యుద్ధ భాష తగదు

Sat,April 14, 2018 12:07 AM

సిరియా ప్రభుత్వం ప్రజలపై రసాయనిక ఆయుధాలను ప్రయోగించిందనేది అమెరికా రోపణ. ఈ దాడిలో నలభై నుంచి ఎనభై మంది వరకు మరణించారని అంటున్నారు. రసాయనిక దాడి అమెరికా జరిపించిన తంతు అని, తమ దాడికి నైతిక మద్దతు కూడగట్టుకోవడానికి ఈ దంతాన్ని సృష్టించిందని రష్యా ఆరోపిస్తున్నది. రసాయనిక ఆయుధాలు ప్రయోగించింది నిజమే అయితే వాటిని కట్టడి చేయడానికి అంతర్జాతీయస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలె.

సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సిరియాపై మళ్ళా యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఆందోళన కలిగిస్తున్నది. క్షిపణిదాడులకు సిద్ధంగా ఉండాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పెరిగిపోయింది. రష్యా తీవ్రంగా స్పందించడంతో క్షిపణి దాడి చాలా తొందరగా జరుగవచ్చు. అంత తొందరగా జరుగకపోవచ్చు అంటూ ట్రంప్ కొంత మాట మార్చారు. అయినా అమెరికా, యూరప్ దేశాల తీరునుబట్టి అవసరమైతే సిరియాపై దాడికి సిద్ధపడుతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విదేశీ పర్యటనను మానుకొని మిత్రదేశాలతో మంతనాలు జరుపుతున్నారు. బ్రిటన్ ప్రధాని థెరీసా మే అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం జరిపి అవసరమైతే దాడికి ఆమోదం పొందారని తెలుస్తున్నది. సిరియాపై దాడి చేయడానికి అనువైనంత దగ్గరగా తమ జలాంతర్గాములను తరలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సిరియాకు మద్దతు ఇస్తున్న (రష్యా, ఇరాన్) దేశాలపై దాడి చేయబోమని, రసాయనిక నిలువల పైనే దాడులు సాగుతాయని ఫ్రాన్స్ రక్షణశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. సిరియాపై క్షిపణిదాడులు సాగిస్తామన్న అమెరికా ప్రకటనకు రష్యా తీవ్రంగా స్పందించింది. సిరియాపైకి దూసుకొచ్చే క్షిపణులను తాము అడ్డుకోవడమే కాదు, ప్రయోగ వేదికలపై ప్రతిదాడులు చేస్తామని పశ్చిమాసియాలోని రష్యా దౌత్యవేత్త ఒకరు హెచ్చరించారు. అంటే క్షిపణిదాడులు సాగిస్తున్న విమానాలను కూల్చివేయడానికి, ఓడలను ధ్వంసం చేయడానికి రష్యా వెనుకాడదు. సిరియాలోని నిర్దిష్ట స్థలాలపై, పరిమిత దాడులు సాగించాలనేది నాటో దేశాల ఆలోచన కావచ్చు. కానీ ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత పరిణామాలు ఎటు సాగుతాయో చెప్పడం కష్టం.

రసాయనికదాడులను అరికట్టేందుకు తాము దాడులు సాగిస్తామని అమెరికా, యూరప్ దేశాలు పైకి అంటున్నప్పటికీ, అసలు కారణం వేరే ఉంది. పశ్చిమాసియాను పూర్తిగా తమ చేతి లో పెట్టుకోవాలని నాటో దేశాలు, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయి. నాటో దేశాలు ఇరాక్‌పై దాడిచేసిన తర్వాత ఆ దేశంలో ఇరాన్ ప్రాబల్యం విస్తరించింది. ఆ తర్వాత పశ్చిమ దేశాలు సిరియా అధ్యక్షుడు అస్సాద్‌ను దించివేయాలనే పథకంలో భాగంగా ఆ దేశాన్ని యుద్ధభూమిగా మార్చాయి. కానీ చివరికి సిరియాలో రష్యాతోపాటు, ఇరాన్ ప్రాబల్యం స్థిరపడ్డది. సిరియా దక్షిణభాగంలో ప్రభుత్వ బలగాలు పాతుకపోవడం ఇజ్రాయెల్‌కు పక్కలో బల్లెంగా మారింది. సిరియా తూర్పు ప్రాం తంలో ఇరాక్ సరిహద్దు వరకు అమెరికా దళాలు పలుచగావిస్తరించిఉన్నాయి.

ఈ ప్రాంతం నుంచి అమెరికా దళాలను తరిమివేయాలని ఇరాన్ భావిస్తున్నది. అటు సౌదీ అరేబియాతో యెమెన్‌లో దాడులు సాగిస్తున్న అమెరికా ఖతర్‌ను కూడా కట్ట డి చేస్తున్నది. ఇటు సిరియా- ఇరాక్ ప్రాంతంలో రష్యా, ఇరాన్ ప్రాబల్యాన్ని దెబ్బకొట్టాలని భావిస్తున్నది. సిరియా అధ్యక్షుడు అస్సాద్‌ను దింపివేయాలనే అజెండాతో అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో రష్యా, ఇరాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఇస్లామిక్ మిలిటెంట్లు, ఇతర తిరుగుబాటుదళాలు తలదూర్చాయి. ఎవరి అజెం డా వారిది. దాదాపు నాలుగు లక్షల మంది మరణించగా, కోటి మందికి పైగా శరణార్థులుగా మారారు. అమెరికా కొంత వెనుకకు తగ్గి, ఇస్లామిక్ మిలిటెంట్లు తోకముడిచిన తర్వాత సిరియాలో యుద్ధం తగ్గుముఖం పట్టింది. కానీ సిరియా సమాజం ఇంకా తెప్పరిల్లలేదు. ఈ దశలో అమెరికా మళ్ళా దాడులకు దిగితే పశ్చిమాసియాలో ఏయే వర్గాలు తలెత్తి పోరాటం ఏ రూపం తీసుకుంటుందో అంచనా వేయడం కష్టం.

సిరియాలో అమెరికా మద్దతుగల తిరుగుబాటుదారులు క్రమంగా బలహీనపడుతున్నారు. తూర్పు ఘౌటా ప్రాంతంలోని కొంత భూభాగం ఇటీవలివరకు ఈ తిరుగుబాటుదారుల చేతిలోనే ఉంది. దాదాపు ఆరువారాల పాటు ఈ ప్రాంతంలో తీవ్ర పోరు సాగింది. వందలాది మంది మరణించారు. ప్రభుత్వ దిగ్బంధాన్ని, దాడులను భరించలేని తిరుగుబాటుదారులు రష్యాతో అంగీకారానికి వచ్చి, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈలోగా సిరియా ప్రభు త్వం ప్రజలపై రసాయనిక ఆయుధాలను ప్రయోగించిందనేది అమెరికా ఆరోపణ. ఈ దాడిలో నలభై నుంచి ఎనభై మంది వరకు మరణించారని అంటున్నారు. రసాయనిక దాడి అమెరికా జరిపించిన తంతు అని, తమ దాడికి నైతిక మద్దతు కూడగట్టుకోవడానికి ఈ ఉదంతాన్ని సృష్టించిందని రష్యా ఆరోపిస్తున్నది. రసాయనిక ఆయుధాలు ప్రయోగించింది నిజమే అయితే వాటిని కట్టడి చేయడానికి అంతర్జాతీయస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలె.

ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో చర్చలు కూడా సాగుతున్నాయి. భద్రతా మండలిలో రష్యాకు వీటో హక్కు ఉండటం వల్ల సిరియాపై తీర్మానాలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయినా శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం అన్వేషించాలె తప్ప దాడుల ద్వారా కాదు. సిరియాలో సాగుతున్న యుద్ధమే అన్ని సమస్యలకు మూలం కనుక, శాంతి నెలకొల్పడానికి ప్రాధాన్యం ఇవ్వాలె. అంతే కానీ సిరియా ప్రజల కోసం యుద్ధానికి దిగుతామని చెప్పడం సబబు కాదు. గతంలో ఇరాక్‌లోని సద్దాం ప్రభుత్వం మారణాయుధాలను కలిగి ఉన్నదని నాటో దేశాలు ఆరోపించి, దాడికి దిగాయి. కానీ ఇప్పటికీ ఆ యుద్ధం ముగియడంలేదు. ఇరాక్ పరిస్థితి కండ్లమందు కనిపిస్తున్నప్పటికీ, సిరియాలో అదే దుందుడుకు వైఖరి ప్రదర్శించడం తగదు.

861
Tags

More News

VIRAL NEWS