పల్లెల అభివృద్ధి

Tue,January 22, 2019 06:22 PM

పంచాయతీల పాలనావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేసీఆర్ కాంక్షిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే కొంతకాలంపాటు పంచాయతీరాజ్ శాఖను తానే నిర్వహిస్తానని కూడా అన్నారు. ప్రజలు కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో చైతన్యవంతంగా వ్యవహరిస్తూ పల్లెలను అభివృద్ధి చేసుకోవాలె. అవినీతికి తావు లేకుండా, అభివృద్ధి పథకాలన్నీ సక్రమంగా అమలు కావాలంటే, గ్రామపరిపాలనలో ప్రజలు సంపూర్ణ భాగస్వాములు కావడం అవసరం.

కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో రాష్ట్ర అభివృద్ధి గమనంపై మరింత దృఢ విశ్వాసం ప్రజల్లో ఏర్పడ్డది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను, దేశంలోనే తలమానికంగా తళుకులాడుతున్న తీరును చక్కగా వివరించారు. గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి సమాధానం విన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, పరిపాలన తీరుతెన్నులపై ప్రజలకు మరింత ధీమా ఏర్పడ్డది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రభుత్వ వ్యూహాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహజశైలిలో అత్యంత విపులంగా సాధారణ పౌరులకు కూడా అర్థమయ్యే రీతిలో వివరించారు. అభివృద్ధి పథకాలు, గణాంకాలంటే సామాన్యులకు అర్థం కానివనే ధోరణికి భిన్నంగా ముఖ్యమంత్రి మొదటినుంచి ప్రజాస్వామ్యస్ఫూర్తితో ప్రతి ఒక్క అంశాన్ని గోరుముద్దలు పెట్టినట్టు ప్రజలకు వివరిస్తుంటారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రుణాలకు సంబంధించి, నీటి పారుదల ప్రాజెక్టులపై, ఇతర పరిపాలనాపర అంశాలపై కేసీఆర్ చెప్పిన అంశాలు కొందరు గిట్టనివారు చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేశా యి.

వచ్చే ఐదేండ్లలో మొత్తం రెవెన్యూ పది లక్షల కోట్ల మేర ఉంటుందని, దీనిని జాగ్రత్తగా ప్రజల అభివృద్ధి కోసం వెచ్చిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.2.40 లక్షలు రుణాలు తీర్చడానికి సరిపోతుందని, ఈ రుణాలను సక్రమంగా చెల్లించడం వల్ల మళ్లా రూ.1.3 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకోవడానికి అర్హత లభిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితులకు లోబడి రుణాలు తీసుకుంటున్నది. ఈ రుణాలను కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం సహేతుకంగా వినియోగిస్తున్నది. ఎంత కాదన్నా, వచ్చే ఐదేండ్లలో వేతనాలు, ఇతర ఖర్చులు పక్కనపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అభివృద్ధి కోసం వెచ్చించడానికి నిధులు ఐదు లక్షల కోట్లు ఉంటాయని సీఎం వెల్లడించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టలేదు కనుకనే ఇక్కడి సమాజం ఛిన్నాభిన్నమైంది. పల్లెలు కకావికలమయ్యాయి. రుణాలను సక్రమంగా వినియోగించలేదు. ప్రాజెక్టుల వల్ల కాంట్రాక్ట ర్లు, నాయకులు బతికారు తప్ప, పొలాలకు నీళ్లు రాలేదు. ప్రజల దప్పిక తీరలేదు. కానీ కేసీఆర్ పాలన ప్రజాసంక్షేమం లక్ష్యంగానే సాగుతున్నదని గత నాలుగున్నరేండ్ల పాలన వల్ల స్పష్టమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. 2014 ఎన్నిక ల్లో హామీ ఇవ్వని 72 కొత్త పథకాలను అమలు చేసింది. కేసీఆర్ పథకాలు ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రవేశపెట్టేవి కాదని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజల అవసరాలను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలను ప్రవేశపెడుతున్నారు. నీటి పారుదల ప్రాజెక్టులను కూడా అత్యంత వేగంగా పూర్తిచేస్తున్నారు.

నీటిపారుదల ప్రాజెక్టుల మొత్తం అంచనా 2.25 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఇప్పటివరకు.. 1.07 లక్ష కోట్లు వెచ్చించారు. అతిత్వరలో ప్రాజెక్టులన్నీ పూర్తిచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు దేశంలోనే అత్యధికంగా 17.17 శాతం ఉండటం అసాధారణం. పైగా ఈ ఏడాది 29.93 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతున్నది. జీఎస్టీ వసూళ్లలో కూడా మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉన్నదని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్రం అందిస్తున్న తోడ్పాటుకు సంబంధించి వెల్లడించిన విషయాలు ఆలోచింపదగినవి. మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ పథకాల కోసం 24 వేల కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ సూచించింది. అయినా కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. గత నాలుగేండ్లు కేంద్రం తెలంగాణ పట్ల ఏ మాత్రం సౌహార్దపూరితంగా లేదు. కేంద్రంలో మన అనుకూల ప్రభుత్వమే కనుక ఉంటే కనీసం మరో లక్ష కోట్ల రూపాయల మేర అదనపు నిధులు వస్తాయని ముఖ్యమం త్రి వివరించారు. కేంద్రంలో తెలంగాణ రాజకీయశక్తి కీలకపాత్ర పోషించాలే తప్ప, జాతీయ పార్టీల ముందు చేతులు కట్టుకొని నిలబడే వారివల్ల ప్రయోజనం ఉండదు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, రాష్ర్టాభివృద్ధి, సామాజిక ప్రాధాన్యాల విషయంలో అత్యంత స్పష్టతతో వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలను కట్టుదిట్టంగా అమలుచేయడంతో పాటు, గ్రామస్థాయిలో రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని వెల్లడించారు. అడవుల పరిరక్షణపై కూడా పట్టుదలగా ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే సమగ్ర ప్రణాళికను అమలు చేసే క్రమంలో ఉన్నారు. ఇందులో రైతు సమన్వయ సమితులు కీలక పాత్రపోషిస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మహిళల సాధికారతకు కూడా మార్గం పడుతుంది. వచ్చే ఐదేండ్లలో వ్యవసాయం రూపురేఖలు మారిపోతాయి.

పంచాయతీల పాలనా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేసీఆర్ కాంక్షిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే కొంతకాలం పాటు పంచాయతీరాజ్ శాఖను తానే నిర్వహిస్తానని కూడా అన్నారు. ప్రజలు కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో చైతన్యవంతంగా వ్యవహరిస్తూ పల్లెలను అభివృద్ధి చేసుకోవాలె. అవినీతికి తావు లేకుండా, అభివృద్ధి పథకాలన్నీ సక్రమంగా అమలు కావాలంటే, గ్రామపరిపాలనలో ప్రజలు సంపూర్ణ భాగస్వాములు కావడం అవసరం.

320
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles