కేటీఆర్-జగన్ భేటీ


Sat,January 19, 2019 01:32 AM

టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహ న్‌రెడ్డితో జరిపిన సమావేశం పలువిధాలుగా ప్రాధాన్యం గలది. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం దేశ రాజకీయ స్వరూపాన్ని సమూలంగా మార్చే మహత్తర ప్రయోగం. ఇదే జరిగితే రాష్ర్టాలకు అధికారాలు పెరిగి దేశ పరిపాలనా స్వభావమే మారిపోతుంది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఎంపీలు పార్లమెంట్‌లో సమన్వయంతో వ్యవహరిస్తే బలమైన జట్టుగా ఏర్పడి తమ డిమాండ్లను సులభంగా సాధించుకోవచ్చు. ప్రతిదానికి కేంద్రాన్ని బతిమాలుకోవలసిన దుస్థితి ఉండదు. తెలంగాణ, ఏపీలలోని రాజకీయపక్షాల మధ్య సత్సంబంధాలు నెలకొంటే రెండు రాష్ర్టాలను వేధిస్తున్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. నిజానికి ఈ సమస్యలన్నీ రాజకీయ నాయకులు స్వార్థం కోసం సృష్టించినవి. నాయకులు విజ్ఞతతో వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు. కేటీఆర్, జగన్ భేటీ వల్ల ఏ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం లేదు. అయినా ఈ భేటీపై టీడీ పీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరగణాలు కొంపలు మునిగిపోయినట్టు గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉన్నది. ఈ ఇరువురు యువనాయకుల భేటీ ఇంతకాలం చంద్రబాబు అనుసరించిన కుత్సిత రాజకీయాలకు భిన్నంగా ఉండటం వల్లనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నిక లు సమీపించినప్పుడు, బాబ్లీ ప్రాజెక్టు దగ్గరకు పోయి చొక్కా చింపుకొని ప్రజలను రెచ్చగొట్టాలనుకోవడం చంద్రబాబు తరహా రాజకీయం. గోదావరి నదిపై ప్రాజెక్టులకు సంబంధించి ముం బై వెళ్ళి మహారాష్ట్ర ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా చర్చించి ఒప్పందం కుదుర్చుకోవడం కేసీఆర్ తరహా రాజనీతి. ఈ దృక్కోణంలో తేడానే కేటీఆర్-జగన్ భేటీపై చంద్రబాబు చిందులు వేయడానికి కారణం.


ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాన్నిచ్చాయనేది జాతీయ రాజకీయాలను గమనించేవారికి ఎవరికైనా అర్థమవుతుంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణానికి ప్రయత్నించేనాటికి ఏదో జాతీయపార్టీని ఆలంబన చేసుకొని నిలబడాలనే దుర్బల మనస్తత్వం ప్రాంతీయ పార్టీలకు ఉండేది. లోక్‌సభ ఎన్నికల్లో ఏ జాతీయపార్టీకి మెజార్టీ రానప్పటికీ రెండింటిలో ఏదో ఒకదానిని భుజాన మోయడం తప్ప గత్యంతరం లేదనే అభిప్రాయం పాతుకపోయి ఉన్నది. ఏదో ఒక జాతీయపార్టీతో అవగాహన కుదుర్చుకొని, యూపీఏలో లేదా ఎన్డీయేలో చేరడం వరకు మాత్రమే ప్రాంతీయపార్టీల నాయకులు ఆలోచించేవారు. కేసీఆర్ ముందుకు వచ్చేవరకు ఈ చట్రం నుంచి ప్రాంతీయ నాయకు లు బయటపడలేదు. ప్రాంతీయ పార్టీల బలహీన త జాతీయపార్టీలకు పెద్దరికాన్ని ఇచ్చింది. ఆయా జాతీయపార్టీల నాయకులు ప్రాంతీయ పార్టీల అధినేతలతో నయా జమీందారుల్లా అహంకార పూరితంగా వ్యహరించిన సందర్భాలూ ఉన్నాయి. కేంద్రంతో సఖ్యత లేకపోతే నిధులు రావని, కేసు లు పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తాయని, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తాయని భయాందోళనలు ఉండేవి. ఏదో ఒక జాతీయపార్టీని పట్టుకొని యాల్లాడాలనే పాతకాలపు మనో దౌర్బల్యంతోనే టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీని మోసినంత కాలం మోసి, ఇప్పుడు యూపీఏ పల్లకీని మోస్తున్నాడు. కాంగ్రెస్ కూటమిలో కొనసాగుతూ అందుకు అనుగుణంగా వివిధ పార్టీల నాయకులను వెళ్ళి కలుసుకున్నా డు. ఫెడరల్ స్ఫూర్తితో సాగుతున్న యత్నాలను హర్షించాలనే సోయి కూడా కలుగడం లేదు.

కేసీఆర్ ప్రతిపాదన కార్యరూపం దాల్చకముందే విజయ సౌరభాన్ని వెదజల్లుతున్నది. కేసీఆర్ యత్నాల వల్ల ప్రాంతీయపార్టీల నాయకుల్లో ధీమా పెరిగింది. దీంతో జాతీయపార్టీలు బావురుమంటూ ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరుగడం మొదలైంది రాష్ర్టాలకు మరిన్ని అధికారాలు ఉండాలనే సైద్ధాంతిక పునాది ఉండటం వల్ల దాదాపు ప్రాంతీయ పార్టీలన్నీ ఈ కొత్త ప్రయత్నాలకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ప్రాంతీయపార్టీల మధ్య సంఘీభావం పెరిగింది. ఈ క్రమంలోనే ఏపీలో బలమైన పార్టీ అయిన వైఎస్సార్సీపీతో చర్చలు సాగిస్తున్నారు. దేశ రాజకీయాలు సమూల మార్పులకు లోనవుతున్న చారిత్రక పరిణామంలో తెలంగాణ, ఆం ధ్ర ప్రజలు భాగస్వాములు కావడం సంతోషకరం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం స్వపరిపాలన కోసమే తప్ప తమకు వ్యతిరేకం కాదనేది ఆంధ్ర ప్రజలకు ఇప్పటికే స్పష్టమైంది. తెలంగాణ ఉద్యమ విలువలు, టీఆర్‌ఎస్ సమర్థవంతమైన పాలన నేపథ్యంలో ఆంధ్ర ప్రజలు కూడా తమ రాష్ట్ర రాజకీయాలను కొత్త కోణంలో చూస్తున్నారు. తెలంగాణ నాయకులకు సౌహార్ద్ర స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు ఏకంగా వైఎస్సార్సీపీ చర్చలు కూడా జరుపుతుండటంతో పాతకాలపు రోత రాజకీయాలకు అలవాటుపడిన చంద్రబాబుకు ఒంటినిండా జెర్రులు పాకినట్టుగా ఉన్నది. చంద్రబాబు వంటి కుటిల రాజకీయ నాయకులు, వారి గణాలు ఎంత మొత్తుకున్నా, తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య సంఘీభావాన్ని పెంపొందించి, అభివృద్ధిపథంలో నడిపించవలసిన బాధ్యత రెండు రాష్ర్టాల్లోని బాధ్యతాయుత రాజకీయపక్షాలపై ఉన్నది.

532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles