మానవీయత!

Thu,July 12, 2018 01:03 AM

థాయిలాండ్ భయానక ఉదంతం ఇతర దేశాలలోని పిల్లలకు కూడా ఒక హెచ్చరిక. బడి పిల్లలు, కళాశాల విద్యార్థులు వినోదయాత్రలకు వెళ్లడం సాధారణం. ఎక్కడికి వెళ్ళినా నీళ్ళలోకి దిగకూడదు. కొత్త ప్రదేశాలలోకి చొచ్చుకుపోకూడదు. దుందుడుకుతనం వల్ల ప్రమాదాలు సంభవిస్తే తల్లిదండ్రులకు కడుపుకోత, సమాజానికి కూడా ఎంతో వ్యథ మిగిల్చిన వారవుతారు. యాత్రికులు తీసుకోవలసిన జాగ్రత్తలను తల్లిదండ్రులు, వీరివెంట వెళ్ళే పెద్దలు ముందుగానే వివరించాలె. కొత్త ప్రదేశాలలో అక్కడి స్థితిగతులను, నిబంధనలను తెలుసుకొని వ్యవహరించాలె.

థాయిలాండ్‌లోని కొండ గుహలో చిక్కుకున్న బాలలను రక్షించడానికి అంతర్జాతీయ సమాజమంతా చేసిన కృషి ఆధునిక సమాజంలో ఉండే మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. దుర్గమమైన గుహలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న పన్నెండు మంది పిల్లలను, వారి కోచ్‌ను కాపాడటానికి వివిధ దేశాల్లోని అనేక రంగాల నిపుణులు అహర్నిషలు చేసిన కృషి ప్రశంసనీయం. ఈ పిల్లల ను కాపాడటం ఏ ఒక్క బృందమో లేదా ఒక దేశమో తలుచుకుంటే జరిగింది కాదు. మెరికల్లాం టి పద్దెనిమిది మంది డైవర్లలో పదమూడు మంది విదేశీయులు పిల్లలను బయటకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సాహస కృత్యానికి ముందు వెనుక భాగస్వాములైన భిన్నరంగాల నిపుణులు, స్వచ్ఛంద సేవకులు వెయ్యి మంది ఉంటారు. యూకే, చైనా, అమెరికా, జపాన్, రష్యా తదితరమైన కనీసం ఇరువై దేశాలు తోడ్పాటు అందించాయి. భిన్న రకాల యంత్ర పరికరాలు, విభిన్న రంగాల నిపుణులు ఏయే దేశాలలో ఉంటే ఆయా దేశాలు సహకరించాయి. జెక్ దేశం నీళ్ళుతోడే బలమైన యంత్రాలను సరఫరా చేసింది. గుహలోని జలాల్లో ఈదడంలో అగ్రశ్రేణి డైవర్లు బ్రిటన్ నుంచి వచ్చారు. మానవుల ఆనవాళ్ళు పసిగట్టే కుక్కలను, అత్యాధునిక డ్రోన్‌లను, రోబోలను ఉపయోగించారు. వెయ్యి మీటర్ల ఎత్తున ఉన్న కొండను కొన్ని వైపుల నుంచి తొలిచే ప్రయత్నమూ సాగింది. పిల్లలను చేరడానికి దగ్గరి దారుల వెతుకులాట జరిగింది. అనేక వ్యూహాలను చర్చించి అనేక రీతిలో తర్కించి చివరకు బాలలను సురక్షితంగా బయటకు తరలించారు. అంతరిక్ష రవాణా సంస్థ స్పేస్ ఎక్స్ స్థాపకుడు ఎలాన్ మాస్క్ పిల్లలను తేవడానికి చిన్న జలాంతర్గామిని కూడా తయారుచేయించి తెచ్చాడు. కానీ అది ఉపయోగపడదని తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానం అన్నివేళలా పనిచేయదు. మానవ నైపుణ్యం, సహనం, అంకితభావమే పిల్లలను కాపాడాయి.

కొండ గుహలో చిక్కుకుపోయిన బృందాన్ని గుర్తించడానికి పడిన శ్రమ కూడా అసాధారణమైనది. జూన్ 23న పిల్లలు కనిపించకుండా పోయిన నాటినుంచి అన్వేషణ మొదలైంది. పిల్లలకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి కనుక వారు గుహలో ఉన్నట్టు ధ్రువపడ్డది. అనేకసార్లు వరద నీటి ప్రవాహానికి తట్టుకోలేక తిరిగి వెనుక్కు రావలసి వచ్చింది. అయినా బ్రిటన్‌కు చెందిన డైవర్లు అవాంతరాలకు వెరవకుండా, అతి ప్రయాసకోర్చి సన్నని దారిలో, బురదనీటిలో లోపలివరకు వెళ్ళడం వల్ల బాల ల ఆచూకీ దొరికింది. గుహల్లోకి వెళ్ళే అన్వేషకులు దారం చుట్టను విప్పుతూ వెళతారు. వెన క్కు వచ్చేటప్పుడు దారి తప్పకుండా తీసుకునే జాగ్రత్త ఇది. చుట్టలోని దారం మొత్తం అయిపోయిన దశలో, గుహలో పిల్లల అరుపులు వినిపించాయి. దారం పొడుగు కొంచెం తక్కువగా ఉన్నా, గుహలో పిల్లలు మరింత లోపలికి ఉన్నా దొరుకకపోయేవారేమో! వానలు కొంత తెరిపి ఇవ్వడం కూడా కలిసివచ్చింది. పిల్లలకు మానసిక శక్తిని ఇవ్వడానికి, ఆహారం, ప్రాణ వాయువు అందించడానికి, వైద్యం చేయడానికి ఇట్లా ప్రతి అంశంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. పద్దెనిమిది రోజుల కృషి విజయవంతం అయినప్పటికీ, మధ్యలో ఒక డైవర్ మరణించడం మాత్రం బాధాకరం. మానవులు తమ విజ్ఞానాన్ని, శక్తియుక్తులను యుద్ధాల కోసం కాకుం డా మానవ సంక్షేమం కోసం కలిసికట్టుగా ఉపయోగిస్తే ఎంత బాగుంటుందో ఈ ఘటన తెలి యజేస్తుంది.

ఆటగాళ్ళలో ఒకరి జన్మ దినోత్సవం జరుపుకోవడానికి గుహలోకి వెళ్ళారట! వారు లోపలికి వెళ్ళిన తరువాత వాన కురిసి వరద నీరు లోపలికి రావడం మొదలైంది. దీంతో పగలు రాత్రి తేడా తెలువని చీకటి గుహలో మురికి నీరు తాగుతూ దయనీయంగా గడుపాల్సి వచ్చింది. థాయిలాండ్- మయన్మార్ సరిహద్దులో దోయి నాంగ్ నాన్ అనేది పది కిలోమీటర్ల పొడువున విస్తరించిన కొండల బారు. దీనిలో అనేక గుహలు, సొరంగాలు సన్నని దారులు పరుచుకొని ఉన్నాయి. ఈ కొండల కింద ఉన్నదే థామ్ లువాంగ్ నాంగ్ నాన్ అనేది పెద్ద కొండ గుహల సముదాయం. వానకాలంలో ఈ కొండ గుహలలోకి వరద నీరు ప్రవహించడం పరిపాటి. వానకాలంలో ఈ గుహలలోకి వెళ్ళకూడదని హెచ్చరిక కూడా ప్రవేశ ప్రాంతంలో పెట్టారు. కొండ గుహలలోకి వెళ్ళడం, అన్వేషించడం అనేది ఒక ప్రత్యేక విద్య. దీనికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. నిష్ణాతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని గుహాన్వేషణ సాగిస్తుంటారు. అటువంటిది ఏ అనుభవం లేని బాలలను తీసుకొని గుహలోకి ప్రవేశించకపోవలసింది. పిల్లలు కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని, అన్వేషించాలని ఉబలాట పడుతుంటారు. కానీ వారి వెంట ఉన్న కోచ్‌కు లోపలకు వెళ్లే ముందు కొంచెం ముందు వెనుక ఆలోచిస్తే ఇంత ప్రమాదం తప్పేది. థాయిలాండ్ భయానక ఉదంతం ఇతర దేశాలలోని పిల్లలకు కూడా ఒక హెచ్చరిక. బడి పిల్లలు, కళాశాల విద్యార్థులు వినోదయాత్రలకు వెళ్లడం సాధారణం. ఎక్కడికి వెళ్ళినా నీళ్ళలోకి దిగకూడదు. కొత్త ప్రదేశాలలోకి చొచ్చుకుపోకూడదు. దుందుడుకుతనం వల్ల ప్రమాదాలు సంభవిస్తే తల్లిదండ్రులకు కడుపుకోత, సమాజానికి కూడా ఎంతో వ్యథ మిగిల్చిన వారవుతారు. యాత్రికులు తీసుకోవలసిన జాగ్రత్తలను తల్లిదండ్రులు, వీరివెంట వెళ్ళే పెద్దలు ముందుగానే వివరించాలె. కొత్త ప్రదేశాలలో అక్కడి స్థితిగతులను, నిబంధనలను తెలుసుకొని వ్యవహరించాలె.

334
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles