సభ ప్రతిష్ఠ కాపాడాలి

Tue,March 13, 2018 10:03 PM

సభలు సజావుగా ప్రయోజనాత్మకంగా జరిగేందుకు శాసనసభా స్పీకర్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదనిపిస్తున్నది. ఈ క్రమంలో రాజ్యసభ చైర్మన్‌గా నారాయణన్ చెప్పిన మాటలు గమనార్హమైనవి. చట్టసభ సర్వసత్తాక వ్యవస్థ కాబట్టి గౌరవ సభ్యులంతా స్వీయ సమీక్షతో తప్పులు గ్రహించాలి, దిద్దుకోవాలి. అవసరమైతే తననుతాను శిక్షించుకోవాలన్నారు ఆయన. నిజానికి ఇప్పుడు కావాల్సింది ఈ స్ఫూర్తేనని తేటతెల్లమవుతున్నది. ఇలాంటి స్వీయ నియంత్రణతోనే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటిగా ఉన్న శాసన నిర్మాణ వ్యవస్థ విశిష్టత పెరుగుతుంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తొలిరోజే ప్రతిపక్షాల వ్యవహరణ తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నది. ఓ సభ్యుడు విసిరిన హెడ్‌ఫోన్ నేరుగా సభాధ్యక్ష స్థానంవైపు దూసుకెళ్లి గోడకు తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలింది. ప్రతిపక్షాల తీరు నిరసనల పరిధి దాటి దాడుల దాకా దిగజారటం దిగ్భ్రాంతికరం. పార్లమెంటరీ వ్యవస్థలో అధికారపక్ష విధాన లోపాలను ఎత్తిచూపటం, ప్రజానుకూల విధానాలకు పట్టుబట్టడం ఆరోగ్యకర, ఆహ్వానించదగ్గ విధానం. ఇలాంటి చర్చలే వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తాయి. కానీ ఈమధ్య ప్రతిపక్షాల తీరు మరోలా మారిపోయింది. అధికారపక్షం ఏ పనిచేసినా, ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా వ్యతిరేకించటమే, రచ్చచేయటమే పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే వ్యూహంతో సభలోకి ప్రవేశించటం శోచనీయం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తగా మార్షల్స్‌ను పెద్ద సంఖ్యలో మోహరించి సభాధ్యక్ష స్థానానికి రక్షణ ఏర్పరిచింది. అయినా ఇలాంటి ఘటన చోటుచేసుకోవటం పరిస్థితి తీవ్రతను తెలుపుతున్నది. ప్రజానుకూల విధాన రచనకు, రూపకల్పనకు వేదిక కావాల్సిన చట్టసభలు బల ప్రదర్శనల స్థాయికి దిగజారటం ప్రజాస్వామ్య ప్రియులను కలిచివేస్తున్నది. అయితే ఇదేదో కాకతాళీయం గా, పొరపాటుగా జరిగిందని సరిపెట్టుకునే పరిస్థితులు లేకపోవటమే ఇప్పటి విషాదం.

కొంతకాలంగా చట్టసభల్లో చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాలు ఏ మాత్రం సమర్థనీయంగా లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చర్చలే జవము, జీవమూ అన్న విషయాన్ని మరిచి ప్రవర్తిస్తున్న తీరుతో చట్టసభల విలువల పత నం పాతాళంలో పడిన స్థితిని తెలుపుతున్నాయి. దీనికి పార్లమెంటు మొదలు, వివిధ రాష్ర్టాల అసెంబ్లీలు వేదికలు కావటం దిగజారుతున్న చట్టసభల ప్రతిష్ఠకు తార్కాణం. కేరళ అసెంబ్లీలో బడ్జెట్ ఘట్టం మునుపెన్నడూ ఎరుగని బీభత్స కాండకు వేదికైంది. ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థికమంత్రి కె.ఎం.మణి వార్షిక బడ్జెట్ పెట్టకుండా అడ్డుకుంటామని విపక్ష ఎల్‌డీఎఫ్ ముందుగానే ప్రకటించింది. ఆరునూరైనా బడ్జెట్ ప్రవేశపెట్టి తీరుతామని కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ పం తానికి పోయింది. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య అక్షరాలా యుద్ధమే జరిగింది. ఏకంగా సభాపతి కుర్చీనే ఎత్తి బయటపడేశారు. ప్రతిపక్ష సభ్యుల రణగొణ ధ్వనుల మధ్య ఆరు నిమిషాల్లోనే 140 పేజీల బడ్జెట్‌ను చదివేశారు! ఈ క్రమంలో జరిగిన విధ్వం సం అంతాఇంతా కాదు. వైరిపక్షీయుల్ని కొట్టి, కొరి కి, నెట్టి, కంప్యూటర్లు బద్దలుకొట్టి, బల్లలపై ఎక్కి చిందులు తొక్కి సృష్టించిన మహా గందరగోళం కేరళనే కాదు, యావత్ భారతావనినే దిగ్భ్రాంతి పరిచింది. ఇక తమిళనాట అసెంబ్లీలో జరిగిన కీచులా ట, కీచకపర్వం తెలియంది కాదు. ఒడిషా శాసన సభలోనూ జరిగిన దొమ్మిలో ముఖ్యమంత్రి దవాఖానకు వెళ్లి కట్టు కట్టించుకోవాల్సి వచ్చింది. మరో సందర్భంలో గవర్నర్‌నూ ఉతికి ఆరేసిన తీరూ ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లో వీధిపోరాటాలు దర్శనమిచ్చాయి. బీహార్‌లో తప్పతాగివచ్చిన ఓ సభ్యుడు మల్లయుద్ధానికి దిగిన ఉదంతం ఉన్నది. మధ్యప్రదేశలో పాదరక్షలు తలలకు తగిలి నెత్తురును కళ్లచూశాయి. ఈ నేపథ్యంలోంచే పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కూడా ప్రజాస్వామ్య విలువలను మసకబార్చింది. ఇలాంటి దురావేశ, దుశ్చేష్టలు ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతాలు.

చర్చలతో నడిచేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని తొలినాటి సభాపతి మవలాంకర్ ఉద్బోధించారు. చట్టసభలను సజావుగా చర్చలకు సరైన వేదికలుగా నిలువనివ్వకుండా బలప్రదర్శన శాలలుగా భ్రష్టుపట్టిస్తున్న నేరం, పాపం రాజకీయపక్షాలది, గౌరవసభ్యులది. ఔన్నత్యాన్ని మరి చి వ్యవహరిస్తే మిగిలేది అరాచకమే. దేశవ్యాప్తంగా ఇటువంటి వికృత పోకడలు సాగుతున్న తరుణంలో తెలంగాణ సభ ఇందుకు భిన్నంగా ఆదర్శప్రాయంగా సాగాలని కోరుకోవడం అత్యా శ కాదు. మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అసెంబ్లీ గౌరవప్రదం గా, అర్థవంతంగా నడిచిన తీరు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతిప్రశ్నకూ సమాధానాలివ్వటం కోసం కాలపరిమితి లేకుండా గత బడ్జెట్ సమావేశాలు నడిచిన తీరు ఉండనే ఉన్నది. అయినా ఫక్తు రాజకీయ కారణాలతో చట్టసభ వేదికను రచ్చ చేయటం ప్రజారాజకీయం అనిపించుకోదు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన దుర్ఘటనలు దురదృష్టకరమైనవే. సభలు సజావుగా ప్రయోజనాత్మకంగా జరిగేందుకు శాసనసభా స్పీకర్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదనిపిస్తున్నది. ఈ క్రమంలో రాజ్యసభ చైర్మన్‌గా నారాయణన్ చెప్పిన మాటలు గమనార్హమైనవి. చట్టసభ సర్వసత్తాక వ్యవస్థ కాబట్టి గౌరవ సభ్యులంతా స్వీయ సమీక్షతో తప్పులు గ్రహించాలి, దిద్దుకోవాలి. అవసరమైతే తననుతాను శిక్షించుకోవాలన్నారు ఆయన. నిజానికి ఇప్పుడు కావాల్సింది ఈ స్ఫూర్తేనని తేటతెల్లమవుతున్నది. ఇలాంటి స్వీయ నియంత్రణతోనే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటిగా ఉన్న శాసన నిర్మాణ వ్యవస్థ విశిష్టత పెరుగుతుంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

380
Tags

More News

VIRAL NEWS