అస్తిత్వ పరిరక్షణ

Fri,December 7, 2018 12:46 AM

స్వపరిపాలనలో ఎంతో ప్రగతి సాధించినప్పటికీ, తెలంగాణ ఇప్పటికీ చౌరస్తాలో నిలబడి ఉన్నది. విభజన చట్టంలోని కొన్ని అంశాల మూలంగా ఇంకా అనేక సవాళ్ళు మనముందున్నాయి. తెలంగాణ రాష్ట్రం తరఫున పోరాడే నాయకుడు ఉంటే తప్ప సంపూర్ణ తెలంగాణ సాధించుకోలేము. మరోవైపు పరాయిశక్తులు పొంచి ఉన్నాయి. వాటి కుట్రలను తిప్పికొడితే తప్ప మన అస్తిత్వాన్ని కాపాడుకొని బంగారు తెలంగాణ నిర్మించుకోలేము. ఈ రెండు కోణాలలో ఆలోచించి ప్రజలు జాగ్రత్తగా ఓటువేయవలసిన తరుణమిది. ప్రజల విజ్ఞత, చైతన్యమే తెలంగాణకు రక్ష.

తెలంగాణ ప్రజలు తమ ఓటు ద్వారా తమ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవలసిన కీలకమైన రోజు ఇది. దశాబ్దాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని, నాలుగున్నరేండ్లుగా ఎంతో కృషి చేసి సాగిస్తున్న అభివృద్ధి నిలుపుకోవడమనేది ప్రజల తీర్పుపై ఆధారపడి ఉన్నది. ప్రజలు తమ తీర్పు ఇచ్చే ముందు నాలుగేండ్లలో తెలంగాణ స్వపరిపాలన సాధించింది ఏమున్నది, ఇంకా సాగవలసింది ఏ దారులలో అనే స్పష్టత పొందవలసి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ముందు ఇక్కడి సమాజం పరాయి పాలనలో అన్నివిధాలా అణిచివేతకు గురైంది. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం కూడా క్యూలో నిలబడవలసి వచ్చేది. లాఠీదెబ్బలు కూడా తినవలసిన దుర్గతి పట్టింది. ఊరూరా ఆకలి కేకలు వినిపించేవి. కరెంటు ఉండదు, నీళ్ళు ఉండవు. చట్టబద్ధ పాలన లేకపోగా, ముఠాలదే రాజ్యం. మన భూమి మన చేతిలో ఉంటుందనే హామీ లేదు. భూ ఆక్రమణదారులు చెలరేగిపోయేవారు. పాలు కల్తీ, పసుపు కల్తీ, నూనెల కల్తీ, అయినా అడిగే దిక్కులేదు. మంచినీళ్ళు దొరుకవు కానీ, కల్తీ సారా, గుడుంబా పుష్కలం. కొత్త రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న అరాచక పరిస్థితులు ఇవి. పరాయి పాలకులు తామేదో గొప్పగా పాలించినట్టుగా చెప్పుకుంటూ, తెలంగాణ వస్తే చీకటి అలుముకుంటుందని, మనకు స్వపరిపాలన చేతకాదని పరాయిశక్తులు ఎద్దేవా చేశారు. కానీ ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రజలు కొత్త రాష్ర్టాన్ని కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ చేతిలో పెట్టారు. ఉద్యమనాయకుడే మొదటి పరిపాలకునిగా సమర్థవంతమైన పరిపాలన అందించారు. తెలంగాణ వస్తే జరిగే అభివృద్ధి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ నాలుగేండ్ల స్వపరిపాలన సగర్వంగా సాగిందని చాటుకుంటున్న నేపథ్యంలో విజయ గర్వంతో ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాం. సాధించిన విజయాలను మన తీర్పు ద్వారా సగర్వంగాచాటుకోవలసిన తరుణమిది.

ఈ నాలుగున్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. అన్నిరంగాలలో సర్వతోముఖాభివృద్ధి చెంది దేశంలో అత్యంత ఆర్థికాభివృద్ధి సాధించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో నిలిచింది. నాయకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తే అన్ని సమస్యలకు మౌలిక పరిష్కారాలు సాధించవచ్చునని నిరూపించింది. దాదాపు అన్నిరంగాలలో జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకొని కొత్త రాష్ట్రమైనా గొప్ప రాష్ట్రమనే భావనను జాతీయస్థాయిలో కలిగించింది. తెలంగాణ వస్తే ఏమి సాధిస్తారనే మందమతుల నోటికి తాళమేసే విధంగా పరిపాలన సాగింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కొత్త రాష్ట్రంలో మేము సాధించనిది ఏమున్నదని ఎదురు సవాలు విసురుతున్నారు. ఇంటింటికీ మంచినీరు అందించే మిషన్ భగీరథ వంటి అద్భుత ప్రయోగం దేశంలో మరెక్కడైనా సాగిందా? వచ్చే తరాలకు కూడా కరువు కాటమంటే తెలువకుండా చేసే, కాళేశ్వరం వంటి నీటి పారుదల వ్యవస్థ ప్రపంచస్థాయి అద్భుతం. ఎక్కడి నీళ్ళు అక్కడ ఒడిసిపట్టుకొని నిలువ చేసే చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ- ప్రపంచమంతా ఘోషిస్తున్న సుస్థిర జీవన విధానానికి మచ్చుతునక. గురుకులాలలో వేలాదిమంది దళిత గిరిజన విద్యార్థులు ఎదిగి వచ్చి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాకాలను ఎగురవేస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో తెలంగాణ వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ అధ్యయనవేత్తలు వచ్చి మన పథకాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణ వారికి స్వపరిపాలన చేతకాదని ఇప్పుడెవరైనా అనగలరా? బుడిబుడి నడకల వయసులోనే ఇన్ని అద్భుతాలు సాధించాం. అయినా బంగారు తెలంగాణ నిర్మాణానికి ఇప్పటి వరకు పునాదులు మాత్రమే పడ్డాయి. సాగవలసిన ప్రయాణం ఇంకా ఎంతో ఉన్నది. అలసత్వం వహిస్తే మొదటికే మోసం జరిగే ప్రమాదం పొంచి ఉన్నది.

ఈ ఎన్నికలలో రాజకీయ రంగం రెండు శిబిరాలుగా మోహరించి పోయి ఉంది. అయితే అయోమయంగా మాత్రం లేదు. ఎవరు ప్రజల పక్షమనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. ఒకవైపు మన జాతి అస్తిత్వాన్ని పరిరక్షించుకోవాలని తపన పడుతున్న తెలంగాణ శక్తులు నిలబడి ఉన్నాయి. మరోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టి దొడ్డిదారిన పరాయి పెత్తనాన్ని సాగించాలనే కుట్రదారులు ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తెలంగాణ శక్తులను గెలిపించుకోకపోతే, మళ్ళా పరాయి పెత్తనంలోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. స్వపరిపాలనలో ఎంతో ప్రగతి సాధించినప్పటికీ, తెలంగాణ ఇప్పటికీ చౌరస్తాలో నిలబడి ఉన్నది. విభజన చట్టంలోని కొన్ని అంశాల మూలంగా ఇంకా అనేక సవాళ్ళు మనముందున్నాయి. తెలంగాణ రాష్ట్రం తరఫున పోరాడే నాయకుడు ఉంటే తప్ప సంపూర్ణ తెలంగాణ సాధించుకోలేము. మరోవైపు పరాయిశక్తులు పొంచి ఉన్నాయి. వాటి కుట్రలను తిప్పికొడితే తప్ప మన అస్తిత్వాన్ని కాపాడుకొని బంగారు తెలంగాణ నిర్మించుకోలేము. ఈ రెండు కోణాలలో ఆలోచించి ప్రజలు జాగ్రత్తగా ఓటువేయవలసిన తరుణమిది. ప్రజల విజ్ఞత, చైతన్యమే తెలంగాణకు రక్ష.

561
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles