ప్రమాద ఘంటిక

Wed,October 10, 2018 11:02 PM

ప్రభుత్వాలు తమ విధానాల ద్వారా ప్రకృతి హితమైన అభివృద్ధి విధానాలను అమలుచేయాలె. ప్రకృతి విధ్వంసక పారిశ్రామిక విధానాలను అనుసరించకూడదు. ప్రజలు తమ జీవన సరళిని కూడా నిరాడంబరంగా మార్చుకోవాలె. స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలె. కార్లలో షికార్లు చేయకుండా ప్రజా రవాణాను ఉపయోగించాలె. సైకిళ్ళపై ప్రయాణిస్తే, ఆరోగ్యం బాగుపడుతుంది, ప్రకృతిని పరిరక్షించవచ్చు. విద్యుత్‌ను తక్కువగా వినియోగించే జీవనశైలిని అలవరుచుకోవాలె.

వాతావరణ మార్పు వల్ల ఊహించిన దానికన్నా మించిన విపత్తులు పొంచి ఉన్నాయనీ, తక్ష ణం అప్రమత్తమై, నియంత్రణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికకు మానవాళి అప్రమత్తం కాకతప్పదు. వాతావరణ మార్పును అరికట్టే లక్ష్యంతో 2015లో ప్యారిస్ ఒడంబడిక జరిగింది. ఆ తర్వాత కీలక భేటీ పొలాండ్‌లో వచ్చే డిసెంబర్‌లో జరుగనుంది. ఈ నేపథ్యం లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్ ప్రభుత్వ వాతావరణ మార్పు ప్యానెల్ (ఐపీసీసీ) సమావేశం దక్షిణకొరియాలో జరిగింది. ఈ సమావేశంలో దాదాపు తొంభై మంది శాస్త్రవేత్తలు వేలాది అధ్యయన పత్రాలను పరిశీలించి వాతావరణ మార్పును తక్షణం అరికట్టడానికి సిద్ధప డాలని మానవాళిని హెచ్చరించారు. పారిశ్రామిక విప్లవం రాకముందు ఉండే వాతావరణంతో పోలిస్తే భూగోళం ఒక డిగ్రీ వేడెక్కింది. దీని ఫలితాలను ఇప్పటికే అ నుభవిస్తున్నామని ఈ సమావేశం రూఢీగా చెప్పడం విశేషం. వాతావరణంలో విపరీత పోకడలు, సముద్ర మట్టం పెరుగ డం, అర్కిటిక్ మంచు తరగడం, వంటివన్నీ వాతావరణ మార్పు ఫలితాలేనని స్పష్టంచేసింది. 2010లో జరిగిన అంతర్జాతీయ చర్చలలో భూగోళ తాపం రెండు డిగ్రీలకు మించి పెరుగకుండా చూసుకోవాలనే అవగాహన కుదిరింది. ప్యారిస్ ఒడంబడిక కుదిరేనాటికి రెండు డిగ్రీల లక్ష్యంతో పాటు వీలైతే 1.5 డిగ్రీలకే భూతాపం పెరుగుదలను పరిమితం చేయాలనే ఒప్పందం కుదిరింది. అయితే భూతాపం కనుక రెండు డిగ్రీలకు పెరిగితే తమకు మరణ శాసనమే అని కొన్నిదేశాలు వాదించాయి. దీనిపై కూలంకష చర్చ అనంతరం శాస్త్రవేత్తలు 1.5 డిగ్రీలు దాటడం ప్రమాదకరమని హెచ్చరించారు. 1.5 డిగ్రీలకు మించి గనుక భూగోళం వేడెక్కితే, కరువు, వరదలు, వేడిగాలులతో జీవన పరిస్థితి ఘోరంగా మారుతుంది. కోట్లాదిమంది పేదరికంలో మగ్గిపోతా రు.

తక్షణం అప్రమత్తమై చర్యలు చేపడితే భూతాపం పెరుగుదలను అరికట్టడం సాధ్యమేనని కూడా ఐపీసీసీ నివేదిక అభిప్రాయపడ్డది. భూగోళతాపం 1.5 డిగ్రీలకు మించి పెరుగకుం డా నిరోధించాలని ఇందుకు పన్నెండేండ్ల వ్యవ ధి మాత్రమే ఉన్నదని శాస్త్రవేత్తలు తమ నివేదికలో హెచ్చరించారు. భూతాపం పెరుగడం వల్ల మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతున్నదనేది స్పష్టం. కానీ విచ్చలవిడిగా ప్రకృతి వనరులను కొల్లగొడు తూ, అశాస్త్రీయమైన అభివృద్ధి విధానాల వల్ల భూతాపం మరింత పెరుగుతున్నది. భూతాపం పై శాస్త్రవేత్తల నివేదికలను కూడా తప్పుబట్టే విపరీత ధోరణి కనిపిస్తున్నది. వాతావరణ మార్పువల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయనే వాదననే కొందరు కొట్టివేస్తున్నారు. ఇం దులో అగ్రగణ్యుడిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చెప్పుకోవచ్చు. భూతాపాన్ని అరికట్టాలంటున్న శాస్త్రవేత్తల వాదనలను ట్రంప్ బహిరంగంగానే తప్పుబడుతున్నారు. ప్యారిస్ ఒడంబడిక నుంచి వైదొలుగడమే కాకుండా, అంతర్గతంగా అనేక పర్యావరణ పరిరక్షణ చట్టాలను నిర్వీర్యం చేశారు. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికపై తేలిగ్గా మాట్లాడారు. భూగోళ వాతావరణం వేడెక్కడంలో పారిశ్రామిక దేశాల విచ్చలవిడితనం కారణమనేది స్పష్టమే. వాటిని అరికట్టవలసిన బాధ్యత అమెరికాతో సహా పారిశ్రామిక దేశాలపై ఉన్నది. కానీ పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని బడుగు దేశాలకు బదిలీ చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. గ్రీన్‌హౌజ్ వాయువులను అరికట్టే విషయంలో కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. భూ తాపం పెరుగుదలను అరికట్టాలని అంగీకరిస్తూనే, దాన్ని అరికట్టడానికి కొందరు వింతవాదనలు ముందుకు తెస్తున్నారు.

ఈ వాదనలు పిచ్చి కుదిరిందంటే రోకలి తలకు చుట్టమన్నట్టుగా ఉన్నాయి. భూ గోళం వేడెక్కకుండా నిరోధించడానికి కార్బన్ వాయువులను గ్రహించుకునే కృత్రిమ వృక్షాలను ఏర్పాటు చేయాలనేది ఒక సూచన. వాతావరణం పై పొరల్లో అద్దాలు నింపి లేదా ఇతర చర్యల వల్ల సూర్యుడి వేడి భూమిపైకి చేరకుండా తగ్గించాలనేది మరొక విచిత్ర వాదన. జియో ఇంజినీరింగ్ పేరిట చేస్తున్న వాదనలన్నీ, భూమిని కాపాడే పేరిట భారీగా నిధులు మింగడానికి తప్ప మరెందుకు ఉపయోగపడవు. దీనికన్నా గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదల కాకుండా నివారించడమే ఉత్తమమైన మార్గం. అందుకే ఐపీసీసీ ఇటువంటి వాదనలు ఆచరణ యోగ్యమని తేలనందున వాటిని నమ్ముకోవద్దని స్పష్టంచేసింది. అడవులను పునరుద్ధరించడం, విద్యుత్ వాహనాలు వాడటం వంటి భిన్న మార్గాలను ఐపీసీసీ నివేదికలో శాస్త్రవేత్తలు సూచించారు. ఈ నివేదిక ద్వారా అప్రమత్తమై తగుచర్యలు తీసుకోవలసిన బాధ్యత అన్నిదేశాల ప్రభుత్వాల మీద, ప్రజల మీద ఉన్నది. ప్రభుత్వాలు తమ విధానాల ద్వారా ప్రకృతి హితమైన అభివృద్ధి విధానాలను అమలుచేయాలె. ప్రకృతి విధ్వంసక పారిశ్రామిక విధానాలను అనుసరించకూడదు. ప్రజలు తమ జీవన సరళిని కూడా నిరాడంబరంగా మార్చుకోవాలె. స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలె. కార్లలో షికార్లు చేయకుండా ప్రజా రవాణాను ఉపయోగించాలె. సైకిళ్ళపై ప్రయాణిస్తే, ఆరోగ్యం బాగుపడుతుంది, ప్రకృతిని పరిరక్షిం చవచ్చు. విద్యుత్‌ను తక్కువగా వినియోగించే జీవనశైలిని అలవరుచుకోవాలె. సాత్విక ఆహారం భుజించాలె. రాబోయేతరాల వారికి ఒక సుందరమైన భూగోళాన్ని, ఆరోగ్యకర జీవనాన్ని అం దించడం మనందరి బాధ్యత.

275
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles