ఆరుషి విషాదం

Fri,October 13, 2017 01:31 AM

దర్యాప్తు తీరుతెన్నులు మారిపోతే, ఒక్క ఆరుషి కేసే కాదు, దేశంలోని అన్ని కేసుల పరిష్కారం సులభమవుతుంది. బాధితులకు న్యాయం జరుగుతుంది. దోష నిరూపణ పకడ్బందీగా జరుగుతుంది, నిర్దోషులపై నింద పడదు. దోషుల నిర్ధారణ జరుగాలని మళ్ళా దర్యాప్తుకు ఆదేశించిన సీబీఐ కోర్టు, ఆ తరువాత తల్లిదండ్రులకు శిక్ష విధించింది. కానీ దర్యాప్తు తీరు తెన్నులు మారాలనేది కూడా గుర్తిస్తే వ్యవస్థాత్మక మార్పునకు దోహదం చేసినట్టవుతుంది.

సంచలనాత్మకమైన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆరుషి, నౌకరు హేమ్‌రాజ్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నూపుర్‌లను దోషులుగా నిర్ధారించడానికి తగిన ఆధారాలు లేవని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసిం ది. 2013 నవంబర్ 25న సీబీఐ ప్రత్యేక కోర్టు తల్వార్ దంపతులు దోషులని తీర్పు ఇచ్చి జీవి త ఖైదు విధించింది. దీంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఈ కేసులో సుప్రీంకోర్టుకు అపీలు చేసుకునే అవకాశం ఉన్నది. అయితే తమ దగ్గర ఉన్న ఆధారాలు, ప్రజాభిప్రాయం వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవలసి ఉంటుంది. 2008 జనవరిలో ఢిల్లీ శివారులోని నోయిడాలోని సొంత ఇంటిలో ఆరుషి అనే పధ్నాలుగు ఏండ్ల బాలిక హత్యకు గురైంది. అదే రోజు హేమ్‌రాజ్ అనే నౌకరు హత్య కూడా జరిగింది. కానీ ఆయన మృతదేహం ఇంటి మిద్దెపై ఉన్నట్టు మరుసటి రోజు గానీ గుర్తించలేకపోయారు. ఈ కేసులో పోలీసులు, ఆ తరువాత సీబీఐ బృందం తల్లిదండ్రులపై, ముగ్గురు నేపాలీ పనివారిపై దర్యాప్తు జరిపిన తీరు తీవ్ర ఆక్షేపణకు గురైంది. బాలిక వ్యక్తిత్వంపై, తల్లిదండ్రుల జీవన విధానంపై పోలీసులు వెల్లడించిన అభిప్రాయాలు కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ఈ కేసులో దర్యాప్తు యంత్రాంగ వైఫల్యం అనేక సందర్భాలలో వెల్లడైంది.

దర్యాప్తు సంస్థ అనుమానం ఆరుషి తల్లిదండ్రుల మీదే ఉన్నది కానీ, వారే దోషులని తగిన ఆధారాలు చూపలేకపోయింది. దీంతో వారే దోషులని చెప్పలేని పరిస్థితి. అయితే తల్లిదండ్రు లు నిర్దోషులనే వాదన కూడా బలంగానే ఉన్నది. తల్లిదండ్రులను దోషులుగా చూపించడం కోసం సాగిన దర్యాప్తు తీరు తెన్నులను తప్పు పట్టి న వారూ ఉన్నారు. దర్యాప్తు అధికారులు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం కూడగట్టడానికి అనుసరించిన విధానమైతే తీవ్ర విమర్శలకు గురైంది. ఆరుషి తల్లిదండ్రులే హంతకులంటూ నిరంతరం వెంటాడుతుంటే, వారు తమ బిడ్డ మర ణం పట్ల ఈ తొమ్మిదేండ్లలో కనీసం తృప్తిగా ఏడువలేక పోయారని, హంతకులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, ఈ బాధితులు తమకు బిగిసిన ఉచ్చు నుం చి బయట పడటానికి ఎంతో క్షోభ అనుభవించార ని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు చేసిన ఆరోపణల వల్ల సామాజికంగా తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. వీరు హం తకులని నిస్సందేహంగా నిరూపించలేని నేపథ్యం లో- ఏ నేరానికి వీరు ఈ శిక్ష అనుభవించవలసి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతున్నది. అనేక మలుపులు తిరిగిన ఈ రెండు హత్యల కేసులో ఇంతకూ హం తకుడు లేదా హంతకులు ఎవరు? దోషులు ఎవరో నిరూపణ కాకుండానే కేసు ముగింపునకు రావడమేమిటి? ఈ ప్రశ్నలు ఎవరికైనా కలుగడంలో ఆశ్చ ర్యం లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా, దోషులెవరో తేల్చవలసిందేనని భావించి, ఆధారాలు తగిన మేర లేకున్నా సరే, అనుమానం ఉన్న వారిపై నేరాన్ని మోపి చేతులు దులుపుకోవాలని అనుకోవడం సమర్థనీయం కాదు. పొట్టివాడు ఉరికంబానికి అందడం లేదు ప్రభూ అంటే, అయితే పొడుగు వాడిని పట్టుకొచ్చి ఉరితీయండి అనే విధంగా వ్యవస్థ ఉండకూడదు. ఈ కేసులో దోషులెవరో సందేహాతీతంగా రుజువు కాలేదు.

కానీ ఈ కేసులో సందేహాతీతంగా స్పష్టమైనది మాత్రం- అక్కడి పోలీసుల అసమర్థత. నేరం జరిగిన చోట ఆధారాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకొని, వాటిని సేకరించాలనే కనీస అవగాహన వారికి లోపించింది. అపోహలు, వ్యక్తిగత దురభిప్రాయాలు దర్యాప్తులో కేసును నడిపించడంలో ప్రధాన పాత్ర వహించాయి. ఆరుషి హత్య విషయం తెలిసిన తరువాత, ఆ నివాసాన్ని మొత్తం గాలిస్తే, మిద్దెపై పడి ఉన్న నౌకరు హేమ్‌రాజ్ మృతదేహం అదే రోజు కనిపించేది. కానీ మొదటి రోజు హతుడే హంతకుడనే నిర్ధారణకు వచ్చారు. అక్రమ సంబంధం, వివాహేతర బంధాలు అంటూ రంజైన కథనాలను మీడియా ద్వారా వినిపించారు. సీబీఐ న్యాయస్థానం కూడా దోషులెవరో తేల్చకుం డా కేసుకు ముగింపు పలుకడాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో కేసు మళ్ళా దర్యాప్తు చేపట్టే దశలో, తల్లిదండ్రులే దోషులనే భావన చుట్టూ దర్యాప్తు తిరిగింది. మొదటగా- ఈ కేసులో నేరస్థులను నిర్ధారించలేక పోయామనే విషయాన్ని ఆత్మవంచనకు పాల్పడకుండా అంగీకరించాలె. దీంతో ఈ పరిస్థితికి కారణమేమిటనే ప్రశ్న ముందుకు వస్తుంది. దర్యాప్తు యంత్రాంగంలోని లోపం బయట పడుతుంది. దర్యాప్తు తీరుతెన్నులు మారిపోతే, ఒక్క ఆరుషి కేసే కాదు, దేశంలోని అన్ని కేసుల పరిష్కారం సులభమవుతుంది. బాధితులకు న్యాయం జరుగుతుంది. దోష నిరూపణ పకడ్బందీగా జరుగుతుంది, నిర్దోషులపై నింద పడదు. దోషుల నిర్ధారణ జరుగాలని మళ్ళా దర్యాప్తుకు ఆదేశించిన సీబీఐ కోర్టు, ఆ తరువాత తల్లిదండ్రులకు శిక్ష విధించింది. కానీ దర్యాప్తు తీరు తెన్నులు మారాలనేది కూడా గుర్తిస్తే వ్యవస్థాత్మక మార్పునకు దోహదం చేసినట్టవుతుంది. నేరస్థులుగా అనుమానం ఉన్నవారందరిని పట్టుకొచ్చి ఒప్పించే మొరటు పద్ధతి వదిలి, శాస్త్రీయంగా ఆధారాలు సేకరించి, తర్కబద్ధంగా దోషులని నిరూపించే స్థాయికి మన దర్యాప్తు యంత్రాంగం మెరుగుపడాలె. బాలిక మరణించినప్పుడు యథాలాపంగా లైంగిక కోణంలో ఆరోపణలు చేస్తూ, మీడియా ద్వారా ప్రచారం చేయకుండా కుటుంబ పరువు ప్రతిష్ఠలను దృష్టి లో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలె.

306
Tags

More News

VIRAL NEWS