ఢిల్లీ సంక్షోభం

Thu,June 14, 2018 12:17 AM

చట్టం, నిబంధనలు ఏమి చెబుతున్నా ప్రజా ప్రభుత్వానికి వీలైన మేర అధికారాలు ఇవ్వడమే ఈ సమస్యకు పరిష్కారం. కేంద్రం సంకుచిత పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజాస్వామిక దృక్పథంతో, ఫెడరల్ సూత్రాలకు అనుగుణంగా, దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలె. ఏయే సందర్భాలలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవాలో, ఎంతమేర రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు బదలాయించవచ్చునో స్పష్టత ఇవ్వడం ద్వారా ఇటువంటి సంక్షోభం మళ్ళా తలెత్తకుండా జాగ్రత్తపడాలె.

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా సంక్షోభంలో పడ్డది. లెఫ్టినెంట్ గవర్నర్ సహకరించడం లేదంటూ ఏకంగా ఆయన కార్యాలయం ముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మరో ముగ్గురు మంత్రులు ధర్నా ప్రారంభించారు. కొన్ని నెలలుగా ఐఏఎస్ అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించుకోవడానికి కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాయిజల్ కార్యాలయానికి వచ్చారు. అయితే వీరిని కలుసుకోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నిరాకరించడంతో వారు మూడురోజులుగా వెయిటింగ్ రూమ్‌లోనే ధర్నా ప్రారంభించారు. ఆ తర్వాత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఫిబ్రవరిలో చీఫ్ సెక్రటరీపై తనపై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ ఉదంతం తరువా త ఐఏఎస్ అధికారులు మంత్రుల సమావేశాలకు హాజరుకావడం లేదని, ఫోన్‌కాల్స్ స్వీకరించ డం లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రులు ఆరోపిస్తున్నారు. చట్టప్రకారం ఐఏఎస్ అధికారులు సమ్మె చేయకూడదని, దీనివెనుక కేంద్రం హస్తం ఉన్నదని వీరు తప్పుపడుతున్నారు. తాము సమ్మె చేయడం లేదని ఐఏఎస్ అధికారులు అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి, మం త్రుల సమావేశాలకు హాజరుకావడం లేదని అంగీకరిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు యథావిధిగా పనిచేస్తున్నారని, వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ముఖ్యమంత్రి బాధ్యత అని లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు.

కేజ్రీవాల్ ఒకప్పుడు ప్రభుత్వాధికారిగా ఉండి రాజకీయ నాయకుడిగా మారారు. ఆయనకు మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే, ప్రభుత్వాధికారులతో వ్యవహరించడం తెలువదని అనుకోలేం. అయినా ఈ సమస్య ఎందుకు వచ్చిందనేది పరిశీలించవలసి ఉన్నది.
ఐఏఎస్ అధికారులతో గొడవ మధ్యలో తలెత్తింది కానీ, అదే అసలు సమస్య కాదు. అసలు సమస్య ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు సంబంధించినది. ఢిల్లీ ప్రభుత్వాన్ని పనిచేయకుండా కేంద్రం అవరోధాలు కల్పిస్తున్నదనేది కేజ్రీవాల్ ఆరోపణ. లెఫ్టినెంట్ గవర్న ర్ కూడా సాధారణ ఫైళ్ళను పంపిస్తున్నప్పటికీ, విధానపరమైన ఫైళ్ళను తమవద్దనే పెండింగ్ లో పెడుతున్నారని కేజ్రీవాల్ అంటున్నారు. ఈ మొత్తం వివాదంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీ రు మరింత బాధ్యతారహితంగా ఉన్నది. కేం ద్రంలోని ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకున్నదే కనుక ఢిల్లీ రాష్ర్టాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా పాలించవచ్చునని కేంద్రం సుప్రీంకోర్టు ముందుచేసిన వాదన హాస్యాస్పదంగా ఉన్నది. ఇదే తర్కంతో కేంద్రం రేపు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నయినా పక్కనపెట్టి తానే పాలించవచ్చు. ఈ వాదన సమాఖ్య సూత్రాలకే విరుద్ధం. చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్రం కాదనీ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు పూర్తి అధికారాలున్నాయని వాదించడం, ప్రజా ప్రభుత్వం పట్ల గౌరవం లేకపోవడమే. కేంద్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా పూర్తిగా పరిపాలించే అధికారం ఉందని అనుకుందాం. చట్టప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు అన్ని అధికారాలు ఉండవచ్చు. అయినంత మాత్రాన ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుతగులడం ప్రజాస్వామిక సూత్రాలకు విరు ద్ధం. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిరసనకు రాష్ట్రీయ లోక్‌దళ్, రాష్ట్రీయ జనతాదళ్, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా తదితరుల నుంచి మద్దతు లభించింది. కానీ కాంగ్రెస్‌పార్టీ మాత్రం బీజేపీ వాదనతో ఏకీభవించడం ఆశ్చర్యకరం.

ఢిల్లీ దేశ రాజధాని కనుక పూర్తిస్థాయి అధికారాల బదలాయింపు చేయకుండా, కేంద్రం వద్ద అధికారాలు పెట్టడంలోని ఔచిత్యాన్ని అర్థం చేసుకోగలం. కానీ ఈ అధికారాలను కేంద్రం కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కానీ ఆచితూచి వాడుకోవాలె. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో, విధానాల్లో ఏవైనా ప్రమాదకర పోకడలు ఉంటే చర్చించాలె. కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య లెఫ్టినెంట్ గవర్నర్ సమన్వయం సాధించాలె. కానీ ప్రజా ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా అవరోధాలు కల్పించడం తగదు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ, రాష్ర్టాల్లో కానీ ప్రజాస్వామీకరణ వైపు నడకసాగాలె కానీ, ప్రజా ప్రభుత్వాన్ని నిరర్థకంగా మార్చకూడదు. ఢిల్లీలో ఇంత రగడ జరిగినా కేంద్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇంత మొండిగా వ్యవహరిస్తున్నాడంటేనే, దీనికి కేంద్రం మద్దతు ఉందన్నట్టు. కేంద్ర, రాష్ర్టాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నంత మాత్రాన, రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయకుండా అవరోధాలు సృష్టించడం, సంక్షోభం సృష్టించ డం చర్యలు భారత్ వంటి పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగడం అవాంఛనీయం. కేంద్రం సూచనలు ఇస్తే తప్ప లెఫ్టినెంట్ గవర్నర్ చలించడనేది స్పష్టం. ఈ పరిస్థితుల్లో ఈ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత కేంద్రంపైనే ఉన్నది. చట్టం, నిబంధనలు ఏమి చెబుతున్నా ప్రజా ప్రభుత్వానికి వీలైన మేర అధికారాలు ఇవ్వడమే ఈ సమస్యకు పరిష్కారం. కేంద్రం సంకుచిత పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజాస్వామిక దృక్పథంతో, ఫెడరల్ సూత్రాలకు అనుగుణంగా, దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలె. ఏయే సందర్భాలలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవాలో, ఎంతమేర రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు బదలాయించవచ్చునో స్పష్టత ఇవ్వడం ద్వారా ఇటువంటి సంక్షోభం మళ్ళా తలెత్తకుండా జాగ్రత్తపడాలె.

410
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles