శాంతి ఒప్పందం

Tue,June 12, 2018 10:54 PM

అమెరికా అండ, స్వేచ్ఛా మార్కెట్ విధానంతో దక్షిణకొరియా సామ్‌సంగ్, హ్యూందాయ్, ఎల్‌జీ లాంటి దిగ్గజ కంపెనీలకు స్థావరంగా మారి ఆర్థికంగా వెలిగిపోయింది. ఈ పరిస్థితులన్నీ ఉత్తర కొరియా పాలకుల్లో మార్పునకు కారణమైంది. అమెరికాకు ఎదురొడ్డి నిలిచేకంటే, రాజీతో రాణించవచ్చనే ఆలోచనకు అంకురార్పణ జరుగటానికి కారణమైంది. ట్రంప్ కూడా ఎన్నికల సమయంలో చెప్పినట్లు ఉత్తర కొరియా సమస్యను పరిష్కరిస్తానన్నది ఆచరణలో చూపినట్లు అవుతున్నది. ట్రంప్, కిమ్‌జోంగ్ తమ వ్యక్తిగత స్వభావాలు, ధోరణులకు భిన్నంగా శాంతిచర్చలకు కూర్చోవటం తక్షణ అవసరంగా ముందుకొచ్చింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య సింగపూర్‌లో జరిగిన శాంతి భేటీ ఫలవంతంగా ముగియటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ సందర్భంగా ఉత్తర కొరియా అణ్వస్త్ర నిరాయుధీకరణతోపాటు, దౌత్య, వాణిజ్యపర ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేయటం కొరియా ద్వీపకల్ప ప్రాంతానికే గాక, ప్రపంచశాంతికి శుభ సూచకం. నిన్నమొన్నటిదాకా బెదిరింపులతో పాటు అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచాన్ని వణికించిన ట్రంప్, కిమ్‌జోంగ్ ఉన్ మధ్య శాంతి చర్చలు జరుగటం పెద్ద ముందంజగా చెప్పుకోవచ్చు. ఒక దశలో అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణ్వాయుధ శక్తి ఉందన్న ధీమా పనికిరాదని ఉత్తర కొరియా ను హెచ్చరించాడు. దీనికి ప్రతిగా కిమ్ జోంగ్ అణ్వాయుధ మీట నా టేబుల్‌పై, నా వేలు కిందనే ఉన్నదని అమెరికాకు సవాల్ విసిరాడు. ఇలా పరస్పర బెదిరింపులు, హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం అనివార్యమనే విధంగా ప్రపంచమే వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దుందుడుకు తనానికీ, పెడసరి మాటలకు పెట్టింది పేరుగా ప్రపంచమం తా భావిస్తున్న ట్రంప్, జగమొండి తనానికీ, తెగేదాకా లాగే తత్వానికీ ఆనవాలుగా చెప్పుకొనే కిమ్ మధ్య శాంతి చర్చలు జరుగటం అద్భుతమే. ఏదేమై నా ఇరు దేశాధినేతలు పంతాలు పట్టింపులకు పోకుండా సమస్యలకు చర్చలతో శాంతియుత పరిష్కారాల దిశగా అడుగులు వేయటం ముదావహం.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామ్యవాద, పెట్టుబడిదారీ కూటముల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు ప్రపంచాన్నే రెండు విభిన్న శిబిరాలుగా విభజించింది. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు ముక్కలయ్యాయి. జర్మనీ- తూర్పు, పశ్చిమ జర్మనీలుగా విడిపోయినట్లు గానే కొరియా కూడా ఉత్తర, దక్షిణ కొరియాలుగా చీలిపోయింది. సామ్యవాద సోవియట్ రష్యా అనుకూల దేశాలుగా తూర్పు జర్మనీ, ఉత్తర కొరియా ఉంటే, పెట్టుబడిదారీ అనుకూల దేశాల ప్రతినిధులుగా పశ్చిమ జర్మనీ, దక్షిణ కొరియా అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. ఈ రెండు కూటముల మధ్య ఏడు దశా బ్దాలుగా ఆధిపత్య పోరు సాగుతూనే ఉన్నది. సోవియట్ యూనియన్ పతనమై, బెర్లిన్ గోడ బద్దలై పోయిన తర్వాత ఉత్తర కొరి యా మాత్రమే అమెరికా కు కొరకరాని కొయ్యగా మారింది. కొరియా ద్వీపకల్పంపై, ఆప్రాంత సముద్ర జలాలపై ఆధిపత్యం నిలుపుకోవాలనే వ్యూహంలో ఉత్తర కొరియా పెద్ద అడ్డంకిగా మారింది. ఈ చారిత్రక, భౌగోళిక వ్యూహాలతోనే అమెరికా నాటి నుంచీ నేటిదాకా ఉత్తరకొరియాపై కత్తిగట్టి, ఆంక్షలు, ఒత్తిళ్లతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించింది. దక్షిణ కొరియాను అమెరికా సైనిక స్థావరంగా మార్చేసింది. దీంతో దక్షిణ కొరియా నుంచి అమెరికా తన సైనికులను ఉపసంహరించుకోవాలని ఉత్తర కొరియా డిమాండ్ చేయ టం, దానికి ప్రతిగా రష్యా అండతో ఉత్తర కొరియానే ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నదని ప్రతిదాడి చేయటం కొనసాగింది. సుదీర్ఘకాలంగా కొరియా ద్వీపకల్ప ప్రాంతం ఉద్రిక్తతల నిలయంగా నిలిచిపోయింది.

ఉత్తర కొరియాతో సమస్య పరిష్కారానికి పదకొండు మంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నించి విఫలమయ్యారు. 1960లో కెనెడీ కొరియా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించారు. 1968లో అమెరికా నిఘా నౌకలను నిర్బంధించటంతో పాటు, గూఢచర్య విమానాలను ఉత్తరకొరియా కూల్చి వేయటంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.1974 తర్వాత కాలంలో జిమ్మీ కార్టర్, రీగన్, జార్జ్ బుష్ (సీనియర్), బిల్ క్లింటన్, బుష్ (జూనియర్), ఒబామా హయాం దాకా అమెరికా అధినేతలంతా ఉత్తర కొరియాను నయాన, భయాన దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అనేక వాణిజ్య ఆంక్షలు విధించి ఉత్తరకొరియాను ఊపిరాడకుండా చేశారు. అభివృద్ధి కుంటుపడటం, వరుసగా ఏర్పడిన కరువు కాటకాలు ఉత్తర కొరియాను పీడించాయి. దీంతో తిరుగుబాటు తలెత్తక ముందే సర్దుకోవాలనే ఆలోచన ప్రస్తుత కిమ్ జోంగ్ ఉన్‌లో తలెత్తింది. అమెరికా అండ, స్వేచ్ఛా మార్కె ట్ విధానంతో దక్షిణ కొరియా సామ్‌సంగ్, హ్యూందాయ్, ఎల్‌జీ లాంటి దిగ్గజ కంపెనీలకు స్థావరంగా మారి ఆర్థికంగా వెలిగిపోయింది. ఈ పరిస్థితులన్నీ ఉత్తర కొరియా పాలకుల్లో మార్పునకు కారణమైంది. అమెరికాకు ఎదురొడ్డి నిలిచేకంటే, రాజీతో రాణించవచ్చనే ఆలోచనకు అంకురార్పణ జరుగటానికి కారణమైంది. ట్రంప్ కూడా ఎన్నికల సమయంలో చెప్పినట్లు ఉత్తర కొరియా సమస్యను పరిష్కరిస్తానన్నది ఆచరణలో చూపినట్లు అవుతున్నది. ట్రంప్, కిమ్‌జోంగ్ తమ వ్యక్తిగత స్వభావాలు, ధోరణులకు భిన్నంగా శాంతిచర్చలకు కూర్చోవటం తక్షణ అవసరంగా ముందుకొచ్చింది. ఎవరైనా యుద్ధానికి పునాదులు వేయొచ్చు, యుద్ధ కారకులు కావచ్చు. కానీ చాలా సాహసవంతులు మాత్రమే శాంతిని నెలకొల్పగలుగుతారని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పిన మాటలు అక్షర సత్యం.

407
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles