యూ.. టూ..

Fri,October 12, 2018 12:16 AM

పనిస్థలాల్లో రక్షణ కల్పించే చట్టాలున్నా ఆచరణలో అంతటా విఫలమవుతున్నదానికి తార్కాణాలే నేటి మీటూ ఉద్యమానికి పునాదిగా గ్రహించాలె. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నటి మీటూగా మేమూ బాధితులమే అని చెప్పటం కాదు, యూ టూగా మీరూ దోషులే అని దాన్ని తిరగేసి చెప్పటం ద్వారా ఉద్యమాన్ని ఆత్మగౌరవ ప్రతీకగా చెప్పటం మహిళల్లో వస్తున్న మార్పునకు ప్రతీక.

మీ టూ ఉద్యమం సినిమా, మీడియా రంగాలను కుదిపేసింది. ఇప్పుడు రాజకీయరంగాన్ని కూడా తాకటంతో సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. ఇప్పటికే ఆయా రంగాల్లో ఎంతో లబ్ధ ప్రతిష్టులైనవారు ఈ లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలో తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం దిగ్భ్రాంతికర విషయం. సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగుచూస్తున్న ఘటనలను చూస్తే, లైంగిక వేధింపులకు వేదికకాని రంగం, వ్యవస్థ అంటూ లేదేమో అనిపిస్తున్నది. తనుశ్రీ దత్తా మొదలు కంగనా రనౌత్, గాయని చిన్మయి, గుత్తా జ్వాలా దాకా రోజుకొకరుగా తాము ఎదుర్కొన్న చేదనుభవాలను చెబుతున్నారు. ఆ ఘటనలు వారిని ఎంత తీవ్రంగా మానసికంగా, శారీరకంగా కుంగదీశాయో వాపోతున్నారు. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు ఎంతటి గో-ముఖ వ్యాఘ్రాలో చూపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తులుగా, బాధితులుగా ఆయారంగాల్లో వారి ప్రగతి ముగిసిపోయింది. అంతేకాదు జీవితమే ముగిసినంతంగా అన్నివిధాలా నష్టపోయిన వారూ ఉన్న ఉదంతాలున్నాయి. ఇలాంటి అమానవీయ ఘటనలు అభివృద్ధిచెందిన నాగరిక సమాజానికి ప్రతీకలుగా, వేదికలు గా చెప్పుకుంటున్న వ్యవస్థల్లోనూ ఉండటమే నేటి విషాదం.

మీ టూ ఉద్యమం మన దేశంలో ఏడాది కిందట మొదలై బాలీవుడ్ నుంచి తెలుగు చిత్రసీమకు చేరుకోవటమే కాదు మీడియా రంగానికి కూడా విస్తరించి మొత్తంగా సమాజాన్ని కుదిపేస్తున్నది. నిజానికి అమెరికాలో 2006లో జరిగిన ఓ ఘటన మీ టూ ఉద్యమానికి ఊపిరిపోసింది. న్యూయార్క్‌కు చెందిన తరానా బర్క్ గాళ్స్ ఫర్ జెండర్ ఈక్విటీ సంస్థలో ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేసేది. అమ్మాయిల సమానహక్కులు, సంక్షేమం కోసం పనిచేసే ఆమెపైనే రెం డుసార్లు లైంగికదాడి జరిగింది. పరాయి వ్యక్తి చేయి తాకితేనే అసౌకర్యం, కంపరమెత్తే పరిస్థితి ఉంటే, ఏకంగా తన నిస్సహాయతను ఆసరాగా చేసుకొని లైంగిక దాడిచేస్తే ఎంతటి నరకం అనుభవించి ఉంటుందో ఊహించుకోవాల్సిం దే. ధైర్యాన్నంతా కూడదీసుకొని తనకు ఎదురై న భయంకర పరిస్థితులను, బాధను అంతర్జాలంలో పెట్టింది. దీన్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన వేలాదిమంది బర్క్‌కు బాసటగా నిలువటమే కాదు, తాము కూడా జీవితంలో ఎదుర్కొన్న చేదనుభవాలను ప్రపంచానికి చాటుతూ మీటూ ఉద్యమాన్ని విస్తృతం చేశారు. ఇప్పుడు పదులు, వందల సంఖ్యలో మహిళలు తాము ఎదుర్కొన్న దాడుల గురించి ధైర్యంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టెన్ నుంచి తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి గైనెత్ పాల్ట్రో, ఎంజెలినా జోలీ ప్రపంచానికి చాటి చెప్పటంతో ప్రపంచమం తా విస్తుపోయింది. అంతేకాదు హార్వే బాధితులుగా 12 మంది మహిళలు ముందుకొచ్చి తమ గోడును తెలుపటంతో మహిళలపై జరుగుతున్న దాడుల తీవ్రత ప్రపంచానికి తెలిసివచ్చింది. ఈ ప్రకంపనలు సద్దుమనగక ముందే హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ టొబాక్ తమను లైంగికంగా వేధించాడంటూ 38 మంది మహిళలు ముందుకురావటంతో మీటూ ఉద్యమం ఇప్పడు మహిళల ఆత్మగౌరవ ఉద్యమంగా మారింది.

హాలీవుడ్, బాలీవుడ్ మీదుగా దక్షిణాదికి, తెలుగు చిత్రసీమకు విస్తరించిన మీటూ ఉద్యమం అనేకమంది ప్రముఖ వ్యక్తుల అసలు ముఖాలను ముసుగుతీసి చూపుతున్నది. ఆ మధ్యనే కాస్టింగ్ కౌచ్ అనేది తెలుగు చిత్రరంగాన్ని ఏ తీరుగా పట్టిపీడించిందో తెలిసిందే. ఓ టీవీ ఛానల్ మహిళా రిపోర్టర్ సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వర్ధమాన నటిగా 2005లో చేసిన స్టింగ్ ఆపరేషన్ బాలీవుడ్ బండారాన్ని బయటపెట్టింది. ఈ స్టింగ్‌లో ప్రముఖ నటుడు శక్తికపూర్, అమన్‌వర్మ అడ్డంగా దొరికిపోయారు. సినిమాలో వేషాలు కావాలంటే తమ కోరిక తీర్చాలని షరతు పెట్టారు. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడిన అహూజాకు న్యాయస్థానం ఏడేండ్ల కారాగార శిక్ష విధించింది. అలాగే పీప్లీ లైవ్‌సినిమా సహ దర్శకుడు మహమూద్ ఫారూఖీకి ఏడేండ్ల శిక్ష పడింది. ఈ జనవరిలో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినీ నిర్మాత మొరానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీరంగ ప్రముఖుల్లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్, హిందీ రచయిత, నిర్మాత అలోక్‌నాథ్, జాతీయ పురస్కార గ్రహీత తమిళ గీత రచయిత వైరముత్తు, తమిళ నటుడు రాధారవి, మలయాళ నటుడు ముఖేష్ తదితరులు ఉండటం గమనార్హం. ఎప్పుడో దశాబ్దాల కిందటి విషయాలను ఇప్పుడు తెరమీదికి తేవటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నవారు, అసలు లైంగిక వేధింపుల ఉనికిని నిరాకరిస్తున్న దాఖలాలు లేవు. మరోవైపు అన్నివర్గాల నుంచి మహిళలు తాము ఎదుర్కొన్న వివక్ష, అణిచివేతలను నిర్భయంగా చాటుతూ సమాన హక్కుల కోసం ఉద్యమిస్తున్న తీరు ఆహ్వానించదగినది.

పనిస్థలాల్లో రక్షణ కల్పించే చట్టాలున్నా ఆచరణలో అంతటా విఫలమవుతున్నదానికి తార్కాణాలే నేటి మీటూ ఉద్యమానికి పునాదిగా గ్రహించాలె. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నటి మీటూగా మేమూ బాధితులమే అని చెప్పటం కాదు, యూ టూగా మీరూ దోషులే అని దాన్ని తిరగేసి చెప్పటం ద్వారా ఉద్యమాన్ని ఆత్మగౌరవ ప్రతీకగా చెప్పటం మహిళల్లో వస్తున్న మార్పునకు ప్రతీక. ఈ చైతన్యమే మహిళలకు అంతటా సమానత్వానికి పునాదిగా మారుతుంది.

285
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles