ట్రంప్‌నకు చెక్

Thu,November 8, 2018 10:50 PM

ప్రతినిధుల సభకు దేశవ్యాప్తంగా గల 435 నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు ఎన్నికవుతారు. కానీ సెనేట్‌లో ఉండే వంద సీట్లలో రెండేండ్లకు ఒకసారి మూడోవంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి రాష్ర్టానికి రెండు స్థానాలుంటాయి. అందువల్ల సెనేట్‌తో పోలిస్తే సూక్ష్మస్థాయిలో ప్రజాభిప్రాయం వ్యక్తమయ్యేది ప్రతినిధుల సభ ద్వారానే. అందువల్ల ట్రంప్‌కు రెండేండ్ల కింద ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదనవచ్చు. అయితే ట్రంప్ మెజార్టీవాదాన్ని లేవనెత్తి సమాజంలో చీలిక ద్వారా తన స్థానాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు.

అమెరికాలో కాంగ్రెస్ (ఉభయ సభలు)కు జరిగిన ఎన్నికల్లో- అధ్యక్షుడు ట్రంప్ సెనేట్ (ఎగు వ సభ)లో పట్టు కాపాడుకోగలిగినా, ప్రతిపక్షమైన డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల సభ (దిగువ సభ)లో మెజార్టీ సాధించడం విశేషం. 2010 తర్వాత డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల సభలో మెజార్టీ సాధించడం ఇదే మొదటిసారి. అమెరికాలో కార్యనిర్వాహక అధ్యక్షుడే శక్తిమంతుడు కనుక రెండేండ్లకు ఒకసారి జరిగే ఉభయ సభల ఎన్నికలపై అంత ఆసక్తి ఉండదు. కానీ ఈ సారి పోలింగ్ శాతం బాగా పెరిగిందంటే, ట్రంప్ అనుకూల, వ్యతిరేకశక్తులుగా అమెరికా సమాజం ఎంతగా చీలిపోయిందో అర్థమవుతున్నది. అల్ప సంఖ్యాకవర్గాలు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రతినిధుల సభలో కూడా గతంలో పోలిస్తే ఎక్కువగా ప్రవేశించడం గమనార్హం. అమెరికాలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా మౌలికమైన మార్పులు ఉండవు. అయినప్పటికీ, ట్రంప్ సామాజిక, ఆర్థిక రంగాల్లో అనుసరిస్తున్న విధానాలు అత్యంత వివాదాస్పదమైనవి. ప్రజాస్వామ్య, లౌకిక స్ఫూర్తికి విరుద్ధమైనవి. అమెరికా సమాజం ఇంతకాలం ఒంట పట్టించుకున్న విలువలకు భిన్నమైనవి. ఈ నేపథ్యంలో రెండేండ్ల ట్రంప్ పాలనకు ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయ సేకరణగా ప్రచారమైంది. ఇంతకాలం ఉభయ సభలో రిపబ్లికన్ పార్టీకి ఆధిక్యం ఉన్నందువల్ల ట్రంప్‌కు పెద్దగా ఎదురులేదు. కానీ ఇప్పుడు డెమొక్రాటిక్ పార్టీ ఆధిక్యం గల ప్రతినిధు ల సభ అదుపు (చెక్) ఉంటుంది. ఇంతకాలం ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ఉద్వేగభరితంగా సాగేవి. కానీ ఇప్పుడు డెమొక్రాట్స్ పట్టు సాధించినందు వల్ల ట్రంప్ వ్యతిరేక పక్షాలకు తమ నిరసనలకు శాసనసభ వేదికగా లభించింది. అధ్యక్షుడి ఒం టెద్దు పోకడను నిరోధించడానికి అమెరికా రాజ్యాంగంలో ఏర్పరిచిన నియంత్రణ ప్రతినిధుల సభ ద్వారా ఆచరణ సాధ్యమవుతుంది.

అమెరికా సమాజం ఎంతగా చీలిపోయిందంటే, ట్రంప్‌ను వ్యతిరేకించేవారు, ప్రతినిధు ల సభలో వెంటనే అధ్యక్షుడి అభిశంసన ప్రక్రి య ప్రారంభిచాలని కోరుకుంటున్నారు. రెండు సభలపై పూర్తి పట్టు ఉంటే తప్ప ట్రంప్‌ను తొలిగించడం సాధ్యం కాదు. డెమొక్రాటిక్ పార్టీ నాయకత్వం కూడా ఇప్పటికిప్పుడు ట్రంప్‌తో గొడవకు దిగాలనుకోవడం లేదు. అమెరికాలో అధ్యక్షుడికి, శాసనసభలకు మధ్య ఏకాభిప్రా యం లేకపోతే పరిపాలన స్తంభించిపోతుంది. తెగేదానుక లాగడాన్ని ప్రజలు ఆమోదించరు. అందువల్ల ట్రంప్ ప్రగతి నిరోధక విధానాలను అడ్డుకుంటూనే, సాధారణాంశాల్లో సహకరించాలని డెమొక్రాటిక్ పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ట్రంప్ విధానాలు అత్యంత విధ్వంసకరంగా ఉన్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించే చట్టాలను నిర్వీర్యం చేశాడు. మహిళల హక్కుల ను గౌరవించడం లేదు. అల్ప సంఖ్యాకవర్గాల పట్ల వ్యతిరేక ధోరణి ఉన్నది. కార్పొరేట్ సంస్థల అధినేతలతో చట్టసభల సభ్యులు అంటకాగడం ఎక్కువైంది. పారిశ్రామిక వర్గాలకు రాయితీలు, అధికార యంత్రాంగంలో అవినీతి పెరుగడంపై విమర్శలున్నాయి. ఈ విపరీత పోకడలకు అడ్డుకట్టవేయాలని డెమొక్రాటిక్ పార్టీ భావిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్‌పై వ్యక్తిగత దూషణలు చేయకుండా తమ విధానాలనే ప్రజల ముందుపెట్టింది. అయితే ట్రంప్ ప్రభుత్వ అక్రమాలు, కుంభకోణాలపై దర్యాప్తు జరుపడానికి, అడుగడుగునా వెంటాడటానికి ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ కూడా మారిన పరిస్థితుల్లో రాజీ ధోరణికి వస్తారా అనేది ఆసక్తిదాయకం. ప్రతినిధుల సభకు దేశవ్యాప్తంగా గల 435 నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు ఎన్నికవుతారు. కానీ సెనేట్‌లో ఉండే వంద సీట్లలో రెండేండ్లకు ఒకసారి మూడోవంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

చిన్నదైనా, పెద్దదైనా ప్రతి రాష్ర్టానికి రెండు స్థానాలుంటాయి. అందువల్ల సెనేట్‌తో పోలిస్తే సూక్ష్మస్థాయిలో ప్రజాభిప్రాయం వ్యక్తమయ్యేది ప్రతినిధుల సభ ద్వారానే. అందువల్ల ట్రంప్‌కు రెండేండ్ల కింద ఉన్నంత ఆదరణ ఇప్పుడు లేదనవచ్చు. అయితే ట్రంప్ మెజార్టీవాదాన్ని లేవనెత్తి సమాజంలో చీలిక ద్వారా తన స్థానాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు. ఒక విశ్లేషకుడి అభిప్రాయం ప్రకారం- ట్రంప్ గెలువలేదు. కానీ ఆయన చాలామంది కోరుకుంటున్నంతగా ఓటమి చెందలేదు. ట్రంప్ విధానాలకు రెండేండ్ల కింద ఉన్నంత మద్దతు లేకపోవచ్చు. కానీ ఆయన ప్రవచిస్తున్న తిరోగమన భావజాలానికి ప్రజాదరణ ఇంకా ఉన్నది. ఒక్క అమెరికాలోనే కాదు, యూరప్‌లో, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో జాతీయత పేర ప్రజాస్వామ్య వ్యతిరేక ఉన్మాద శక్తులు తలెత్తుతున్నాయి. అయితే అమెరికాలో రాజకీయాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మరింత ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే. జాతీయోన్మాద శక్తులు తలెత్తి తే, బయటి ప్రపంచానికి ప్రమాదమే, ఆంతరంగికంగా దేశ ప్రజలకు కూడా దుర్భరమే. ట్రంప్ ఒక వ్యక్తి కాదు, అదొక పరిణామంగా గుర్తించాలె. వివిధ రంగాల్లో జాతీయవాదం ముసుగులో కార్పొరేట్ శక్తులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియచెప్పాలె. అమెరి కా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేండ్ల వ్యవధి ఉన్నది. టంప్ విధానాలను, దీర్ఘకాలికంగా వచ్చే పరిణామాలను ప్రజల్లో ప్రచారం చేయవలసిన బాధ్యత ప్రజాస్వామ్య శక్తులది.

275
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles