై నాటకాలు రాశారు. దేవుడయ్య, గంధర్వులే తీరుస్తా రు, కొత్తదారి, ఆప్‌కీ అదాలత్, నారు మనది నీరు వాడిదా, ప్రధా నం, వార్షికోత్సవం, ఓ ఆఫీ సు కథ, నిన్న నేడు రేపు, ఇంటర్వ్యూ నాటికలను రచించా రు. 1972లో ఫ్యామిలీ ప్లానిం గ్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండి యా రేడియో, దూరదర్శన్‌లు సంయుక్తంగా కుటుంబ నియంత్రణ పై జాతీయ నాటక పోటీలను ఆహ్వానించాయి. తెలంగాణ మాండలికంలో విద్యాసాగర్‌రావు నారు మనది నీరు వాడిదా నాటికను రాసి పోటీకి పంపారు. గంపెడు సంతానంతో సంసారాన్ని పోషించలేక చేతులెత్తేసి తప్పుకాదని సమర్థించుకునే వారిని, భవిష్యత్ తరాన్ని ప్రశ్నార్థంగా మార్చిన పెద్దతరాన్ని సున్నితంగా మేల్కొలిపిందీ నాటిక. జాతీయ పోటీ ల్లో మొదటి బహుమతి అందుకున్నది. ఈ నాటిక ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమైంది. రంగస్థలంపై అనేకసార్లు ప్రదర్శితమైంది.

విద్యాసాగర్‌రావు తెలంగాణ థియేటర్ రిసెర్చ్ సెంటర్ బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి తన నాటక ప్రయాణ మలుపులను వివరించారు. ఇంతకాలం జలసాగరుడిగానే మనందరికి తెలిసిన విద్యాసాగర్‌రావు కళాసాగరుడన్న మాట మాకు ఒకింత ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించిం ది. ఆయన స్వదస్తూరితో రాసుకున్న 2 నాటకా లు, 9 నాటికలను అటకపై నుంచి దుమ్ము దులి పి మా ముందుపెట్టారు. ఆయన నాటక రచన లు ముద్రణా రూపంలోకి తీసుకువచ్చి, ప్రదర్శింపజేయాలనే ఆయన కోరిక మేరకు తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ ప్రయత్నాలు ప్రారంభించింది. వారే స్వయంగా మాతో వచ్చి మామిడి హరికృష్ణను కలిసి నాటక ప్రదర్శనలకు రవీంద్రభారతి వేదిక కావాలని 2017, మే 18,19,20 తేదీలను ఖరారు చేయించారు.

ఒకవైపు నాటకాల రిహార్స ్స కొనసాగుతూనే ఉన్నాయి. ప్రదర్శనలకు సన్నద్ధమవుతు న్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆర్.విద్యాసాగర్‌రావు 2017 ఏప్రిల్ 29న తుది శ్వాస విడిచి తమ జీవన నాటకరంగం నుంచి నిష్ర్కమించారు. ఈ నేపథ్యంలో విద్యాసాగర్‌రావు గారి నాటకాల సంపుటి ఆవిష్కరణతో పాటు వారి నాటక ప్రదర్శనలను మే 20వ తేదీ వరకు రవీంద్రభారతి వేదికపై ప్రదర్శిస్తున్నాం. ఈ నాటకోత్సవాలను విజయంతం చేయడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి.

353
Tags

More News

VIRAL NEWS