పశ్చిమాసియాలో సమతూకం

Tue,February 13, 2018 01:00 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుతో సౌదీ అరేబియా ఖతర్‌ను ఏకాకిని చేసి దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నది. ఈ అన్నిదేశాలతో భారత్ సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నది. భారత్‌కు అరబ్ దేశాలతో ఎగుమతులు 50 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 71 బిలియన్ మేర ఉన్నాయి. అరబ్ దేశాలలో 90 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. వీరి నుంచి భారత్‌కు 38 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారకం లభిస్తున్నది. అందువల్ల పశ్చిమాసియాతో సంబంధాలలో వీలైనంత సమతూకాన్ని పాటించక తప్పదు.

ఆరు నెలల కిందట ఇజ్రాయెల్ వెళ్ళి చరిత్ర సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మూడు దేశాల పశ్చిమాసియా పర్యటనలో భాగంగా పాలస్తీనాను కూడా సందర్శించి సమతూకం పాటించినట్టు చాటుకోగలిగారు. ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదం ఎట్లా ఉన్నా, పశ్చిమాసియాకు మొదటి నుంచి భారత విదేశాంగ విధానంలో ప్రాధాన్యం ఉంటున్నది. పాలస్తీనా సందర్శన మొక్కుబడిగా సాగించింది కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాల పర్యటన వాణిజ్య దృష్టితో సాగింది. ఇటీవలి కాలంలో భారత విదేశాంగ విధానం అమెరికా వైపు మొగ్గుతున్నది. బీజేపీ అధికారంలో ఉంటే ఈ మొగ్గు మరింతగా ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ఈ విధానపరమైన మార్పును స్పష్టం చేశారు. మోదీ ఎప్పటి మాదిరిగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడలేదు. మోదీ ప్రసంగంలోని దౌత్య పరిభాషలో స్పష్టమైన మార్పు చోటు చేసుకున్నది. వెస్ట్ బ్యాంక్, గజా స్ట్రిప్ అనే రెండు ముక్కలను పాలస్తీనా దేశంగా ప్రకటించాలనే ప్రయత్నాలకు భిన్నంగా సమైక్య, మనగలిగే పాలస్తీనా దేశం ఉండాలనేది భారత్ విధానం. కానీ మోదీ తన ప్రసంగంలో ఈ పదాలు వాడకపోడం భారత్ విధానంలో వచ్చిన మార్పుకు సూచనగా పరిశీలకులు భావిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏడు అతి చిన్న రాచరిక రాజ్యాల సమాఖ్య. ఇందులో ప్రధానమైన అబూధబీ, దుబాయిలను సందర్శించిన మోదీ ఆ తరువాత గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఒమన్‌కు కూడా సందర్శించి ఆ దేశంతో ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ప్రధాని మోదీ పాలస్తీనా పర్యటన ద్వారా ఇజ్రాయెల్ వ్యతిరేక చర్యకు పాల్పడినట్టు పైకి కనిపించవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉన్నది. పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికా అనుకూల దేశాలు అనుసరిస్తున్న విచిత్ర విధానమిది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి పశ్చిమాసియా అమెరికా అనుకూల, వ్యతిరేక దేశాలుగా విడిపోయి ఉంటున్నది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఇరాక్, లిబియా వంటి దేశాలు అరబ్ జాతీయవాద భావజాలంతో, స్థిరమైన ఆర్థిక వ్యవస్థలతో, సోవియెట్ మద్దతుతో అమెరికా వ్యతిరేక పాత్రను పోషించాయి. భారత్ వర్ధమాన దేశంగా రెండు శిబిరాలతో సత్సంబంధాలను నెలకొల్పుకొని, అలీన విధానాన్ని పాటించింది. అయితే ఐక్యరాజ్యసమితిలో, బయటా సోవియెట్ శిబిరంతో సన్నిహితంగా ఉండేది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన నేపథ్యంలో, అమెరికా ఈ దేశాలను ఛిద్రం చేసింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ వంటి దేశాలలోని రాచరిక వ్యవస్థలు అమెరికా శిబిరంలో ఉన్నా యి. ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా అమెరికా- ఇజ్రాయెల్ కూటమికి మద్దతు ఇస్తున్నాయి. కానీ అరబ్బు ప్రజల మనోభావాలు అమెరికా- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉండటం వల్ల పైకి పాలస్తీనా అనుకూల ప్రకటనలు జారీ చేస్తుంటాయి. భారత్ ఈ అరబ్బు రాచరికాలతో సాన్నిహిత్యాన్ని పెంచుకునే క్రమంలోనే, మోదీ పశ్చిమాసియా పర్యటన సాగింది. ఇప్పుడు పాలస్తీనా ప్రాంతాలుగా ఉన్న వెస్ట్‌బ్యాంక్, గజా స్ట్రిప్‌లలో పరిస్థితి కూడా గమనార్హమైనది. వెస్ట్‌బ్యాంక్‌లో అధికారంలో ఉన్న ఫతా వర్గం పైకి ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అమెరికాకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది. గజా స్ట్రిప్‌లో పట్టు కలిగిన హమాస్ వర్గం మాత్రం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకమైనది. అందువల్ల హమాస్ వర్గాన్ని కట్టడి చేస్తూ, వెస్ట్‌బ్యాంక్‌లోని ఫతాతో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా- ఇజ్రాయెల్ కూటమి భావిస్తున్నది. మోదీ వెస్ట్‌బ్యాంక్ సందర్శించడం అంటే, ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్న ఫతా నాయకుడు అబ్బాస్‌కు మద్దతు ఇవ్వడమే.

ఏదో ఒక శిబిరంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ, మరో శిబిరాన్ని దూరం చేసుకోవడం భారత్ విదేశాంగ విధానంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా అమెరికా అనుకూల అరబ్ దేశాలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నప్పటికీ, ఇరాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నది. అతి త్వరలో ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహనికి భారత్ ఆహ్వానం పలుకనుంది. క్షేత్ర స్థాయి వాస్తవికత ప్రకారం- పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాలలో భారత్ కీలక పాత్రేమీ పోషించడం లేదు. అయితే వ్యూహాత్మక ప్రాధాన్యం లేనప్పటికీ, వాణిణ్యాది రంగాలలో పశ్చిమాసియాలోని ఏ ఒక్క శిబిరాన్ని ఉపేక్షించలేం. చమురు దిగుమతి, కార్మికులకు ఉపాధి- ఈ రెండు అంశాలు భారత విధానాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ప్రభుత్వాలతో అధికారిక సంబంధాలు, ప్రజల మనోభావాలు రెండు భిన్న అంశాలు. ఇజ్రాయెల్‌తో సంబంధాలను, పాలస్తీనా విధానానికి ముడిపెట్టదలుచుకోలేదు. అమెరికాకు అనుకూలంగా సౌదీ అరేబియా, వ్యతిరేకంగా ఇరాన్ పశ్చిమాసియా రాజకీయాలను శాసిస్తున్నాయి. ఈ మధ్య ఖతర్ కూడా ఒక ప్రభావిత కేంద్రంగా మారింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుతో సౌదీ అరేబియా ఖతర్‌ను ఏకాకిని చేసి దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నది. ఈ అన్ని దేశాలతో భారత్ సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నది. భారత్‌కు అరబ్ దేశాలతో ఎగుమతులు 50 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 71 బిలియన్ మేర ఉన్నాయి. అరబ్ దేశాలలో 90 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. వీరి నుంచి భారత్‌కు 38 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారకం లభిస్తున్నది. అందువల్ల పశ్చిమాసియాతో సంబంధాలలో వీలైనంత సమతూకాన్ని పాటించక తప్పదు.

359
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles