ముళ్ళ కిరీటం!

Wed,December 6, 2017 11:29 PM

ప్రాంతీయ ఆకాంక్షలను తీర్చగలిగే నాయకులు ఇప్పుడు అవసరం. అటువంటి నాయకత్వాన్ని అందించడం జాతీయ పార్టీలకు సాధ్యమా అనే అనుమానం తలెత్తుతున్నది. భారతీయ సమాజాన్ని ఏకశిలా స్వరూపంగా భావించే బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన కొన్ని రాష్ర్టాలలోనే నెగ్గుకు రాగలిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చినప్పటికీ, దేశ వ్యాప్తంగా అంత బలమైన పునాది కలిగి లేదు. ఒక నాయకుడిగా మోదీ స్థానం కూడా బలహీనపడ్డది. కాంగ్రెస్ పార్టీ తన బలహీనతను అధిగమించే సూచనలు కనిపించడం లేదు.

ఎట్టకేలకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ఎన్నిక లాంఛనమేననేది తెలిసిందే. రాహుల్ తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు. అందుకు కష్టపడవలసింది కూడా ఏమీ లేదు. కానీ నాయకుడిగా రుజువు చేసుకోవడమే ఆయన ముందున్న అతిపెద్ద సవాలు. పైగా కాంగ్రెస్ పార్టీ జవజీవాలు కోల్పోయి ఉన్నది. నాయకత్వం చుట్టూ కోట రీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని పునర్నిర్మించి, పునరుజ్జీవింప చేయడం సాధారణ విషయం కాదు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబానికి ఉన్న పట్టు మూలంగా రాహు ల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు ఎప్పుడో చేపట్టవలసింది. కానీ నాయకులకు సహజంగా ఉండే ఆసక్తి రాహుల్ గాంధీ ప్రదర్శించలేదు. ఆయనలో అంతటి పరిణతి ఉన్నట్టు కూడా కనిపించలే దు. ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పెద్దరికాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టినప్పటి నుంచి వరుసగా వైఫల్యాలు ఎదురయ్యాయి. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల వ్యూహాన్ని, ప్రచార బాధ్యతను తన నెత్తి మీద పెట్టుకున్నారు. యూపీలో ఘోర పరాజయం ఆయన ప్రతిష్ఠను మరింత దిగజార్చింది. పార్టీ శ్రేణులు ఆయనపై నమ్మకాన్ని కోల్పోయాయి. గుజరాత్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టుకున్నది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్ర నాయకత్వ బలహీనత, పాటీదార్ల ఉద్యమం మొదలైన కారణాల వల్ల బీజేపీ నెగ్గురాలేదేమో అనే ఆశ తప్ప, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ శ్రేణులే నమ్మడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు.

సోనియా గాంధీని కూడా లెక్కిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన నెహ్రూ కుటుంబానికి చెందిన ఆరవ నేత రాహుల్. జవహర్ లాల్ నెహ్రూను మొదట్లో మోతీలాల్ కుమారుడిగా చెప్పుకునేవారు. అటువంటిది ఆయన తొలి ప్రధానిగా దేశానికి దిశానిర్దేశం చేసి తనకంటూ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇక ఇందిరాగాం ధీ నెహ్రూ మరణించే నాటికి రాజకీయాల్లో స్థిరపడినా, ప్రధాని పదవిని చేపట్టడానికి ఎంతో చాకచక్యాన్ని ప్రదర్శించారు. ప్రధాని పదవిని చేపట్టిన తరువాత ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందారు. కానీ రాహుల్‌లో అంతటి చతురత లోపించింది. విదేశీ వనితగా విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేజిక్కించుకొని పార్టీని మళ్ళా అధికారంలోకి తేవడంలో సోనియా ఎంతో రాజనీతి ని ప్రదర్శించారు. కానీ ఆ స్థాయిలో రాజనీతిజ్ఞతను రాహుల్ ప్రదర్శించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపడుతున్నప్పటికీ, దేశంలో అదొక ప్రాధాన్యమున్న వార్త గా మారలేదు. ఇది రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉన్న స్థానాన్ని సూచిస్తున్నది. 2004లో అమేథీ లోక్‌సభ స్థానానికి పోటీ చేయడం ద్వారా క్రియాశీల రాజకీయాల లో ప్రవేశించినప్పటి నుంచి ఆయనను ప్రజలు గమనిస్తున్నారు. ఈ పదమూడేండ్ల కాలంలో ఆయన వ్యవహారసరళి మూలంగా ప్రజలకు ఆయన నాయకత్వం పట్ల ఆసక్తి పోయింది. కాంగ్రెస్ పార్టీ బలహీనపడి పోవడం కూడా ఈ అనాసక్తికి కారణం. ప్రాంతీయ రాజకీయపక్షాలు బలపడే క్రమంలో కాంగ్రెస్ రాజకీయాలు అప్రధానమైపోయాయి.

విశాలమైన భారత దేశంలో అనేక సమాజాలున్నాయి. ప్రతి రాష్ట్రంలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరి ఆకాంక్షలు వారివి. ఎవరి అభివృద్ధి దశ వారిది. ప్రాంతీయ ఆకాంక్షలను తీర్చగలిగే నాయకులు ఇప్పుడు అవసరం. అటువంటి నాయకత్వాన్ని అందించడం జాతీయపార్టీలకు సాధ్యమా అనే అనుమానం తలెత్తుతున్నది. భారతీయ సమాజాన్ని ఏకశిలా స్వరూపంగా భావించే బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన కొన్ని రాష్ర్టాలలోనే నెగ్గుకు రాగలిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చినప్పటికీ, దేశవ్యాప్తంగా అం త బలమైన పునాది కలిగి లేదు. ఒక నాయకుడిగా మోదీ స్థానం కూడా బలహీనపడ్డది. కాంగ్రెస్ పార్టీ తన బలహీనతను అధిగమించే సూచనలు కనిపించడం లేదు. రాహుల్ నాయకత్వంపై పార్టీ శ్రేణులకు, ప్రజలకు పెద్దగా ఆశలు ఉన్నట్టు కనిపించడం లేదు. అయినప్పటికీ ఆందోళన పడవలసిందేమీ లేదు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశ ప్రజలు ఎంతో పరిణతిని సాధించారు. జాతీయపార్టీల స్థానంలో తమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలను ఎన్నుకుంటున్నారు. ప్రాంతీయ నాయకులు దేశ ప్రయోజనాల విషయం వచ్చే సరికి బాధ్యతగా జాతీ య కోణంలో ఆలోచిస్తున్నారు. ప్రాంతీయ పక్షాలు సమిష్టిగా చర్చించుకొని దేశాన్ని నడిపించే దశ వస్తున్నది. జాతీయ పార్టీలు ప్రాంతీయ పక్షాలకు స్థానం కల్పించే దశ ఇప్పటికే ఆరంభమైం ది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే చర్యగా కాకుండా, ప్రాంతీయ పార్టీలను మరింత బలోపేతం చేసే పరిణామంగా చూడవచ్చు.

517
Tags

More News

VIRAL NEWS