పరిణత దౌత్యం

Wed,November 15, 2017 12:49 AM

భౌగోళికంగా సమీపంగా ఉన్న చైనాతో వీలైనంత మేర సఖ్యంగా ఉండాలనే భావన ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు కూడా ఉన్నది. అయినప్పటికీ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రయోజనాలు, విధానాలలో చాలా వరకు సారూప్యం ఉన్నది. భారత్ ఏ ఒక్క దేశానికో అనుకూలమని లేదా వ్యతిరేకమని కాదు. మన ప్రయోజనాల కోసం మనకు అనువైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నది. భవిష్యత్తులో కూడా భారత్ ఇదే రీతిలో స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలె. ఏదో ఒక అగ్రరాజ్యం వెంట ఉంటే నిలబడలేమనే బలహీన మనస్తత్వాన్నిసంతరించుకోకూడదు.

భారత్‌తోపాటు, ఆగ్నేయాసియా దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ చర్చకు వేదికైంది. ఈ సందర్భంగా భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి నాలుగు దేశాల (చైనా వ్యతిరేక) కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా యత్నం ఆశించి న మేర సఫలం కాలేదు. ఇందుకు భారత్ అనుసరించిన పరిణత వైఖరే ప్రధాన కారణం కావ డం. నిజానికి ఇటీవల భారత్ అనుసరిస్తున్న అమెరికా అనుకూల విదేశాంగ విధాన పర్యవసానం ఎట్లా ఉంటుందో అనే ఆందోళన చాలామంది విశ్లేషకులలోనే కాదు, దేశవ్యాప్తంగా విద్యావంతులలో కూడా నెలకొన్నది. ఈ నేపథ్యంలో మనీలాలో భారత్ ప్రదర్శించిన సంయమనం ప్రశంసనీయమైనది. ఈ వైఖరి వల్ల స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చాటి చెబుతున్న విలువలకు అనుగుణంగా భారత్ నిలబడగలదనే భరోసా లభిస్తున్నది. అమెరికా ఆశిస్తున్నట్టు భారత్ పూర్తిగా చైనా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించకుండా ఆచితూచి వ్యవహరించింది. హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్ జలాల వరకు తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత్‌ను ఊతకర్రలా వాడుకోవాలని అమెరికా భావిస్తున్నది. ప్రత్యేకించి హిందు మహా సముద్రంలో భారత్ కాపలాదారుగా ఉండాలని భావిస్తున్నది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా చిన్న దేశాలను ఉసిగొలుపుతున్న అమెరికా, ఆ గొడవలోకి భారత్‌ను దింపాలని నిర్ణయించింది. భారత్ ఇటీవలి కాలంలో అమెరికాకు అనుకూలంగా మారడం, చైనాతో డోక్లాం గొడవ జరుగడం వల్ల నాలుగు దేశాలతో కొత్త కూటమి ఏర్పాటు అనివార్యమనే అభిప్రాయం ఏర్పడ్డది. అయితే ఈ అనివార్యతను గుర్తిస్తూనే భారత్ జాగ్రత్తగా వ్యవహరించింది.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో భారత్‌కు సోవియెట్ యూనియన్ తోడుగా నిలిచిన తీరు పాతతరం వారు ఇప్పటికీ మరిచిపోలేరు. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు అండగా నిలువడం, ఉప ఖండంలో నాటో కుట్రలను తిప్పికొట్టడం, దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎదుగడానికి తోడ్పడటం, రక్షణ రంగంలో సహాయపడటం ద్వారా నాటి సోవియెట్ యూనియన్ ఇక్కడ ప్రజ ల అభిమానాన్ని పొందింది. అయితే ప్రజాస్వామ్య దేశం గా అమెరికా సమాజం పట్ల, ఉదారవాద సం స్కృతి పట్ల కూడా అభిమానానికి కొదువలేదు. ఇటీవలి కాలంలో రెండు సమాజాల మధ్య సంబంధాలు మరింతగా అల్లుకుపోయాయి. చైనా బలమై న ఆర్థిక, సైనిక శక్తిగా పొరుగునే ఉండటం, రష్యా పూర్వం మాదిరిగా బలంగా లేకపోవడం వల్ల అమెరికాతో మైత్రి తప్పదనేది కూడా తెలిసిందే. అయినప్పటికీ మూడవ ప్రపంచదేశాల పట్ల అమెరికా అనుసరించే విధానాలు అనుమానాలకు తావిస్తున్నాయి. అమెరికా తన ప్రయోజనాల కోసం భారత్‌ను పావుగా వాడుకుంటుందనేది తెలిసిందే. ఈ క్రమంలో భారత్ జాగ్రత్తగా ఉండాలనే అభిప్రా యం బలంగా ఏర్పడ్డది. ఒకప్పుడు భారత్ రష్యావైపు మొగ్గు చూపినప్పటికీ, అలీన విధానం వదులుకోలేదు. సోవియెట్ నాయకత్వంలోని వార్సా కూటమిలో చేరకుండా స్వతంత్రతను కాపాడుకున్నది. ఇప్పుడు కూడా అమెరికాతో సాన్నిహిత్యాన్ని కాపాడుకుంటూనే, ఆ దేశం ఆడమన్నట్టల్లా ఆడకూడదనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఇటీవల మనీలాలో నాలుగు దేశాల సమావేశంలో భారత్ ఇదేవిధంగా వ్యవహరించడమే విశేషం. అమెరికా చైనాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తూనే, ఆ దేశాన్ని కట్టడి చేయడానికి భారత్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. అందువల్ల భారత్ కూడా ఇదేరీతిలో చైనాను కట్టడి చేయడానికి నాలుగు దేశాల కూటమిని వాడుకోవాలని భావిస్తున్నది. అంతే తప్ప నాలుగు దేశాల కూటమిలో చేరడం ద్వారా చైనాతో అనవసర వైరం పెట్టుకోకూడదని భావిస్తున్నది. అట్లాగని చైనాకు భయపడి అమెరికాకు దూరంగా ఉండటం లేదు.

మనీలాలో ఆగ్నేయాసియా దేశాల కూటమి సమావేశానికి హాజరైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ నాయకులు విడిగా సమావేశమై నాలుగు దేశాల కూటమి ఏర్పాటుపై ఉమ్మడి ప్రకటన జారీ చేయవలసింది. కానీ భారత్ నిరాసక్తత వల్ల నాయకుల సమావేశం జరుగలేదు. నాయకుల భేటీకి బదులుగా అధికారుల స్థాయి సమావేశం మాత్రమే జరిగింది. నాలుగు దేశా లు విడిగా ప్రకటనలు చేశాయి. మిగతా మూడు దేశాల ప్రకటనల్లో చైనా, ఉత్తర కొరియా వ్యతిరేక పదజాలం చోటుచేసుకున్నది. కానీ భారత్ తన ప్రకటనలో ఎక్కడా చైనా వ్యతిరేక పదజాలం లేదు. భౌగోళికంగా సమీపంగా ఉన్న చైనాతో వీలైనంత మేర సఖ్యంగా ఉండాలనే భావన ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు కూడా ఉన్నది. అయినప్పటికీ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రయోజనాలు, విధానాలలో చాలా వరకు సారూప్యం ఉన్నది. భారత్ ఏ ఒక్క దేశానికో అనుకూలమని లేదా వ్యతిరేకమని కాదు. మన ప్రయోజనాల కోసం మనకు అనువైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నది. భవిష్యత్తులో కూడా భారత్ ఇదే రీతిలో స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలె. ఏదో ఒక అగ్రరాజ్యం వెంట ఉంటే నిలబడలేమనే బలహీన మనస్తత్వాన్ని సంతరించుకోకూడదు.

365
Tags

More News

VIRAL NEWS