యూపీలో పొత్తు


Tue,January 15, 2019 01:03 AM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ), మాయావతి సారథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పొత్తుపెట్టుకోవడంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు మరింత ఊపు వచ్చినట్టయింది. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిగా ఏర్పడిన ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్‌ను తమ కూటమిలో చేర్చుకోకపోవడం విశేషం. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక తీర్పు రావడం కాంగ్రెస్ కన్నా, ఎస్పీ, బీఎస్పీల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ రెండు రాష్ర్టా ల్లో బీజేపీ వ్యతిరేకత ద్వారా కాంగ్రెస్ పూర్తిగా లబ్ధి పొందలేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేకతతోపాటు, తమకున్న సామాజిక పునాది ద్వారా గెలువాలని ఎస్పీ, బీఎస్పీ భావిస్తున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎనభై లోక్‌సభ స్థానాలున్నాయి. అత్యంత బలమైన పార్టీలు ఎస్పీ, బీఎస్పీ ఏకతాటిపైకి రావడం విశేష పరిణామం. ఇదే సందర్భంలో ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ కూడా తాము బీజేపీ, కాంగ్రెస్ ల నేతృత్వంలోని ఏ కూటమిలో చేరబోమని స్పష్టం చేశారు. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలున్నాయి. మరో తూర్పు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ కూడా ఈ రెండు జాతీయ పార్టీల పట్ల విముఖంగా ఉన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు యత్నాల కోసం చేపట్టిన యాత్రలో తూర్పు ప్రాంత రాష్ర్టాలనే ఎంచుకోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని ఎనభై లోక్‌సభ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ చెరి 38 స్థానాలకు పోటీ చేస్తున్నా యి.

మిగిలిన నాలుగు స్థానాల్లో రెండు అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ్ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)కు వదిలిపెట్టాయి. సోనియా గాంధీ, రాహుల్ పోటీ చేసే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలను కాంగ్రెస్‌కు వదిలేసి పోటీ పెట్టకూడదని నిర్ణయించాయి. కాంగ్రెస్‌కు ఆ రెండు స్థానాల ను మర్యాద కోసం వదిలిపెట్టాయే తప్ప పొత్తు పెట్టుకొని కాదు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టనే అభిప్రాయం ఎస్పీ, బీఎస్పీలకు ఉన్నది. కాంగ్రెస్‌తో యూపీ వరకు పొత్తు పెట్టుకున్నా, దేశవ్యాప్తంగా కాంగ్రె స్ కూటమిలో భాగమైపోతాయి. జాతీయ స్థాయిలో ప్రధాని పదవి కోసం మోదీకి, రాహు ల్ గాంధీకి మధ్య పోటీగా కనిపిస్తుంది. అంతేతప్ప తమ బలం ఆధారంగా పోటీ పడుతున్న ట్టు కనిపించదు. రాహుల్‌గాంధీని నెత్తిన మోయడం వల్ల నష్టమే తప్ప అదనపు ప్రయోజనం ఏమీ లేదు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 21 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇంకా అదే భ్రమలో ఉన్నది. ఈసారి ఎంత కాదన్నా కనీసం 25 సీట్లు అడుగవ చ్చు. కాంగ్రెస్ నాయకత్వం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు కేటాయించే వరకు అఖిలేశ్ ను ఇబ్బంది పెట్టింది. ఈ అనుభవం మూలంగానే కాంగ్రెస్‌ను దూరంగా పెట్టాయి. యూపీ అంతటా విస్తరించి ఉన్న ఎస్పీ, బీఎస్పీ చెరి సగం సీట్లు పంచుకోవడమంటే, చెరి సగం సీట్లు వదులుకోవడం. క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల కార్యకర్తలు కలిసిపోవడం, ఓటు బ్యాంక్ బది లీ కావడం నాయకులు పొత్తు పెట్టుకున్నంత సులభం కాదు. అందుకే అజిత్‌సింగ్‌తో కనీసం చర్చలు జరుపకుండా రెండు సీట్లు వదిలిపెట్టాయి.

అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఏ ఒక్క పార్టీ ఒంటరిగా అధికారానికి రావడం కష్టతరం. కొంతకాలం సంకీర్ణ ప్రభుత్వాలే తప్ప ఏక పార్టీ పాలన జరుగలేదు. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఒక్కోసారి ఒక్కో పార్టీకి ప్రజలు మెజార్టీని అందించారు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ తెచ్చుకోవడం అసాధారణమైన ప్రజాతీర్పుగా చెప్పవ చ్చు. మోదీ ప్రభంజనంతో పాటు, కొన్ని సమీకరణాలు కలిసివచ్చాయి. గతంలో ఒకసారి అఖిలేశ్, మరోసారి మాయావతి అసెంబ్లీలో ఒంటరిగా మెజార్టీ స్థానాలు సాధించి అధికారం చేపట్టారు. ఒక దశలో అఖిలేశ్‌ను దెబ్బకొట్టాలనే భావనతో, మరో సందర్భంలో మాయావతిని బలహీనపరుచాలనే ఉద్దేశంతో ఇతర సామాజికవర్గాలు కేంద్రీకృతమైన ఫలితాలవి. ప్రజలు కులాలకు అతీతంగా ఓటేసిన అనుకూలాంశం కూడా ఈ ఫలితాల్లో దాగి ఉన్నది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ 21, ఆర్‌ఎల్‌డీ ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. అల్ప సం ఖ్యాకవర్గాలు కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన అసాధారణ సందర్భంలో లభించిన ఫలితమిది. దీన్ని కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉన్నట్టు చెప్పలేం. ఎస్పీ, బీఎస్సీ ఏకతాటిపై నిలుస్తే అల్ప సంఖ్యాకవర్గాలు ఈ కూటమివైపు మొగ్గవచ్చు. ఈ రెండు పక్షాలు ఏకమైన నేపథ్యంలో కాంగ్రెస్ వెంట ఉండే కొద్ది పాటి సంప్రదాయ ఓటు బ్యాంక్ వ్యూహాత్మకంగా బీజేపీ వైపు మొగ్గితే ఆ పార్టీకి లాభం. కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వల్ల తమకు పడని ఓట్లు చీలిపోతాయని ఎస్పీ, బీఎస్పీ కూటమి భావించవచ్చు. రాజకీయాల్లో కులాల లెక్కలు కొంతవరకే పనిచేస్తాయి. ప్రజానుకూలమైన పథకాలతో, విలువలతో కూడిన రాజకీయాలతో ఎన్నికలకు దిగడం దీర్ఘకాలికంగా ఉత్తమమైన పద్ధతి. లోక్‌సభ ఎన్నికల నాటికి ఇటువంటి ప్రత్యామ్నాయ అజెండాతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడటం అభిలషణీయం.

443
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles