ఔషధనగరి!

Wed,October 11, 2017 11:18 PM

ఎవరి కాలంలో ఎంత ముంపు జరిగింది, ఎంత పరిహారం లభించిందనే లెక్కలు చెప్పినా వినరు. హుస్సేన్‌సాగర్‌లోకి కాలుష్యం ప్రవాహంలా వస్తుంటే వీరు అడ్డుకోలేదు. కానీ దానిని సదుద్దేశంతో శుద్ధి చేస్తుంటే మాత్రం సహించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేయాలన్నా సరే, అదో పెద్ద నేరమైనట్టు గొడవలకు దిగుతారు. తెలంగాణ జనం అమాయకులు కారని, అంతా గమనిస్తున్నారని వీరింకా గ్రహించడం లేదు.

రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ త్వరలో నెలకొల్పబోతున్న ఫార్మాసిటీ రూపు రేఖలను, నిర్వహణ విధానాలను వివరించడంతో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుకు ఎంత తేడా ఉన్నదో తెలుస్తున్నది. ఔషధనగరిని రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో, కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతున్న తీరును మంత్రి కేటీఆర్ మంగళవారం దృశ్యరూప వ్యక్తీకరణ ద్వారా సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో వెల్లడించారు. మంత్రి వెల్లడించిన ప్రకారం- 19 వేల పైచిలుకు ఎకరాలలో నిర్మిస్తున్న ఈ ఫార్మా సిటీ సంపన్నులు ఉండే గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తుంది తప్ప కాలుష్య కేంద్రంగా మారదు. కాలుష్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేస్తారు. కాలుష్య తనిఖీ చేసేది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కాదు, అంతర్జాతీయ సంస్థ జరుపుతుంది. 46 శాతం భూభాగంలో మాత్రమే పరిశ్రమలు ఉం టాయి. 33 శాతం హరిత మండలం ఉంటుంది. శాస్త్రవేత్తలు, అధికారులు, కార్మికులు అందులోనే నివసిస్తారు కనుక కాలుష్యం ఉండదనే భరోసా లభిస్తున్నది. ఈ ప్రాంతంలోని చెరువుల ను ధ్వంసం చేయకపోగా, సుందరీకరిస్తారు. సమీపంలోని 12 వందల ఎకరాల అడవిని అభివృద్ధి పరిచే బాధ్యతను ఫార్మాసిటీ తీసుకుంటుంది. 270 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.

ఔషధనగరి చుట్టూ అర కిలోమీటరు మేర నివాస ప్రాంతాలు ఉండకుండా తటస్థ మండలం ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం భూములు కోల్పోయిన వారికి మెరుగైన నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా, స్థానిక ప్రజలకు ఉపాధి లభించడానికి వీలుగా నైపుణ్య శిక్షణ ఇస్తుంది. నాలుగు లక్షల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. ఒక్కో కంపెనీ సామాజిక బాధ్యతగా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఫార్మాసిటీలో పరిశోధనలు జరుగుతాయి, మందుల తయారీ కూడా ఉంటుంది. ఫార్మసీ కళాశాల కూడా ఉంటుంది. మన దేశం 84 శాతం మందుల ముడిసరుకులు దిగుమతి చేసుకుంటు న్న నేపథ్యంలో ఈ ఔషధనగరి ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఔషధనగరిని అత్యంత సురక్షితంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం అంటున్నప్పటికీ ప్రతిపక్షాలు ఇంతగా గొడవ చేస్తున్నా యి. మరి ఈ ప్రతిపక్షాలు గతంలో అధికారం లో ఉన్నప్పుడు, పారిశ్రామిక ప్రాంతాలు ఎంత గొప్పగా ఉండేవో ఒకసారి పరికిస్తే బాగుంటుం ది. హైదరాబాద్ పొలిమేరలోని పటాన్‌చెరువు ప్రపంచంలోని అత్యంత కాలుష్య ప్రాంతాల లో ఒకటి. పీల్చే గాలి కలుషితం, తాగే నీరు దుర్గంధ భూయిష్టం.

కాలుష్యం వల్ల యువతులకు గర్భం నిలువక, అక్కడి గ్రామాలలోని యువకులకు ఎవరూ పిల్లనిచ్చేవారు కాదు. జీడిమెట్ల, పాశమైలారం, బాలానగర్ మొదలై న ప్రాంతాల ప్రజల బాధలను ఇప్పటికీ అడిగి తెలుసుకోవచ్చు. పారిశ్రామిక వ్యర్థాలను శాస్త్రీ య పద్ధతిలో నిర్వీర్యం చేయడానికి బదులు, రాత్రివేళ తగుల బెడుతారనేది బహిరంగ రహ స్యం. ఆయా ప్రాంతాల్లో భరించలేని వాసన వస్తూనే ఉంటుంది. శుద్ధి చేసే సంస్థతో లాలూచీ పడి తతంగమంతా శాస్త్రీయ పద్ధతిలో జరిపినట్టు కాగితాలు సృష్టిస్తారు. సీమాంధ్ర పాలనలో ఆంధ్ర ప్రాంతంలోని వ్యర్థ రసాయనాలను హైదరాబాద్‌కు లారీలలో తరలించి, ఇక్కడ మాన్‌హోల్స్ ద్వారా భూగర్భంలో కుమ్మరించేవారు. హుస్సేన్‌సాగర్‌లోకి, మూసీ నదిలోకి కాలుష్యాలు ప్రవాహంలా వచ్చిపడటం ఎవరికి తెలియనిది! వ్యాధి చికిత్సకు ఉపయోగపడవలసిన ఔషధ పరిశ్రమలు వ్యాధుల సృష్టికి దోహదపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఈ పరిశ్రమలు కాలుష్యాన్ని అడ్డగోలుగా విడుదల చేయకుండా అనేక చర్యలను చేపట్టింది. ఇప్పటికీ సీమాంధ్ర పాలనలో వెలసిన పారిశ్రామిక వాడలు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగానే ఉన్నాయి.

సీమాంధ్ర పాలనలో పరిశ్రమలు కాలుష్యాన్ని విచ్చలవిడిగా వదులుతుంటే ఇంతకాలం తమ జ్ఞానేంద్రియాలకు పని చెప్పనివారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఔషధనగరిని నిర్మిస్తున్నదనగానే గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణవారికి పాలించుకోవడం చేతకాదని పరాయి పాలకులు ఎద్దేవా చేస్తుంటే, దానిని నిజం చేయడానికి ఇక్కడి కొందరు ప్రయత్నిస్తున్నారు. నదీజలాలను తెలంగాణ ఉపయోగించుకోకుండా పరాయిశక్తులు అడ్డుపుల్లలు వేస్తుంటే, వారిని తప్పుపట్టవలసిందిపోయి, ఇక్కడి ప్రాజెక్టులకు అడ్డుపడటమే పనిగా పెట్టుకున్నారు. వీరు వీధుల్లో ఆందోళనలు చేయగలరు, న్యాయస్థానాలకు ఎక్కి అవరోధాలు సృష్టించగలరు. ఎవరి కాలంలో ఎంత ముంపు జరిగింది, ఎంత పరిహారం లభించిందనే లెక్కలు చెప్పినా వినరు. హుస్సేన్‌సాగర్‌లోకి కాలుష్యం ప్రవాహంలా వస్తుంటే వీరు అడ్డుకోలేదు. కానీ దానిని సదుద్దేశంతో శుద్ధి చేస్తుంటే మాత్రం సహించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేయాలన్నా సరే, అదో పెద్ద నేరమైనట్టు గొడవలకు దిగుతారు. తెలంగాణ జనం అమాయకులు కారని, అంతా గమనిస్తున్నారని వీరింకా గ్రహించడం లేదు.

339
Tags

More News

VIRAL NEWS