బీజేపీ సమ్మేళనం

Wed,January 16, 2019 11:05 PM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండురోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ సమ్మేళనం పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని, ప్రజలలో ఆశాభావాన్ని నింపలేకపోయింది. దేశం నలుమూలల నుంచి దాదాపు 12 వేల మంది ప్రతినిధులు హాజరైన ఈ సమ్మేళనం ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని పార్టీ నాయకత్వం భావించింది. ప్రధాని మోదీ పరిపాలన ప్రధానాంశంగానే ఎన్నికల ప్రచారం సాగుతుందనేది ఈ సమావేశం ద్వారా ధ్రువపడ్డది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర ప్రముఖులు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు. ప్రతిపక్షాలు గెలిస్తే అస్థిరత్వం నెలకొంటుందని, సాహసవంతుడైన నాయకుడికి, నాయకుడు లేని అవకాశవాద కూటమికి మధ్య పోటీ జరుగుతున్నదని రాజకీయ తీర్మానంలో వ్యాఖ్యానించింది. బీజేపీ నాయకత్వం కార్యకర్తలకు ఎన్నయినా చెప్పవచ్చు. కానీ ఎన్నికల సమయంలో ఏమి చెబుతారనేది ప్రజలను మెప్పించే విధంగా ఉండాలె. ప్రజలను మెప్పించే మాటలు మాట్లాడాలంటే మొదట మోదీ పాలనలోని విజయాలు, వైపల్యాలపై పార్టీ నాయకత్వం నిష్పక్షపాతం గా ఆత్మవిమర్శ చేసుకోవాలె. ఆర్థికాభివృద్ధి, విదేశాంగం, చట్టబద్ధపాలన, పరిశుద్ధపాలన మొదలైన రంగాలలో మోదీ ప్రభుత్వం సాధించినదేమిటో, వైఫల్యాలు ఎదురైతే అందుకు కారణాలేమిటో ప్రజలకు వివరించాలె. పార్టీ పెద్దలు మోదీ నాయకత్వాన్ని ప్రశంసించినంత మాత్రాన ప్రజలు ఆమోదించాలనేమీ లేదు. భారత్ ఇరుగు పొరుగు దేశాలలో వ్యతిరేకత ప్రబలడం మొదలుకొని నోట్ల రద్దు విధానం బెడిసికొట్టడం వరకు విపులంగా పార్టీలో ఇప్పటికే ఆంతరంగికంగానైనా చర్చించి, కార్యకర్తలకు స్పష్టత ఇవ్వడం మంచిది.

బీజేపీ జాతీయ సమ్మేళనంలో మొదటి రోజు ఆమోదించిన వ్యవసాయ తీర్మానం ఈ రంగం లో సంక్షోభాన్ని తొలిగించడానికి మోదీ ప్రభు త్వం ఏమి చేసిందో వివరించలేకపోయింది. స్వామినాథన్ సూచనల ప్రకారం రైతుల పండించిన ఖర్చుకు అదనంగా యాభై శాతం లాభం వచ్చే విధంగా చూస్తామని బీజేపీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని నెరవేర్చలేకపోయింది. దేశవ్యాప్తంగా రైతువర్గంలో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకున్నది. ఉత్తరాది రాష్ర్టాలలో జాట్లు, గుజరాత్‌లో పటీదారులు, మహారాష్ట్రలో మరాఠాలు ఇట్లా- పలు రాష్ర్టాలలో రైతు వర్గాలు తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టాయి. తమిళనాడులో జల్లికట్టు విషయమై ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగడానికి కూడా అంతర్లీనంగా వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభమే కారణమనే అభిప్రాయం ఉన్నది. మధ్య ప్రదేశ్‌లోనైతే ఆందోళన ఒక దశలో అదుపు తప్పింది. బీజేపీ పై వ్యతిరేకత ప్రబలడానికి వ్యవసాయ సంక్షోభమే కారణం. గుజరాత్ శాసన సభ ఎన్నికల లో అతి కష్టంగా కాంగ్రెస్‌పై విజయం సాధించినప్పటికీ బీజేపీపై ప్రజలలో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని అప్పుడే తెలిసిపోయింది. ఇటీవలి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోయాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ బీజేపీ నెట్టుకు రాలేకపోయింది. ఈ మూడు రాష్ర్టాల పరాజయాల నుంచి తగిన గుణపాఠాలు నేర్చుకోవాలని బీజేపీ రాజకీయ తీర్మానంలో కార్యకర్తలకు ఉద్బోధించింది. కానీ నేర్చుకోవలసింది పార్టీ కార్యకర్తలు కాదు, విధానకర్తలు!

ప్రధాని మోదీ తమ ప్రసంగంలో తమది ఉత్తమమైన పాలన అని చెప్పుకుంటూ, ప్రతిపక్షాల పాలన అవినీతిమయమని దుమ్మెత్తి పోసారు. గత ప్రభుత్వాలు దేశాన్ని చీకటిలోకి నెట్టివేశాయనీ, 2004 నుంచి పదేండ్లపాటు సాగిన యూపీఏ పాలన అవినీతి, కుంభకోణాలతో నిండిపోయిందని ఆరోపించారు. 21వ శతాబ్దం ప్రారంభంలోని ఈ పదేండ్లు ఎంతో విలువైనవని ఆయన అన్నారు. కానీ దేశ చరిత్రలో మొదటిసారిగా తమ ప్రభుత్వంపై ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదని, ఇందుకు మనం గర్వపడవచ్చునని మోదీ చెప్పుకోవడం ఆశ్చర్యంగానే ఉన్నది. రాఫెల్ ఒప్పందంపై సాగతున్న రగడ అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా నల్లధనం ఉన్న వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయీల గురించిన పాపమంతా కాంగ్రెస్‌దే అనే విధంగా మాట్లాడారు. కానీ కొందరు ఎగవేతదారులు మోదీ హయాంలోనే దేశం నుంచి జారుకున్నారనేది జగద్విదితమే. విజయ్ మాల్యా మొదలుకొని దేశం విడిచిపోయినవారిని పట్టి తెచ్చి శిక్షించడం ఇప్పటివరకు జరుగలేదు. కాంగ్రె స్ అవినీతి గురించి మోదీ కొత్తగా ప్రజలకు చెప్పవలసిందేమీ లేదు. ఆ పార్టీ అవినీతి పాలనతో విసిగిపోవడం వల్లనే ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీకి పట్టం కట్టారు. మోదీ చెప్పుకోవలసింది తమ ఐదేండ్ల పాలనలో సాధించినదేమిటనేదే. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల గడువు మాత్రమే ఉన్నది. ఈ స్పల్ప కాలంలో ప్రజలను మెప్పించే అద్భుతాలు ఏమైనా చేస్తే చేయవచ్చు. అంతేకానీ ప్రతిపక్షాల బలహీనత వల్ల గట్టెక్కాలంటే మాత్రం సాధ్యం కాదు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నా, ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ముందుకు వస్తున్నాయనేది గమనించదగిన పరిణామం.

428
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles