కయ్యానికి కాలం కాదు!

Sat,July 15, 2017 01:50 AM

భారత్-చైనాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా? అంటే ఇటీవలి పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. డోక్లాం ప్రాంతంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న సైనిక మోహరింపులు రెండుదేశాల మధ్య సంబంధాలను సంక్షోభం దిశగా తీసుకుపోతున్నాయి. సిక్కిం సరిహద్దు భూభాగంలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టి భారత్ భద్రతకు భంగం కలిగిస్తున్నదంటూ రోడ్డు నిర్మాణ పనులను భారత్ అడ్డుకున్నది. తమ భూభాగంలో రోడ్డు నిర్మాణం చేసుకుంటుంటే భారత్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నదని చైనా ఆక్షేపిస్తున్నది. ఈ క్రమంలోనే ఇరుదేశాలూ ఆ ప్రాంతానికి సైనిక బలగాల తరలింపునకు పూనుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది చిలికిచిలికి గాలివానగా మారి ఆసియా యుద్ధానికి దారితీయబోతున్నదా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులు ఇలా ఉంటే ఇరుదేశాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ప్రమాదకరస్థాయిలో సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే 62నాటి యుద్ధంలో భారత్ భంగపడిన పరిణామాలను, ఫలితాలను గుర్తుచేసుకోవాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరికలు జారీచేస్తున్నది. భారత్ వెనక్కి తగ్గకుంటే యుద్ధం తప్పదని హూంకరిస్తున్న ది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఇప్పుడు 2017లో ఉన్నదని, 1962 నాటి పరిస్థితులు లేవని మన రక్షణ మంత్రి స్పందించారు. దీన్నిబట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే జర్మనీలోని హాంబర్గ్‌లో జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ఇరుదేశాల సమస్యలపై చర్చలు సాగాయని చెప్పుకుంటున్న తరుణం లో రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగటం దురదృష్టకరం.

భారత్, చైనాల మధ్య సరిహద్దు సమస్య కొత్తదేమీ కాదు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆక్సాయ్‌చిన్, మెక్‌మోహన్ రేఖ విషయంలో భారత్-చైనాల మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతున్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని జమ్ముకశ్మీర్‌లో అంతర్భాగమని భారత్ వాదిస్తున్నది. కానీ దీన్ని జిన్‌జియాంగ్ పేరుతో తమ దేశంలోని ప్రత్యేక ప్రాంతంగా చైనా పరిగణి స్తూ తన ఆధీనంలో ఉంచుకున్నది. బ్రిటిష్ ఇండియాలో 1914లో సిమ్లా ఒడంబడిక పేరుతో మెక్‌మోహన్‌రేఖ ఇండో టిబెటన్ సరిహద్దుగా రూపొందించబడింది. ఈ వివాదాన్ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ పర్యవేక్షిస్తున్నది. కానీ బ్రిటిష్ ఇండియాలో రూపొందించిన మెక్‌మోహన్‌రేఖ తమకు సమ్మతం కాదని, అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగమేనని చైనా మొదటినుంచి వితండవాదం చేస్తున్నది. ఈ వివాదాల పునాదిగానే 1962నాటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గెలుపోటములు అటుంచితే ఇరుదేశాలూ సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని తీర్మానించుకోవటం తెలివైన పని. ఈ చర్చల సం ప్రదింపులు 1996లో ముగింపునకు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో 2006లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పేరుతో సరిహద్దు సమస్యను యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయానికొచ్చాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇరుదేశాలూ ఎంతో సంయమనంతో వ్యవహరించాయి. దీనికి ఇరుదేశాల నాయకత్వంతో పాటు, ప్రజలు, పౌరసమాజాల పాత్ర కూడా ఎంతో గొప్పది. భారత-చైనా మిత్రమండలి లాంటి పౌరసంఘాలు ఇరుదేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు బలమైన పునాదిని వేశాయి. పాలకుల విధానాలను ప్రభావితం చేశాయి.

సిక్కింలో చికెన్ నెక్‌గా పిలువబడుతున్న సిలుగురి కారిడార్ ప్రాంతం ఈశాన్య భారతంలోని మిగతా ఎనిమిది రాష్ర్టాలతో అనుసంధానం చేస్తుంది. ఈ సున్నితమైన ప్రాంతంపై కన్నేసిన చైనా ఇంత రాద్ధాంతం చేస్తున్నదా అనిపిస్తున్నది. ఈ మధ్యనే నాథులా పాస్ మార్గాన్ని మూసేసి మానస సరోవర్ యాత్రికులను అడ్డుకొని తన సంకుచితత్వాన్ని చాటుకున్న చైనా అందివచ్చిన అవకాశాలను వాడుకోజూస్తున్నట్లు అనిపిస్తున్నది. సరిగ్గా ఇప్పుడే గూర్ఖాలాండ్ ఉద్యమం కూడా తీవ్రరూపం దాల్చటం వెనుక ఏదైనా పన్నాగమున్నదా అని అనుమానం కలుగుతున్నది. కొంతకాలంగా భారత్ తన రక్షణ రంగ సమాయత్తంలో లక్ష్యంగా దాయాది పాకిస్థాన్ కాకుండా చైనా ఉంటున్నదని ప్రచారం ఉన్నది. ఏ క్షిపణి ప్రయోగం చేసినా, రక్షణరంగ ఆవిష్కరణ ఏది జరిగినా చైనా భూభాగాన్ని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నట్లుగా అమెరికా రక్షణరంగ నిపుణులు చెప్పటం గమనార్హం. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన నేటి ఆధునిక యుగంలో సంఖ్యాబలంతోనో, సాంకేతిక బలంతోనో యుద్ధం గెలువాలనుకోవటం దుస్సాహసం. అభివృద్ధిలో, సంఖ్యాబలంలో తాము ముందున్నామనే అహంకారం చైనా పాలకులకు ఉంటే అది అజ్ఞానం మాత్రమే. ఏ రంగంలో తీసుకున్నా భారత్ ప్రపంచ దేశాలకు దీటుగా ఉన్నది. వైమానిక శక్తిలో ప్రపంచంలో నాలుగో స్థానం, నౌకాదళంలో ఐదోస్థానం, సైన్యంలో మూడో స్థానం, అణ్వస్త్ర పాటవ శక్తిలో ఏడో స్థానంలో భారత్ ఉన్నది. ఏదేమైనా జనాభాపరంగా, ఆర్థిక వ్యవస్థ పరంగా అతిపెద్ద దేశాలైన భారత్-చైనాలు సమస్యలను చర్చల ప్రాతిపదికగా పరిష్కరించుకుంటే మంచిది.

937
Tags

More News

VIRAL NEWS