జవాబుదారీతనం

Tue,July 18, 2017 01:04 AM

ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మానవీయ దృక్పథంతో సామరస్య పరిష్కారం సాధించాలె. అంతేతప్ప సమస్యలను ముదరనీయకూడదు. ప్రత్యేకించి ఈశాన్య రాష్ర్టాలు దేశ సరిహద్దులో ఉండటం, ప్రధాన భూభాగంతో సంబంధం తక్కువగా ఉండటం, సాంస్కృతిక భిన్నత్వాన్ని కలిగి ఉండటం వంటి అంశాలు గమనార్హమైనవి. కేంద్రం పాలనాదక్షతను ప్రదర్శించడం ద్వారా శాంతిని నెలకొల్పాలే తప్ప దేశ ప్రజలపై అదే పనిగా సాయుధ దళాలను ఉపయోగించుకోవడం సమంజసం కాదు.

ప్రజాస్వామ్యంలో చట్టబద్ధపాలన, జవాబుదారీతనం ప్రధానమైనవి. ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించి-సైనిక దళాలు, పోలీసు బలగాలు కూడా ఈ జవాబుదారీతనానికి అతీతం కాదని గతంలోనే స్పష్టం చేసిన సుప్రీం కోర్టు, మణిపూర్‌లో సైన్యం, అసోం రైఫిల్స్ చేత జరిగిన మరణాలపై దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను శుక్రవారం నాడు ఆదేశించడం గమనార్హం. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి 1958లో బీజం పడింది. ఈ చట్టం ద్వారా సాయుధ దళాలకు అపరిమిత అధికారాలు ఇవ్వడం వల్ల ప్రజల హక్కులకు భంగం కలుగుతున్నదని ఎంతోకాలంగా మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. మణిపూర్‌లో 2000 సంవత్సరంలో అసోం రైఫిల్స్ దళాలు పది మందిని కాల్చివేసిన ఘటన తీవ్ర విమర్శకు గురైంది. ఈ ఘటనపై చలించిన ఇరోం షర్మిల సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కొన్నేండ్ల పాటు నిరాహార దీక్ష పట్టింది. సైనిక దళాల అతి బలప్రయోగం వల్ల జరిగిన మరణాలపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఈ ప్రత్యేక అధికార చట్టం ఆచరణలో నిర్వీర్యమైంది. దేశంలో కొన్ని ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించడం, ఆ తరువాత అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయి తే పిటిషన్‌లో పేర్కొన్న అనేక మరణాలపై స్పష్టమైన సమాచారం లేదు. దీంతో న్యాయస్థానం మొదటగా కొన్నింటిని గుర్తించి, వాటిపై దర్యాప్తు సాగించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఎనభై కేసులపై దర్యాప్తునకు సీబీఐ ఐదుగురు సభ్యులతో కమిటీ వేయవలసి ఉన్నది.

మణిపూర్‌లో 2000- 12 మధ్య కాలంలో చట్టం, న్యాయంతో నిమిత్తం లేకుండా భద్రతా దళాలు, పోలీసుల చేత జరిగిన 1,528 మరణాలపై దర్యాప్తు జరిపి పరిహారం అందించాలని బాధితుల కుటుంబాల సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పీఐఎల్) సుప్రీం కోర్టులో దాఖ లు చేయడంతో కేసు మొదలైంది. మిలిటెన్సీనీ ఎదుర్కొనేందుకు అయినా ఆత్మ రక్షణ పేరిట ఇంత భారీ ఎత్తున హతం చేయడం ఆమోదయో గ్యం కాదని గత ఏడాది జూలై నెలలో సుప్రీంకో ర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. శత్రువు అనే అనుమానంతోనే దేశ ప్రజలను హతమార్చడానికి సైనిక దళాలను దింపితే, అది చట్టబద్ధ పాలనకే కాదు, ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదమని సుప్రీంకోర్టు ఈ తీర్పులో వ్యాఖ్యానించింది. ప్రత్యేక అధికారాలు లేకపోతే సాయుధ దళాలు నైతిక ైస్థెర్యం కోల్పోతాయని చెప్పడం సమస్యను ఒక కోణం నుంచి చూడటమే అని, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడి దృష్టిలో చూసినట్టయి తే చట్టంతో సంబంధం లేకుండా తుపాకీ నీడన బతకడం కూడా నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. శత్రువుతో వ్యవహరించేటప్పుడు కూడా కొన్ని చట్టబద్ధ విధానా లు ఉంటాయి. విద్యుక్త ధర్మాన్ని మించి బలప్రయోగం చేయకూడదు. అది న్యాయస్థానం ద్వారా విచారణార్హమని, సైనిక న్యాయస్థానం కిం దికి మాత్రమే రాదని పరమోన్నత న్యాయస్థానం వివరించింది. అటార్నీ జనరల్ యుద్ధ పరిస్థితులు ఉన్నాయంటూ చెప్పడాన్ని కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. అది యుద్ధ పరిస్థితి కాదని, రాజ్యాంగపరంగా చూస్తే ఆంతరంగిక కల్లోలమని కోర్టు విశదీకరించింది. ఈ తీర్పు నేపథ్యంలో- సైన్యం ఉగ్రవాద, వేర్పాటువాద వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టలేని పరిస్థితి ఏర్పడుతున్నదని, అందువల్ల వెసులుబాటు కావాలని కేంద్రం క్యూరేటివ్ పిటిషన్ వేసింది. అయితే గత ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది.

బూటకపు ఎదురుకాల్పులలో ఎంతోమంది మరణిస్తున్నారని ఆరోపణలు వస్తుంటే, మణిపూర్ ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదని కూడా సుప్రీం కోర్టు తప్పు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయవలసిన అవసరం లేదా అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉండటం, అనేక మంది సాయుధ చర్యలలో బలికావడం అంతర్జాతీయంగా మన దేశానికి మచ్చ తెస్తున్నది. ప్రభుత్వం రాజకీయ పరిష్కారం కోసం సమర్థవంతంగా కృషి చేయడం లేదనే అపవాదు దీనివల్ల కలుగుతున్నది. సుప్రీం కోర్టు కూడా తమ తీర్పులో ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఎక్కడైనా ప్రత్యేక రాష్ర్టాల కోసమో, ఇతర డిమాండ్ల సాధన కోసమో రాజ్యాంగ పరిధిలో ఉద్యమాలు సాగినప్పుడు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దశాబ్దాలు సాగదీసిన ఉదంతాలున్నాయి. ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మానవీయ దృక్పథంతో సామరస్య పరిష్కారం సాధించాలె. అంతేతప్ప సమస్యలను ముదరనీయకూడదు. ప్రత్యేకించి ఈశాన్య రాష్ర్టాలు దేశ సరిహద్దులో ఉండటం, ప్రధాన భూభాగంతో సంబంధం తక్కువగా ఉండటం, సాంస్కృతిక భిన్నత్వాన్ని కలిగి ఉండటం వంటి అంశాలు గమనార్హమైనవి. కేంద్రం పాలనాదక్షతను ప్రదర్శించడం ద్వారా శాంతిని నెలకొల్పాలే తప్ప దేశ ప్రజలపై అదే పనిగా సాయుధ దళాలను ఉపయోగించుకోవడం సమంజసం కాదు. సుప్రీం కోర్టు తీర్పును సదుద్దేశంతో అర్థం చేసుకోవాలె.

434
Tags

More News

VIRAL NEWS