ఉదయకాంతుల ఉగాది

Sat,March 21, 2015 01:52 AM

ఉదయకాంతి రాగాలతో మబ్బుల్ని
చీల్చుకుంటూ వచ్చే ఇనబింబం
భూపాలరాగామాలపిస్తూ అంబరాన
పిట్టల గుంపులు..
లేలేత పచ్చని మేలిముసుగులు
పంచవర్ణాల చిలుకల ఎదలో మత్తిల్లే మౌనరాగాలు
బంగారురంగులో మెరిసే మీనాల తుళ్ళింతలు
కిలకిల నగవుల కమ్మని తెమ్మెరల కలువల హేలలు
మిలమిలమెరిసేటి మెత్తని పచ్చికపై
మంచు మౌక్తికాలు!
మధువులూరుతూ మందారపు మొగ్గల
సిగ్గిల్లుతూ నేలకు చూపులు విసుర్లు!
మారాకులు మావిడాకుల
మాలలుగా కూర్చుతున్నాయి..
పొన్నాయిపూలను
పట్టిలుగా చుట్టుకుని ఘల్లుఘల్లుమని
సిరిమువ్వల సవ్వ్వడితో
ఏతెంచే శివరంజనిలా చైత్రలక్ష్మి
సెలయేటి ఝరుల్లో కూచిపూడి నాట్యభంగిమలు
చిట్టిచేమంతుల్లో ఐక్యమైన
చిలిపి తూపుల తూణీరాలు
గరికపూలు తేనెలు చిమ్ముతూ..అద్దుకునే
తుషారబిందువుల తపనల తడి
పంచవర్ణ పద్మాల పరాగాల
పుప్పొడిలో వెన్నెల జల్లు
శంపాలతల సౌరభాలు
వనమంతా గుప్పుమంటున్నాయి
రాయంచల కన్నుల్లో పలికే వేనవేల
వేణుగానరవళుల రసపూర్ణికలు
రెమ్మరెమ్మకూ కమ్మని
వేపపూతల ముత్యాల పూసలు
పిల్లగాలులు మోసుకొచ్చే సుగంధాల
సురుచిర సుస్వరవాహినులు
మలయమారుతాలు వనకన్య చెక్కిళ్ళపై
లిఖించే మకరికా పత్రాలు
పుష్పబాణుడి కోసం పండువెన్నెల్లో
మధు సేవనంలోఅలిసిన తుమ్మెదలు
నిండు యవ్వనంతో నవనవలాడే వనకన్యకు
నవమల్లికల వరమాలలు..
మందాకినీ అలలపై పయనించే
రసమయ తుంబురుని వీణానాదాలు
చూపుల కౌగిలింతలతో
గోరువంకల ఎదలో గుసగుసలు
శ్రీగంధపు పూతలతో సుమనోహర కుసుమదళాలు
మన్మధశరాలతో మత్తుగొలిపే వీచికా
ప్రమోదాల ప్రహేళికలు
మోద ఖేదాల మయూరాల వింజామరలు
దినకరునికి కొండాకోనా కలిపి ఆలపించే
కర్పూర నీరాజనాలు
మత్తకోకిల మంజులవాణులతో
మావిచివుళ్ళ చెక్కిళ్ళపై నిగ్గులు..
ఇదే మన ఉదయకాంతుల ఉగాది.. !!

927
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles