మళ్లీ నాటకం వేయాలని ఉంది..

Sat,April 29, 2017 11:54 PM

తెలంగాణ నీళ్ళ జాడల వెతుకులాటకు మార్గం చూపిన స్వచ్ఛమైన నీటి ఊటలాంటి నిలువెత్తు పెద్దమనిషీ నీకు కన్నీళ్లతో మా అశ్రునివాళి. ఆర్.విద్యాసాగర్‌రావు ఈ పేరును తెలంగాణ ఉద్యమ స్పృహ ఉన్న ఎవరికీ పరిచయం చేయాల్సి న అవసరం లేదు. నీటి కోసం, నిధుల కోసం. నియామకాల కోసం పుట్టి గెలిచిన ఉద్యమంలో సారథికి నీడలా ఉన్నావు. కోట్లాది. తెలంగాణ మట్టి బిడ్డల ఆకాంక్షలకు అండగా నిలబడ్డావు. సమయం, సందర్భం ఏదైనా పారే నీటి ధారలా తెలంగాణ స్వయంపాలన ఆకాంక్షను ఢిల్లీకి వినబడేలా నినదించావు. అది మీలో ఉన్న స్వతః సిద్ధ పోరాట లక్షణం. బలమైన ఆలోచనా స్రవంతి లోంచి పుట్టిన ఆవేశం. అయితే ఆర్.విద్యాసాగర్‌రావు ఆలోచనాపరులైన నిపుణుడే కాదు, ఒక సున్నిత, సునిశిత కళాకారుడు, రచయిత. ఆయనలో ఉన్న ఈ కోణాన్ని తెలంగాణ సమాజానికి చెప్పాలన్నదే నా ప్రయత్నం. యువకుడిగా ఉన్నప్పుడే రంగస్థలంపై ఉన్న మక్కువతో రం గస్థల శాస్త్రం చదివి ఎన్నో నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించిన గొప్ప నటుడు. ఉద్యోగ బాధ్యతల్లో ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపాల్సి వచ్చినా అక్కడ కూడా తోటి ఉత్సాహవంతులతో నాటకాల లో పాల్గొనేవారు. కేవలం నటించటంతోటే ఆగిపోకుండా తనలో చెలరేగిన భావాలకు, తను చూసిన తెలంగాణ ముఖచిత్రాల్లోని చీకటి వెలుగులకు అక్షరరూపం ఇచ్చి 10 నాటకాలు, 2 నాటకాలు రాసి దేశవ్యాప్తంగా ప్రదర్శించిన నాటక రచయిత.

తన జీవితకాల స్వప్నం సాకారమయ్యాక, స్వతంత్ర తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణవైపు పరుగులు పెడుతున్న సందర్భంలో మళ్లీ తనలోని నాటక కళాకారున్ని తెలంగాణ వేదిక మీద ఆవిష్కరించుకోవాలని ఆరాటపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నాటక రంగం అభివృద్ధి జరుగాలని ఆకాంక్షించారు. జరుగుతున్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి తన నాటకాలను మూడు రోజుల నాటకోత్సవంగా రవీంద్ర భారతి వేదికపై జరుపుకోవాలని ఆ సందర్భం చూడాలని మమ్మల్ని పరుగులు పెట్టించారు. ఆయన రాసిన నాటకాలను ఒక పుస్తకంగా ముద్రించి, నాటకోత్సవాలు నిర్వహించటానికి తెలంగాణ రీసెర్చ్ సెంటర్ ముందుకురాగానే ఆయన కళ్ళల్లో ఒక మెరుపును చూశాం. ఆ వేడుకలు ఘనంగా జరుగాలనీ, తన ఉద్యమ సహచరుడు, ఆప్తుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని.. ఎన్నో ఆలోచనల్ని మాతో పం చుకున్నా.. ఆయన తన చివరి కోరిక చూడకుండానే వెళ్లిపోవటం నిజంగా మా దురదృష్టం. కానీ మాస్టా రూ! ఉద్యమకారుడిగానే కాదు కళాకారుడిగా ముఖ్యంగా తెలంగాణ నాటకరంగం మిమ్మల్నీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని భావిస్తూ నిలువెత్తు నిరాడంబరామా.. మీకు ఇదే మా కళాంజలి!
- శ్రీధర్ బీచరాజు, తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్

229
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles