దుండగులపై ఉపేక్ష

Sat,August 12, 2017 01:55 AM

తమది భిన్నమైన పార్టీ అని బీజేపీ నేతలు అధికారంలోకి రాకముందు తరుచు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు కొడుకు చేసిన తప్పుకు తండ్రిని తప్పుపట్టడమేమిటని అంటున్నారు. నిజమే కానీ,రాజకీయ నాయకులు ఆదర్శ ప్రవర్తన కలిగి ఉండాలె. పుత్రరత్నం తప్పతాగి యువతిని వెంటాడి అఘాయిత్యానికి పాల్పడాలని యత్నిస్తే, బహిరంగంగా ఖండించి శిక్ష పడేటట్టు చేయాలె. అంతే కానీ పరోక్ష మద్దతు ఇవ్వడం తప్పు. ఇంత జరిగిన తరువాత కూడా ఆ నాయకుడిని పదవి నుంచి తప్పించకపోవ డం పార్టీ పెద్దల తప్పు.

చండీగఢ్‌లో ఐఏఎస్ అధికారి కుమార్తెను బీజేపీ హర్యానా విభాగం అధ్యక్షుడి కుమారుడు, అతడి మిత్రుడు వెంబడించి అపహరణకు ప్రయత్నించడం, అతడి పట్ల పోలీసులు మొదట్లో ఉపేక్ష వహించడం మహిళల భద్రతారాహిత్యానికి అద్దం పడుతున్నది. ఈ నెల నాలుగవ తేదీ శుక్రవారం రాత్రి వర్ణిక కుందు అనే 29 ఏండ్ల యువతి చండీగఢ్‌లోని ఒక ప్రధాన వీధిలో కారు సొంతగా నడుపుకుంటూ తమ ఇంటికి పోతున్నప్పుడు బీజేపీ నేత సుభాష్ బరాలా కుమారుడు వికాస్, ఆయన మిత్రుడు ఆశిష్ ఆమెను తమ కారులో వెంబడించారు. ఆమె కారు ను వేగంగా నడుపుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేసేకొద్దీ, దుండగులు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం వెంటబడ్డారు. వర్ణిక వెల్లడించిన వివరాల ప్రకారం- వారు అమె కారును అనేక చోట్ల అడ్డుకున్నారు. ఒకచోట తమ కారును అడ్డుపెట్టి ఆపగలిగారు. వారిలో ఒకరు ఆమె కారు దగ్గరకు వచ్చి కారు అద్దాలపై కొట్టడమే కాకుండా, తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. వర్ణిక వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే పోలీసులకు సమాచారం అందించడం వల్ల వారు వెంటనే వచ్చి కాపాడారు. పోలీసులు దుండగులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తక్షణం స్పందించి ఆమెను కాపాడటం ప్రశంసనీయమే. వారు సమయానికి రాకపోతే తన పరిస్థితి ఎట్లా ఉండేదోనని బాధితురాలు కూడా అంటున్నారు. కానీ దుండగులను పోలీసు స్టేషన్‌కు తీసుకుపోయిన తరువాత పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, ఆ తరువాత వారు నిర్వహించిన పాత్ర, కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలకు తావిస్తున్నది.

దుండగులు ఒక యువతిని వెంటాడటం, కారు తలుపును తెరిచే ప్రయత్నం చేయడాన్ని బట్టి వారి దురుద్దేశం ఏమిటో తెలుస్తూనే ఉన్నది. కానీ పోలీసులు యువతిని వెంబడించారనే సాధారణ కేసు పెట్టి, వారిని అరెస్టు చేసిన కొద్ది గంటలలోనే బెయిల్‌పై విడుదల చేశారు. ఆ తరువాత కూడా ఆమెను అడ్డుకున్నారు అని మాత్రమే చేర్చారు. తనను అపహరించడానికి ప్రయత్నించారని ఆమె వెల్లడించలేదని పోలీసులు సమర్థించుకున్నారు. కానీ వారు తన కారు తలుపు తెరువడానికి ప్రయత్నించారని, తనను అపహరించాలనేది వారి ఉద్దేశమని స్పష్టమని ఆమె తన రాతపూర్వక ఫిర్యాదులోనే పేర్కొన్నారు. దుండగులు వర్ణికను వెంటాడిన రహదారిపై సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు మొదట అన్నారు. ఈలోగా దుండగుల తరఫున బాధితురాలికి వ్యతిరేకంగా దుష్ప్రచారం మొదలైంది. బీజేపీ నేత ఒకరు ఆ అమ్మాయి రాత్రి పూట బయటకు ఎందుకు వెళ్ళినట్టు అనే రీతిలో వ్యాఖ్య చేశారు. ఆమె ఫేస్‌బుక్‌లో పెట్టుకున్న మిత్రులతో దిగిన ఫొటోలను తప్పుడు అర్థం వచ్చే రీతిలో వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో ప్రచా రం సాగింది. ఇంతలో నాయకులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పత్రికల్లో, టీవీల్లో ప్రచారమై, ఒత్తిడి రావడంతో పోలీసులు తప్పనిసరై అపహర ణ యత్నం అని చేర్చి నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి వారిని అరెస్టు చేశారు. సీసీటీవీ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. వాటిలో వర్ణిక కారును దుండగుల కారు వెంటాడుతున్నట్టు స్పష్టంగా ఉన్నది. అయితే ఆమెను అడ్డుకున్న చోట మాత్రం కెమెరాలు పనిచేయడం లేదని అంటున్నారు. దుండగులను అరెస్టు చేసినప్పుడు వచ్చిన వైద్యుడు వారి నోటి నుంచి మద్యం సేవించిన వాసన వస్తున్నదని వెల్లడించారు. అయితే రక్త పరీక్ష చేయించుకోవడానికి వారు నిరాకరించారు. వారు మద్యం కొనుక్కున్న దృశ్యాలు కూడా లభ్యమయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనాలను కూడా పోలీసులు సేకరించారు.

యువతిపై అఘాయిత్యానికి పాల్పడటం సాధ్యం కాలేదు కానీ, వారికి ఆ ఉద్దేశం ఉన్నదనే ది స్పష్టం. బాధితురాలు ఒక ఉన్నతాధికారి కుమార్తె కనుక ధైర్యంగా నిలబడి న్యాయం కోసం పోరాడుతున్నారు. కానీ బీజేపీ హర్యానా శాఖ అధ్యక్షుడు తన కుమారుడికి అండగా నిలబడినందుకు, పార్టీ ఆయనను తప్పు పట్టడం లేదు. మొదట్లో పోలీసులు వారికి అనుకూలంగా వ్యవహరించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం అయినందు వల్ల అధికార యంత్రాంగం కేంద్రం అజమాయిషీలో ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వమైనా వెంటనే స్పందించి, అనుమానాలకు తావులేకుండా వ్యవహరించవలసింది. తమది భిన్నమైన పార్టీ అని బీజేపీ నేతలు అధికారంలోకి రాకముందే తరచు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు కొడుకు చేసిన తప్పు కు తండ్రిని తప్పుపట్టడమేమిటని అంటున్నారు. నిజమే కానీ, రాజకీయ నాయకులు ఆదర్శ ప్రవర్తన కలిగి ఉండాలె. పుత్రరత్నం తప్పతాగి యువతిని వెంటాడి అఘాయిత్యానికి పాల్పడాలని యత్నిస్తే, బహిరంగంగా ఖండించి శిక్ష పడేటట్టు చేయాలె. అంతే కానీ పరోక్ష మద్దతు ఇవ్వడం తప్పు. ఇంత జరిగిన తరువాత కూడా ఆ నాయకుడిని పదవి నుంచి తప్పించకపోవ డం పార్టీ పెద్దల తప్పు. ప్రతిపక్షాలు ఈ ఉదంతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే దేశంలో చట్టబద్ధ పాలన నెలకొల్పడం పాలకపక్షం బాధ్యత.

674
Tags

More News

VIRAL NEWS